వేదగిరి లక్ష్మీనరసింహస్వామి
ఎన్నో పుణ్యక్షేత్రాలున్న నెల్లూరు నగరానికి పడమటి దిక్కున 19 కి.మీ. దూరంలో నరసింహకొండ అనబడే వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నెలకొంది.
ఎన్నో పుణ్యక్షేత్రాలున్న నెల్లూరు నగరానికి పడమటి దిక్కున 19 కి.మీ. దూరంలో నరసింహకొండ అనబడే వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నెలకొంది.
క్షేత్రమహాత్మ్యం (పురాణకథనం)
మునిపుంగవుడు, సప్తఋషులలో ప్రథముడైన కాశ్యప మహర్షి లోకహితం కొరకు ఒక యాగాన్ని సంకల్పించారు. తగినచోటు కోసం భువిపై వెతకగా పినాకినీ నది ఒడ్డున తల్పగిరి, రజితగిరి, వేదగిరి అనే మూడు కొండచరియలు పక్కపక్కనే ఉండటం చూసాడు. యాగం చేయటానికి ఇదే అనువైన చోటు అని తెలుసుకొన్న మహర్షి, వేదగిరికి దక్షిణం దిక్కున ఉన్న ఒకగుహలో ఏడు యాగగుండాలను ఏర్పాటు చేసాడు. యాగం ఎటువంటి విఘ్నమూ లేకుండా జరగాలని గోవిందరాజస్వామి, ప్రసన్న లక్ష్మీదేవిని రక్షణకొరకు ప్రతిష్ట చేశారు. భూలోకంలో లభించే ఎన్నో ప్రత్యేకమైన పదార్థాలను యాగంలో ఆహుతి కావించారు.
వైశాఖమాసం, స్వాతి నక్షత్రమందు చతుర్థశి రోజున, సంధ్యా సమయంలో ఈ యాగం మొదలైంది. యాగం ముగిసే సమయం ఆసన్నమైంది. అప్పుడు ముఖ్యమైన యాగగుండం నుండి ఒక జ్యోతి ప్రజ్వలించింది. అది అక్కడి నుండి వేదగిరిదాకా వెళ్ళి అక్కడొక గుహలోపలికి వెళ్ళింది.
శ్రీమహావిష్ణువు యొక్క దశావతారములలో నాల్గవది నారసింహావతారము. విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని కాపాడుటకోసం ఒక స్థంభంలో ఉద్భవించి, ఆ తరవాత హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఈ కథనం మనకందరకూ తెలిసిన విషయమే.
యాగగుండంలో జ్వలించిన జ్యోతి నరసింహావతారంలా కనిపించినందువల్ల కాశ్యప మహర్షి జ్యోతి వెళ్ళిన గుహలో నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
రాతిగుహ రూపంలో ఉన్న ఈ గర్భగుడిలో నరసింహస్వామి ఆరు అడుగుల ఎత్తైన విగ్రహం, చతుర్భుజుడై దర్శనమిస్తాడు. ఏ రూపమైతే హిరణ్యకశిపుడి మనసులో భయాన్ని కలిగించిందో - అదే రూపం భక్తులకు అందమైన రూపంలా గోచరిస్తుంది. ఏకళ్ళు అసురసంహరంలో ఉగ్రరూపం దాల్చాయో అవే కళ్ళు భక్తుల పాలిట కరుణ చూపిస్తున్నాయి.
మూలవిగ్రహానికి క్రింది భాగంలో నరసింహస్వామి - లక్ష్మీదేవిల చిన్న రూపాలు చెక్కారు. స్వామికి ఎడమవైపున లోకరక్షణ కోసం యాగమాచరించిన కాశ్యపమహర్షి విగ్రహం చెక్కించారు.
స్వామి ఆలయానికి ఉత్తరం వైపున అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారిఆలయ ప్రాకారాన్ని ప్రదక్షిణచేసి వస్తే అమ్మవారి సన్నిధికి కుడివైపున సంతానాన్ని ప్రసాదించే స్థలవృక్షమొకటుంది. పుత్రసంతానం కోరే స్త్రీలు అమ్మవారికి మొక్కుకొని, తరవాత ఒక వస్త్రంలో కాసునుకట్టి స్థలవృక్షానికున్న కొమ్మలకు కడతారు. వారి నమ్మకం ఎప్పుడూ వృథాకాలేదని అక్కడివాళ్ళకి గట్టి విశ్వాసం.
బయట ప్రాకారంలోని దేవిసన్నిధికి ఎడమవైపున ఒక హుండీ ఉంది. ఆహుండీలో కానుకలు సమర్పించినవారు పాము, తేలు వంటి విషజంతువుల నుండి రక్షించబడతారని నమ్మకం. అందుకే ఆలయానికి వెళ్ళే భక్తులందరూ హుండీలో కానుకలు సమర్పిస్తారు.
కాశ్యపమహర్షి క్షేత్రపాలకుల్లా ప్రతిష్ఠ చేసిన గివిందరాజస్వామివిగ్రహం ఐదుతలల పడగతో ఉన్న ఆదిశేషుడిపై శయనించినట్లుంటుంది. ఆస్వామికి ఒక ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం వేదగిరికి దక్షిణవైపున నరసింహస్వామి ఆలయానికి సుమారు 1 కి.మి.దూరంలో ఉంది. -
చారిత్రక కథనం
ఆరవశతాబ్దం, విప్రముఖ్యుడు అనే భక్తుడు వేదగిరి కొండపై నరసింహస్వామి కొలువై ఉండటం చూసి, ఆసమయంలో పాలిస్తున్న పల్లవరాజు విక్రమసింహుడిని కలుసుకొని నరసింహస్వామికి ఒక ఆలయాన్ని నిర్మించమని కోరాడు. పల్లవుల రాజముద్ర 'సింహం' కావటంవల్ల విక్రమసింహ పల్లవరాజు ఆ నరసింహస్వామికి ఆలయాన్ని నిర్మించాడు.
ఆతరువాత ఈఆలయాన్ని విజయనగర రాజులు కూడా సంరక్షించి ఆలయాన్ని విస్తరించారు. ఆలయ నిర్వహణకోసం విజయనగర చక్రవర్తి కొన్నిగ్రామాలు భూదానంగా ఇచ్చి, నరసింహస్వామికి - లక్ష్మీదేవికి నగలను కానుకలుగా బహూకరించారు.
వైశాఖమాసంలో బ్రహ్మోత్సవము, రథోత్సవము మొదలైన ఉత్సవాలు పదిరోజులు జరుగుతాయి. 5 వ రోజున స్వాతి నక్షత్రమందు స్వామివారికి జరిగే గరుడసేవ వైభవంగా జరుగుతుంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండే కాకుండా దూరప్రాంతాల నుండీ కూడా స్వామిని దర్శించటానికి జనం తరలివచ్చి, స్వామి ఆశీస్సులు పొంది, సంతోషంగా ఇంటికి తరలివెళతారు.
అందరికీ మంచిచేసి, ఆపదల నుండి, సంకటముల నుండీ కాపాడే లక్ష్మీనరసింహస్వామిని దర్శించి, ఆశీస్సులు పొందండి.
సర్వేజనా సుఖినోభవంతు