October 10, 2013

దసరా నవరాత్రులలో మూడవరోజు చంద్రఘంటా అవతార విశేషాలు

దసరా నవరాత్రులలో మూడవరోజు చంద్రఘంటా అవతార విశేషాలు 


(3) చంద్రఘంట: 

పిండజప్రవరారుఢా చండకోపాస్త్ర కైర్యుతా
ప్రసాదం తనుతే మహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా ||   


దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట. ఈమె స్వరూపము పరమశాంతిదాయకమై, శుభములు చేకూర్చునిదై యున్నది. ఈమె శరీరము పసిడి వన్నెతో మెరయుచుండును. ఈమె శిరస్సుపై అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఈ పేరు సార్థకమైనది. ఈమె తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండి కౄరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ దినమున సాధకుని మనస్సు మనిపూరచక్రమునందు యుండును. ఈమెను ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు అవుతారు. ఇహలోకంలోనేకాక పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది. 

ఈమె వాహనము సింహము. ఈమె  యుద్ధమునకు సిద్ధమైయున్న విధంగా ముద్రదాల్చి యుండును. ఈమె చేయు భయంకరమైన ఘంటా చండ ధ్వనితో అత్యాచారులైన దానవ దైత్య రాక్షసులు భయకంపితులగుచుందురు.

నవరాత్రులలో దుర్గమ్మను ఉపాసించు మూడవరోజు పూజ అత్యధిక మహత్తు గలది. ఈ దినమున సాధకుని మనస్సు "మనిపూర" చక్రమందుండును. చంద్రఘంటా మాత దయతో అలౌకిక వస్తువుల దర్శనమగును. దివ్యసుగంధములు అనుభవించెదరు. వివిధ దివ్యధ్వనులు వినిపించును. ఆ క్షణమున సాధకులు అతిసావధానులై యుండవలెను.

చంద్రఘంటామాత కృపతో సాధకుల సమస్త పాపములు, బాధలు నశించును. ఈమెను ఆరాధించుట ఫలదాయకమైనది. సదా యుద్ధమునకు అభిముఖ ముద్రదాల్చి యుండుటచే భక్తుల కష్టములు శీఘ్రముగా నివారితములగును.

ఈమె వాహనము సింహము అగుటచే ఈమెను ఉపాసించువారు సింహమువలె పరాక్రమము కలిగి నిర్భయులై యుందురు.

మనము మనోవాక్కాయ కర్మలను శాస్త్ర విధిననుసరించి సంపూర్ణంగా పరిశుద్దులములను, పవిత్రములను చేసుకొని చంద్రఘంటామాతను శరణము పొందవలెను. ఈమెను ఉపాసించుటవలన మనము సమస్త సంసారిక బాధల నుండి విముక్తులమై సహజముగ పరమపదమునకు అధికారులము అగుదుము. మనము నిరంతరము ఆ మాత పవిత్ర రూపమును ధ్యానించుచు సాధనలో అగ్రేసరులమగుటకు ప్రయత్నించవలెను. ఆ మాతను ధ్యానించుట వల్ల మనకు ఇహలోక, పరలోకములందు సర్వశుభములు , సద్గతి కలుగును.                   

మూడవరోజు నైవేద్యం ----- కొబ్బరి అన్నం....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  


No comments:

Post a Comment