January 4, 2020

My Karnataka Tour Complete Details

కర్ణాటక యాత్రా విశేషాలు 

2019 డిశెంబర్ 21వ తారీఖున కాచీగూడ రైల్వేస్టేషన్ నుండి 50 మంది కర్ణాటక యాత్ర కోసం, రైలు ఎక్కి బయలుదేరి, 22 వ తేదీ ఉదయం 6.30కి బెంగుళూరు KSR రైల్వేస్టేషన్ లో రైలు దిగాము. 


సురేన్ టూర్స్ & ట్రావెల్స్ వాళ్ళ ద్వారా అందరం వివిధ ప్రాంతాల నుండి యాత్రకి బయలుదేరాం. యాత్ర మొదట్లో ఎవరికెవరు పరిచయం లేరు. యాత్ర ముగిసే సమయానికి అందరం అందరికీ పరిచయం అయ్యాము. 

ఈయాత్ర వారం రోజులలో మేము చూసిన ఆలయాలు ఏమిటంటే !......  
1) శ్రీరంగపట్నం 2) మైసూరు-చాముండేశ్వరి అమ్మవారు 3) మైసూరు-మహారాజ ప్యాలెస్ 4) కుషాల్ నగర్ లో ఉన్న జలపాతాలు 5) గోల్డెన్ టెంపుల్ 6) కుక్కి- సుబ్రహ్మణ్యస్వామి 7) ధర్మస్థలి-మంజునాథుడు 8) ఉడిపి-కృష్ణుడు 9) గోకర్ణం 10) మురుడేశ్వరం 11) కొల్లూరు-మూకాంబిక అమ్మవారు 12) శృంగేరి-శారదాదేవి 13) హోర్నాడు-అన్నపూర్ణాదేవి 14) బేలూరు-చెన్నకేశవస్వామి 15) హళేబీడు-సంతలేశ్వర్ & హోయసలేశ్వర్.  

ఒక వారంలో 15 ప్రాంతాలకి వెళ్ళటం అంటే కష్టమే అనుకుంటున్నారా? అవును నిజంగా చాలా కష్టం. మేము కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.  

యాత్ర చేసే విధానం 
అసలు యాత్ర చెయ్యటం అంటే ఎక్కడికైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో ఒకరాత్రి నిద్రించాలి. ప్రధాన ఆలయాన్ని దర్శించి, ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అని ఒకరుంటారు. అతనిని దర్శించుకోవాలి. ఇంకా ఆ క్షేత్రంలో చూడవలసిన మిగిలిన దేవాలయాలని దర్శించుకోవాలి. 
అన్నీ తెలిసీ కూడా నేను ఈ యాత్రలో ఎక్కడికి వెళ్ళినా ప్రధాన ఆలయాన్ని మాత్రమే దర్శనం చేసుకొని రావటం జరిగింది. 
ఎవ్వరూ ఇటువంటి యాత్ర చెయ్యకండి. హడావుడిగా ఎవరో బంధువుని చూడటానికి కాదు కదా మనం ఇంతా డబ్బుని వెచ్చించి, శ్రమపడి వెళ్ళేది. ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడి ఆలయ చరిత్ర తెలుసుకోవాలి. ఆలయ నిర్మాణశైలిని పరిశీలించాలి. దేవుని విగ్రహాన్ని మనస్ఫూర్తిగా, తనివితీరా చూడాలి. మళ్ళీ మనం రెండోసారి వెళ్ళనక్కరలేకుండా ఎప్పుడు ఆ ఆలయం గుర్తుకువచ్చినా మన కళ్ళముందు అన్నీ మెదులుతూ ఉండాలి. ఆవిధంగా చేస్తేనే అది యాత్ర అనిపించుకుంటుంది. మొక్కుబడిగా గుడికి వెళ్ళి, అక్కడ దేవుడికి ఒక నమస్కారం పెట్టి వచ్చేస్తే అది యాత్ర అనిపించుకోదు.      
      

Day 1......డిశెంబర్ 22
ఈరోజు మేము శ్రీరంగపట్నంలో రంగనాథస్వామిని & మైసూరులో చాముండేశ్వరీ అమ్మవారిని దర్శించాము. 
వివరాలు  మొట్టమొదటగా మేము చూడవలసిన ఆలయం శ్రీరంగపట్నం....ఇది బెంగుళూరుకి  140 or 150 km దూరంలో ఉంది. అంటే సుమారుగా 3 లేక 4 గంటల సమయం పడుతుంది. అదే మేము మైసూరు రైల్వేస్టేషన్ లో రైలు దిగితే అంత సమయం ప్రయాణం చెయ్యటం తగ్గేది. అదే మైసూరునుండి శ్రీరంగపట్నానికి చేరుకుంటే ఇంచుమించుగా 30 నిమిషాల ప్రయాణం మాత్రమే. మమ్మల్ని తీసుకువెళ్ళిన టూర్ ఆర్గనైసర్ శ్రీమతి శారద గారికి ఆ విషయం తెలియక ఆమె ఇబ్బందిపడి, తీసుకువెళ్ళినవాళ్ళని కూడా ఇబ్బందిపాలు చేసింది.    

