January 21, 2014

మహా మాఘి ........... మాఘ పౌర్ణమి

మహా మాఘి ........... మాఘ పౌర్ణమి



చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు వర్తిస్తుంది. పౌర్ణమి నాడు మఘ నక్షత్రం ఉండుట వలన ఈ మాసానికి మాఘమాసం అని పేరువచ్చింది. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేయుటకు ఈమాసం శ్రేష్టమైనది అని మన పెద్దలు చెబుతుంటారు. యజ్ఞాలకు అధిష్టాన దైవం 'ఇంద్రుడు'. అందుకే ఇంద్రుణ్ణి 'మఘవుడు' అని కూడా అంటారు. ఈ మాసంలోనే శిశిరఋతువు వస్తుంది. చెట్ల ఆకులు రాలిపోతూ ఉంటాయి. శూన్య పుష్యమాసం అనంతరం వచ్చే కళ్యాణకారక మాసం ఇది.

వైశాఖ - కార్తీక మాసాల లాగే, ఈ మాఘమాసం కూడా స్నానాలకి జనులు ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు. మఘస్నానం అతి పవిత్రమైనదని చెబుతారు. పాపాలు తొలగుటకు నదీస్నానం చేయటం మాఘమాసం సాంప్రదాయం. ఈమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి, సూర్యోదయ కాలంలో --- సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయంట. ఆ సమయంలో సూర్యకిరణాలలో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు కనిపిస్తాయి. మాఘస్నాన విధులను 'మాఘపురాణం' వివరిస్తుంది, మఘస్నాన మహాత్మ్యాన్ని 'బ్రహ్మాండ పురాణం' వివరిస్తుంది.

మాఘమాసంలో సూర్యోదయానికి ముందే ఇంటివద్ద స్నానం చేస్తే -- ఆరు సంవత్సరాల యజ్ఞ, స్నానఫలం లభిస్తుంది అంటారు. బావినీటితో స్నానం చేస్తే -- 12 ఏళ్ళ పుణ్యఫలం, తాటాక స్నానం చేస్తే -- ద్విగుణం, నదీస్నానం చేస్తే శతగుణం, త్రివేణీ సంగమ స్నానం చేస్తే -- నదీ శతగుణ ఫలం ఇస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి.

మాఘపౌర్ణమిను 'మహామాఘి' అని కూడా అంటారు. ఈ పౌర్ణమిని, అన్ని పున్నమిలలోకెల్లా ఉత్తమమైన పున్నమిగా భావిస్తారు. స్నాన, దాన, జపాలకు ప్రశస్తమైన రోజు ఈరోజు. మఘమాసమంతా స్నానాలకి ఒక ప్రాముఖ్యము ఉంటే, మఘపౌర్ణమి రోజు స్నానానికి అతి పవిత్రమైన విశిష్టత ఉంది. ఈ పౌర్ణమి రోజున 'సింధుస్నానం' చేయాలని శాస్తవిధి. సింధువు అంటే సముద్రము. ఈరోజు సముద్రస్నానం కలుషహరమని, మహామహిమాన్వితమని విశ్వసిస్తారు. ఈ మాఘమాసంలో దివ్య తీర్థాలని స్మరిస్తూ, పౌర్ణమి స్నానం చేయటం సనాతన సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే, ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మృకండ మహర్షి - మనస్వినిల మాఘస్నానం ఫలితము వలననే వారి కుమారుడగు మార్కండేయునికి అపమృత్యు దోషం తొలగిందని పురాణాలు చెబుతున్నాయి.

మహామాఘి రోజునే 'కపిల మహర్షి' జయంతి. కపిలుడు విష్ణువు అంశ సంభూతుడు. దేవహూతి - కర్దమ మునిల పుత్రుడు. కపిలుని భార్య పేరు శ్రీమతి. సగర పుత్రులు -- యజ్ఞాశ్వం కోసం వెదుకుతూ - వెదుకుతూ, కపిలుడు తపస్సు చేస్తున్న సమీపంలో అశ్వం ఉండుట చూసి, అతడే అశ్వాన్ని అపహరించాడు అని భావించి, అతనిని బంధించబోగా, కపిలుడు కళ్ళు తెరచి చూసేసరికి వారంతా భస్మమయ్యారు. వారికి శాప విమోచనం ...... వారిపై (ఆ భస్మంపై) గంగాజలాన్ని ప్రవహింపచేయటమే, అని తెలిపాడు. భగీరథుడు ఘోర తపస్సు చేసి, గంగను భూమిపైకి రప్పించి, వారికి శాప విమోచనం కలిగించాడు.

              

3 comments: