November 28, 2013

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై తొమ్మిదవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై తొమ్మిదవరోజు కథ

అనంతరం అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి -"మహామునీ ! నేను బహు పాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికై నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను. అయినా నాయందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంట విందు ఆరగించి, నా సర్వదోషాలనూ ఉపశమింపచెయ్యు అని ప్రార్థించాడు. దూర్వాసుడు అతనిని తన బాహువులతో లేవనెత్తి "రాజా ! ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవు అయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ బ్రాహ్మణుడనూ తాపసినీ నీకనా వయోవృద్ధుడినీ  అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేగానీ మేలు చేయదు. అందువల్ల నీకు నమస్కరించడంలేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను. అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీవంటి ధర్మాత్మునితో కలిసి భోజనము చేయటం మహాద్భాగ్యం" అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి, విష్ణుభక్తుల మహాత్మ్య ప్రకటనార్థం, పరీక్షకునిగా వచ్చి దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తికావడంతో తన ఆశ్రమానికి తరలివెళ్ళిపోయాడు. కనుక కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాస జాగరణలు చేసి, ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, వ్రాసినా, వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలనూ పొంది, ఉత్తమ పదాన్ని, మోహాన్ని పొందుతారు.  

కార్తీకమాసం ఇరవై తొమ్మిదవరోజు కథ పారాయణం సమాప్తం 

                      

No comments:

Post a Comment