ఎవరైనా శ్రీరంగపట్నం, మైసూరు వెళ్ళాలని అనుకునేవారు మైసూరు స్టేషనులో మాత్రమే దిగండి. బెంగుళూరులో దిగవద్దు. ఇది నా సలహా మాత్రమే       

రైలు దిగేసరికి మాకోసం బస్సు వచ్చింది, బస్సు ఎక్కి ఒక హోటల్ దగ్గర దిగి, మనిషికి ఒక్కరికి 150 రూపాయలు చెల్లించి, ఒక Room కి 5గురు మనుషులు చొప్పున ఉండి, స్నానాలు చేసి, బస్సు ఎక్కి, మధ్యలో ఫలహారాలు ముగించుకొని, శ్రీరంగపట్నం చేరేసరికి 2.40 నిముషాలు అయ్యింది. నేను శ్రీరంగపట్నం 2014లో వెళ్ళాను. అప్పుడు ఎలా ఉందో చుట్టుప్రక్కల పరిసరాలు అన్నీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఎక్కడా ఏం మార్పు లేదు.      
               

మేము వెళ్ళేసరికి గుడి తలుపులు మూసేసారు, దర్శనాలు లేవు.  4.30 కి మళ్ళీ గుడి తెరుస్తారు అని చెప్పారు అక్కడివారు. ఆలయం తెరిచేలోపు అందరం పక్కనే ఉన్న కావేరీనదికి వెళ్ళాము. 

నదికి నమస్కరించి, నీళ్ళు జల్లుకొని, కాసేపు అక్కడ ఉండి, గుడికి వచ్చేసరికి, దర్శనానికి లైను పెద్దది అయ్యింది, లైనులో నిలబడి గుడి తెరిచాక స్వామిని దర్శించుకొని, 5.00 కి బస్సు దగ్గరకి మేమంతా వచ్చేసరికి వంటలు పూర్తి అయ్యాయి. 




అందరూ భోజనాలు ముగించుకొని అక్కడనుండి మైసూరులో ఉన్న చాముండేశ్వరీ అమ్మవారిని దర్శించుకోవటానికి బయలుదేరాము. 


శ్రీరంగపట్నం క్షేత్ర విశేషాలు 
ఈ ప్రాంతం కర్ణాటకా రాష్ట్రంలో మైసూరుజిల్లాకి సుమారుగా 13 కిలోమీటర్ల దూరంలో, మాండ్య జిల్లాలో ఉన్నది. కావేరీనది చాలా పవిత్రమైనది. ఎంత పవిత్రం అంటే వైకుంఠంలోని విరజానదితో ఇది సమానమైనది. అంటే కావేరీనది ఒడ్డున ఉన్న శ్రీరంగనాథుడు "సాక్షాత్తు శ్రీమహావిష్ణువే" అని అంటారు. శ్రీరంగనాథుడు మూడుచోట్ల ప్రత్యక్షంగా వెలిసాడు. 
తూర్పున శ్రీరంగము నందు 
దక్షిణమున అనంతశయమందు 
పడమరన శ్రీరంగపట్నము నందు 
ఈ మూడు ప్రదేశాలలో ఉన్న విగ్రహాలు ఎవరూ ప్రతిష్టించినవి కాకుండా, స్వయంగా ఆమహావిష్ణువే ఈప్రదేశాలలో స్వయంగా ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయి. కావేరీనది మూడుపాయలుగా ప్రవహిస్తుంది. ఆ మూడుపాయల సంగమ స్థానమే ఈ శ్రీరంగపట్నం. 

ఒకసారి కావేరీనది చేసిన తపస్సుకి మెచ్చి, శ్రీరంగనాథస్వామి ఆమెకు 3 వరములిచ్చాడు. (1)గంగానదికంటే కావేరీ పావనము కాగలదని (2) శ్రీరంగపట్నము క్షేత్రమై పవిత్ర యాత్రాస్థలము కాగలదని (3) తన భక్తుల కోర్కెలను తీరుస్తూ తాను ఇక్కడే స్థిరముగా ఉంటానని వరములిచ్చాడు. 

జనులనుండి తనకు అంటిన పాపముల నుండి ముక్తి పొందటానికై, గంగానది తులామాసం ప్రారంభంలో వచ్చి ఇక్కడ ఉన్న కావేరీనదిలో కలుస్తుందని అంటుంటారు. తులామాసంలో, కృష్ణపక్షంలో, దశమిరోజున అష్టతీర్థ స్నానం చేసిన భక్తులకు వారి కోర్కెలు తీరి, మోక్షం పొందుతారంటారు అందరు. 

వేరే ఆలయాల వద్ద చేసిన పాపములు ఏమైనా ఉంటే ఈ క్షేత్రానికి వస్తే నశిస్తాయంట, ఈ క్షేత్రంలో పాపములు చేస్తే వేరే ఎక్కడికి వెళ్లినా నశించవంట. అందువల్ల ఈ పశ్చిమ రంగక్షేత్రం పరమ పునీతమైనది. కావేరీ నది ఒడ్డున నివశించేవారికి మోక్షము సిద్దిస్తుందట, కేవలం ఈనదిని దర్శించిన వారికి పాపములు తొలుగుతాయంట.

గంగాతీరంలో మూడురోజులుగానీ, యమునాతీరంలో ఐదురోజులుగానీ కావేరీనదిలో ఒక్కసారి స్నానం చేసినవారికి పాపాలు తొలగుతాయి అని అంటారు. 

ఒకప్పుడు గంధర్వరాజులైన చిత్రసేన, చిత్రరథులు మహేంద్రసతి అయిన శచీదేవిని కామించినందున మహేంద్ర శాపముచే రాక్షసులై, గౌతముని క్షేత్రమైన ఈ ప్రాంతానికి చేరి, తులామాసంలో పౌర్ణమిరోజున కావేరీలో స్నానం చేసి శ్రీరంగనాథుని దర్శించుటవలన వారు పాపవిముక్తిని పొంది తిరిగి స్వర్గమును చేరుకున్నారు.        
 పంచరంగ క్షేత్రాలు 
1) శ్రీరంగపట్నం.... మాండ్య జిల్లా - కర్ణాటక..... ఆదిరంగ క్షేత్రం  
2) శ్రీరంగ క్షేత్రం .... తిరుచిరాపల్లి-తమిళనాడు... అంత్యరంగ క్షేత్రం  
3) అప్పకుడుతన్ పెరుమాళ్....శ్రీరంగానికి 16km దూరంలో ఉంది.108 దివ్యదేశాలలో ఇది ఒకటి.
4) పరిమళ రంగనాథ పెరుమాళ్ ..... మైలదుతురాయ్.... తమిళనాడు .... ఇది కూడా 108 దివ్యదేశాలలో ఒక క్షేత్రం 
5) సారంగపాణి ఆలయం .... కుంభకోణం .... తమిళనాడు  

క్షేత్ర చరిత్ర 
ఈ క్షేత్రమహత్యమును గుర్తించిన బ్రహ్మాది దేవతలు అందరూ స్వామిని పూజించి, ఈ ఆలయాన్ని నిర్మించి. శ్రీరంగడుని పూజించారని అంటుంటారు. క్షేత్రాలన్నింటిలోనూ ఈ క్షేత్రం పరమ పవిత్రమైనది, దీనికి సమానమైన క్షేత్రం భూత-భవిష్యత్తులలో ఏదీ లేదని బ్రహ్మ నారద మహర్షికి తెలియచేశారని చెబుతుంటారు. 

గౌతమ మహాముని ఒకసారి యాత్రకై బయలుదేరి, శ్రీరంగం చేరి, రంగనాథుని ధ్యానించగా, శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై శ్రీరంగంలో విభీషణునిచే పూజలు అందుకుంటున్నానని, ఆదిరంగనిచే ప్రతిష్ఠింపబడిన ఆ పవిత్ర స్థలమును చేరమని గౌతమునికి చెప్పారు. రంగని ఆనతి ప్రకారం గౌతమ ముని తన శిష్యబృందంతో ఆ చోటుని వెదుకుతూ వెళ్ళాడు. చివరికి రంగనాథుడు చెప్పిన ప్రాంతానికి అందరూ చేరుకున్నారు. శ్రీరంగనాథుని మహాత్మ్యములను గౌతముడు తన శిష్యులకి వివరిస్తున్న సమయంలో పరాశర, కణ్వ యాజ్ఞవల్క్య మొదలగు ఋషులు అక్కడికి వచ్చారు. గౌతముడు అందరికీ స్వాగత సత్కారాలు చేసారు. 

అప్పుడు ఋషులందరూ గౌతమముని ఆధ్వర్యంలో శ్రీరంగనాథుని సేవించటం కోసం ఒక గొప్ప క్రతువుని చేయనారంభించారు. అంతట స్వామి సంతోషించి ప్రత్యక్షమై వారిని దీవించి, తాను అక్కడకి దగ్గర్లో ఉన్న తులసివనంలో విగ్రహ రూపంలో ఒక పుట్టలో వెలసి ఉన్నారని గౌతమునికి తెలియచేసారు. వెంటనే గౌతముడు ఋషి గణంతో తులసివనంలోకి ప్రవేశించి, ఆ పుట్టను చూసి, సాష్టంగా ప్రణామం చేసి, స్వర్గంలో ఉన్న కామధేనువుని అక్కడకి రప్పించారు. కామధేనువు తన క్షీరముతో(పాలతో) పుట్టను కరిగించగా అందరూ రంగనాథుని దర్శించారు. 

మేషమాసం శుక్లపక్షం సప్తమి శనివారం రోజున అందరూ శ్రీరంగనాథుని దర్శించారు. దేవతలను, విశ్వక్సేనుని, గరుడుడిని చక్రమును భక్తితో కొలిచి తరువాత వారు ఆగ్నేయ భాగంలో ఉన్న శ్రీరంగనాయకీదేవిని దర్శించి ప్రదక్షిణ చేసి గర్భాలయానికి వెళ్ళి స్వామిని దర్శించారు. 


స్వామి పాదాల వద్ద కావేరీనదీ కొలుస్తూండగా రాగనాథుడు శేషసాయిగా తన కుడిచేతిని తలక్రింద ఉంచుకొని ఎడమచేతిని చాపుకొని వక్షస్థలంలో శ్రీమహలక్ష్మీని ధరించి మనకు దర్శనమిస్తారు. స్వామి ముఖమండలం దివ్యతేజస్సుతో వెలుగొందుతుంటే బ్రహ్మరుద్రాదిదేవతలు గౌతముడు ఋషిగణము అందరూ స్వామిని కీర్తించసాగారు. అందుకే ఆ స్థలం గౌతమ క్షేత్రంగా, ఆలయం బ్రహ్మానంద విమానంగా ప్రసిద్ధి చెందుతుందని ఆ రంగనాథస్వామి గౌతమునితో చెప్పారు. ఈ శ్రీరంగనాథుని కథని విన్నవాళ్ళకి చదివినవాళ్ళకి ఆ రంగని అనుగ్రహం పొంది మోక్షం పొందుతారు. ఈ కథని శ్రీరంగపట్నం ఆలయచరిత్ర పుస్తకం నుండి సంగ్రహించి నేను మీకు తెలియచేసాను.   
                                    శ్రీ చాముండేశ్వరీ అమ్మవారి ఆలయం 

అమ్మవారి ఆలయానికి వెళ్ళేసరికి రాత్రి 7 అయ్యింది.

అమ్మవారిని దర్శించుకొని, అక్కడే మైసూరుకి దగ్గరలోనే హోటల్ లో ఆ రాత్రికి నిద్రించి, మరుసటిరోజు ఉదయమే మళ్ళీ మా ప్రయాణం కొనసాగింది. 

రాత్రికి మైసూరులోనే హోటల్ లో నిద్రించి మరుసటిరోజున మహారాజా ప్యాలస్ ను చూసాము. 


చాముండేశ్వరీ ఆలయ స్థలపురాణం  
"చాముండా క్రౌంచపట్టణే" 
ఈ చాముండేశ్వరీ అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో తొమ్మిదవది. సముద్రమట్టానికి సుమారు 3500 అడుగుల ఎత్తున ఈ చాముండీపర్వతం ఉంది. 

మహిషాసురుడు అనే రాక్షుసుడు ఘోరతపస్సు చేసి తనకి దేవతలు, మానవులు అంటే  పురుషుల చేతిలో మరణం లేకుండా బ్రహ్మ ద్వారా వారాలని పొందాడు. ఆ వర గర్వంతో తన మూడు జన్మలలోనూ ఇంద్రాది దేవతలను పీడించసాగాడు. అప్పుడు అమ్మవారు ఉగ్రచండీ, భద్రకాళీ రూపాలతో మహిషుడిని సంహరించింది. మహిషుని ప్రార్థన మేరకు అతనిని తన పాదాలవద్ద నిత్యం ఉండేలాగా అనుగ్రహించింది.



మహిషపురం మహిషాసురుని ఊరు. మహిష+ఊరు అదే నేటి మైసూరు అని ఒక నానుడి. మహిషుని రాజధాని క్రౌంచపట్టణం. అమ్మవారు శక్తిపీఠంగా వెలసిన ఈ పర్వతం(చాముండీ హిల్స్) నేటి మైసూరుకి అతి దగ్గరలోనే ఉన్నది. అమ్మవారు ఆలయానికి ఎదురుగా మహిషాసురుని విగ్రహం మనం చూడవచ్చు.


మహిషాసురునికి పురుషుల చేతిలో మరణం లేదు. ఒకప్పుడు ఇంద్రాది దేవతలపై దండెత్తిన ఈ మహిషుడు స్వర్గం నుంచి ఇంద్రుడిని తరిమేసి, తానే దేవతలకి రాజునని ప్రకటించుకున్నాడు. దేవతలంతా త్రిమూర్తులని శరణు వేడారు, బ్రహ్మ శాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడీకరించి అందమైన నవయవ్వన యువతిగా చాలా శక్తివంతురాలిగా సృష్టించారు.

ఆమెయే సింహవాహనియైన, దుర్గాదేవి, చాముండి. ముందుగా అసిలోముడు, భాష్కలుడు, బిడాలుడు, చామరుడు, ఉదగ్రుడు మొదలగు సేనానులను చాముండీదేవితో యుద్ధానికి పంపాడు మహిషుడు. వారంతా మరణించాక తానే స్వయంగా ఆమెతో యుద్ధంచేసాడు. వరగర్వంతో విజృంభిస్తున్న మహిషుడితో తొమ్మిది రోజులు ఘోరయుద్ధం చేసి, పదవ రోజున ఆ రాక్షసుడిని సంహరిస్తుంది అమ్మవారు. అందువలన దుర్గాదేవిని మహిషాసుర మర్ధిని అని కూడా అంటారు. అంతట అమ్మ దేవతల జయజయధ్వానముల మధ్య అక్కడే ఒక పర్వతంపై స్థిరమూర్తిగా నిలిచిపోయింది. 


పురాణప్రసిద్ధి పొందిన ఈ శక్తిపీఠాన్ని ఒడయార్ రాజవంశీయులు బాగా అభివృద్ధి చేసారు. 
ఈ ఆలయాన్ని చేరుకోవటానికి మెట్లమార్గం & రోడ్డుమార్గం ఉన్నాయి. మెట్లమార్గంలో ద్వారా వెళ్ళేవాళ్ళకి దారిమధ్యలో పెద్ద నందీశ్వరుని విగ్రహం ఒకటి కనిపిస్తుంది. మేము బస్సులో వెళ్ళటం వల్ల ఈ నందిని చూడలేకపోయాము. 


