November 24, 2013

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఐదవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఐదవరోజు కథ

“మహారాజా అంబరీషా ! పురాకర్మానుసారియై నీకిప్పుడు  రెండు ప్రక్కల నుంచీ ఈ ధర్మసంకటము ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చేవరకు ఆగాలో, లేక ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలో  ఏదో నిశ్చయించి చెప్పడానికి మేము అశక్తులం ఐపోతున్నాం కనుక “ఆత్మబుద్ధి –స్సుఖంవైచ” అనే సూత్రం వలన భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు” అన్నారు బ్రాహ్మణోత్తములు. ఆ మాటలు వినగానే అంబరీషుడు “ఓ బ్రాహ్మణులారా ! బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను. 

శృత్యర్థబోధక ప్రమాణం చేత, ప్రస్తుతం నేను కొన్ని మంచినీళ్ళు తాగుతాను. అందువల్ల అందువల్ల అతిథి కంటే ముందు అన్నం తినిన దోషం రాదు. ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితమూ ఉంటుంది. ఇందువలన దుర్వాసుడు కోపించి, శపించే అవకాశము ఉండదు. నా జన్మాంతర పాపము నశిస్తుంది. ఇదే నా నిర్ణయం అన్నాడు. అలా అంటూ వారి ఎదుటనే కొన్ని నీళ్ళు తాగాడు. నోటి దగ్గర నీటి పాత్ర ఇంకా నేలమీద పెట్టకుండానే దుర్వాసుడు అక్కడ అడుగుపెట్టాడు. 

రాజు చేతిలో జలపాత్రను చూడగానే జరిగిందేమిటో దుర్వాసుడు గ్రహించాడు. చూపులతోనే కల్చేస్తాడా ?? అన్నట్లు చురచురా చూసాడు. మాటలతోనే మరణహోమం చేస్తాడా ??? అన్నట్లుగా --- "ఓయీ ! దురహంకార పూరిత రాజాధమా ! అతిథినైన నేను లేకుండానే ద్వాదశీ పారణ చేస్తావా ??? స్నానం చెయ్యకుండా భోజనము చేసేవాడు, పరులకు పెట్టకుండా తానొక్కడే తినేవాడు, తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనము చేసేవాడు --- అశుద్ధములో పురుగువలె మలాశియే అవుతాడు. పండినది కానీ, పత్రం గానీ, నీళ్ళుగానీ, భోజనర్థంగా భావించి సేవించినది ఏదైనాసరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీచేత అంగీకృతుడనై అతిథిని(నేను) రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలమును సేవించావు. బ్రాహ్మణ తిరస్కారివైన నువ్వు బ్రాహ్మణా ప్రియుడైన విష్ణువునకు భక్తుడివి ఎలా అవుతావు ??? నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు" అని ఆగ్రహంతో అన్నాడు.... ఆ ఆగ్రహానికి భయకంపితుడైన అంబరీషుడు దోసిలి ఒగ్గి "మునీంద్రా ! నేను పాపినే ... పరమ నీచుడినే అయినా నిన్ను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియుడను కనుక ఈ ఆభిజత్యము, అహంకారము వల్లనో తప్పే చేశాను --- కానీ నువ్వు బ్రాహ్మణుడవు అయిన కారణంగా శాంతాన్ని వహించు, నన్ను రక్షించు, నీవంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు???" అని అంటూ దూర్వాసుని పాదాలపై పడి ప్రార్థించాడు. 

అయినాసరే ఆ దూర్వాసుని కోపం తగ్గలేదు. కిరీటము ధరించి ఉన్న ఆ రాజు తలను తన ఎడమకాలితో తన్ని, కొంచెం ప్రక్కకు జరిగి "ఎవరికైనా కోపం వస్తే వాళ్ళని ప్రార్థించగానే వాళ్ళు శాంతులు అవుతారు. కానీ నేను అలాంటివాడిని కాను. నాకు కోపం వస్తే శాపం ఇవ్వకుండా ఉండను. చేపగా, తాబేలుగా, పందిగా మరుగుజ్జుగా, వికృతమైన ముఖం కలవాడిగా, కౄరుడైన బ్రాహ్మణునిగా, జ్ఞానశూన్యుడైన క్షత్రియునిగా, అధికారంలేని క్షత్రియునిగా, దురాచార భూయిష్టమైన పాషండ మర్గావేదిగా, నిర్దయా పూర్వక బ్రాహ్మణహింసకుడవైన బ్రాహ్మణునిగా ---- ఈ విధంగా పదిజన్మల (గర్భనరకాల)ను అనుభవించు" అని శపించాడు. అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు. అయినా అతని ఆంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీమహావిష్ణువు కల్పాంతర కాలంలో లోకకళ్యాణార్థము, బ్రాహ్మణా వాక్యాన్ని తిరస్కరించకూడదు అనే వ్రతం వల్లా ..... ఆ పదిజన్మల శాపాన్ని తానూ భరించదలచి "గృహ్ణామి" అని ఊరుకున్నాడు. --- ఇన్ని - శాపాల్ని ఇస్తే - గృహ్ణామి - అని అంటాడేమిటి ఈ రాజు, ఐతే వీనికి ఇంకా పెద్ద శాపమే ఇవ్వాలి నిర్ణయించుకొని దూర్వాసుడు మరోసారి శాపము ఇచ్చుటకు నోరు తెరవబోయాడు భక్తుడైన అంబరీషునికి రక్షణగా తన ఆయుధమైన సుదర్శనాన్ని విడిచిపెట్టడంతో అక్కడి పూజా స్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దూర్వాసుని వైపు కదిలింది... తనవైపు రివ్వున దూసుకువస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి దూర్వాసుడు తుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకుండా భూమండలము అంతా క్షణాలమీద తిరిగాడు, అయినా సుదర్శనం అతనిని తరుముతూనే ఉంది. భయకంపితుడైన ఆ దూర్వాసుడు  వసిష్టాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్ట దిక్పాలకులని, చివరికి శివ – బ్రహ్మలని కూడా శరణు కోరాడు—కానీ అతని వెనుకనే మహాగ్ని జ్వాలాయుతంగా వస్తూన్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికివారే తప్పుకున్నారే తప్ప,  ఎవరూ అభయమీయలేదు.

కార్తీక మహాత్మ్యం ఇరవై ఐదవరోజు కథ పారాయణం సమాప్తం...... 

                                                         

No comments:

Post a Comment