November 4, 2013

కార్తీకమాస మహత్యం ----- మొదటిరోజు కథ

కార్తీకమాస మహత్యం ----- మొదటిరోజు కథ

ఒకరోజు శౌనకాది మునులు, సూతమహామునిని దర్శించి, కార్తిక మాస మహత్యాన్ని గురించి వివరణ ఇవ్వవలసిందిగా కోరారు,అంతట సూత మహర్షి  "ఓ ముని పుంగవులారా! విష్ణు మూర్తి లక్ష్మి దేవికి, సాంబశివుడు పార్వతి దేవికి, తెలిపిన కథను నేను మీకు వివరించెదను,,ఆ కథను వినుట  వలన మానవులకు ఇహమందు, పరమందు సకల ఐశ్వర్యములతో తులతూగుతారు, శ్రద్దగా వినండి" అని ఇలా చెప్ప  సాగెను .

ఒకనాడు వశిష్ఠుడు మిథిలకు వెళ్లి జనక మహారాజుతో -- "ఓ రాజా! నేనొక మహా యజ్ఞాన్ని చేస్తున్నాను,దానికి కావలసిన  అర్థబలాన్ని,అంగబలాన్ని నిన్ను అడిగి క్రతువు ప్రారంభించుదామని ఇలా వచ్చాను"  అని చెప్పగా,జనకుడు ముందుగా తనకున్న సందేహాన్ని నివృత్తి చేయమని కోరాడు,అదేమనగా సంవత్సరములో గల మాసములలో కార్తిక మాసమే ఎందుకు అతి పవిత్రమైనది, దాని గొప్పతనము ఏమిటి తెలియచేయమని కోరాడు.

అంతట వశిష్ఠుడు ఈ విధంగా తెలియచేసాడు  "ఓ రాజా! ఈ కార్తికమాసం హరిహర స్వరూపము. ఈ మాసము నందు ఆచరించు వ్రత ఫలితం ఇంత అని చెప్పలేము,ఇది ఆచరించిన వారికీ, వినిన వారికీ నరక బాధలు అనేవి  లేక, ఇహపరములందు సర్వ సౌఖ్యాలని పొందుతారు.

వశిష్ఠుడు వ్రత విధానాన్ని తెలుపుట :

"ఓ జనకమహారాజా!  ఏ వయసు వారయినా కార్తీకమాసం లో ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి,దాన ధర్మములు,దేవతా  పూజలు చేసినచో మంచి పుణ్య ఫలం లభిస్తుంది. ఈ  మాసం ప్రారంభం నుంచి ఆఖరు వరకు ఈ విధంగా చేస్తూ, విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన చేస్తూ ఉండాలి,ముందుగా  కార్తీకమాసానికి అధి దేవత అయిన దామోదరునికి  నమస్కరించి, "ఓ దామోదరా ! నా వ్రతానికి ఎటువంటి ఆటంకాలు రానీయకుండా నన్ను కాపాడుము" అని ధ్యానించి వ్రతాన్ని ప్రారంభించాలి."

కార్తీక స్నాన విధానం :

ఈ  వ్రత్రమును ఆచరించే నెల రోజులు సూర్యోదయానికి ముందే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, దగ్గర్లో ఉన్న నదికి లేదా సముద్రానికి,లేదా బావి నీటితో గాని అంటే చల్లటి నీటితో స్నానం చేసి, సూర్య భగవానునికి నమస్కరించాలి. పితృదేవతలకి నమస్కరించి, భక్తీ శ్రద్దలతో శివుని పూజించి, కార్తిక పురాణం చదివి, కలిగి ఉన్నంతలో పేదలకు దానధర్మాలు చేయాలి. సాయంకాలం శివాలయంలో గాని,తులసి మొక్క దగ్గర గాని దీపారాధన చేసి, నైవేద్యం చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని భక్తిశ్రద్దలతో ఆచరించిన వారికి గత జన్మలోనూ,ఈ జన్మలోనూ చేసిన పాపాలు పోయి, మోక్షాన్ని పొందుతారు. ఇలా చేయటానికి అవకాశం  లేనివారు వ్రతం చేసిన వారిని చూసినా లేక వారి పాదాలకి నమస్కరించినా అదే ఫలితం వీరికి కూడా లభిస్తుంది.

తొలిరోజు పారాయణ సమాప్తం 


4 comments: