"నా స్వామి" తెలుగు పద్యాలు
రచన - శ్రీ కోడూరి శేషఫణి శర్మ గారు
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి గారు
01
తే.గీ.
శ్రీ గజాస్యుని మద్భావ సీమ నిల్పి,
శ్రీ సరస్వతీ మాతను చిత్తమెంచి
స్వామి శతకమ్ము వ్రాయగా భావమూని
కలము పట్టితి తుదిదాక కదలుమనుచు!
02
ఆ.వె.
వెదురు బుట్ట యనుచు విలువ జూడకుమయ్య!
స్వర్ణ పాత్ర దెచ్చు శక్తి లేదు!
పదముల కడ నిడుదు మదిని పూవుల తోడ!
స్వీకరించు స్వామి! విన్నప మిదె!
03
తే.గీ. సర్వకాలములందు నీ సన్నిధాన
మందు నిలువగ గోరుచు నుందు స్వామి!
గుడిని దీపమ్మునై వెల్గ గడప చెంత
నుండు వరము ప్రసాదింపు మోయి దేవ!
04
ఆ.వె.
మేను పులకరించు నీ నామమును విన్న!
తలచినంత మనము తన్మయమగు
నీవు లేని నేను, నేనుగా మనలేను!
స్వామి! నిన్ను నేను వదల లేను!
05
ఆ.వె.
మదిని చేసినాను మంటపమ్ముగ నీకు!
నిల్పినాను స్వామి! నెమ్మి మీర!
మంటపమును వీడి మరలి పోబోకుమా!
కాళ్ల వ్రేళ్ల బడెద! కనికరించు!
06
తే.గీ.
ఎన్ని యిడుముల బడనౌనొ నన్ను జేర?
సలుపగలనయ్య నీ పాద సంవహనము!
తరలి రావయ్య నాపైన దయను జూపి!
వేచియుండెద నో స్వామి! వేయి కనుల!
07
తే.గీ.
విశ్వమంతయు నీవని విశ్వసించి
నీవె విశ్వమ్ము కద యను భావనమున
మెలగు చుంటిని గాని స్వామి! కనులకును
నేను గోరెడ్డి రీతిగా గాన బడవె?
08
ఆ.వె.
కొండ కోన దిరిగి కోసి తెచ్చిన పూలు
వాడి పోకముందె వచ్చి నిలిచి
చేయు నాదు పూజ స్వీకరించుము స్వామి!
కాలు మోపవయ్య గడప ముందు!
09
ఆ.వె.
సంస్కృతమ్ము నెఱుగ, సంస్తుతుల నెఱుంగ;
పలుకరించు టొకటె తెలియు నాకు!
పలువ రించు చుంటి పలుమార్లు నిను గూర్చి!
పలకవేమి స్వామి? అలిగి నావె?
10
ఆ.వె.
మదిని చేసినాను మృదుశయ్యగా నీకు;
పవ్వళింపు సేవ పదిలముగను
సలుపగలను స్వామి! శయ్యపై జేరుమా!
నిదురకేమి లోటు నీకు రాదు!
11
ఆ.వె.
పళ్లెరమ్ము నిండ బహువిధ ఫలముల
బేర్చినాను స్వామి! ప్రీతి మీర
నారగించుమయ్య యనువైన వానిని!
కనుల విందు నాకు! కడుపునిండు!
12
ఆ.వె.
వకుళమాల కలదు వంట యింటిని జూడ;
నువిద తోడ నూయలూగ గలవు!
పెట్టి పుట్టు బిడ్డ పెనిమిటి వీవయా!
స్వామి! నీదు భాగ్యమేమొ? భళిర!
13
ఆ.వె.
ఆలు గలదు నీకు నల్లంత దూరాన;
భార్య చెంత నున్న బాధ తెలియు!
చేరబోయె దీవు తీరు బాటున్ననే!
భాగ్యమనిన నీదె! స్వామి! భళిర!
14
తే.గీ.
లక్షలాదిగ నుంద్రు నిరీక్షతోడ!
