కైలాస మానస సరోవర యాత్రా విశేషాలు (21/08/25 to 02/09/25) యాత్ర మొత్తం 13 రోజులు
Day 01 - 21-08-2025
మా యాత్ర కైలాస మానససరోవరంకి
చెన్నైలో ఉండే మహదేవ్ ట్రావెల్స్ వాళ్ళతో మా ఈ యాత్రకి వెళ్ళటం జరిగింది. మొత్తం 45 మంది యాత్రికులం. చెన్నైలో ఉండే నా స్నేహితురాలు (శ్రీలంక యాత్రలో పరిచయమైన స్నేహితురాలు) సంధ్య, ఆమె భర్త (హరివర్మ) ఇద్దరూ వెళుతున్నారు అని తెలిసి, నేను కూడా వాళ్ళతో పాటు ఈ యాత్రకి బయలుదేరాను.
యాత్రలో అందరూ తమిళ్ వారే ఉన్నారు. ట్రావెల్స్ వాళ్ళు కూడా తమిళ్ వాళ్ళే. స్నేహితురాలు తెలుగు అమ్మాయే (ఆ అమ్మాయికి తెలుగు, తమిళ్ కూడా వచ్చును) కాబట్టి నాకు భాష వల్ల ఏ సమస్యా లేదని యాత్రకి బయలుదేరాను.
మా పిల్లలిద్దరూ నన్ను హైదరాబాదు ఎయిర్పోర్ట్ లో ఉదయం 7.30 కి దించారు.
కొద్దిసేపట్లోనే నాతో పాటు గిరిజ గారు కూడా వచ్చారు. ఇద్దరం కలసి లోపలకి వెళ్ళాము. 10 గంటలకి మా ఫ్లైట్.
హైదరాబాదు నుండి మేము ఇద్దరమే ఖాట్మండుకు బయలుదేరాము. హైదరాబాదు నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి ఖాట్మండుకి విమానాల ద్వారా సాయంత్రం 5.30కి హోటల్ కి చేరుకున్నాము.
వివిధ ప్రాంతాల నుండి (చెన్నై, కోయంబత్తూరు, బెంగుళూరు, హైదరాబాదు) యాత్రికులు అందరమూ ఖాట్మండుకి సాయంత్రానికి చేరుకున్నాము.
మేము వెళ్ళేసరికి అన్ని ప్రాంతాలవారు అందరూ వచ్చేసారు, మేమే లాస్ట్ చేరుకున్నాము. పశుపతినాథ్ ఆలయానికి చేరువలో మాకు హోటల్ ఇచ్చారు. వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి, అందరం కలసి రెండు బస్సులలో జలనారాయణుని (నేపాలీ వాళ్ళు బుద్ధ నీలకంఠ అంటారు) దర్శించటానికి వెళ్ళాము. అక్కడికి చేరుకునేసరికి హోరున వర్షము & కరెంటు పోయింది. ఆ చీకటిలోనే టార్చ్ లైటు వెలుతురులో స్వామిని దర్శించి వచ్చాము. రాత్రికి హోటల్ లో భోజనాలు ముగించి నిద్రించాము.
Day 02 - 22-08-2025
ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని, టిఫిన్ చేసి 8.30 కి పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళాము, అక్కడ రుద్ర, నమక - చమకాలతో హోమం చేయించారు. అందరం కూర్చుని హోమంలో పాల్గొన్నాము. మా కైలాస మానససరోవర యాత్ర దిగ్విజయంగా జరగాలని ట్రావెల్స్ వాళ్ళే జరిపించారు.
హోమం అనంతరం పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించాము. తరవాత కూకేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించాము. ఇది ఒక శక్తిపీఠం.

ఆ తరువాత హోటల్ కి వచ్చి భోజనాలు ముగించుకొని, పంచ కేదారాలలో ఒకటైన డోలేశ్వరనాథ్ ని దర్శించటానికి అందరం బస్సులలో బయలుదేరాము. ఇప్పుడు కూడా హోరున వర్షమే. ఆ వర్షంలోనే అందరం వెళ్ళి స్వామిని దర్శించి తిరిగి హోటల్ కి చేరుకున్నాము.
Day 03 - 23-08-2025
ఈరోజు మా ప్రయాణం నేపాల్ సరిహద్దు దాటి - చైనాలోకి ప్రవేశించటం.
