మల్లూరు హేమాచల నృసింహస్వామి క్షేత్రవిశేషాలు
ఆలయానికి చేరుకోవటానికి మొదటి ప్రవేశద్వారం - ఇక్కడనుండి ఆటోల ద్వారా చేరుకోవచ్చును.
మా తమ్ముడి ఫ్యామిలీతో నేను కూడా ఈ ఆలయాన్ని చూడటానికి, స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్ళాను. ఈ ప్రాంతమంతా అటవీప్రాంతం అవ్వటం వల్లన రోడ్డుకి ఇరుప్రక్కలా ఎత్తైన చెట్లతో, కొండలు, గుట్టలతో వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది. రోడ్డు పొడవునా, దారి అంతా కోతులు ఎక్కువగా కనిపించాయి. గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి, స్వామికి నైవేద్యానికి ఇద్దామని వస్తుంటే, చేతిలో ఉన్న కొబ్బరిచిప్పని లాక్కుని వెళ్ళిపోయాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి.
సరే ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే ...... ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు. ఈ క్షేత్రమంతా విహంగవీక్షణం చేస్తే అర్ధచంద్రాకారంలో ఉంటుందని అంటుంటారు. శాతవాహనశక ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు కలలో సాక్షాత్కరించి గుహాంతర భాగంలో ఉన్నానని చెప్పారంట. మహారాజు కొంతమంది సైనికులతో అక్కడకు వెళ్ళి గుహను తవ్విస్తుండగా స్వామివారికి గునపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం కారుతూఉంటుంది. ఈ ద్రవం సంతానం లేనివారు తీసుకుంటే సంతానం కలుగుతుందని, పెళ్ళికాని వారు తీసుకుంటే పెళ్ళి జరుగుతుందని నమ్ముతుంటారు. దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు. నరసింహస్వామిని దర్శించుకోవడంవల్ల సమస్త శతృ బాధలు తీరుతాయంటారు.
ఆలయానికి చేరుకోవటానికి రెండవ ప్రవేశద్వారం
పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రంలో తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. సాక్షాత్తు దేవతలే ఇక్కడి స్వామివారిని ప్రతిష్టించినట్లు చెబుతారు.
ఆలయానికి చేరుకోవటానికి మెట్లమార్గం
స్వామి వారికి ఆదిలక్ష్మీ(అక్క), చెంచులక్ష్మీ(చెల్లి)అను ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆలయంలో స్వామివారికి ఇరుప్రక్కల వీరిరువురి ఆలయాలు ఉన్నాయి.
ఆదిలక్ష్మీ అమ్మవారు
చెంచులక్ష్మీ అమ్మవారు
క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయ స్వామి, శిఖాంజనేయ స్వాములున్నారు.
ఆలయానికి మెట్లమార్గానికి ఎడమచేతి వైపు వేణుగోపాలస్వామి ఆలయం ఉంది.
ఆలయానికి ఎడమవైపు ఒక చిన్న కోనేరు ఉంది. మేము చూసిన సమయానికి అందులో నీరు లేదు.
ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామివారి విగ్రహం మానవ శరీర ఆకృతిలో మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసిన మెత్తగా మానవ శరీరంగా దర్శనమిస్తుంది. స్వామివారి శరీరమంతా రోమాలు మనకు దర్శనమిస్తాయి.
స్వామివారి మూల విగ్రహం
మానవాకృతిలో అతి సున్నితంగా ఉండే ఇక్కడి లక్ష్మీనర్సింహ స్వామికి తైలాభిషేకం అతి ప్రీతికరమని అంటారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన లక్ష్మీనర్సింహస్వామికి దక్షిణ భారతదేశంలోనే మరే దేవాలయంలో ఇలా తైలాభిషేకం చేయరు.
స్వామివారిని దర్శించే ముందు ధారల దగ్గరకి వెళ్ళి, తీర్థం తాగి, తలపై జల్లుకోవాలంట. మల్లూరు హేమాచల క్షేత్రాన్ని కాకతీయ రాణి రుద్రమదేవి సందర్శించి, ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చెబుతున్నారు.
ఇక్కడ రెండు ధారలున్నాయి, వాటిని అక్క ఆదిలక్ష్మీధార, చెల్లి చెంచులక్ష్మీధార అని అంటారు. సర్వరోగ నివారిణి ఈ ధారలు అని చెబుతుంటారు. కాశీ గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవని నమ్ముతారు. వంద రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్ని నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం యేడాది పొడవునా పారుతూనే ఉంటుంది. హేమాచల క్షేత్రదర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుందిట. హేమాచల క్షేత్రంలో కొండ మామిడి చెట్లు చాలా ఉన్నాయి. ఆకాశమంతా ఎత్తున్న మహా వృక్షాలు ఇక్కడ కనిపించాయి.
అక్క ఆదిలక్ష్మిధార
చెల్లి చెంచులక్ష్మీధార
ఆదిలక్ష్మీ ధార దగ్గర చిన్న గుట్ట మీద హనుమంతుడు ఉన్నట్టుగా ఒక ఆలయం ఉన్నది.
రామబంటు ఆంజనేయుడి విగ్రహం ఎక్కడా లేని విధంగా ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్న శిఖాంజనేయుడి స్వామి విగ్రహం అతివీర భయంకరంగా ఉండే విగ్రహం భక్తులకు దర్శనమిస్తుందట. రోడ్డుకి అరకిలోమీటరు దూరంలో కాలిబాటలో వెళ్ళాలి అని అన్నారు. కానీ మాకు సమయం లేకపోవటంతో స్వామిని దర్శించలేకపోయాం.
ఆలయ ప్రాంగణంలో కొన్ని ఆంజనేయ విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ఆలయం కూడా ఉంది.
ఈ ఆలయ నిర్వాహకులు ప్రతీ యేటా వైశాఖ మాసంలో లక్ష్మీనర్సింహస్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ పూజారులు నర్సింహస్వామి జయంతి, స్వామి వారి కల్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, నాకభలి(నాగబెల్లి), వసంతోత్సవం, మొదలగు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. స్వామి కల్యాణం రోజున రాష్ట్ర గిరిజన సంక్షేమ, సాంస్కృతిక శాఖ మంత్రి హాజరై స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారంట.
హైదరాబాదుకి సుమారుగా 300కి.మీ. వరంగలుకి 135 కి.మీ. దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే వరంగల్ నుండి మంగపేట వరకు బస్సులు ఉన్నాయి. మంగపేట నుండి ప్రైవేటు వాహనాల ద్వారా (ఆటోలు ఉన్నాయి) మల్లూరు లోని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. లేదా వరంగల్ నుండి ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. మేము మాత్రం కారులోనే బయలుదేరి వెళ్ళాం. హైదరాబాద్ నుండి 6 గంటల సమయం పట్టింది మేము ఈ క్షేత్రాన్ని చేరటానికి. ఉదయం 5 గంటలకి ఇల్లు దాటినవాళ్ళం, రాత్రి 9 అయ్యింది మళ్ళీ ఇల్లు చేరటానికి.
అంతా బాగానే ఉంది కానీ, ఇక్కడ కొనుక్కుని తినటానికి చిరుతిళ్ళనేవి ఏవీ దొరకవు. దొరుకుతాయేమో మాకు తెలీదు. మేము వెళ్ళినప్పుడు అక్కడ మాకేమి కనిపించలేదు. పులిహోర, లడ్డు, రవ్వలడ్డు ఈ ప్రసాదాలు మాత్రమే అక్కడ అమ్మారు.
ఇవే ఆ ప్రసాదాలు
ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ నిత్యాన్నదానసత్రం ఉంది. ఎవరొచ్చినా లేదు అనకుండా భోజనాలు పెడుతున్నారు. కానీ మేము ఇంటి నుండి కొన్ని items వండి తీసుకువెళ్ళాం. మేం అవే తిన్నాం. మా డ్రైవరు రాజు మేము తీసుకువెళ్ళిన వాటితో పాటు అక్కడ వారు వడ్డించిన అన్న ప్రసాదం కూడా తిన్నాడు.
నిత్యాన్నదాన సదనం
భోజనశాల
సర్వేజనా సుఖినోభవంతు