నన్ను గుర్తించి యెట్టుల నెన్న గలవు?
నీదు పాదాల ముద్రలు నాదు కనుల
గాంచ గలుగుదు వో స్వామి! కనుల గనుము!
15
తే.గీ.
నిన్ను స్మరియింపనేరని నిముషములను
లెక్కగట్టంగనేవియు లేనె లేవు!
నిన్ను స్మరియించుకాలమ్ము నెన్న బూన
సాధ్యపడదయ్య లెక్కించ స్వామి! యెపుడు.
16
తే.గీ.
అప్పు చేగొని పెండ్లియా? అందుకొఱకు
వడ్డీ చెల్లింపు మాదియా? బాగు బాగు!
ఋణము తీరుట యెప్పుడో? యెటుల స్వామి!
చెల్లు వేయుట కెన్నేళ్లు చెప్పవయ్య!
17
తే.గీ.
అమ్మ నలివేలు మంగమ్మ నాదరమున
జేరు సమయాన నప్పులు చిత్తమందు
కలత గలిగించవా స్వామి? కంటి కెటుల
నిదుర వచ్చుట సాధ్యమ్ము నీకు? చెపుమ!
18
తే.గీ.
పరగ శ్రీశైల మైనను, తిరుమలైన
నీశుడైనను, శ్రీవేంకటేశుడైన
నొక్కడే యని నమ్ముచు నుందు స్వామి!
వమ్ము కాలేదు నా నమ్మకమ్ము లెపుడు!
19
తే.గీ.
శంఖమూదగ నిర్వురసాధ్యు లౌర!
ఆయుధమ్ములు నిర్వుర కమరి యుండె?
వరము లిచ్చుట యందును స్వామి! నాకు
భేదమేమియు గన్పడ లేదు సుమ్ము!
20
ఆ.వె.
మనసు మాయజేసి మనుజుని యాడించు;
అదుపులోన నుంచు నంతరాత్మ!
ఆత్మసాక్షి వీవె! యనుసరించెద స్వామి!
మార్గదర్శివగుచు మన్ననలిడు!
21
తే.గీ.
తెలిసి కొన్నియు నటులనే తెలియకుండ
చేసి యుండిన పాపాల ద్రోసి వేసి
క్షమను జూపుచు నొసగుమా శమము స్వామి!
పాపమను మాటయే లేని బ్రతుకు నిమ్ము!
22
ఆ.వె.
పరవశమున నీదు పాదాల నొత్తంగ
దలచి స్వామి! కొంత కలత బడితి
కఱకు బారియున్న కరములు నావని!
నచ్చియోర్వగలవొ? నొచ్చు కొనెదొ?
23
ఆ.వె.
మదిని నిన్ను గూర్చి స్మరియించుటే తప్ప
యెఱుగనయ్య యితర మేమి నేను!
దరికి జేర్చుకొనగ దగనని యందువా?
ఏమి చేయగలను స్వామి? చెపుమ?
24
తే.గీ.
ఆల వర్ణము లెన్నున్న పాలు తెలుపు!
పుత్తడియు నొక్కటే గాని భూష లెన్నో!
ఎన్ని రూపులు గొల్చిన నేమి స్వామి?
నీవు నొక్కండవే నని నేను దలతు!
25
తే.గీ.
వచ్చు నప్పుడు పాదాలు నొచ్చుననుచు
పూల బాటను ముంగిట పూన్కి తోడ
బరచి యుంచెదనో స్వామి! కఱకునేల!
తెలియ జేయుము ముందుగ, తెమలి యుందు!
26
ఆ.వె.
పూల, కంటకముల బుట్టించి నట్లుగా
మంచి చెడుల నేల నుంచినావు
స్వామి? యేలనయ్య వైరుధ్య మిట్టుల?
మంచి నుంచి చెడును ద్రుంచరాదె?
27
తే.గీ.
నేను నైవేద్య మిడెదను నీకటంచు
బల్కు టెట్టుల దగునయ్య స్వామి? కనగ
నాకు గల్గిన దేదైన నాది కాదు!
