November 6, 2013

నాగులచవితి ....... నాగపంచమి .......సుబ్రహ్మణ్యషష్టి......

నాగులచవితి ....... నాగపంచమి .......సుబ్రహ్మణ్యషష్టి

నాగపంచమి --- శ్రావణమాసంలో శుక్లపక్షంలో పంచమి నాడు జరుపుకుంటారు.
నాగులచవితి -- కార్తీకమాసంలో శుక్లపక్షంలో చవితినాడు జరుపుతారు.
సుబ్రహ్మణ్య షష్టి -- మార్గశిరమాసంలో శుక్లపక్షంలో షష్టి రోజున జరుపుతారు.

ఈ పండుగనాడు ఉన్నఊరిలోగానీ.....ఊరి బయటగానీ  ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన పాములపుట్టలో ప్రజలు (హిందువులు) పాలు పోస్తారు.

నాగులచవితి నాడు పుట్టలో పాలుపోయుట అనేది భారతీయ సంప్రదాయాలలో ఒకటి. సందర్భాలు వేరు వేరు ఐనా, పాముల్ని పూజించుట మనదేశంలో అన్ని ప్రాంతాలలో ఉన్నది. ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మనది కాబట్టే ప్రకృతిలో కనిపించే ప్రతీజీవికి  మనం పూజచేసి కృతజ్ఞత తెలుపుకుంటాము. అదే విధంగా పాములని పూజిస్తాము. నాగులచవితి ..నాగపంచమి....సుబ్రహ్మణ్యషష్టి.. పేర్లు ఏవైనా ఆయా ప్రాంతాలలో పండుగ చేసుకొనే ఆచారం పాటించటమే ముఖ్యం.



తల నుండి - తోక వరకు మెలికలు వేసుకొని ఉన్న రెండు పాముల రాయి ఒకటి మనకి రావిచెట్టు క్రింద ఉంచుట ఎక్కువగా దేవాలయాలలో మనం చూస్తూ ఉంటాము. ఈ నాగుల చవితి నాడు పాములనిపూజిస్తే  సర్వరోగాలు పోయి, గర్భదోషాలు పోయి,  ఆరోగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.



పురాణాలలో సర్పాలకి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మనదేశంలో ఉన్న హిందూ మతంలోనే కాకుండా బౌద్ధ -- జైన -- సిక్కు మాటలన్నింటిలో కూడా నాగదేవతల గుర్తింపు --వాటిని పూజించే సంస్కృతి ఉన్నది. శైవ -- వైష్ణవాలు మిగిలిన విషయాలలో విభేదించినా.... సర్ప పూజల విషయంలో మాత్రం ఏకాభిప్రాయాన్నే వెల్లడించాయి.మనం కొద్దిగా గమనిస్తే పాములకు మనకు ఎంతోదగ్గర సంబంధం ఉన్నది. శ్రీమహావిష్ణువుని పానుపు ఆదిశేషువు.... పాలసముద్రాన్ని చిలుకుటకు ఉపయోగపడింది వాసుకి అనే సర్పము. కృష్ణుని అన్న బలరాముడు ఆదిశేషుని అంశే అని చెబుతారు. రాముని  తమ్ముడు లక్ష్మణుడు కూడా శేషుని అంశే. మనజీవితాలని నడిపించే గ్రహాలలో ఉన్న రాహుకేతువులు కూడా సర్పాలే.....శంకరుని , వినాయకుని ఆభరణాలు సర్పాలే....దేవలోకంలో అమృతాన్ని రక్షించేవి సర్పాలే. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే సర్పాల గూర్చి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చును.

పొలాల్లో పంటలని పాడుచేసే ఎలుకలు మరియు క్రిమికీటకాలని సంహరించి, పంటలని రక్షించేవి పాములే. నీటిలో ఉంటూ ప్రజలకి అపకారాన్ని కలిగించే నీటిపురుగులని...క్రిమికీటకాలని తింటూ, తమ నోటినుండి వచ్చే విషాన్ని నీటిలో విడుస్తూ, ఆ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరిరక్షించేవి పాములే.

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. పుట్టకు క్రిందిభాగం విశాలంగా ఉండి పైకి పోనుపోను చిన్నదిగా ఉంటుంది. అదే విధంగా మానవుడు కూర్చున్నప్పుడు కటి భాగం వెడల్పుగా ఉండి పైకి పోయేకొలది సన్నగా చిన్నగా తల భాగం ఉంటుంది. పుట్టలో పాలు పోసినట్లు, ఈ శరీరము అనే పుట్టలో కూడా జ్ఞానమనే అమృతాన్ని తలనుండి పోయాలి అని దీని అంతరార్థం. తలనుండి క్రింద వరకు దిగి ఉండేది "కుండలినీ శక్తి"..... (కుండలములు అంటే పాములచుట్ట) కుండలములు కలది కనుక ఇది కుండలినీ అనే పేరు వచ్చింది.



ఎక్కడ సహజసిద్ధంగా పాములపుట్ట ఉంటే....ఆ పుట్ట క్రింద నీరు ఉంటుందని వరహమిహురుడు చెప్పాడని అంటూ ఉంటారు. లోపల చల్లదనం లేనిదే చెదపురుగులు పుట్టని తాయారుచేసుకోలేవు.

సర్వజీవుల యందు పరమాత్మని దర్శించుటే ఈ పండుగల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి, చలిమిడి - చిమ్మిలి (నువ్వుల ఉండలు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు, కొన్ని ప్రాంతాల వారు కోడిగుడ్లని కూడా వేస్తారు. నాగరాజుకు హారతి పట్టడం గాని, వేడి పదార్థాల ఆరగింపు గాని పనికి రాదు. అందుకే నాగ పూజ చేసి ఉపవాసం ఉన్నవారు పొయ్యిమీద పెట్టిన వేడి పదార్ధాలని భుజించరు. పుట్టలో పాలు పోసిన అనంతరం వరిపిండిలో ఉన్న నూకలని జల్లుతూ .....ఈ నూకలని తీసుకొని మాకు భూమ్మీద ఉండే నూకల్ని ఉంచు అని చెబుతూ ........ పడగతొక్కితే పారిపో .......నడుం తొక్కితే నావారనుకో ........ తోక తొక్కితే తొలగిపో ......అంటూ పాములని ప్రార్థిస్తారు. పాము యొక్క కుబుసము మరియు విషము కొన్ని ఆయుర్వేద ఔషదాలలోఉపయోగిస్తారు.

చెవిబాధలు, కంటిబాధలు ఉన్నవాళ్ళు చవితి ఉపవాసం చేస్తే వారి బాధలు తొలగుతాయి. నాగవస్త్రాలు పుట్టమీద పెట్టి తీసి ధరిస్తే కోరిన కోరికలు తీరుతాయి.

నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే.. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తారు

5 comments: