మహాత్మా గాంధీ గారికి ఎంతో ఇష్టమైన పాట వైష్ణవ జనతో హిందీలో ఉంది ఆ పాటని ఆచార్య ఫణీంద్రగారు తెలుగులో అనువదించి మనకు అందించారు. నాకు చాలాబాగా నచ్చింది. అందుకే ఆ పాటని అతని అనుమతితో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
వైష్ణవ జనతో ... (తెలుగులో)
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -
వాడె గదా భువి - వైష్ణవుడనగ!
ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -
ఎరిగి, సహాయము నెవ్వడు సేయు -
చిత్త మహంకృతి చేరగనీడు -
వాడె గదా భువి - వైష్ణవుడనగ!
ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -
వాడె గదా భువి - వైష్ణవుడనగ!
సకల లోకుల గను సాదరంబుగను -
పరులను నిందల పాల్జేయకుండు -
బుద్ధి వాక్కర్మల శుద్ధిగ నుంచు -
తత్పురుషుని గను తల్లి ధన్యయగు!
ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -
వాడె గదా భువి - వైష్ణవుడనగ!
సమదృష్టి గలుగు - తృష్ణల త్యజియించు -
పర కాంతలను మాత పగిదిగ జూచు -
జిహ్వ యసత్యము చెప్ప దెప్పుడును -
అన్యుల ధనముల నంట డెప్పుడును -
ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -
వాడె గదా భువి - వైష్ణవుడనగ!
కామ మోహ క్రోధ కపట లోభముల
మునుగకుండ మదిని ముక్తిని గోరు -
రామ నామమును నిరతము ధ్యానించు -
తనువున పుణ్య తీర్థముల ధరించు -
ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -
వాడె గదా భువి - వైష్ణవుడనగ!