నీ విభూతియె! నీకిడ నేనెవరిని?
28
ఆ.వె.
బాల భక్తుడైన ప్రహ్లాదు గరుణించి
నావుగాని స్వామి! నాకు గాన
రావదేమి? పగలు రాతిరనక నేను
పలువరించు చుంటి; పలుకవేమి?
29
ఆ.వె.
జీవకోటి గావ నీవ యుందువు గాని
చివర నున్న నన్ను జేరుటెపుడు?
ఎన్ని జన్మలెత్తి నిన్ను గాంచగ నౌనా?
తెలియకుంటే స్వామి! తెలుపవలదె?
30
తే.గీ.
ఎందరెందరి కేవేవొ యిడుము లెన్నొ
తొలగ జేసితి వీవను పలుకు వింటి!
స్వామి! కలిగించి తొలగించు పనుల నిటుల
జేయ బూనుట యేలనో చెప్పవయ్య!
31
తే.గీ.
ఉన్నదానిని నీకిడ నుంటి స్వామి!
నీకు వలసిన దేదియో నాకు దెలియ
కుంటి; నటు లౌట నద్దాని నుచిత రీతి
నీయ గోరెద నోదేవ! ఇదియె వినతి!
32
తే.గీ.
వడలు, లడ్లు, ప్రసాదాలు, వసతి గదులు
క్షేత్రముల యందు భక్తుల చేతి కనువు
గాను లేకపోయెను గదా! కనుక యెటుల
స్వామి! నిను జూడ వచ్చుట సాధ్యమౌను?
33
ఆ.వె.
యత్నపూర్వకముగ నజ్ఞానమును వీడ
జేయుమయ్య! గురుని జేర్చవయ్య!
కత్తిమీది నడక కష్టమైనను సరే!
నడుపుమయ్య స్వామి! ఒడుపు దెలిపి!
34
ఆ.వె.
చేతనున్న చిన్న చెంబెడు మాత్రమే
యుదక మొదవు నాకు నుదధి నుండి!
పెద్ద చెంబు నిచ్చి పేర్మిజూపుము స్వామి!
నీదు దయను నేను నింపుకొనగ!
35
ఆ.వె.
రెక్కలున్న యెడల రెపరెప మని వచ్చి
తమరి జూడ వచ్చు త్వరిత గతిన!
రెక్క లీయకుండ చిక్కులన్ బెడితివి!
మనసు నిన్ను జేరె! గనుము స్వామి!
36
ఆ.వె.
పండితుడను గాను; భక్తితో నిను గూర్చి
పద్యమల్ల నేర్చి బ్రతుకు చుంటి!
తప్పు లొప్పు లనుచు దిప్పలు బెట్టకు!
సర్దుకొనుము స్వామి! సంతసమున!
37
తే.గీ.
నీవు పల్కించు పల్కులే నేను బల్కు
చుందు నో స్వామి! నాదేమి యిందు లేదు!
కలము సాగంగ జేయుమా సులభముగను!
పద్యముల వ్రాత జూడుము హృద్యమగను!
38
తే.గీ.
పిడికెడటుకుల కీవిడు విలువ తెలిసె!
మదిని నీకిడి నిల్చితి; మరచినావె?
మోక్షమే గాని వేటొండు ముదము నిడదు!
గురుతు జేసెద నో స్వామి! కరుణ జూడు!
39
తే.గీ.
అమృతమును ద్రావు వారల కాకలియెటు
తెలియ గలదయ్య? పేదల గలయ జూడు!
చేయవలసిన దేదియో చేయవయ్య!
నీదు సంతానమే స్వామి! నెమ్మిగనవె?
40
తే.గీ.
డొక్క లెండిన లోకులు పెక్కురిలను
గలరు చూడవె నా స్వామి! కనులు తెరచి;
“బల”యు “నతిబల” విద్యలు వారి కొఱకు
గాక యింకేల కో దేవ? కనికరించు!
41
ఆ.వె.