Day 2 ...... డిశెంబర్ 23
ఈరోజు మేము మైసూరులో మహారాజా ప్యాలెస్ ని & కుషాల్ నగర్ లో ఉన్న జలపాతాలని చూసాము. 

ఉదయం ఫలహారాలు ముగించుకొని, 9.50కి మహారాజ ప్యాలస్ చూడటానికి, ప్యాలెస్ కి వచ్చాము. 

10 గంటలకి Tikets ఇవ్వటం ప్రారంభించారు. మనిషి ఒక్కింటికి టికెట్టు విలువ 70 రూపాయలు. టికెట్స్ తీసుకొని ప్యాలెస్ లోకి వెళ్ళి  మైసూరు మహారాజుల వైభవాన్ని కళ్ళారా తిలకించాం, ఆ రాజభవన సౌందర్యాన్ని ఎవ్వరూ వర్ణించలేము, చూసి తీరవలసిందే. అందుకే ఇక్కడ నేను ఏమీ వర్ణించటం లేదు. 











కృష్ణరాజ వడయార్ .... ఈ ప్యాలస్ నిర్మాణకర్త 
దసరా ఉత్సవాలలో ఏనుగులకి అలంకరించే అలంకరణలు 
ప్యాలెస్ ని చూసి 11.40 కి బయటకి వచ్చాము. 

12 గంటలకి మళ్ళీ మా ప్రయాణం కొనసాగింది. మధ్యలో భోజనాలకి ఆగి, 3.45 కి కుషాల్ నగర్ వద్ద ఉన్న జలపాతాలు చూడటానికి వెళ్ళాము. Entrence Ticket 10 రూపాయలు. 






టికెట్ తీసుకొని లోనికి వెళ్ళగానే మనకి తాళ్ళతో తయారుచేసిన ఒక ఝూలా కనిపిస్తుంది ... దానిమీదనుంచి నడచి ఆవలి ఒడ్డుకి మనం వెళితే పార్క్ కనిపిస్తుంది.
ఈ వంతెన క్రింద ఒక నది ప్రవహిస్తూ ఉంది అందులో Boat Shikar కి వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చును.


 




పార్కులో అక్కడక్క ఇటువంటి చిత్రాలని ఉంచారు. చూడటానికి చాలా బావున్నాయి, సజీవంగా ఉన్నాయి. అక్కడి ప్రాంతీయ వస్త్రాలంకరణతో ఉన్నాయి.  
ఈ చిత్రంలో అంతా పల్లె వాతావరణం కనిపిస్తుంది. 
     
మొదట్లో మనకి అంతా పచ్చని చెట్లతో కూడిన పార్క్ కనిపిస్తుంది, కొంతదూరం అంటే సుమారుగా 15, 20 నిముషాలు నడచిన తరవాత మనకి జలపాతాలు కనిపిస్తాయి. అక్కడ జలపాతాలు అని అన్నారు కానీ మాకు ఎక్కడా జలపాతాలు కనబడలేదు. కేవలం నీరు పెద్ద పెద్ద బండరాళ్లపైనుండి ప్రవహిస్తూ పోతోంది. ఆ బండలు నాచుపట్టి లేవు కాబట్టి అందరు ఈ ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకి నడచి వెళ్ళిపోతున్నారు. 





ఈ ప్రదేశం అందరికీ నచ్చవచ్చునేమోగానీ నాకు మాత్రం ఆనందాన్ని ఏమీ ఇవ్వలేదు. అందుకే మెట్లుదిగి నేను క్రిందకి వెళ్ళలేదు.    


అక్కడ నుండి 5.20 కి మళ్ళీ బస్సు బయలుదేరి 5.45కి Golden Templeకి వెళ్ళాము


ఇది టిబెట్ వారి ఆధ్యాత్మిక కేంద్రం (ఆశ్రమం). ఇది కూర్గ్ జిల్లాకే ప్రధాన ఆకర్షణ కేంద్రం ఈ ప్రాంతమంట. చూడటానికి చాలా చాలా బావుంది. స్వర్ణాలయం అంటే నిజంగా స్వర్ణమయంగానే ఉంది, అలానే అనిపించింది. 







అక్కడ నుండి 7 గంటలకు బయలుదేరి, మధ్యలో ఫలహారాలు ముగించుకొని, రాత్రి 12.30 కి కుక్కి లో హోటల్ కి చేరుకున్నాము. 

కుక్కి చేరుకోవాలంటే ఎవరైనా పగటిపూటే ప్రయాణం చెయ్యండి. ఎందుకంటే వెళ్ళేదారి అంతా ఘాటీ రోడ్డునే. చాలా చాలా మెలికలు ఉన్నాయి, చాలా ప్రమాదకరమైన మార్గం. రాత్రిపూట ప్రయాణం అంత మంచిది కాదు. ఇది నా సలహా మాత్రమే. 

Day 3 ...... డిశెంబర్ 24

ఈరోజు కుక్కి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, ధర్మస్థలి మంజునాథుని ఆలయం, ఉడిపి శ్రీకృష్ణుని ఆలయాలని దర్శించాము. 





