February 11, 2015

శ్రీ అంతర్వేది క్షేత్ర మహాత్మ్యం (1 అధ్యాయం)

శ్రీ అంతర్వేది క్షేత్ర మహాత్మ్యం (1 అధ్యాయం) 


శ్రీకరము శుభప్రదమగు నైమిశారణ్యంలో కృతయుగమున శౌనకాది మహర్షులు సత్రయాగము చేస్తూ, పురాణకథా కాలక్షేపం కొరకు సకలపురాణాలు తెలిసిన సూతమహాముని వద్దకు వెళ్ళి, సమస్త పాపాలు నివారించి, సకల శుభాలను పొందే అంతర్వేది దివ్యస్థలం యొక్క మహాత్మ్యంను, శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి లీలా వైభవములను తెలియచేయమని ప్రార్థించిరి. మునులందరూ వచ్చి కోరిన తీరుని చూసి సంతోషించి, ఆనాడు అంతర్వేది మహాత్మ్యం గురించి బ్రహ్మదేవుడు – నారదమహర్షికి తెలియచేసిన కథను ..... మునులందరికీ ఈవిధంగా చెప్పుచున్నారు.

ఒకరోజున బ్రహ్మ దేవతా గణములతో కొలువై ఉన్న సమయంలో త్రిలోకసంచారి అయిన నారదుడు తన గానమాధుర్యముతో బ్రహ్మని పొగుడుతూ వచ్చి “తండ్రీ !భూలోకంలో పుణ్యప్రదమైనది, దర్శనం చేసినంత మాత్రమునే సకల శుభాలు ప్రసాదించే నరసింహ క్షేత్రాలలో ప్రసిద్ధి పొందిన అంతర్వేది దివ్యపుణ్యక్షేత్రం మహిమను, శ్రీలక్ష్మీనరసింహ స్వామి, పార్వతీ నీలకంఠేశ్వరులు ఈ క్షేత్రంలోనే నివసించుటకు గల కారణాలు, వశిష్ట సాగరసంగమం మహత్యమును వివరింపుడు” అని ప్రార్థించెను. అంతట విధాత నారదుని ప్రశ్నలకి సంతోషించి, “కుమారా ! నీ ప్రశ్నలు అన్నింటికీ సమాధానములు చెబుతాను, జాగ్రత్తగా విను” అని ఈవిధంగా చెప్పుచున్నాడు బ్రహ్మ.

"గోహత్యా పాపవిమోచనం కోసం గంగాది సర్వతీర్థాలతో సమానమైన పరమపవిత్రమైన పుణ్య గోదావరీ నదిని గౌతమ ముని కొవ్వూరు వరకు తీసుకొని రాగా, సప్తమహర్షులు ఆ నదిని ఏడు పాయలుగా విభజించి, సాగరమున సంగమం గావించారు.

సప్తరుషులలో ప్రధానుడైన బ్రహ్మర్షి వశిష్ట మహర్షి అరుంధతీతో గౌతమీ గోదావరీ శాఖను సముద్రమున సంగమింప చేసి, ఆ తీరముననే ఒక ఆశ్రమం ఏర్పాటుచేసుకోని తపస్సు చేసుకుంటున్నాడు. వశిష్టుడు తాను గావించిన శివాపచారమునకు నివారణగా అంతర్వేది క్షేత్రమున వశిష్టునిచే తీసుకురాబడిన నదీశాఖను, సముద్రమునకు గల మధ్య ప్రదేశమును “యజ్నశాల” గా చేసి, రుద్రయాగం చేసి, పార్వతీ నీలకంఠేశ్వరుల విగ్రహములను ప్రతిష్ఠించి, పాప నిష్కృతి పొంది, కృతార్థుడయ్యెను. అందుకే ఈప్రాంతమునకు “అంతర్వేది” అని పేరు వచ్చింది.

“వశిష్ఠముని నీతాయా గంగాయా స్సాగర స్యచ
తయోర్మధ్య గతా భూమీ ‘రంతర్వేదీ’ తివిశ్రుతా !”   

వేదవేదాంగ నిష్ణాతులు, ఆగమాచార్యులు ప్రతీరోజు చేసే విష్ణుపురాణ పారాయణములతో, ప్రబోధనలతో, హరినామ సంకీర్తనలతో, వివిధ పూజలతో, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే బ్రాహ్మణులు తమ తపజప విశేషములతో భూలోక వైకుంఠముగా ఈ అంతర్వేది క్షేత్రం వైభవోపేతంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో ఉండేవారు అన్యచింత(వేరే ధ్యాస) లేకుండా నిత్యం ధ్యాన సమాధిలో ఉంటూ హరినామ స్మరణ చేస్తూ ఉంటారు.
మాఘశుద్ధ ఏకాదశి – పాల్గుణమాసం పౌర్ణమి రోజుల్లో చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి,  వివిధ రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వచ్చి, ఈ క్షేత్రమందలి సాగరసంగమమున స్నానాలు చేసి, క్షేత్ర పాలకుడైన శ్రీ నీలకంఠేశ్వరుని దర్శించి, పూజించి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి పంచామృత అభిషేకాలు చేయించి, సర్వపాపాల నుండి విముక్తులై ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ఎవ్వరైతే అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహుని త్రికరణ శుద్ధిగా పూజిస్తారో, వారు అనాయాసంగా ముక్తిని పొందుతారు.


నరసింహస్వామినిదర్శించటానికి వచ్చిన వారికీ, అటంకములచే రాలేని వారికీ, దర్శించుకోవాలి అని మనసున సంకల్పించుకొన్న వారికీ, అందరికీ సమానంగా ముక్తిని ప్రసాదించే స్వామి .... ఈ నరసింహస్వామి. ఈ క్షేత్రమును సందర్శించినంత మాత్రమునే వారి మనోసంకల్పములు సిద్ధిస్తాయి. ఈ అంతర్వేది నరసింహక్షేత్రమునకు రెండు క్రోసుల దూరములో ఉన్న పరిసర ప్రాంతమంతా “నరసింహ క్షేత్రం” – “ముక్తిక్షేత్రం” అని ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్రం తూర్పు- దక్షిణ భాగమున సముద్రము, పశ్చిమ భాగమున గోదావరి నది, ఉత్తర భాగమున “రక్త కుల్యానది” కలిగి ఉన్నాయి. శ్రీస్వామివారి కరుణచే ఈ క్షేత్ర వాసులకు, సందర్శకులకు సర్వతీర్థ స్నాన ఫలము ప్రాప్తించును.


మాతాపితృ హంతకుడు, గురుద్రోహి, భ్రూణహత్యా పాతకుడు, సురపానుడు, గోహంతకుడు మొదలైన మహాపాపాలు చేసినవారు ఈ క్షేత్రమందు సాగరసంగమంలో స్నానం చేసినట్లయితే సర్వపాపాలు పోయి, సకల శుభాలు పొందుతారు. ఇంతటి మహాత్మ్యం కలిగినది ఈ అంతర్వేది పుణ్యక్షేత్రము” అని బ్రహ్మదేవుడు – నారదమహామునికి తెలియచేసాడు. 
                                                                               (To be countinued)  

No comments:

Post a Comment