పుండ్రములను బట్టి పుణ్యమ్ము పాపమ్ము
లొదవు ననుట జూడ నుత్తమాట!
ఉన్న మాట జెప్ప నూకొట్టరో స్వామి!
తెలియ జెప్పు టెటులొ తెలియ దాయె!
42
ఆ.వె.
నడక లిచ్చి తీవు! నడచితి నీ వైపు!
పలుకు లిచ్చి తీవు! ప్రణతు లిడితి!
చేతు లిచ్చి తీవు! చేసితి నీ పూజ!
లింత కన్న స్వామి! యేమి చేతు!
43
తే.గీ.
త్రికరణమ్ముల శుద్ధిగ దేవ! నిన్ను
స్మరణ జేయుచు, నుతియింతు! చక్కగాను
సేవ జేసెద నో స్వామి! చిత్తగించి
కంట జూడగ వేడెద! గావుమనుచు!
44
ఆ.వె.
నీదు ప్రాంగణమున పాదమూనిన చాలు
మధుర భావములవి మదికి దోచు!
క్షణము నిలువ నీక స్వచ్ఛంద సేవకుల్
స్వామి! వెడల ద్రోయ బాధ కలుగు!
45
తే.గీ.
రాకపోకల దెలుపక, లక్ష్యమేమొ
తెలియ జేయక పుట్టించి యిలను స్వామి!
ఆట లాడించు చున్నావు; యవనికలను
దించు టెత్తుట యన్నది తెలుపవేమి?
46
ఆ.వె.
మల్లెపూల జేరు మధుపమ్ము వోలెను,
కడలి వైపు నదులు కదలు నట్లు,
నీదు గడప జేర మోదమ్ము నొందును
స్వామి! నాదు మనము నేమనందు?
47
ఆ.వె.
తావళమును ద్రిప్పు తహతహయే గాని,
మనము నిలువ బోదు మంత్ర మందు!
మంత్రమేమి కలదు మదిని కట్టడి జేయ?
చెప్పవయ్య స్వామి! చేతు నతులు!
48
ఆ.వె.
అర్చనమున కింత, యభిషేకమున కింత;
పాద దర్శనంపు భక్తి కింత;
నేత్ర దర్శనంపు నియమాల కింతని
యందు రెటుల స్వామి? అంత వలెనె?
49
ఆ.వె.
వేలు పెట్టలేని పేదలసంగతి
పట్టదేమి స్వామి? గిట్ట దేమి?
క్షణము నిలువనీక సాగద్రోయుచు నుంద్రు!
దర్శనమ్ము గూడ దక్కనీరె?
50
ఆ.వె.
వినుట కుదర లేదొ? వినిపించు కోలేదొ?
ఏవగించు కొంటివేమొ స్వామి?
విడువ బోను నిన్ను వినినంత వరకును!
దిక్కులేదు, నీవె దక్క నాకు!
51
ఆ.వె.
పిలిచినంత పలుకు వేల్పు వనుచు నుంద్రు;
వేయి పేర్ల నిన్ను బిలిచినాను!
మరచినావొ స్వామి మరి నీదు నామాలు?
ఉలుకు పలుకు లేక యుందు వేల?
52
తే.గీ.
స్వామి! నీ దయ జగమెల్ల చల్లగాను
వెన్నెలట్లుగ ప్రసరించు చున్న దౌర!
మానసమ్మను వాకిలి మానవుండు
తెరచినను గాక నీ కృప తెలియుటెట్లు?
53
ఆ.వె.
కరము బట్టి నడుపు ఘనుడవు నీవుండ
దిగులు లేదు నాకు! వగపు లేదు!
క్రిందు మీదు లయిన, కేలు నందించగా
స్వామి! నీదె కదర బాధ్యతయును!
54
ఆ.వె.
వేద విదుడ గాను; వేదాంత మెఱుగను!
చెవుల కెక్క నెవరు చెప్పలేదు!
ఆస్తి కుండ ననెడు నర్హత నాకుండె!
