November 20, 2013

కార్తీక మహాత్మ్యం - పంతొమ్మిదవరోజు కథ.

కార్తీక మహాత్మ్యం - పంతొమ్మిదవరోజు కథ.

జ్ఞానసిద్ధులవారు ఈ విధంగా విష్ణువును స్తుతించారు. వేదవేత్తల చేత - వేదవేద్యునిగాను, వేదాంత స్థితునిగాను, రహస్యమైన వానిగానూ, అద్వితీయునిగానూ కీర్తింపబడేవాడా ! సూర్యచంద్ర శివబ్రహ్మాదులచే, మహారాజాధి రాజులచే స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా ! నీకు నమస్కరిస్తున్నాను. పంచాభూతాలూ, సృష్టిసంభూతాలైన సమస్త ప్రపంచము కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివ సేవిత చరణా ! నువ్వు పరమము కంటెను పరముడవు, నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచమూ కూడా - దానికి కారణమైన మాయతో సహా నీ యందే ప్రస్ఫుటమవుతుంది. సృష్టి యొక్క ఆది, మధ్య , అంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు. చతుర్విధ అన్న రూపుడవు, యజ్ఞ స్వరూపుడవు నీవే. హే ఆనంద సాగరా ! ఈశ్వరా ! సమస్తానికి ఆధారము, సకల పురాణ సారమూ కూడా నీవే.  ఈ విశ్వము అంతా నీవల్లే జనించి, నీలోనే లయమవుతుంది. ప్రాణులందరిలోనూ నీవే ఉంటావు. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి చెయ్యు. జగదేక పూజ్యుడవైన నీకు మొక్కడం వలన నాజన్మకు సాఫల్యాన్ని చేకూర్చు. సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను ఉద్ధరించు. హే ముకుందా ! అనంతా ! దయామయీ ! విష్ణో ! నీకు నమస్కారము.    

నిత్యానంద సుధాబ్ది వాసీ ! తేజోమయా ! ఆత్మారామా ! దేవదేవేశా ! గోవిందా ! నీకిదే నమస్కారము, నీపాదాలకివే నా ప్రణామాలు. నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించ గలిగినవాళ్ళు మాత్రమే, నిన్ను ఆత్మ స్వరూపునిగా గుర్తించి , తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధృవ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే, సమస్త పాపాలూ నశించిపోతున్నాయి. ఓ కేశవా ! నన్ను రక్షించుము. ఈ విధంగా స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుడిని చిరునవ్వుతో చూస్తూ "జ్ఞానాసిద్ధా ! నీ స్తోత్రానికి నేను సంతోషంతో పారవస్యుడిని అయ్యాను. నీకేమి వరము కావాలో కోరుకో" అనెను. "హే జగన్నాధా ! నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే, నాకు వైకుంఠ ప్రాప్తి కలిగించు." అని జ్ఞానసిద్ధుడు అనెను. "జ్ఞానసిద్ధా ! నీ కోరిక నెరవేరుతుంది. అత్యంత దుర్మార్గులతో నిండిపోతున్న ఈ నరకంలో మహా పాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతాను. సత్పురుషా ! నేను ప్రతీ ఆషాఢశుద్ధ దశమి రోజు లక్ష్మీ సమేతుడనై, పాలకడలిలో పవళించి -- కార్తీక శుద్ధ ద్వాదశి రోజు మేల్కొంటాను. నాకు నిద్రా సుఖాన్ని ఇచ్చే ఈ నాలుగు నెలలూ, ఎవరైతే వ్రతాలను ఆచరిస్తారో ....... వారు విగత పాపులై,  నా సాన్నిధ్యాన్ని పొందుతారు. నేను చెప్పిన చాతుర్మాస వ్రతాన్ని ఆచరించని వాళ్ళు , బ్రహ్మహత్యాపాతక ఫలాన్ని పొందుతారు. నిజానికి నాకు నిద్ర - మెలకువ , కల అనేవి అనేవి ఏమీ లేవు . నేను వాటికి అతీతుడను. నా భక్తులను పరీక్షించుటకు నేను అలా నిద్రా మిషతో జగన్నాటకాన్ని చూస్తూ ఉంటాను. నీవు నాపై చేసిన స్తోత్రాన్ని రోజూ మూడు పూటలా చదివిన వాళ్ళు తరిస్తారు. ఇవన్నీ లోకంలో ప్రచారము చెయ్యు" అని చెప్పి విష్ణువు పాలసముద్రముపై శయనించాడు.

దురాత్ములైనా, పాపులైనా, భగవంతుని ధ్యానిస్తూ చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారో (బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అన్ని జాతుల వారు కూడా) వారి జన్మ ధన్యమవుతుంది. చేయనివారు కోటిజన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధా - భక్తులతో ఆచరించేవారు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొంది, చివరి దశలో విష్ణు లోకాన్ని పొందుతారు.

-:కార్తీక మహాత్మ్యం -- పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము:-    

   

No comments:

Post a Comment