ఉదయాన్నే ఆరు గంటలకి అందరం వచ్చి బస్సులు ఎక్కాము. దారిలోనే ఒక హోటల్ లో 9 అయ్యేసరికి అందరం టిఫిన్స్ చేసాము. సుమారుగా 12.20కి నేపాల్ చైనా సరిహద్దుకి చేరుకున్నాము.
చాలా ట్రావెల్స్ కంపెనీలు వాళ్ళు రావటం వలన మేము సరిహద్దు దాటటానికి సుమారుగా 3 గంటల సమయం పట్టింది. ఈ బ్రిడ్జే సరిహద్దు. దీనినే ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అంటారు.
ఇమిగ్రేషన్, చెకింగ్ అన్నీ పూర్తి చేసుకొని క్షేమంగా అందరం సరిహద్దు (Border) దాటాము.
సరిహద్దు దాటగానే ఆటోమేటిక్ గా టైం & వాతావరణం రెండూ మారిపోయాయి. అంతవరకూ ఉక్కపోసింది, సరిహద్దు దాటి చైనాలోకి అడుగుపెట్టగానే బాగా చల్లగా వాతావరణం మారిపోయి చలివేసింది. మన భారతదేశ సమయానికి, నేపాల్ కి 15 నిముషాలు తేడా ఉంటుంది. భారతదేశానికి - చైనాకి 2.15 నిముషాలు తేడా ఉంటుంది. అంటే మనకంటే 2 గంటలు ముందు ఉంటారు. మనకి సాయంత్రం 5 ఐతే చైనాకి రాత్రి 7.15 అవుతుంది.
నేపాల్ నుండి సరిహద్దు వరకు వచ్చిన బస్సులు మళ్ళీ తిరిగి నేపాల్ కి వెళ్ళిపోయాయి. చైనాలోకి వచ్చాక చైనా బస్సులు 2 వచ్చాయి. వాటికి 1.గంగ - 2.యమునా అని పేర్లు పెట్టారు. మేము యమునా బస్సులో ఉన్నాము. అక్కడ నుండి న్యాలం అనే సిటీకి రాత్రి 7.30 కి చేరుకున్నాము. చైనాలో రాత్రి 10. వరకు చీకటి అవ్వదు, ఉదయం 7.30 ఐతేగానీ వెలుగు రేఖలు రావు. ఈ న్యాలంలో హోటల్ కి లిఫ్ట్ లేదు. 4 అంతస్తులు మెట్ల ద్వారానే నడిచి రూమ్ కి చేరుకోవాలి. ఒకప్రక్క ఆల్టిట్యూడ్ సిక్నెస్, మరొకప్రక్క లిఫ్ట్ లేకపోవటం వల్ల అందరూ చాలా డల్ ఇపోయారు.
ఈ ఫొటోలో మీరు గమనించవచ్చు టైం రాత్రి 7.57 అయ్యింది, ఐనా ఎండగనే ఉన్నది. ఇక్కడ నుండి మనం వాతావరణానికి అలవాటు పడటం నేర్చుకోవాలి. (అంటే Accumulate అవ్వాలి.)
కొంచెం మనం హై ఆల్టిట్యుడ్ కి చేరుకున్నాం అన్నమాట. అందుకే ఈ వాతావరణం అందరికి కొద్దిగా అలవాటు అవ్వాలని ఆరోజు, మరుసటి రోజు కూడా అందరం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆల్టిట్యూడ్ సిక్నెస్ అందరికీ వస్తుంది. ఒక్కో మనిషికీ వారి శరీర పరిస్థితులను బట్టి ఒక్కొక్కలాగా వస్తుంది. జ్వరం, వాంతులు, విరోచనాలు, ఒళ్ళు నొప్పులు, నిద్రలేమి, తల తిరగటం, తల పట్టేయటం, తిండి సహించకపోవటం ..... ఇలాగ ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ఇబ్బందికి తప్పక గురి అవుతారు. నాకైతే తల దిమ్మెక్కినట్టు, తలంతా బరువుగా అనిపించింది. ఈరోజు నుండి ప్రతీరోజూ రాత్రి పూట ట్రావెల్స్ వారు భోజనాల తరవాత డయామోక్స్ టాబ్లెట్ ప్రతీ ఒక్కరికీ ఇచ్చారు.