స్వామి! నన్ను బ్రోవ జాలు గదర!
55
ఆ.వె.
అక్రమార్జనమున నారి తేరిన వారు
మ్రొక్కు చుందురయ్య ముడుపు లొసగి!
దోచుకొనగ బ్రజల జూచుచు నుందురు!
వరము లొసగనేల స్వామి! నీవు!
56
ఆ.వె.
నీదు సొమ్ము మెక్కి నిక్కి నీల్గెడి వారు
పెక్కు రుండిరయ్య! నిక్క మిద్ది!
తగదు వారి సైచ తగదయ్య! ఓ స్వామి!
తాట దీయవలదె తగిన రీతి!
57
ఆ.వె.
'స్వామి' యనుచు వ్రాయ, జదువ జాలని వారు
'సాములోరి' మనుచు సంఘమందు
చెల్లు బాటు నగుచు జెలరేగు చుండిరి!
కంట జూడు స్వామి! తుంటరులను!
58
ఆ.వె.
కోట్ల కొలది ప్రజల కోర్కెలు విని విని
విసుగు జెందబోకు! వినుము స్వామి!
వెదకి చూడుమయ్య, విన్నవించెడి వారి
వరుసలోనె నేను వచ్చియుంటి!
59
ఆ.వె.
పుష్కరాల మునగ బుణ్యమ్ము గలదను
పెద్దవారి మాట వింటి స్వామి!
అహరహమ్ము తావకా రాధనమ్ములో
మునిగి యున్న నాకు
బుణ్య మిడవె?
60
తే.గీ.
పద్యముల వ్రాయ బల్కునే వాసుదేవు
డనుచు నున్నారు బంధువు; లౌన స్వామి?
నీవు నెట్టుల బల్కెదో నెమ్మి నాకు
చెప్ప గోరెద; నట్టులే చేయగలను!
61
తే.గీ.
నాకు వలసిన దేదియో నీకు దెలుసు!
నెట్లు నడిపించగా నన్ను నెంచినావొ?
స్వామి! నా మది నిను గూర్చి నీమముగను
వర్తిలంగను జేయుమా! వందనములు!
62
ఆ.వె.
ఆయుధమ్ము లైదు సాయ మందించవే?
నేటి వార లేమి మేటి వారె?
కంటకనగ రాని తుంటరి దైత్యుల
స్వామి! మదమడంచి చంపవేమి?
63
ఆ.వె.
నాటి రాక్షసులను నలిపి వేసితివయ్య!
కలియుగాన నేడు తెలివి మీరి
యున్నవారి దునుమ కున్న కారణమేమి?
వారి కంటె ఘనులె వీరు స్వామి?
64
ఆ.వె.
సాత్వికతను జూప చవటగా నెంతురు!
రజము జూపినంత 'రౌడీ' యంద్రు
తమము జూపు వారి తలదన్ని పోదురు!
స్వామి! కష్టమయ్యె! బ్రతుకు గనవె!
65
ఆ.వె.
అధికమౌచు వర్ష మదియు న భావమై
హాలికులకు గలుగు హాని గనిన
చెదరి పోవు గుండె! చెమ్మగిల్లును కళ్లు!
కంట జూడు స్వామి! కర్షకులను!
66
ఆ.వె.
తల్లి, తండ్రి, గురువు తరువాత నీవని
పలుకు చుంద్రుగాని వారి యందు
నిన్నె గంటి నేను; నీ దయ కనుగొంటి!
నర్థమయ్యె స్వామి! అన్ని నీవె!
67
ఆ.వె.
నల్గురున్న యట్టి నాదు సంసారమ్ము
నడుపు చుండి నేను నలిగిపోదు!
స్వామి! నిన్ను జూడ బహుళ సంసారివి!
ఎంత నలుగు చుందు వీవు సతము?
68
ఆ.వె.
కోట్ల కొలది ప్రజకు కోట్ల సమస్యల
గలుగ జేసి తీర్చగలవు స్వామి!
