November 19, 2013

కార్తీక మహాత్మ్యం -- పద్దెనిమిదవరోజు కథ

కార్తీక మహాత్మ్యం -- పద్దెనిమిదవరోజు కథ

అంగీరసుడు చెప్పినది విని కర్మయోగాన్ని గురించి ఉద్భూత పురుషుడు ప్రశ్నించటంతో సకలవిద్యా సంపన్నుడు అంగీరసుడు ఇలా చెప్పసాగెను. “సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే కానీ, తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ శంసయగ్రస్తుడో, వాడు మాత్రమే కర్మలను చేసి, తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహధారియైన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలయిన స్నానసౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి.

స్నానము చేయకుండా చేసే ఏ కర్మమైనా సరే – ఏనుగు తిన్న వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందులోనీ బ్రాహ్మణులకు ప్రాతః స్నానము వేదోక్తమై ఉంది.ప్రతీరోజూ ప్రాతఃస్నానము చేయలేనివారు సూర్యడు సంచారము చేయు తులారాశి -- కార్తీకం, మకరరాశి -- మాఘమాసం, మేషరాశి - వైశాఖమాసంలోనైనా చేయాలి. జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాతఃస్నానాలు చేసేవారు, సరాసరి వైకుంఠమునకు చేరుతారు. చాతుర్మాసం మొదలైన పుణ్యకాలాలలో గానీ సూర్య - చంద్ర గ్రహణ సమయాలలో గానీ, స్నానము చాలా ప్రధానము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో సర్వప్రజలకు -- స్నాన, సంధ్యా, జప, హోమ, సూర్యనమస్కారాలు తప్పనిసరిగా చేయాలి. స్నానము చేయనివారు రౌరవ నరక గతుడై -పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. పుణ్యకాలాలన్నిటిలో కార్తీకమాసం ఉత్తమమైనది. వేదాన్ని మించిన శాస్త్రం, గంగను మించిన తీర్థం, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహం, కంటికంటే వెలుగు లేనట్లుగా ---కార్తీకమాసంతో సమానమైన పుణ్యకాలము లేదు. 

కర్మమార్గాన్ని తెలుసుకొని, ఈ మాసంలో ధర్మాన్ని ఆచరించేవారు వైకుంఠమునకు చేరుతారు. విష్ణువు లక్ష్మిసమేతుడై, ఆషాఢశుక్ల దశమి అంతంలో -- పాలసముద్రాన్ని చేరి , నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధినీ అనబడే కార్తీకశుక్ల ద్వాదశినాడు నిద్రలేస్తాడు. ఈ మధ్య నాలుగు మాసాలూ ఎవరైతే భగవంతుని ధ్యానము, పూజలను చేస్తూ ఉంటారో, వారి పుణ్యాలు అనంతమై, విష్ణు లోకాన్ని చేరుతారు. 
సత్కర్మ అనుష్ఠాన ఫల ప్రభావము
కృతయుగంలో, వైకుంఠములోనున్న - లక్ష్మీసమేతుడైన విష్ణువుకు నమస్కరించి, నారదుడు "ఓ శ్రీహరీ! భూలోకంలో వేద విధులు అడుగంటుతున్నాయి. జ్ఞానులు సైతము సుఖాలకు లోనవుతున్నారు. ప్రజలంతా వికర్మలై ఉన్నారు, వారు ఏ విధంగా విముక్తులవుతారో తెలియక నేను మధనపడుతున్నాను." అని అనగా, విష్ణువు అతని మాటలను విశ్వసించి, సతీసమేతుడై, వృద్ధ బ్రాహ్మణ రూపమును ధరించి, తీర్థక్షేత్రాలలోనూ, బ్రాహ్మణులుండే పట్టణాలలోనూ, పర్యటించాడు. కొందరు వారికి అతిథి సత్కారాలు చేశారు, కొందరు తిరస్కరించారు, మరికొందరు లక్ష్మీనారాయణుల విగ్రహాలకు పూజలు చేస్తూ, వీరిని తిరస్కరించారు. కొందరు తినకూడనివి తింటున్నారు. ఒకటేమిటి? పుణ్యం చేసేవారు తక్కువ, పాపం చేసేవారు ఎక్కువ మందిని చూచి, శ్రీహరి అన్యమనస్కుడై ఉండి ---- చతుర్భుజాలతో .... కౌస్తుభాది ఆభరణాలతో తన నిజరూపంలో ప్రత్యక్షమవ్వగా --జ్ఞానసిద్ధుడనే ఋషి అతని శిష్యులతో వచ్చి విష్ణువును ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు.
-:కార్తీక మహాత్మ్యం - పద్దెనిమిదవరోజు పారాయణం సమాప్తం:-

      

No comments:

Post a Comment