October 26, 2013

ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి

ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి 

పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమైన పట్టణం ఏలూరు. ఇక్కడ నుండి 40 కి. మి. దూరంలో ద్వారకాతిరుమల ఉంది. ద్రావిడ సంప్రదాయం ప్రకారం నిర్మించబడింది. ఈ ఆలయం దక్షిణాన రాజగోపురం 5 దశలున్న గోపురం. ఆలయ సమీపంలో గజ, గోశాలలు ఏర్పరచారు. అభయ ఆంజనేయస్వామి విగ్రహం, సుదర్శన చక్రము దర్శనమిస్తాయి.

ఒక గర్భగుడి (విమానం) క్రింద రెండు మూల విగ్రహాలు ఉండటం చాలా అరుదైన దృశ్యం. గర్భగుడిలో కాలు పెట్టగానే ఏంటో ప్రశాంతత లభిస్తుంది.

మూలవిగ్రహాలలో ఒకటి శిరస్సు భాగం దాకా కరుణావీక్షనాలతో దర్శనమివ్వగా మరొకటి స్వామి రూపం మొత్తంగా దర్శనమిస్తుంది. వేంకటేశ్వరస్వామి శిరస్సు నుండి ఛాతీ వరకు దర్శనం లభించగలదు. పాతాళంలో బలిచక్రవర్తి పూజించటానికి వీలుగా మిగిలిన అవయవాలు భూమిలోపల పాతుకుపోయాయని అంటారు.

శిరస్సు నుండి పాదాల వరకు గల (విగ్రహాన్ని) స్వామిని కళ్యాణవైకుంఠవాసుడు అని అంటారు. కంఠం వరకు దర్శనమిచ్చే స్వామిని దర్శిస్తే ముక్తి లభిస్తుంది. శిరస్సు నుండి పాదాల వరకు ఉన్న స్వామిని దర్శిస్తే ధనము, ధాన్యము, మోక్షము అన్నీ లభిస్తాయని ప్రతీతి. తిరుపతిలో జరిగే పూజలు ఇక్కడ కూడా జరుగుతాయి.

తిరుపతికి వెళ్లి కానుకలును సమర్పించుకుంటామని మొక్కుకున్నవారు, తలనీలాలు సమర్పించుకోవాలని మొక్కుకున్నవారు, ఇంకా మొక్కుబడులను చెల్లించాలనుకొని తిరుపతి వెళ్ళటానికి పరిస్థితులు అనుకూలించనివారు ద్వారకాతిరుమలకు వెళ్లి మొక్కులను తీర్చుకోవచ్చును. అందుకే ద్వారకాతిరుమలను "చిన్నతిరుపతి"  అని కూడా వ్యవహరిస్తారు.

ప్రతీ ఏటా రెండుసార్లు కళ్యాణాలు జరుగుతాయి. వైశాఖమాసంలో మరియు ఆశ్వీయుజ మాసంలో జరుగుతాయి.

ఆలయ చరిత్ర విశేషాలు:

ద్వారకా మునీశ్వరులు విష్ణువుని దర్శించాలని ఎంతోకాలంగా తపించారు. అందువల్ల ఆయన తిరుమల అనే ఒక చిన్న కొండపై కఠిన తపస్సు ఆచరించాడు. ఆ కొండ పూర్వం నుండే ఆదిశేషుడి అవతారంగా చెప్పుకునేవారు. కఠిన తపస్సు చేస్తున్న ఆ మునిపై చీమలపుట్ట, పెద్దపుట్టగా ఆయనపై ఏర్పడింది. అయినా మహర్షికి తపోభంగం కలిగించలేదు. ఆయన తపస్సుకి మెచ్చిన కరుణామూర్తి అయిన నారాయణుడు ఆతని ముందు ప్రత్యక్షమై ఆదిశేషుని అవతారమైన ఆ కొండపై తానూ కొలువైనట్టు తెలిపాడు. అంతట ద్వారకాముని ఆ కొండపై గోవిందుని కోసం వెతికాడు. ఒకచోట తన శిరస్సు మాత్రం లోకంలోని ప్రజలకు దర్శనమిచ్చేట్లు గోవిందుడు ఉండటం గమనించాడు. విష్ణురూపం తన కళ్ళకు కనిపించగానే ఆనందం పట్టలేకపోయాడు ద్వారకామునీశ్వరుడు.