ఎంత కష్టపడేదొ? ఇన్ని సమస్యల
కల్పనమ్ము జేయు కష్టమేల?
69
ఆ.వె.
నీవు గానబడగ నేను గుర్తించెడు
విధము దెల్పు స్వామి! విశ్వరూప!
పిదప వగచకుండ మొదటె వేడుచు నుంటి!
పలకరించవయ్య! పులకరింతు!
70
ఆ.వె.
లయము జేయుటనెడు లక్ష్యమ్ము నీదైన
మహిని ఘోరమగు ప్రమాద మేల?
బాధ తెలియ కుండ పైకి గైకొని పోవె?
స్వామి! వారి గూర్చి బాధలేదె?
71
తే.గీ.
ప్రకృతి సంపద మాకెంతొ వరము స్వామి!
స్వార్థమును జూపి దాని నాశనము జేయు
ఖలుల నూరక వదలక ఖండనమ్ము
జేసి యుపకారమును మాకు చేయుమయ్య!
72
తే.గీ.
నీకు మాత్రమె ఋణపడి నేను నుండు
నటుల, పరుల ఋణములు నీ యవని పైనె
తీరి పోయెడి రీతిగా దీవెన లిడి
కనుల జూడుము! నా స్వామి! కనికరించు!
73
ఆ.వె.
నాలుగక్షరములు నా చేత వ్రాయంగ
చేయు చుంటివయ్య! చేసినట్టి
పుణ్యమేమొ గాని పొగడుదు నిను స్వామి!
వ్రాయ నేర్పమందు రమ్యముగను!
74
ఆ.వె.
కూడు, గూడు, గుడ్డ కొఱత లేనట్లుగా
నున్న చాలు గాని యుర్వి జనులు
కోట్లు కూడ బెట్ట గోరగ నేలనో?
బుద్ధి చెప్పు స్వామి! భువిని ప్రజకు!
75
ఆ.వె.
కనులు చూచినాను; తనువు తడిమినాను;
చిత్తమలర జేసె చేతి స్పర్శ!
పాదమంటి నేను పరవశించితి స్వామి!
కలను నిజము చేసి కరుణ గనుము!
76
ఆ.వె.
నాకు కనుల ముందు నఖశిఖ పర్యంత
మద్భుతముగ మీర లవతరించి
విందు గూర్చినారు! వేలనతులు స్వామి!
చెరగి పోదు ముద్ర చిత్తమందు!
77
ఆ.వె.
నిన్ను తలచినంత నెరవేరు పనులన్ని;
మ్రొక్కినంత సుఖము దక్కగలదు!
పెక్కుమాటలేల? దిక్కునీవే స్వామి!
యనుచు చాటుచుందు నహరహమ్ము!
78
ఆ.వె.
సాగరమును బోలు సంసార మిడితివి!
కలత బడగనౌనె యలల వడికి!
రత్న నిధిగ దలచి రంజిలగా నౌనె?
సందియమ్ము వొడమె స్వామి! నాకు!
79
ఆ.వె.
అర్థమేమి కాని యాధ్యాత్మికమ్ములౌ
పలుకులేవొ సతము పలికి, వినిచి
వాయగొట్టుచుండు వారి నే మనవలె?
స్వామి! చెప్పవయ్య! వందనములు!
80
ఆ.వె.
విసుగు బుట్టజేయు వేదాంత మేలనో?
తెలిసి కొందమనిన తెమల బోదు!
సరళమైన యట్టి పరిభాష లేదేల?
నిన్ను దెలియ స్వామి, యెన్ని నేర్తు?
81
ఆ.వె.
పలుకరించి నేను పలుమార్లు నిన్నిటు
పలుచనైతి నేమొ స్వామి! వెఱతు!
పిలిచినంత లోనె పలికెడు వాడని
పేరుగలదు నీకు! విడువ గలనె?
82
ఆ.వె.
నల్ల మబ్బు తాను తెల్లని మెరపును
రువ్వెననగ నీదు నవ్వు నన్ను
సంతసింపజేసె స్వామి! నాకిది చాలు!