ఉదయం స్నానాదికాలు ముగించుకొని 6.30 కి ఆలయ దర్శనానికి వెళ్ళాము, ఆరోజు మంగళవారం అవ్వటం మా అదృష్టం. సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి చాలామంది భక్తులు లైనులలో వేచి ఉన్నారు. కానీ మేము దర్శించుకోవటానికి పెద్దగా ఏమీ ఇబ్బంది పడలేదు. 10 నిమిషాలలో మాకు దర్శనం లభించింది. స్వామిని మనసారా దర్శించుకొని, పక్కనే ఉన్న ఉపాలయాలని దర్శించుకొని, 8.15 కి హోటల్ కి చేరుకున్నాము. ఫలహారాలు ముగించుకొని 10.15 కి ధర్మస్థలి చేరుకోవటానికి మళ్ళీ మా ప్రయాణం ప్రారంభమయ్యింది. 



11.30 కి మేము ధర్మస్థలిలో బస్సు దిగాము. 12 గంటలకి ఆలయం మూసేస్తారు దర్శనాలు ఉండవు అన్నారని అందరం పరుగుపరుగున ఆలయానికి చేరుకొని లైనుల్లో నిలబడ్డాము. కానీ అప్పటికే ఆలయం తలుపులు మూసేసారని తెలిసింది. 11.30 నుండి 12 వరకు స్వామికి నైవేద్యం సమర్పిస్తారని ఆలయాన్ని మూసేసారు. కానీ మాకు విషయం తెలిసేసరికి ఆలస్యం అయ్యింది. ముందుకి వెళ్ళటానికి లైన్లు కదలవు. వెనక్కి వెళ్ళటానికి మా వెనుక అప్పటికే 4 లైన్ల జనం వచ్చేసారు. చేసిది ఏమీ లేక అలాగే లైనుల్లో నడిచి నడిచి అంటే సుమారుగా 30 లైన్లు మెలికలు తిరిగి ఉంటామేమో, 11.30 కి లైనులో నిలబడిన వాళ్ళం 2.30 కి ఆలయం బయటకి వచ్చాము. అంటే 3 గంటలు లైనుల్లోనే నిలబడి, కూర్చొని, మొత్తానికి మంజునాథ స్వామిని దర్శించుకుని బయటకి వచ్చాము. స్వామి చల్లనయ్య శివయ్య దర్శనం లభించగానే అంతసేపు పడిన కష్టం అంతా మరచిపోయాం. బస్సు దగ్గరికి అందరం చేరుకున్నాక భోజనాలు ముగించుకొని, 3.30 కి ఉడిపికి ప్రయాణమయ్యాము. 

ఉడిపి చేరుకునేసరికి 7.30 అయ్యింది. అప్పుడే కృష్ణయ్యని స్వర్ణరథంలో ఉరేగిస్తున్నారు. 



5 సంవత్సరాల క్రితం మేము ఉడిపి వెళ్ళినప్పుడు స్వామి రథయాత్ర చూడలేకపోయానని మనసులో బాధపడుతూ ఉండేదాన్ని. అప్పటి కోరిక ఆరోజున నెరవేరింది. 



అందరూ లైనులో చేరి కిట్టయ్య దర్శనానికి అని వెళ్ళారు , కానీ నేను మాత్రం రథయాత్ర చూడాలి అనే కోరికతో రథయాత్ర పూర్తి అయ్యేవరకు స్వామితో పాటుగా తిరిగాను, స్వామితోపాటుగా కోవెలలోకి ప్రవేశించి ఊoజల సేవని చూసే అదృష్టం దొరికిందని చాలా ఆనందపడ్డాను, ఆ ఆనందంలో ఆనందభాష్పాలు కూడా వచ్చాయి. మన మనస్సులో ఏదైనా గట్టిగా కోరుకుంటే ఆ కోరిక సమంజసమే ఐతే స్వామి తప్పకుండా తీరుస్తాడు అని నాకు నిజంగా నిరూపణ అయ్యింది. 


అంతా  జరిగాక నేను బయటకి వచ్చేసరికి మా వాళ్ళు ఎవ్వరు కనబడలేదు. ఎలాగైనా, ఎంత ఆలస్యమైనా స్వామిని దర్శించనిదే ఇక్కడనుండి వెళ్ళేది లేదు అని గట్టిగా నిర్ణయించుకునే సరికి మా బస్సులో ఉండేవాళ్ళు ముగ్గురు కనిపించారు, వాళ్ళు కూడా దర్శనానికి వెళ్ళలేదు, పక్కనే ఉన్న 100 రూపాయల టికెట్టు తీసుకొని వెళుతున్నాం అన్నారు, వెంటనే నేను కూడా టికెట్టు తీసుకొని ఆలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించాను. అప్పుడు నల్లనయ్య అర్థచంద్రాకారం చంద్రవంక పైన కూర్చొని కాలుపైనా కాలు వేసుకొని చిరునవ్వు నవ్వుతూ ఊయలూగుతున్నట్టుగా ఎంత అందంగా ఉన్నాడో. అచ్చం ఇలాగనే ఉన్నాడు కిట్టయ్య, ఈ ఫొటోలో గులాబీరంగు పంచతో ఉన్నాడు, మేము చూసినరోజున తెల్లటి పంచ కట్టుకొని ఉన్నాడు. ఈ ఫోటోని నేను గూగుల్ నుండి సేకరించాను.    


రాత్రికి అందరూ ఆలయంలో నిత్యాన్నభోజనం దగ్గర అందరూ భోజనాలు చేసారు. కానీ నేను భోజనం చెయ్యటానికి సమయం లేక, స్వామిని కనులారా దర్శించుకొని తృప్తిగా ఉండటం చేత ఆకలి లేక ఆ రాత్రికి భోజనం చెయ్యలేదు. అన్నీ బాగానే ఉన్నాయి, ఉడిపి వెళితే చాలాచాలా కొనాలని అనుకొని వెళ్ళాం, కానీ ఏ ఒక్కటి కొనలేకపోయామని చాలా బాధ మనసులో ఉండిపోయింది.     

మొత్తానికి కిట్టయ్యని దర్శించుకొని బస్సుదగ్గరకి వచ్చేసరికి 9.30 అయ్యింది. అక్కడే ఉడిపిలోనే హోటల్ లో ఆ రాత్రికి బస చేసాము. 

Day 4 ...... డిశెంబర్ 25

ఈరోజు గోకర్ణం, మురుడేశ్వరం దర్శించాము. 

ఉదయమే 7.10 కి మా బస్సు గోకర్ణం చేరుకోవటానికి ప్రారంభమయ్యింది. దారి మధ్యలో ఫలహారాలు ముగించుకొని, 12 గంటలకి గోకర్ణం చేరుకున్నాం. 12.30 కి ఆలయం మూసేస్తారు అంటే త్వరగా పరుగులు పెట్టి వెళ్ళాము. 



ముందుగా గణపతిని దర్శనం చేసుకొని, మేము వెళ్ళేసరికి  ఆలయం మూసేసారు, 12.30 లోపల స్వామిని దర్శించుకుంటే స్పర్శ దర్శనం ఉంటుంది అన్నారు. ఆ అదృష్టం కొంతమందికే దక్కింది. మిగిలినవాళ్ళం 12.15 కి లైనులో ఉండి, 1.15కి శివయ్యని దూరం నుండే దర్శించుకొని బయటకి వచ్చాము. గోకర్ణంలో దర్శించాల్సిన ఆలయాలు చాలా ఉన్నాయి. కానీ వేటిని దర్శించకుండానే మేము వెనుదిరిగాము.   


భోజనాలు ముగించుకొని, మురుడేశ్వరం చేరుకునేసరికి 6.15 అయ్యింది. గోకర్ణం నుండి మురుడేశ్వరం చేరుకోవటానికి 30 నిముషాల సమయం పడుతుంది. కానీ మా ట్రావెల్ మేడంకి రూమ్స్ బుకింగ్ దగ్గర తేడా వచ్చి, ఆ సమస్యని పరిష్కరించుకొని మేము బయలుదేరేసరికి లేట్ అయ్యింది. 

    

మరుసటిరోజు గ్రహణం సందర్భంగా 8 గంటలకే ఆలయాన్ని మూసివేశారు. ఈలోపలనే మేమంతా ఆలయ దర్శనం, పక్కనే ఉన్న పెద్ద శివుని దర్శనం, అక్కడ ఉన్న భూకైలాష్ చరిత్రకి సంబంధించిన కొన్ని చిత్రాలతో కూడిన మ్యూజియం అన్నీ చూసి వచ్చాము. 


కానీ ఎత్తైన 20 అంతస్తులు ఉన్న గోపురంలో ఉన్న లిఫ్ట్ లో పైకి వెళ్ళి,  అక్కడి నుండి సముద్రం, పక్కనే శివుని ఎదురుగా చూసే అదృష్టం మాకు లేకపోయింది. అప్పటికే చాల ఆలస్యం అయ్యింది లిఫ్టుని ఆపేసారు. మేము ఎక్కడికి ఏ ఆలయానికి వెళ్ళినా ప్రధాన ఆలయాన్ని చూసి వెనుదిరిగామే కానీ అక్కడ ఉన్న క్షేత్రపాలకుని ఆలయాలు కానీ, ఉపాలయాలు కానీ ఏమీ చూడలేదు.  



9 గంటలకి బయలుదేరి రాత్రికి అక్కడే అంటే మురుడేశ్వరంలోనే హోటల్ లో బస చేసాము. 

Day 5...... డిశెంబర్ 26

ఈరోజు కొల్లూరులో ఉన్న మూకాంబిక అమ్మవారి కోవెల దగ్గర ఉన్న సౌపర్ణికా నదిలో స్నానాలు చేసి, మూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నాము. 