Day 04 - 24-08-2025
ఈరోజు కూడా న్యాలం లోనే అందరం ఉండిపోయాము. వాతావరణం అలవాటు అవ్వాలి అని టిఫిన్స్ అయ్యాక కొద్దిసేపు బయటనే తిరిగి, తరవాత రూంకి చేరుకున్నాము.
Day 05 - 25-08-2025
ఉదయం టిఫిన్స్ చేసి 9 గంటలకి సాగాకి మా ప్రయాణం మొదలయ్యింది.
దారిలో మానససరోవరం నుండి ప్రవహించే బ్రహ్మపుత్రా నది మాకు కనిపించింది. అందరం వెళ్ళి తలపైన నీరు జల్లుకున్నాం.
సాయంత్రం 4.30కి సాగా చేరుకున్నాము. సాగా సిటీని చూడగానే చైనా దేశంలో అడుగుపెట్టినట్టుగా అనిపించింది. హోటల్ వాతావరణం అంతా టిబెట్ సంస్కృతికి తగ్గట్టుగా అలంకరించి ఉన్నది. ఈ ప్రాంతంలో ఆల్టిట్యూడ్ మరి కొంచెం ఎక్కువయ్యింది. అంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవుతోంది. ఈ సాగాలో మొదలయ్యింది నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం, మళ్ళీ తిరిగి సాగా వచ్చాక కంటినిండా నిద్రపోయాను. అంటే నాకు ఆల్టిట్యూడ్ సిక్నెస్ నిద్రపట్టకపోవడం వచ్చింది. ప్రతీరోజు రాత్రిళ్ళు 2 లేదా 3 గంటలు మాత్రమే నిద్ర పట్టేది.
ఈరోజు రాత్రికి సాగాలోనే నిద్రించాము.
Day 06 - 26-08-2025
ఉదయం టిఫిన్లు చేసి, (ఎప్పటినుండో ఎదురుచూసిన) మానస సరోవరానికి ప్రయాణమయ్యాము.
సాగా నుండి మార్గమధ్యంలో ఫోటో షూట్ కోసం మంచి లొకేషన్స్ వచ్చినప్పుడు బస్సు ఆపినప్పుడు అందరం వెళ్ళి సరదాగా ఇలా క్లిక్కుమనిపించాం.

అలా ప్రయాణించి ఒక ప్రాంతానికి వచ్చి ఆగాము. అక్కడ నుండి చూస్తే దూరంగా మానససరోవరం & దాని వెనుకగా కైలాశనాథుని వెండికొండ మొదటి దర్శనం అయ్యింది. అలా మొదటి చూపులోనే అందరికీ భావోద్వేగం ఆగలేదు. అందరూ ఎమోషనల్ అయిపోయారు. సాస్టాంగ నమస్కారాలు చేసి, కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. అంతవరకు వచ్చిన చైనా బస్సులు అక్కడితో ఆగిపోయాయి. ఇక్కడ నుండి చైనా ప్రభుత్వ బస్సులు ప్రయాణం చెయ్యాలి అంట. అందుకే మళ్ళీ బస్సులు మరి ఆ ప్రభుత్వ బస్సుల్లోనే మమ్మల్ని సరోవరానికి తీసుకొని వెళ్ళారు.
అంతవరకు వచ్చిన చైనా బస్సులు అక్కడితో ఆగిపోయాయి. ఇక్కడ నుండి చైనా ప్రభుత్వ బస్సులు మాత్రమే ప్రయాణం చెయ్యాలి అంట. అందుకే మళ్ళీ బస్సులు మారి, ఆ ప్రభుత్వ బస్సుల్లోనే మమ్మల్ని సరోవరానికి తీసుకొని వెళ్ళారు. రోడ్డుకి ఎడమప్రక్కన మానససరోవరం, కొంత దూరం వెళ్ళాక కుడి ప్రక్కన రాక్షసస్థలం (రావణ సరస్సు). మానససరోవరం తియ్యటి నీరు ఐతే, రావణ సరస్సు ఉప్పునీటి సరస్సు. ఒకే ప్రాంతంలో భిన్న రుచులు. మానససరోవరం అంతా పాజిటివ్ ఎనర్జీ & వైబ్రేషన్స్ ఐతే, రావణ సరస్సు అంతా నెగెటివ్ ఎనర్జీ, వైబ్రేషన్స్. ఈ రావణ సరస్సులో ఒక్క ప్రాణి కూడా నీటిని తాకదు అంట, తాకితే వాటికీ కూడా ఎక్కడ నెగెటివ్ ఎనర్జీ అంటుకుంటుందో అని. ఇది రాక్షసస్థల్
మానససరోవరంలో నీటిలో మునిగి స్నానం చేసే అవకాశం లేదు. నీటిలో దిగి కాళ్ళు కడుక్కొని, తలపైన నీళ్ళు మాత్రమే జల్లుకునే అవకాశం ఉంది. షేర్పాలు మనకి బకెట్ తో నీరు ఇస్తారు, మనం ఒడ్డున నిలబడి స్నానాలు చెయ్యాలి. ఈ కింది ఫొటోలో గమనించండి. సమయం 7.59pm అంటే రాత్రి 8 అయ్యింది కానీ ఎండ ఎంత తీవ్రంగా ఉన్నదో చూసారుగా.

