రాములోరి పెళ్లి యంట రండి! రండి!
రాములోరి పెళ్లి యంట రండి! రండి!
జనకునింట పండగంట రండి! రండి!
రాములోరి పెళ్లి యంట రండి! రండి!
రాములోరి పెళ్లి యంట
జనకునింట పండగంట
ముజ్జగాల ముచ్చటంట రండి! రండి! రండి !
మనమంతా రాములోర్ని చూడాల ... ఆ రాములోరు మనవంకా చూడాల
నీలమేఘ శ్యాముడంట , ఆజానుబాహుడంట , కళ్ళసంగతడగకంట ....
రండి! రండి! రండి
ఓ ఇంటివాడు ఈనాడు ఔతాడు ...
ఓ మెరుపుతీగెకూ తాళి కడతాడు !
కళ్ళు ఉన్న మనమంతా కనులనిండ కలలుపండ చూడాల !
||రాములోరి పెళ్లి యంట ||
ఆ సీతమ్మను ఇపుడైన చూడాల .... మన సీతమ్మా రాములోర్ని చూడాల
అందాలకొమ్మంటా, బంగారు బొమ్మంటా , జగతికంత అమ్మంటా , ...
రండి! రండి! రండి!
మనకోసమె ఈనాడీ పెళ్ళంటా
మెరుపుప్రక్క మేఘముండె వింతంటా
మనసున్నా మనమంతా మనసునిండ మమతపొంగ మళ్ళి మళ్ళి చూడాలా!
||రాములోరి పెళ్లి యంట ||
మనకింక వారిద్దరె దిక్కంటా !
వారుండగ మనకెలా చింతంటా !
నింగినుంచి వచ్చినారు , దీవెనలను తెచ్చినారు , అభయమునూ ఇచ్చినారు
రండి! రండి! రండి !
పెళ్ళేమో వారికంట , కళ్యాణం జగతికంట
ఎప్పుడూ ఒక్కరంట, మళ్ళీ ... ఒక్కటై పోతరంట
కాళ్ళున్న మనమంతా సరయూనది వెల్లువలా పరుగు పెట్టి పోవాలా !
రాములోరి పెళ్లి యంట రండి! రండి!
జనకునింట పండగంట రండి! రండి!
రాములోరి పెళ్లి యంట,
జనకునింట పండగంట ,
ముజ్జగాల ముచ్చటంట ! రండి! రండి!
Dr.T.V.Narayana Rao Garu