స్వామి స్వయంభూవుగా అక్కడే కొలువైయున్న విషయం అక్కడనున్న మునులందరికీ తెలియచేసాడు. స్వామివారి పాదాలను దర్శించకుండా భక్తులకు దర్శనం పరిపూర్ణత చెందదని మిగిలిన మునులు ఆ స్వయంభూవు విగ్రహానికి వెనుకవైపు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసారు.

నిల్చున్నట్లు ఉన్న ఆ స్వామిని పదకొండవ శతాబ్దంలో శ్రీరామనుజలవారు ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. కృతయుగం నుండి ద్వారకాతిరుమల ఉందని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీరాముని తాతగారైన అజ మహారాజుకు యుక్తవయసులో ఉన్నప్పుడు,  ఇందుమతి అనే రాకుమారి  స్వయంవరానికి ఆహ్వానం అందింది. ఇందుమతి గురించి అంతకుముందే ఎంతో గొప్పగా విన్న అజుడు ఆమె తన సతీమణి కావాలన్నఆసక్తితో ఆ స్వయంవరానికి వెళ్ళాడు. వెళ్ళే దారిలో ద్వారకాతిరుమల వద్ద రథం ఆగింది. తను స్వయంవరానికి వెళ్ళే లోపే స్వయంవరం జరిగిపోతే ....... ఏం చెయ్యాలి ? అని ఆలోచించి ద్వారకాతిరుమలలో ఆగి, స్వామిని  దర్శించకుండానే ముందుకు సాగిపోయాడు అజ మహారాజు.

రాకుమారి ఇందుమతి పూలమాలతో రాకుమారులందరు ఉన్నసభలో చుట్టూ చూడగా అజ మహారాజు కనిపించాడు. మరుక్షణం ఆమె అతని మేడలో వరమాలను వేసింది. అజ మహారాజుకు ఎనలేని ఆనందం కలిగింది. అయితే ఆ ఆనందం ఒక ఘడియ మాత్రమే. ఇతర దేశాల నుండి వచ్చిన రాకుమారులు వెనువెంటనే అజునిపై కత్తి   దువ్వారు. వారితో యుద్ధము చేసి గెలిస్తేనే తన దేశానికి తిరిగి వెళ్ళటం సాధ్యమవుతుంది అని అజుడు తెలుసుకున్నాడు.

స్వయంవరంలో రాకుమారి ఎవరో ఒకరినే వివాహమాడగలదు. ఆమె ఎన్నుకోని మిగిలిన రాజులూ కల్యాణోత్సవంలో పాల్గొని విందుభోజనం ఆరగించి వెళ్ళటం ఆనవాయతీ. అయితే ఏ స్వయంవరంలోనూ ఎన్నుకోబడని రాజులు యుద్ధానికి సిద్ధబడరు. మరి తనకు మాత్రం ఎందుకిలా జరుగుతోంది అని అజుడు ఆలోచించాడు. వచ్చేదారిలో ద్వారకాతిరుమలలో ఆగినా, స్వామిని దర్శించకుండానే స్వయంవరానికి రావటం తాను చేసిన పెద్ద పొరపాటు అని గ్రహించాడు. వెంటనే "కళ్యాణవైకుంఠవాసా ! అపచారం జరిగిపోయింది, శాంతించు, రాజ్యానికి తిరిగి వెళ్ళేటప్పుడు తప్పక నిను దర్శించుకుంటాను " అని మొక్కుకున్నాడు. సంభ్రమాశ్చర్యాలు కలిగేలా యుద్ధానికి ముందుకు వచ్చిన రాజులంతా స్వయంవరంలో అజు మహారాజు  గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియచేసారు. ఆనాటి నుండి అజ మహారాజు, దశరథ మహారాజు, శ్రీరామచంద్రుడు మరియు రఘువంశానికి చెందిన రాజులందరునూ ద్వారకాతిరుమల కళ్యాణవైకుంఠవసునికి పరమ భక్తులైనారు.

ఈ ద్వారకాతిరుమల స్వామిని దర్శించగానే మనస్సంతా ఎంతో సంతోషంతో, ఏదో విచిత్రమైన అనుభూతిని పొందగలం. 



                            

No comments:

Post a Comment