స్నానాలు ముగించుకొని దగ్గర్లో ఉన్న ఒక హోటల్ లో రాత్రికి ఉన్నాము.
Day 07 - 27-08-2025
ఇక్కడ హోటల్ లో washrooms లేవు. ఐనా చలి విపరీతంగా ఉండటం వలన ఎవరూ స్నానాలు చేయలేదు. ఉదయమే టిఫిన్లు ముగించుకొని,(ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి స్నానం లేకుండా టిఫిన్ చెయ్యటం నాకు ఇష్టం లేక టిఫిన్ తినలేదు. ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడే భోజనం చేద్దాం అని ఊరుకున్నా) అందరం కలసి హోమం చేసాము. మరుసటిరోజు కైలాస పరిక్రమ అందరూ బాగా చేయటానికి శక్తిని ఇవ్వమని ఆ శివయ్యని వేడుకున్నాము.
వచ్చిన యాత్రికులలో 8 జంటలు వచ్చారు. ఆ 8 జంటల పేర్లు చీటీలపైన రాసి డ్రా తీశారు. డ్రాలో గెలిచిన జంటని శివపార్వతులుగా నియమించి, వారిరువురికి హోమం అయ్యిన తరవాత, పాదపూజ నిర్వహించారు.
అనంతరం అందరం డార్చేన్ చేరుకున్నాము. అక్కడ హోటల్ లో స్నానాదులు ముగించుకొని, భోజనాల తరవాత, కైలాశ పర్వతంలో ముఖ్యమైన భాగం దక్షిణ ముఖ దర్శనం, దానిని దగ్గరగా వెళ్ళి దర్శించుకునే దానిని అష్టపాద దర్శనం అంటారు. దక్షిణముఖం - దక్షిణామూర్తి దర్శనం అని అంటారు. ఆ దర్శనం చేసుకోవటానికి వెళ్ళాము.
శివయ్యకి ఎదురుగా ఎప్పుడూ నందీశ్వరుడు ఉంటాడు కదా ! అదే విధంగా ఈ శివయ్య ఎదురుగా నంది పర్వతం చూడండి.
శివయ్యకి అతి దగ్గరగా వెళ్ళిన అనుభూతి చెందాము. బొందితో కైలాసానికి వెళ్ళాము, శివయ్య పాదాల చెంతకి చేరాము, ఇంతకంటే ఈ జన్మకి అదృష్టం ఇంకేమి ఉంటుంది చెప్పండి. మాటల్లేవు, ఆ మౌనవ్యాఖ్యుని దగ్గరికి చేరగానే అందరం మౌనం వహించాము. అరగంటసేపు అక్కడే ఉన్నాము. ఎంతసేపు ఉన్నా తనివితీరలేదు. అప్పుడే రూముకి వెళ్ళిపోవాలా అనిపించింది.
Day 08 - 28-08-2025
ఎన్నాళ్ళ నుండో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది అనిపించింది. కైలాస పరిక్రమ. ఉదయం 8 గంటలకి టిఫిన్స్ చేసి, బస్సులో యమద్వార్ వరకు వెళ్ళాము. ముందురోజే గుర్రాలు, పోర్టర్లు ఎవరికి ఏవి కావాలో అవి బుక్ చేసుకోవాలి.
1. కొంతమంది నడచి వెళ్ళారు, వాళ్ళలో కొందరు వారి లగేజీ మోయటానికి పక్కన పోర్టర్ ని బుక్ చేసుకున్నారు.
2. కొంతమంది గుర్రాలపైన వెళ్ళారు.