పదిలపరచుకొందు మదిని చిరము!
83
ఆ.వె.
దిక్కు తోచనపుడు దిక్కు నీవే యని
దిక్కునీవే
విన్నవించుకొంటి నెన్నో మార్లు!
అవసరమును బట్టి యాదుకొంటివి స్వామి!
మరువగలనె నీదు కరుణ నేను!
84
తే.గీ.
తెలిసి తెలియక తప్పులు సలిపి యుందు
సగటు మానవ మాత్రుడ నగుట స్వామి!
నన్ను ఋజుమార్గమందున నడుపు మనుచు
కోరి వేడు చుంటి కూర్మి తోడ!
85
తే.గీ.
నీవు నేనను వేర్వేరు భావమెపుడు
లేదు మన మధ్య నా స్వామి! లేక యుంట
నిన్ని యూసుల నీతోడ నిటుల నాడ
గలిగినాడను! నాకిద్ది ఘనత గాదె!
86
తే.గీ.
చాల విసిగించి నానేమొ చనువు కొలది
లౌకి కమ్మగు విషయాల నీకు వినిచి!
వేర లెవ్వారు గలరయ్య వినగ స్వామి!
నీవె హితుడవు! బంధుడ వీవె దేవ!
87
తే.గీ.
మంచి గంధపు చెక్కల మందసమున
బెట్టి నామనుచును విర్రవీగు చుంద్రు
నీదు రూపమ్ము గనని కబోదు లౌచు!
తెలియ జెప్పుట యెట్టులొ తెలుపు స్వామి!
88
ఆ.వె.
పెట్టెయందు బట్టు పిట్టవా నీవేమి
మందసమున బెట్ట మందులకట!
నిన్ను గొల్వ దరమె యెన్ని జన్మలకైన?
స్వామి! యూహనైన సాధ్యమగునె?
89
ఆ.వె.
సాధు జనుల పట్ల సాగెడి దౌష్ట్యమున్
సైచె దేల స్వామి? క్షణమునైన
నాలసించనేల? అణచివేయగ రాదె
ఖలుల దౌష్ట్య బుద్ధి మొలవ కుండ!
90
ఆ.వె.
బిచ్చగాడు బయట బొచ్చె పట్టుచు నుండు
భక్తుడేమొ లోన వరము లడుగు!
భేదమెచట స్వామి? భేదమే కనిపించు!
గుడికి బయట లోన నడుగు కొనుటె!
91
ఆ.వె.
పంచె కట్టు టనిన పనికి మాలినదని
పలుకు చుంద్రు నేడు తెలుగు వారు!
సంప్రదాయ మెటకు సాగిపోయెనొ స్వామి!
తెలుగు దనము నిలుచు తెఱవు గలదె?
92
ఆ.వె.
మాతృభాష పట్ల మమకారమే లేదు!
వ్రాయలేరు నాల్గు వాక్యములను!
చెప్పుకొనగ స్వామి! సిగ్గుగా నున్నది
నాదు జాతి గూర్చి నలుదెసలును!
93
తే.గీ.
పరశు రామావతారమ్ము మరల భువిని
యెత్తుటకుగాను వేగ మా యత్తపడుము!
నీవు గలవన్న సత్యమ్ము నేతలకును
స్వామి! తెలుపంగ వలయు నీ సమయమునను!
94
ఆ.వె.
ఖలులు గద్దె మీద కొలువు దీరినయంత
లెక్కలేని తనము నెక్కువైన
చక్కదిద్దవలెను సత్వరమ్ముగ నీవు!
ప్రజల క్షేమమరయ వలయు స్వామి!
95
ఆ.వె.
మనుజ లోకమందు మరుజన్మ మిడినను
వగపు లేదు కాని స్వామి! నిన్ను
మరవకుండునట్లు వరము నిచ్చిన జాలు!
మోక్షమంది నటుల మురిసి పోదు!
96
తే.గీ.
