April 7, 2014

రామావతార మాధుర్యం

రామావతార మాధుర్యం 


శ్రీరాముడు రాశీభూతమైన ధర్మం. త్రేతాయుగంలో భూమిపై నడచిన సత్యం. మానవరూపంలో భాసించిన నైతిక మహాత్వం. అసురశక్తులపై ఎక్కుపెట్టిన మహాస్త్రం. శ్రీరాముణ్ణి ఆదర్శ పురుషునిగా, ఆదర్శ భర్తగా, ఆదర్శ కుమారునిగా, ఆదర్శ జనకుడిగా -- మహాకవి, ద్రష్టయైన వాల్మీకి మహర్షి అభివర్ణించారు. శ్రీరాముడు అవతారంగా మహిమలు ఏమీ చూపించలేదు. మానవతా తేజస్విగా - మానవమాధుర్యాన్ని అందరికీ పంచిపెట్టాడు. శ్రీరామచంద్రుడు, శ్రీరామాయణం లేని మన పుణ్య భారతావనిని, వేదభూమిని మనం ఊహించలేము. 

చైత్రశుద్ధ నవమినాడు అయిదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న శుభసమయంలో పునర్వసు నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో, పగటిపూట, కౌసల్య గర్భాన్న జన్మించాడు మన శ్రీరామచంద్రుడు. 'రామ' అంటే 'రమించుట' అని అర్థం. ఋషుల మనస్సును ఆనందపరవశం చెందిస్తాడు కనుక శ్రీరాముడు ఆరాధ్యదైవం అయ్యాడు. 

శ్రీరాముడు రజస్తమోగుణాలను అణచివేసి, సత్వమనసును సుస్థిరపరచాడు. వివాహ వ్యవస్థ, అనురాగ బంధాల మధురిమ తెలియని యుగంలో - కోతులుగా, రాక్షసులుగా బ్రతికే జనారణ్యంలో చక్కని నైతిక, ధార్మిక వ్యవస్థను శ్రీరాముడు నెలకొల్పాడు. 

శ్రీరాముడి సత్యనిష్ఠను నిరూపించే ఘట్టం ఒకటి రామాయణంలో మనకు కనిపిస్తుంది. ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తుండగా, లక్ష్మణుడు ఎన్ని బాణాలు ప్రయోగించినా ఫలితం లేకపోయింది. చివరికి లక్ష్మణుడు ఒకబాణం తీసి 'శ్రీరాముడు సత్యవాక్పరిపాలకుడైతే, ఈ బాణం ఇంద్రజిత్తును హతమార్చుగాక' అంటూ దాన్ని ప్రయోగిస్తాడు. ఆ బాణ ఘాతానికి ఇంద్రజిత్తు నేలకూలుతాడు. 

శ్రీరాముడు జటాయువుకు మోక్షం ఇచ్చి, తానూ అవతారంగా బయటపడిపోయాడని కొందరు భావిస్తారు. జటాయువుకు మోక్షం ఇచ్చింది రాముడు కాదు. సత్యస్వరూపమైన రాముని మాటలే మోక్షం ఇచ్చాయి. ఎవరైనా సత్య వ్రతాన్ని పాటిస్తే వారి మాటలు నిజమౌతాయంటారు. 


