January 21, 2014

హోలీ పండుగ ...... హోలీ పౌర్ణమి

హోలీ పండుగ ...... హోలీ పౌర్ణమి


దేశమంతా వేర్వేరు రూపాల్లో, వేర్వేరు కారణాలతో, రకరకాలుగా ఉత్సవాలు జరుపుకునే వాటిల్లో హోలీ పండుగ ఒకటి. త్రిమూర్తులను దంపతసహితంగా పూజించే రోజు ఒకే ఒక్కరోజు. అదే ఫాల్గుణ పౌర్ణమి (హోలీ పున్నమి). 

ఫాల్గుణోత్సవం, కళ్యాణ పూర్ణిమ, డోలాపున్నమి, హుతశనీపూర్ణిమ, కాముని పున్నమి, అనంగపూర్ణిమ, హోళికాదహో, హోళికాపూర్ణిమ, వసంతపూర్ణిమ, హోలీ ----- ఇలా రకరకాల పేర్లతో పిలవబడిన, అవన్నీ ఒక్కటే, అదే హోలీ పండుగ. ఈరోజు జరిపే కార్యక్రమాలు, అనుసరించే ఆచారాలు, జరిపే పూజలు అన్నీ భిన్నమైనవే. అన్నింటి వెనుకా ఆనందంతో పాటు, ఆరోగ్య భావన, ఆధ్యాత్మిక తత్త్వం, సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ వంటి ఎన్నో అనేక కథనాలు దాగిఉన్నాయి. 

శివపార్వతులను కలిపే ప్రయత్నంలో మదనుడు శివుని ఆగ్రహానికి గురై దహనమయ్యాడు. అతని భార్య రతీదేవి అభ్యర్థన చేసిన మీదట, ఆమెకు మాత్రమే సశరీరునిగా, మిగిలిన వారికి అనంగునడిగా ... తిరిగి లేచిన రోజు ఫాల్గుణ పౌర్ణమి. కనుక ఈరోజుని 'కాముని పున్నమి' - 'అనంగ పూర్ణిమ' అనే పేర్లు వచ్చాయని మనకు పురాణాలు వివరిస్తున్నాయి. 



ఉత్తరాంధ్రా ప్రాంతాలలో శివాలయాల్లో శివపార్వతులను (విగ్రహాలను) డోలిక (ఉయ్యాల) లో వేసి ఊపుతూ ఉత్సవం జరుపుతారు. బృందావనంలో బాలకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి ఊపుతూ, రంగులు చల్లుకుంటూ ఉత్సవం చేస్తారు. ఈ రెండు కారణాల వలన 'డోలా పూర్ణిమ' అనే పేరు వచ్చింది. 

మధుర మీనాక్షిదేవి తపస్సు చేసి, సుందరేశ్వర స్వామిని వివాహం చేసుకున్నరోజు ఫాల్గుణ పౌర్ణమి.కనుక దక్షిణాది దేవాలయాలలో ఈరోజుని కళ్యాణ (లక్ష్మీనారాయణ) వ్రతం చేస్తారు. అందుకే కళ్యాణ పూర్ణిమ అనే పేరు వచ్చిందని విష్ణుపురాణం తెలియచేస్తుంది. 


ఉత్తర హిందూప్రాంతంలో వసంతఋతువు ఆగమనాన్ని స్వాగతిస్తూ సృష్టికర్త అయిన బ్రహ్మను, జ్ఞానప్రదాత్రి అయిన సరస్వతిదేవిని పూజిస్తారు. దీనినే ఫాల్గుణోత్సవం అని అంటారు. ఆ మరుసటిదినం (ఫాల్గుణ బహుళ పాడ్యమి) చంద్రమానం ఆచరించేవారికి కొత్త సంవత్సరాది. కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతూ, సంతోషాలని వ్యక్తం చేసుకునేందుకే ఒకరిపైఒకరు రంగుల పొడులు, రంగునీళ్ళు జల్లుకుంటూ "హోలీ హోలీ రెరంగ హోలీ చమకేళిర హోలీ" అని పాడుతారు. ఈపాటకి భావం ---- "మోదుగపూలు తెచ్చి రోట్లో దంచి, కుండలో వేసి, రసం తీసి, వెదురు గొట్టాల్లో నింపాలి. (ఆ రసం ఎర్రగా ఉంటుంది). దీనికి వసంతం అని పేరు. దాన్ని వారు వావి వరుసలు చూడకుండా (పాటించకుండా) అందరూ ఒకరిపై ఒకరు జల్లుకొవాలని" దాని అర్థం. మోదుగపూలు దంచగా కషాయం ఈమాస వాతావరణంలో ఒంటిమీద పడటం వలన శరీరానికి కాంతి, వర్ఛస్సు ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. శరీరంలో కలిగే ఉద్రేకాలు (రక్తపోటు వంటివి) మానసిక దుర్వికారాలు వంటివి తగ్గుతాయి అని ఆయుర్వేదం చెబుతుంది. 

                                                                    

No comments:

Post a Comment