శ్రీ భ్రమరాంబికాష్టకము
రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ
ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణీ
అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణీ
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా ||
కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా
వెలయగును శ్రీ శిఖరమందున విభవమై విలసిల్లవా
ఆలసింపక భక్తవరులకు అష్టసంపద లీయవా
జిలుగు కుంకుమ కాంతిరేఖల శ్రీగిరి భ్రమరాంబికా ||
అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్
పొంగుచును వరహాల కొంకణ పుణ్యభూముల యందునన్
రంగుగా కర్ణాట రాట మరాట దేశములందునన్
శృంగినీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా ||
అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై
సాక్షిగణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవీ
మొక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణ శక్తివి
శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరి భ్రమరాంబికా ||
ఉగ్రలోచన వరవధూమణి కొప్పుగల్గిన భామినీ
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్ధ విచారినీ
శీఘ్రమేకని వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా ||
నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ
మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ
చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా ||
సోమశేఖర పల్లవాధరి సుందరీమణీ ధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ
నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా ||
భూతనాథుని వామభాగము పొందుగా చేకొందువా
ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివా
పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివా
శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమారాంబికా ||
ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున
పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా ||
తరుని శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ
కరుణతో మమ్మేలు మెప్పుడు కల్పవృక్షము భంగినీ
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి
సిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబికా ||