May 27, 2015

హైందవ (బ్రాహ్మణ) వివాహ సంస్కారములు

హైందవ (బ్రాహ్మణ) వివాహ సంస్కారములు



1) స్నాతక వ్రతము 

చరితం బ్రహ్మచర్యో - హం కృతవ్రతచతుష్టయః 
కాశీయాత్రంగమిష్యామి - అనుజ్ఞాం దేహిమేశుభాం 

తా :- బ్రహ్మచర్యాశ్రమంలో విద్యాభ్యాసం పూర్తిచేసిన యువకుడు (వరుడు) పరమార్థ సాధనకు కాశీకి వెళ్లేందుకు సిద్ధపడతాడు. అదే సమయంలో వధువు తండ్రి తన కూతిరిని వివాహము చేసుకోమని కోరతాడు. "ప్రజాతంతుం  మావ్యవచ్చేత్సీహి "   అనే గురువుగారి  అజ్ఞానుసారం గృహస్థాశ్రమ స్వీకారానికి సిద్ధమవుతాడు. అదే స్నాతక మహోత్సవము. అని అంటారు. 

2) గౌరీపూజ 

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే 
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే 

"మంగళం కరోతీతి మంగళః" అని మంగళ శబ్దార్థం సర్వదేవతలు మంగళప్రదులైన మంగళ మూర్తులు "మంగళ " అనే పేరున్నది. "బభ్రుశ్శు మంగళః" అని నమక పాఠం మంగళ, సర్వమంగళ అనే పేర్లతో చండికా ప్రస్తుతి తెలియబడుచున్నది. సర్వ శుభకార్యాలకు మంగళ శబ్దార్థ ప్రతిపాదిత ప్రభావిత సితములై ప్రకాశిస్తున్నాయి. అటువంటి మంగళ గౌరీదేవిని అర్థిస్తూ సుమంగళులై దీర్ఘసుమంగళిగా ఉండాలని వధువు మంగళ గౌరీ వ్రతం చేస్తుంది.  

3) సు(శుభ)ముహూర్తం - సుదర్శనం 

జ్యోతిశ్శాస్త్రము ద్వారా నిర్దేశించబడిన శుభగ్రహాశ్రిత శుభలగ్న పుష్కరాంశ శుభ ముహూర్తమున తెరచాటున ఉన్న వధూవరులు ఒకరి శిరస్సుపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని పురోహితుడు కొద్దిగా తెరదించగా(మొదటిసారి) తొలిచూపులు చూసుకుంటారు. ఇదే సు(శుభ)ముహూర్తం. సుదర్శనం అని కూడా అంటారు. ఇక్కడ సర్వేంద్రియ ప్రధానమైన నేత్రముల(దృష్టి) ని సాధనంగా చేసుకొని అంతరింద్రియములైన రెండు మనస్సులు ఏకం కావడమే సుముహూర్తం యొక్క అర్థం, పరమార్థం. 

4) మాంగళ్యధారణము 

మాంగల్యంతంతునానేనా మమజీవన హేతునా 
కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం 

సర్వమంగళా గౌరీ స్వరూపులైన దివ్య సువాసినుల, మహాపురుషుల హస్త స్పర్శతో అభిమంత్రించబడిన మంగళ సూత్రముతో వరుడు "ధర్మేచ అర్ధేచ కామేచ" అని కన్యాదాన సమయంలో తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటానని వధువు కంఠమున మూడుముళ్లను వేస్తాడు. మాట కట్టుబాటే (ప్రతిజ్ఞ) వరుడి జీవనం కాగా, భర్త జీవనమే తన జీవనంగా నూరేళ్ళు చల్లగా వర్థిల్లాలని మన పూర్వులు చేసిన ఆచారం మాంగళ్యధారణము. 

5) కన్యాదానం 

కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతాం 
దాస్యామివిష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా  
   
ఎనిమిది విధాలైన వివాహాల్లో ఉత్తమమైనది కన్యాదాన పధ్ధతి. అదే దైవతవివాహం. వధువు యొక్క తండ్రి మహావిష్ణువు స్వరూపుడైన అల్లునికి తన కూతిరిని దానం చేస్తాడు. అలాగే "ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయిస్తాడు. ఆరోజు నుండి ధర్మము మరియు ధర్మానుబద్ధఅర్థకామాల్లో భార్యను గాని, భార్య మాటను గాని కాదని వ్యవహరించుటకు వీలులేదు. ఈ కన్యాదానము వలన కన్యాదాత యొక్క మాతాపితరుల వంశము వారి ముందు, వెనుక పదితరాలు పుణ్యలోకాలు పొందుతారు.

6) పాణి గ్రహణము 

"పాణిగ్రహనాత్తు సహత్వం కర్మసుతథాపుణ్య ఫలేషు"

ఈ పాణిగ్రహణ సంస్కారము వలన కర్మను ఆచరించడంలో పుణ్యకర్మ ఫలాన్ని పొందడంలోనూ ఇద్దరు ఒక్కటిగానే ఉంటారు. ఇద్దరు భిన్న వ్యక్తులు ఒక్కటి కావడం ఈ సంస్కారం వలన కలుగుతుంది.
"ఇయం సీతామమసుతా"....... "పాణింగృష్ణీష్యపాణినా"
అని రామాయణంలో కూడా జనకుడు సీతాదేవి చేతిని శ్రీరాముని చేతిలో పెడతాడు. ఇకనుండి ఈమె నీ నీడవలె నీతోనే ఉంటుంది అంటాడు.

7) తలంబ్రాలు (అక్షతారోపణము) 

అన్నదానాచ్ఛ తగుణం ఫలంతండులదానత్ణ 
ఔపాసనం వైశ్వదేవ మాతిథ్యం దేవతార్చన 
బుధూనాంపుత్తృ దారాణం తథాన స్వచపోషణం 
భవం త్యేతానిస్వరాణి రాజ తండులదానతితి 
స్వయంవాకీవత భుంక్తే ఇతిలోకపని సిద్ధత్వాచ్చేతి 

వధూవరుల ఇంటి నుండి తెచ్చిన బియ్యములను కలిపి తలంబ్రాలు పోయిస్తారు. కలిసిన బియ్యాన్ని మళ్ళీ వేరు చేయలేము. అదేవిధంగా వధూవరులు ఏకమై - వారిని ఎవ్వరూకూడా వేరు చేయలేని విధంగా ఉండాలి అని ఈ తలంబ్రాల యొక్క సారాంశం. వధూవరుల ధన, సంపదల, కీర్తి యజ్ఞకర్మల, ధర్మము యొక్క,  సంతానము యొక్క మిక్కిలి వృద్ధిని పొందుటకై ఈకర్మను ఆచరించాలి.


8) బ్రహ్మముడి 

బ్రహ్మ జిజ్ఞాస మితిద్వ యోరస్త్ర బంధనం 
ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తా ద్విశీమత స్సురుచోవేన ఆవహ 
సుబుధ్నియా ఉపమాఅన్య విష్టాస్సత శ్చయోని మసతశ్చ వివః 

యశస్సు, కీర్తి కలుగుటకు ఓ వరుణుడా!, ఓ ఇంద్రుడా! ఈ పడిన ముడి ఎప్పుడూ విడిపోకుండా చూడండి. ఇకనుండి వధూవరులుగా ఉన్న మేము కలిసే ఏపనినైనా చేస్తాము. మేమిద్దరం ఏకం అవుతున్నాం. నీవు ఈ ముడి యందు ప్రవేశిస్తున్నావని భావిస్తున్నాం. మా ఇద్దరినీ ఒకటి చేస్తున్నామని దంపతులు కోరుకోవటమే ఈ బ్రహ్మముడి. (వధూవరుల పసుపు పొత్తులు (మధుపర్కములు) రెండు చెంగులను తీసుకొని మూడుముళ్ళు వేయడమే బ్రహ్మముడి)


9) పుష్పమాలిక  ....... "పెళ్ళంటే నూరేళ్ళపంట" 

ముందు చెప్పిన క్రియలన్నీ వేదపండితులు శాస్త్రసమ్మతంగా వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాలతో బంధుమిత్రుల సమూహ సాక్షిగా వధూవరులు ఒకటవ్వడమే, ఆ వధూవరులు, కన్యాదాతలు కోరుకోవటమే వివాహం (పెండ్లి ..... పరిణయం)

10) సప్తపది 

'పద' అంటే .... మాట అని, అడుగు అని అర్థం. "సఖ్యం సప్తపదీనముచ్యతే" అని అన్నారు కాళిదాసు. ఏడు మాటలు మాట్లాడినా, ఏడడుగులు కలిసి నడిచినా వారి మధ్య స్నేహం కలుగుతుందంట. అందుకే "సఖా సప్తపదా భవ" అంటూ మొదటి మాటలో(అడుగులో) విష్ణువు నిన్ను అనుసరించుగాక(ఏకపదే విష్ణు స్తాన్వేతు) పదములైన మంత్రాలతో, జీవితాంతం తనను నీడలా వెన్నంటి ఉండే భార్యతో ఏడడుగులు వేసి, స్నేహం చేస్తాడు వరుడు. ఈ స్నేహమే వారిని జీవితాంతం ప్రేమగా ఉండేటట్టు చేస్తుంది.

11) అరుంధతీ దర్శనం 

ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల వివాహం చేసినవారు సప్తరుషులు. ఆ సర్వమంగాలను ఆశీర్వదించిన మొదటి ముత్తైదువ అరుంధతి. ఆ మహాసాధ్వి దర్శనం వధూవరులకు సర్వమంగళత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆమెతోపాటు సప్తర్షి దర్శనం (అత్రి, కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్టుడు, విశ్వామిత్రుడు) వదూవరులకు అభ్యుదయ పరంపరను కలగజేస్తుంది.

12) సదస్యం 

యావతీర్వైదేవతాః సర్వే వేదవిది బ్రహ్మణే వసంతి" వివాహం చేసుకొని, ఋషి దర్శనం చేసుకున్న దంపతులకు భూమ్మీద ఉండే దేవతా స్వరూపులైన వేదబ్రాహ్మణులు చేసే ఆశీర్వచనమే సదస్యం. వారి ఆశీస్సులతో వధూవరులు భోగభాగ్యాలతో సుఖసంతోషాలతో పుత్రపౌత్రాదులతో చిరకాలం వర్ధిల్లుతారు.

 7 అడుగులు నడిచి
6వ ప్రాణంగా ఒకరికొకరై జీవిస్తూ
5వ తనాన్ని మూటకట్టుకొని
4 దిక్కులు సాక్షిగా
3 ముళ్ళ బంధంతో
2 జీవితాలు
1 అవ్వాలని
అందరం కోరుకుందాం ....... వదూవరులైన వారిని ఆశీర్వదిద్దాం.

1 comment:

  1. మంచి ప్రయత్నం ..... మీకు అభినందనలు ...... శ్రీసాయి జయసాయి జయజయ సాయి ____/\____

    ReplyDelete