ఆరోజు గ్రహణం సందర్భంగా ఉదయం మాలో కొంతమంది ఫలహారాలు చెయ్యలేదు, పెద్దవయస్సు వారు, పట్టింపులు లేనివారు కొంతమంది ఫలహారాలు చేసారు. ఉదయం 7.30 కి మూకాంబికా చేరుకోవటానికి బస్సు బయలుదేరింది. 9.15 కి మూకాంబిక చేరుకున్నాము. ఆరోజు గ్రహణం ఐనప్పటికీ ఎందుకో ఎమ్మవారి ఆలయం తెరిచే ఉంది. మరి అక్కడి ఆచారం ఏమిటో మాకు అర్థంకాలేదు. గ్రహణం విడుపు స్నానం చేయనివారు, పట్టింపు లేనివారు, అమ్మని దర్శించుకోవటానికి కొంతమంది వెళ్లారు. మేము కొద్దిపాటి దూరంలో ఉన్న సౌపర్ణికా నదికి వెళ్ళి గ్రహణం విడుపు సమయానికి స్నానాలు ముగించుకొని, అమ్మని దర్శించటానికి వెళ్ళాము. 



కొంతమంది నదిలో నీటిలో కూర్చొని జపాలు చేసుకున్నారు, మరికొంతమంది జలకాలాటలు ఆడుకున్నారు. 

మొత్తానికి అందరూ నదిలో స్నానాలు చేసి ఆనందించారు. స్నానాలు ముగించుకొని అమ్మవారి దర్శనానికి 12.15 కి లైనులో నిలబడిన వాళ్ళం 2.15 కి దర్శనం అయ్యి బయటకి వచ్చాము. 



అమ్మని దర్శించి, అదే ప్రాంగణంలో ఉపాలయాలలో ఉన్న  దేవీ-దేవతలని దర్శించాము. అమ్మని దర్శనం చేసుకొని ఆలయం బయటకి వచ్చేవరకు ఎవరికీ ఆకలి మాట గుర్తుకురాలేదు. బయటకి వచ్చిన తరువాత మంచినీళ్ళు తాగాము. 2.40కి బస్సు దగ్గరకి వచ్చి భోజనాలు ముగించుకొని, శృంగేరికి మా ప్రయాణం ప్రారంభమయ్యింది. 4.15కి బయలుదేరితే శృంగేరి చేరుకునేసరికి రాత్రి 9 అయ్యింది. రాత్రికి శృంగేరికి 20km దూరంలో ఒక హోటలులో బస చేసాము. 

Day 6...... డిశెంబర్ 27

పొద్దున్నే 7.30కి బస్సు బయలుదేరి 7.40కి శృంగేరి శారదాదేవిని దర్శించుకున్నాం. 













ఈ ప్రాంగణంలో పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తున్నారు.  

8.50కి హోర్నాడులో అన్నపూర్ణాదేవిని దర్శించటానికి బయలుదేరాము. దారిమధ్యలో ఫలహారాలు ముగించుకొని, హోర్నాడు చేరుకునేసరికి ఒంటిగంట అయ్యింది. 15 నిమిషాల నడక అనంతరం ఆలయాన్ని చేరుకున్నాం. 









1.40 అయ్యేసరికి అమ్మని దర్శించుకొని బయటకి వచ్చేసాము. భోజనాల అనంతరం బస్సు బేలూరు బయలుదేరింది. 




బేలూరు చేరేసరికి 7.15 అయ్యింది. చెన్నకేశవస్వామిని దర్శించి, చుట్టూ ఆలయ సౌందర్యం చూడటానికి మాకు సమయం సరిపోలేదు. ఎందుకంటే ఆలయం 7.30 కే మూసివేస్తారంట. అందుకే అందరికీ ఆలయం చూసిన సంతోషం లేకుండానే, అసంతృప్తితో వెనుదిరిగాం. ఆరాత్రికి ఆలయానికి కొద్ది దూరంలోనే హోటల్ లో బస చేసాము. అక్కడే రాత్రికి నిద్రించి, మరుసటిరోజు మా (ఆఖరిరోజు) ప్రయాణాన్ని ప్రారంభించాం. 

Day 7......డిశెంబర్ 28
ఈరోజు హళేబీడు చూసి, రైల్వేస్టేషన్ కి చేరుకొని రైలు ఎక్కాము. 

ఉదయమే ఫలహారాలు ముగించుకొని 8.50 కి హళేబీడు చేరుకున్నాం. 







హొయసలేశ్వరుడు 



10.15 కి బస్సు రైల్వేస్టేషన్ చేరుకోవటానికి పరుగులు తీసింది. మార్గం మధ్యలో భోజనాలు చేసుకొని, అప్పుడే అందరికి అందరూ వీడ్కోలు చెప్పుకొని, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియని బెంగతో, స్కూల్ చదువు తరవాత అందరూ విడిపోతే ఎంత బెంగగా ఉంటుందో అంత బెంగగా అనిపించింది. 


ఒక వారంరోజుల పాటు ఇల్లు వాకిలి వదిలిపెట్టి అందరం చాలా ఆనందంగా తిరిగి తిరిగి మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాలంటే కొంచెం బెంగ, కొంచెం బాధ, మరికొంచెం ఆనందంతో, బరువైన హృదయాలతో, అందరం మౌనంగా బస్సులో కూర్చున్నాం. స్టేషన్ రాగానే ఎవరి సామాను వారు మోసుకొని రైలు ఎక్కి మరుసటిరోజు ఉదయం 8.30 కి రైలు దిగి ఎవరి ఇళ్ళకి వారు పరుగులు తీసాం. 

ఈ విధంగా మా కర్ణాటక యాత్ర సంపూర్ణమయ్యింది.           
                             

No comments:

Post a Comment