మానవులని ప్రేమించటానికి, భక్తులనుంచి ప్రేమను పొందటానికి, భగవంతుడు భూమికి దిగివస్తాడు. గుహుడు, శబరి చూపిన భక్తి, ప్రేమతత్పరతలను తనివితీరా అనుభవించటం కోసం శ్రీహరి -- శ్రీరాముడై ఈ భువిపైన అవతరించాడు. శ్రీరాముడు దయార్ధహృదయుడు. గుహుణ్ణి మనసారా కౌగిలించుకున్నాడు. గుహుడు పూర్వజన్మలో ఋషికుమారుడు. అతని తండ్రి లేని సమయంలో ఒక రాజు వచ్చి, తాను చేసిన పాపాలకు నివృత్తి చూపమని అతన్ని వేడుకొనగా, అప్పుడతను 'రామ రామ రామ' అని మూడుసార్లు ఉచ్ఛరిస్తే పాపాలు నశిస్తాయి అని చెప్పాడు. రాజు సంబరపడి వెళ్ళిపోయాడు. అంతలో ఆ యువకుని తండ్రి వచ్చి, ఎవరు మనింటికి వచ్చారు?' అని అడుగగా, కుమారుడు అసలు విషయం చెప్పాడు. తండ్రి కోపంతో 'నువ్వు తప్పుచేసావు. రామమంత్రము ఒక్కసారి ఉచ్ఛరిస్తే చాలు. పాపాలు పోతాయి. నువ్వు చేసిన పొరపాటుకు నిన్ను శపిస్తున్నాను. నువ్వు నిమ్నజాతిలో జన్మిస్తావు.' అని శపించిన కారణంగా గుహునిగా ఈజన్మలో జన్మించాడు. అతని శాపమే అతనికి వరమై, సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్నే దర్శించాడని రామాయణం మనకు చెబుతుంది. 


శ్రీరాముడు పరిమితిలేని కారుణ్యమూర్తి. తనను ద్వేషించిన వారిని సైతం చంపకుండా వదిలేసే ప్రేమతత్వం ఆయనది. యుద్ధభూమిలో రావణుడు ఓడిపోగా, యుద్ధభూమిని విడిచివెళ్ళి, మర్నాడు మళ్ళీ రమ్మనమని చెబుతాడు. రాత్రంతా ఆలోచించి, రావణుడు తనమనస్సును మార్చుకొని, సీతను తనంత తానుగ తిరిగి ఇస్తాడని రాముని ఆశ. అప్పుడు రావణున్ని చంపకుండా విడిచిపెట్టాలని రాముని ఊహ. రావణుడు మారడు. ఫలితం మరణం. రావణునికి అంత్యక్రియలు జరపటానికి విభీషణుడు తిరస్కరించాడు. కానీ, తానూ అంత్యక్రియలు చేస్తానని రాముడు ముందుకు వచ్చాడు. ఈ చర్యతోనైనా రావణుని ఆత్మకు విమిక్తి కలిగించాలని అతను భావించాడు. తనను కాపాడటానికి రాముడు చేసే ప్రయత్నాలను రావణుడు ప్రతిఘటించాడు. ఇప్పుడు అతను మరణించాడు కనుక అతణ్ణి విముక్తం చేయవచ్చు. అదీ శ్రీరాముని దయాదృష్టి. 


రాముడిపై విజయానికి, సార్వభౌమత్వానికి రావణుడి మనసు, అహంకారం పోరాటం సాగించాయి. వైకుంఠానికి త్వరగా తిరిగివెళ్ళి భగవంతునికి సేవకుడిగానే జీవించాలని అతడి ఆత్మ తొందరపెట్టింది. రావణుడు దగ్గరిదారి ఎంచుకొని, భీషణ శతృత్వంతో దైవానికి ఎదురుతిరిగాడని కొందరి  ప్రముఖుల అభిప్రాయం.

'నువ్వు విష్ణు అవతారివి, తిరిగి వైకుంఠానికి వచ్చేయ్' అని దేవతలు రావణ వధ అనంతరం కోరినప్పుడు, నేను భూమిని విడిచి రాను. నేను దశరథ కుమారుణ్ణి. అని అంటాడు శ్రీరాముడు. దేవతలు కోరినంతమాత్రాన తన అవతారాన్ని చాలించదలుచుకోలేదు. రాముడు. అటు తరువాత 11000 సంవత్సరాలు శ్రీరాముడు జీవించి, భూమిని పునీతం చేసాడని మనం చదువుకున్నాం. శ్రీరామనామం ప్రణవనాద సుధార్ణవమే రాముడై ప్రవహించింది, ప్రతిధ్వనించింది, నిత్యమంత్ర ధ్యానమై భక్తులకు మోక్షద్వారాలు తెరచింది. 

శ్రీరామ జయరామ జయజయ రామ 


1 comment:

  1. Chaala Chakkaga Rama Vaibhavaanni Koorchaaru ...... Dhanyavaadhamulu

    ReplyDelete