3. కొంతమంది మొదటిరోజు గుర్రాలపైన వచ్చి రెండవరోజు ఉదయం బంగారు కైలాసాన్ని చూసి, గుర్రాలపైనే వెనక్కి వెళ్ళిపోయారు.
నేను ఐతే గుఱ్ఱం పైనే పరిక్రమ చేశాను, పోర్టరుని కూడా బుక్ చేసుకున్నా, ఎందుకంటే రెండవరోజు కొంతదూరం నడవాల్సి వస్తుంది, మనం నడవలేము అన్నప్పుడు పోర్టర్ మన చేయి పట్టుకొని నడిపించుకుని తీసుకొని వెళతాడు. మన లగేజీని మోస్తాడు. అక్కడ ఉన్న వాతావరణానికి ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండటం వలన అయిదు, ఆరు అడుగులు వేసేసరికి ఆయాసం విపరీతంగా వస్తుంది. నడవటమే కాకుండా మన లగేజీ మనం మోసుకొవటం అంటే చాలా కష్టం.
యమద్వార్ కి కొంతదూరం ముందు వరకు మనం బస్సులో రావచ్చును. అక్కడే గుర్రాలు ఉంటాయి. మనకి నచ్చిన గుర్రం మనం ఎంచుకోవటం వంటివి ఉండవు. గుర్రాల వారి పేర్లు రాసిన చిటీలని ఒక దగ్గర ఉంచుతారు. ఎవరు ఏ చీటీ తీస్తే వారితోనే అంటే ఆ గుఱ్ఱంవాళ్ళతోనే మనం వెళ్ళాలి.
గుఱ్ఱం వాళ్ళకి వాళ్ళ చైనా భాష తప్పించి, ఇంగ్లీషు & హిందీ ఏ భాషా రాదు. మనకి దాహం వేస్తే, వాషురూమ్ వెళ్ళాలన్నా చేతితోనే మనం సైగలు చేసి చెప్పాలి.
యమద్వారం దాటాక మనం గుఱ్ఱాలు ఎక్కాలి అంతవరకూ నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళే ముందు ట్రావెల్స్ వాళ్ళు మా అందరికీ food packet ఒకటి ఇచ్చారు. ఒక సమోసా, ఆపిల్ పండు, ఫ్రూటీ డ్రింక్ పాకెట్, బిస్కెట్ ప్యాకెట్, ఒక మంచినీళ్ళ సీసా ఇచ్చారు. అన్నీ ఇచ్చినా ఎవరికీ ఆకలి లేక తినలేకపోయాం. కేవలం మంచినీళ్ళు మాత్రమే తీసుకున్నాము.
యమద్వారం మనం దాటితే, కైలాసంలో అడుగుపెట్టినట్టే. యమద్వారం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి, తలవెంట్రుకలు కొన్ని తలపైనుండి పీకి గుమ్మం ముందు పడేసి, ద్వారం నుండి వెళ్ళి, అటువైపు బయటకి వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడవాలి. అప్పుడు గుఱ్ఱము ఎక్కి మా ప్రయాణం మొదలైంది. గమ్యం చేరుకునే లోపల రెండు చెక్ పోస్ట్ లు ఉన్నాయి. ఆ రెండు ప్రాంతాలలోని కైలాస పర్వత శిఖరాలు మనకి దర్శనమిస్తాయి. అక్కడ కాఫీలు, టీలు తాగటానికి, విశ్రాంతి తీసుకోవటానికి చిన్న షాప్స్ లాంటివి ఏర్పాటు చేసారు. దారిలో డస్టుబిన్ లు ఉన్నాయి, ఎక్కడపడితే అక్కడ చెత్త పారెయ్యకూడదు. ఒకవేళ ఎవరికైనా ఆపద సంభవిస్తే Emergency Alarams ఉన్నాయి. వాటిని మనం press చేస్తే Ambulance వస్తుంది, సహాయం అందిస్తుంది.
