మనం ఆచరిద్దాం.. పిల్లలు అనుసరిస్తారు...
పిల్లలకి ఏది నేర్పించాలన్నా కేవలం చెప్పటం కాకుండా, మనం ఆచరించి చూపించాలి అంటారు నిపుణులు. ఎందుకంటే సహజంగా పిల్లలు పెద్దవాళ్ళని అనుసరిస్తుంటారు. ఒకవేళ మనం చెప్పే విషయానికి, ఆచరించే విధానానికి తేడా వుంటే అది వారిని సందేహంలో పడేస్తుంది. ఆ సందేహం అయోమయానికి కారణమయ్యి, చివరికి వాళ్ళు మనం చెప్పేది వినని స్థితికి వచ్చేస్తారు. అదుగో అప్పుడు మనం వాళ్ళని మాట వినని మొండి ఘటాలని ముద్రవేసేస్తాం. ఇక అప్పటి నుంచి పిల్లలకి, పెద్దలకి మధ్య కనిపించని యుద్ధం మొదలవుతుంది. ఇదంతా వద్దు అనుకుంటే పిల్లలతో మనం వ్యవహరించే తీరుతెన్నులను కాస్త మార్చుకోవాలి.
మనం వారికి ఆదర్శం కావాలి...
పిల్ల ప్రవర్తన, వారి వ్యక్తిత్వంపై తల్లిదండ్రుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ తరువాత కుటుంబంలోని ఇతర సభ్యులు, స్నేహితులు ఇలా....! అయితే మిగతా వారి ప్రవర్తన, వారి తీరుతెన్నులపై మనకి పట్టు వుండదు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ వరకు వారి ప్రవర్తన పిల్లలకి ఆదర్శంగా ఉండేలా చూసుకోవాలిట. పిల్లలు సమయపాలన నేర్చుకోవాలంటే ఊరికే వారికి ఆ విషయంపై ఉపన్యాసాలు ఇవ్వకుండా ఆచరణలో చూపించాలి. మనం ఆచరించి చూపించే ఏ విషయాన్నీ పిల్లలకు ప్రత్యేకంగా నేర్పించటానికి ప్రయత్నించక్కరలేదు. సహజంగానే పిల్లలు అనుసరించే స్వభావం కలవారు కాబట్టి అనుసరిస్తారు. అలవాటుగా మార్చుకుంటారు.
మన మాటే పిల్లలకు మంత్రం...
మాటే మంత్రం అంటారు పిల్లల విషయంలో అది నిజం. మన మాటే వారిని మనకి దగ్గర చేస్తుంది, లేదా దూరం చేస్తుంది. ఉదాహరణకి పిల్లలంటే ప్రతీ తల్లికీ ప్రేమ వుంటుంది. కానీ కొంతమంది పెద్దలు తమ పిల్లలు ఏ చిన్న అల్లరి చేసినా, తప్పు చేసినా దానిని తీవ్రంగా పరిగణిస్తారు. ఇక పిల్లలని అదే పనిగా తిడతారు. నువ్వెప్పుడూ అంతే అల్లరి ఎక్కువ అందుకే నాకు నచ్చవు ఇలా కోపంలో ఏవేవో అనేస్తారు. కోపం తగ్గాక ఏ చాక్లెట్ ఇచ్చో పిల్లల అలక తీర్చి ఆ విషయం గురించి మర్చిపోతారు. కానీ అమ్మ, తనపై వెలిబుచ్చిన అభిప్రాయాలని పిల్లలు మనసుకి తీసుకుంటారు. నేనేం చేసినా అమ్మకి నచ్చదు. నేనంటే అమ్మకి ఇష్టం లేదు అన్న అభిప్రాయానికి వస్తారు. ఇది పిల్లలతో అమ్మ అనుబంధంపై ప్రభావం చూపిస్తుంది. అలా కాక పిల్లల చిన్న చిన్న అల్లరిని, పొరపాటుని చూసీ చూడనట్లు వదిలెయ్యాలిట. ప్రతీ విషయానికి రియాక్ట్ కాకుండా ఉండాలి అంటున్నారు నిపుణులు.
ప్రేమను ప్రదర్శించాలి...
పిల్లల పై ప్రేమ చూపించటమంటే కేవలం మాటలలో దానిని చూపించటంకంటే మన చేతలలో దానిని వ్యక్తం చేస్తే పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి నువ్వంటే నాన్నకి, నాకు ప్రాణం. అని మాటలలో చెప్పేకంటే వారిని ప్రేమగా దగ్గరకు తీసుకోవటం గట్టిగా పట్టుకోవటం, ముద్దు పెట్టుకోవటం వంటివి వారిని ఎక్కువ సంతోషపెడతాయి అంటున్నారు నిపుణులు. పిల్లల చిన్నచిన్న ఇష్టాలని గమనించి వాటిని తీర్చటం, రాత్రి నిద్రపోయే సమయంలో కథలు, కబుర్లు, ఆటపాటలు వంటివి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతాయిట.
వ్యక్తిత్వ పునాదులు గట్టిగా వుండాలి....
పునాదులు గట్టిగా వుంటే ఆ పునాదులపై ఎంతటి భవనాన్ని అయినా కట్టచ్చు. ఇదే సూత్రం పిల్లలకి వర్తిస్తుంది. చిన్నతనంలోనే మంచి అలవాట్లు ప్రవర్తన అలవడిన పిల్లల వ్యక్తిత్వం పెరిగి పెద్ద అయ్యాక ఎంతో చక్కగా ఉంటుంది. అలాగే అమ్మనాన్న ప్రేమని పొందే పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. అలాగే వారితో అనుబంధం కూడా ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుంది. పిల్లలపై మనకుండే ప్రేమ వారికి అర్థమయ్యేలా చూసుకోవాలి. ఇక అప్పుడు పెరిగి పెద్దయ్యి పరిపూర్ణ వ్యక్తిత్వంతో మన ముందు నిలిచే మన బంగారుకొండలని చూసి మనం గర్వపడవచ్చు. ఏమంటారు?
-రమ ఇరగవరపు