నిన్ను నమ్మిన భక్తులు నీకు వలెనె
భాగ్యవంతులు నౌచును వరలు చుందు
రనుటకే నీవు నిండుగా నట్టి వైభ
వమును చాటుచు నుంటివో స్వామి! నిజము!
97
ఆ.వె.
గడప నొక్కటొకటి గడచి నీ దరి జేరి
నిలిచినంత జాలు; నీ కటాక్ష
వీక్షణాల వెలుగు రక్షగా దోచును!
ధైర్యమదియె స్వామి! ధరణి నాకు!
98
ఆ.వె.
శుక్రవార మద్ది; సోమవారమ్మిది!
యనుచు నేను నీకు ననువగు నటు
లిడగలేను స్వామి! యే నివేదన మైన
స్వీకరించి తృప్తి జెందవయ్య!
99
ఆ.వె.
వైద్యశాలలనిన వ్యాపారమే యయ్యె!
రోగి బ్రతికి కూడ రోదనమ్మె!
అప్పు దీర్చలేక యతడు చావును గోరు!
స్వామి! ట్రీటుమెంటు వైద్యుల కిడు!
100
ఆ.వె.
నిన్ను గనిన యపుడు నేత్ర పర్వమ్ముగా
నడుగ దలచినవియు నుడిగిపోవు!
నీదు పాద యుగళి నాదు కాణాచిగా
కాను పించు స్వామి! మేను మఱతు!
101
ఆ.వె.
తలచితేని నీవు తగిన రూపమ్మున
వచ్చిప్రోవ గలవు స్వామి! నాడు
హస్తి రూపమునను నా హథీ రాముని
కాచినావు మిగుల కరుణ జూపి!
102
ఆ.వె.
రూప్య మొక్కటొకటి ఆప్యాయతను జూపి
ముడుపు పేర నీకు ముట్ట జెప్ప
నీ
స్వామి! నీ వొసంగు వరము వందల రెట్లు!
కరుణ జూపు నీవు ఘనుడవయ్య
103
ఆ.వె.
పుష్కరిణిని మునుగ పుష్కలమ్ముగ మాకు
సర్వ సంపదలును చక్కగాను
దక్కుననుచు దెలిసి తరియించితిని స్వామి!
భక్త సులభ నీకు వందనములు!
104
ఆ.వె.
నీ యనుగ్రహమ్ము నిండుగా నున్నచో
గ్రహము లేమి చేయ గలవు స్వామి!
గ్రహములన్ని నీదు కను సన్నలందుండు!
భయము లేదు నాకు భక్త వరద!
105
ఆ.వె.
నీ ప్రసాదమైన నేతి లడ్డుల కంటె
నీదు కీర్తనమ్మె స్వాదు తరము!
గొంతు నెత్తి స్వామి “గోవింద” యనినచో
జీవితమ్ము తీపి! జిహ్వ తీపి!
106
ఆ.వె.
అనుదినమ్ము స్వామి! అష్టోత్తరమ్మగు
నీదు నామ శతము నియమముగను
జపము సల్పుచున్న సాధ్యమే యేదైన!
వేంకటాద్రి నిలయ! విబుధ వినుత!
107
ఆ.వె.
కొలిచి గెలిచె నిన్ను కుమ్మరి యొక్కడు
మట్టి పూల పూజ మనసు బెట్టి!
స్వర్ణసుమములేల స్వామి! నీ పూజకు!
ముక్తి నిడెదవయ్య భక్తి జూప!
108
ఆ.వె.
కదలకుండ నిన్ను గట్టి, పల్లకియందు
త్రిప్పు చుంద్రు స్వామి! తిరుమలేశ!
కట్టుబడుదువయ్య గట్టి భక్తి యనెడు
బంధమందు దేవ! భక్త వరద!
109
ఆ.వె.
సాధనమ్ము జేసి జ్ఞానమున్ బడయంగ
మెట్టు నొక్కటొకటి యెట్టులైన
నెక్కినిన్ను జేరు నేర్పాటుగా దోచె!
స్వామి! అర్థమయ్యె? వందనములు!
*****************************************************************