మేము బయలుదేరిన కొంతసమయానికి వర్షం చిన్న చిరుజల్లు లాగా పడింది. పూలవాన కురిసింది అని మేము అనుకున్నాము. మా అదృష్టం పెద్దవాన పడలేదు. అంతా శివయ్య కరుణ మాపైన ఉంది అనుకున్నాము. మేము వెళ్ళిన ముందురోజు ఐతే పెద్దగా వర్షం వచ్చిందని యమద్వార్ ముందే వేరే వాళ్ళకి మెసేజ్ వచ్చిందని ఆరోజు పరిశ్రమకి వెళ్ళలేదంట. మాకు ఏ ఆటంకము లేకుండా మా పరిక్రమ సజావుగా జరిగిపోయింది. మొదటిరోజు మా పరిక్రమ పూర్తిచేసి రూములకి వెళ్ళాక, కొద్దిసేపు తరవాత, పెద్దగా వర్షం మొదలైంది, రాత్రి తెల్లవార్లూ పడుతూనే ఉంది. మాకెవ్వరికీ ఏ ఇబ్బంది కలగలేదు.
4.40 అయ్యేసరికి మొదటిరోజు పరిక్రమ పూర్తి అయ్యింది. ఇక్కడ శివయ్యకి అతి దగ్గరగా, పాదాల చెంత ఉన్నట్టు అనిపించింది. రాత్రి నిద్రించినప్పుడు శివయ్య ఒడిలో వెచ్చగా పడుకున్నామా అనే అనుభూతి చెందాము.
పరిక్రమ అయ్యాక రాత్రి నిద్రించటానికి వసతులు బాగానే ఉన్నాయి, ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు, అంత ఎత్తు ప్రాంతంలో కూడా కరెంటు ఉన్నాది, మంచాలకి bed heaters ఉన్నాయి, room heaters కూడా ఉన్నాయి, అందువల్ల చలి లేకుండా వెచ్చగా పడుకోగలిగాము. ట్రావెల్స్ వాళ్ళు అందించిన ఆహారం వేడివేడిగా తిని పడుకున్నాము.
(ఇక్కడ ఉన్న సమస్య ఒక్కటే, దారిలో కానీ, రూమ్స్ దగ్గర కానీ, పరిక్రమ చేసే మూడురోజుల్లోనూ ఎక్కడా Bathrooms ఉండవు. నీటి సదుపాయం అసలే లేదు. అవసరమైతే Open areaకే వెళ్ళాలి, స్త్రీ - పురుషులు ఎవరైనా సరే. అంతకుమించి పరిక్రమలో ఏ ఇబ్బంది లేదు.)
Day 09 :- 29-08-2025
ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు, కైలాస పర్వతం పైన ఎప్పుడు సూర్య కిరణాలు పడతాయి, ఎప్పుడు బంగారు పర్వతాన్ని చూస్తామా అనే ఆరాటంతో అంత ఎముకలు కొరికే చలిలో కూడా అందరూ బయటనే నిలబడి కైలాస పర్వతాన్నే తదేకంగా చూస్తూ నిలుచున్నాము. చలిగా ఉందికదా అని లోపలికి వెళ్ళిపోదామా అంటే బండారు పర్వతాన్ని చూడటం మిస్ అవుతామేమో అని వెళ్ళలేదు. మొత్తానికి 8.15 దాటాక బంగారు శివయ్యని దర్శించి, మళ్ళీ మా పరిక్రమని ప్రారంభించాము. ఈ రెండవరోజు మొత్తం 22 కిలోమీటర్లు పరిక్రమ. 6 km కొండ ఎక్కటం, 6 Km కొండ దిగటం, 10km నడక/ గుఱ్ఱం ప్రయాణం.
పరిక్రములో అతి కష్టమైన, ప్రమాదకరమైన ప్రయాణం అంటే అది ఈరోజే. ఈరోజు దాటింది అంటే మనం ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలము అని అర్థం. నాకు అనిపించింది నేను చెప్పాను, ఎవరి అభిప్రాయం వారిది.
గుఱ్ఱం పైన ప్రయాణం మొదలయ్యింది, కొండలపైన ఎక్కటమే పనిగా ఎన్ని కొండలు ఎక్కాము అన్నది తెలియదు, మొత్తానికి 6 కిలోమీటర్లు కొండలు ఎక్కాము. అదేదో సినిమాలో చెప్పినట్టుగా మంచుకొండల పైకి, హిమాలయాల అంచులమీదకి తీసుకెళ్ళి వదిలేసినట్టుగా మమ్మల్ని పర్వతాల అంచులమీదకి తీసుకెళ్ళి గుఱ్ఱాలు వదిలేసాయి. అది డోల్ మాలాపాస్ అని అంటారు. అది సముద్రమట్టానికి 21,778 అడుగుల ఎత్తులో ఉన్నాము, అంటే 6638 మీటర్ల ఎత్తు. ఆక్సిజన్ అందదు. గుఱ్ఱం పైన ఎంతదూరం ప్రయాణం చేసినా ఆక్సిజన్ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా అన్న విషయం మాకు తెలియలేదు, ఇబ్బంది అనిపించలేదు. గుఱ్ఱం దిగాక నడవాలి అంటే అప్పుడు ఆక్సిజన్ తక్కువగా ఉండటం వలన ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. తరవాత కొంతసేపటికి సర్దుకొని, నడవటం ప్రారంభించాము. అక్కడ నుండి కిందకి చూస్తే గౌరీ కుండ్ ఉంది. అంటే గణేశునికి పార్వతి ప్రాణం పోసిన ప్రదేశం.
