November 21, 2013

కార్తీక మహాత్మ్యం -- ఇరవైఒకటవ రోజు కథ

కార్తీక మహాత్మ్యం -- ఇరవైఒకటవ రోజు కథ 

ఈ విధంగా సాధారణంగా మొదలైన యుద్ధం ---- మహాయుద్ధంగా మారింది. ఆ సంకుల సమరములో కాంభోజరాజు మూడువందల బాణాలను ప్రయోగించి, పురంజయుని గొడుగుగా జెండాను, రథాన్ని కూలగొట్టాడు. తరవాత మరో అయిదు బాణాలతో గుర్రాలను కూల్చివేశి, మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను, కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజరాజు కవచాన్ని చీల్చి, గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికితీసి, ఆ కాంభోజుడు "ఓ పురంజయా ! నేను పరులసొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వానినే తన వింట సంధించి, పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారధిని చంపివేసాయి. పురంజయుని మరింత గాయపరచాయి, అంతటితో మండిపడిన అయోధ్యాపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని కంభోజునిపై వదిలగానే....... గుండెలలో నుండి వీపుగుండా దూసుకుపోవటంతో కంభోజుడు మూర్చపోయాడు. దానితో య్యుద్ధం మరింత భయంకరమైంది. తెగిన తుండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుఱ్ఱాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలూ -- మొండాలు వేరుగాబడి ..... గిలగిలా తన్నుకుంటున్న కల్బంటుల కళేబరాలతో ---- మృత వీరుల రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మియైన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజ్రుంభణను తట్టుకోలేక -- ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి, పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తూన్న పురంజయుని చూసి, సుశీలుడు అనే పురోహితుడు ---"మహారాజా ! శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరికే గనుక బలవత్తరంగా ఉంటే --- ఈ క్షణమే భక్తితో విష్ణువును సేవించటమొక్కటే మార్గము ....... ఇది కార్తీక పౌర్ణమి .... కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయమానంగా ఉండే ఈవేళ --- ఈ ఋతువులో దొరికే పూలను సేకరించి, హరి ముందు మోకరించి భక్తితో పూజించు . విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. గోవిందా - నారాయణా - ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు --- ఆ పాటలతో పరవశుడైన హరిముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీకమాసంలో ఆరాధించిన భక్తుల రక్షణార్థం విష్ణువు వేయి అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం ఎవరివల్ల అయ్యేపని కాదు. భూపతీ ! ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవటమే కానీ, నీకు శరీరబలం లేకపోవటం కానీ కానేకాదు. మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం ---- తద్వారా దైవబలం తగ్గిపోవటమే నీ పరాజయానికి కారణం. కనుక పురంజయా ! శోకాన్ని వదలి .... భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ వ్రతం వలన ఆయురారోగ్యాలు --- ఐస్వర్యాలు -- సుఖసంపదలు -- సౌభాగ్యం కలుగుతాయి. నా మాటలను విస్వశించు".

 -: కార్తీకమాసం ఇరవైఒకటవ కథ పారాయణం సమాప్తం :-   
                                    
          

No comments:

Post a Comment