ఆగస్టు మొదటివారం వెళ్ళినవాళ్ళు ఇటువంటి రాళ్ళూ, గుట్టలూ దాటుకుంటూ ప్రయాణం చేసారు.

కానీ మేము రెండవ వారం వెళ్ళటం వల్లనేమో, దారి అంతా మంచుతో కప్పబడి ఉంది.
గౌరీకుండ్ అంతా ఎంత మంచుతో కప్పబడి ఉందో చూడండి.
పోర్టర్ సహాయంతో నేను సులువుగా కొండలు దిగగలిగాను. ఒక చేతిలో కర్ర పట్టుకున్నాను. రెండవ చేతిని పోర్టర్ పట్టుకొని జాగ్రత్తగా నడిపించాడు. కొండలు దిగిన తరవాత గుఱ్ఱాలు వచ్చాయి, మమ్మల్ని గమ్యస్థానానికి, (రూమ్స్ దగ్గర) చేర్చాయి. ఆరోజు నడక + గుఱ్ఱపు ప్రయాణం వల్ల ఎవ్వరికీ ఒళ్ళు స్వాధీనంలో లేదు. బాగా అలసట అనిపించింది. ఈరోజు కూడా అందరం రూమ్స్ కి చేరుకున్నాక రాత్రంతా పెద్దగా వర్షం పడింది. రాత్రిళ్ళు టెంపరేచర్ 0 డిగ్రీలు ఉంది. ఇక్కడ కూడా bed heaters ఉన్నాయి, అందువల్లే ఇబ్బందిలేకుండా అందరం ఆదమరచి నిదురపోయాము.
Day 10 :- 30-08-2025
ఈరోజు పరిక్రమ చాలా తక్కువ సమయమే పట్టింది. ఈరోజు దారి అంతా సమానంగానే ఉన్నది, ఎక్కువగా పెద్ద కొండలు వంటివి ఏమీ లేవు, చిన్న చిన్న గుట్టలు మాత్రమే ఉన్నాయి. గుఱ్ఱాలపైన రెండుగంటలు ప్రయాణం చేసాక, మళ్ళీ నడక ప్రారంభం అయ్యింది. సుమారుగా గంటన్నర, రెండుగంటలు నడచి ఉంటామేమో. అక్కడికి మా బస్సు వచ్చి అందరినీ రూమ్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది.
మొత్తానికి మూడురోజులు పరిక్రమ ఆ శివయ్య దయవలన, పంచాక్షరీ జపిస్తూ అందరం సంపూర్ణంగా పూర్తి చేసాము. ఎవ్వరూ ఆక్షిజన్ ను ఉపయోగించకుండా పరిక్రమ చేయగలిగాము. ఆయాసం వస్తే కొద్దిసేపు నిలబడి అలసట తీర్చుకున్నామే కానీ, ఆక్సిజన్ సిలండర్ అస్సలు వాడలేదు. అంతా ఆ శివయ్య మహిమ, మా అందరిపైనా మెండుగా ఉంది. అందరం రూమ్స్ దగ్గరికి చేరుకున్నాము, టిఫిన్స్ చేసి సాగాకి ప్రయాణమయ్యాము. దారిలో మానససరోవరంకి ఫోటో స్పాట్ ఒకటి కనిపిస్తే అక్కడ ఆగి అందరం కలసి ఫోటోలు తీసుకున్నాము.
మా టిబెట్ గైడ్ Dolma తో
Ganga Bus membars
Yamuna Bus membars
Total Ladies
మొత్తానికి పరిక్రమ పూర్తిచేసుకొని సాయంత్రానికి సాగా చేరుకున్నాము. రాత్రికి అక్కడే ఉన్నాము.
Day 11 :- 31-08-2025
ఉదయం టిఫిన్స్ పూర్తిచేసుకొని, సాయంత్రానికి న్యాలం చేరుకున్నాము.
Day 12 :- 01-09-2025
న్యాలం నుండి ఉదయం 7.15 కి సరిహద్దుల వైపు ప్రయాణం మొదలయ్యింది. 10 గంటలకి గానీ గేట్ తియ్యలేదు, తియ్యగానే మేమే ముందు ఉన్నాము, చెకింగ్ అయ్యి బయటకి వచ్చేసాము.
సరిహద్దు దాటగానే, అంతవరకూ మాకు చలి లేకుండా వెచ్చగా కాపాడిన కోటు మాకు చాలా బరువు అనిపించింది. ఉక్కపోసి తీసి పక్కన పెట్టేసాము.
ఇక్కడ నుండి దగ్గరదగ్గర 2km వరకు నడిచాము, రెండురోజుల క్రితం వరకు వర్షాలు బాగా పడి కొండచరియలు విరిగి పడటంతో దారి అంతా మూసుకుపోయింది, వాహనాలు రాకపోకలు లేని కారణంగా నడవాల్సి వచ్చింది. మా బ్యాగులు పట్టుకొని రాళ్ళు దాటుకుంటూ వెళ్ళలేక ఇక్కడ సహాకులని తీసుకున్నాము. పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి మన లగేజీ పట్టుకొని మనతో పాటు ఎంతదూరం ఐనా ప్రయాణం చేస్తారు, వారికి వాళ్ళు అడిగినంత amount ఇవ్వటమే. 250 రూపాయలు తీసుకున్నాడు. అవసరం మనది, ఎంతైనా ఇవ్వక తప్పదు.
దారి అంతా ఇలాగ ఉన్నాది. అలాగ కొంతదూరం నడిచి వెళ్ళాక కార్లు, వ్యాన్లు వచ్చి మరికొంత దూరం తీసుకొని వెళ్ళాయి, అక్కడికి మా బస్సులు వచ్చాయి. అందరూ వచ్చి రెండు బస్సులలోని చేరుకున్నాక ఖాట్మండుకు ప్రయాణమయ్యి రాత్రి 9 గంటలకి హోటల్ కి చేరుకున్నాము.
Day 13 :- 02-09-2025
ఈరోజుతో మా కైలాస మానససరోవర యాత్ర పూర్తి అయ్యింది. ఎవరిళ్ళకి వాళ్ళం ప్రయాణమయ్యాము.
ఉదయం టిఫిన్లు ముగించుకున్నాక యాత్ర చేసిన వారందిరికీ శివాలయా టూర్స్ & ట్రావెల్స్ అధినేత గౌతమ్ గారి చేతులు మీదుగా అందరికీ సర్టిఫికెట్లు అందించారు.
అందరికీ వీడ్కోలు పలికి నేను, గిరిజా గారు Airport కి చేరుకున్నాము.
@ Khatmand Airport
@ Delhi Airport
మాకు ఉదయం 10 గంటలకి flyt, మిగిలిన వారందరికీ చెన్నైకి మధ్యాహ్నం 2 గంటలకి.
ఖాట్మండు నుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి హైదరాబాద్ కి సాయంత్రం 5.30 కి చేరుకున్నాము. లగేజీ తీసుకొని, 7 గంటలకి ఇంటికి చేరుకున్నాను.
ఇంతవరకు ఓపికగా నా యాత్రా విశేషాలను చదివినందుకు అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏
Very nice Lakshmi, well covered with details. It's like a guide to future travelers. Happy to note you thoroughly enjoyed - Sriram
ReplyDeleteThanq Sriram 🤝🙏🙏🙏
ReplyDeleteశివయ్య దర్శన భాగ్యం మాకు కల్పించినందుకు ధన్యవాదములు.
ReplyDeleteThanq వీరబాబు గారు
Deleteని ప్రయాణం విశేషాలు చదువుతుంటే, నేను అక్కడే ఉన్నట్టు ఫీల్ అయ్యా... చాలా బాగా రాసావు పిన్నీ.... ని జన్మ ధన్యం... చదివిన నేను కూడా ధన్యుడను.. 😍🙏 ఓం నమ శివవాయ 🙏
ReplyDeleteThanq Vasu 🤝🙏
Delete