ఈ జనవరి నెలలో యాత్ర విశేషాలు
19/1/24 . రాత్రి 12.40 కి చెన్నై నుండి శ్రీలంకకి ఫ్లైట్ బయలుదేరింది. ఉదయం 2.05 కి లంకలో ఫ్లైట్ దిగింది. ఇమిగ్రేషన్ & వీసా కార్యక్రమాలు పూర్తి చేసుకొని 3 కి బయటకి వచ్చాము. వచ్చేసరికి ట్రావెల్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సు వచ్చింది. బస్సు ఎక్కి హోటల్ కి వెళ్ళి అందరం పడుకున్నాం.
తెల్లారాక స్నానాలు చేసి బస్సు ఎక్కాము. దారిలో అల్పాహారం (Breakfast) తిని, అక్కడ నుండి మొదటిగా మేము చూసిన ఆలయం.... *మురుగన్ ఆలయం*
ఈ ఆలయంలో చాలా పెద్ద పెద్ద దేవతా మూర్తులు ఉన్నాయి. రంగురంగుల బొమ్మలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
తరవాత అక్కడ నుండి మున్నేశ్వరంలో ఉన్న *రామలింగ* ఆలయాన్ని దర్శించాము. తరవాత భోజనాలు ముగించుకుని సాయంత్రం *మహాబోధి వృక్షాన్ని* దర్శించాము. అక్కడ అన్నీ బౌద్ధ ఆరామాలు, పగోడాలు, ఉన్నాయి.
రాత్రి *అనురాధపుర* లో హోటల్ లో బస చేసాము.
20/1/24. (శనివారం)
నల్లూరులో ఉన్న *మురుగన్ ఆలయం* దర్శించటానికి వెళ్ళాము కానీ మేము వెళ్ళేసరికి అప్పుడే ఆలయం తాళం వేసేశారు. బయట నుండి నమస్కారం చేసి వచ్చేశాము.
భోజనం అనంతరం జఫ్నాలో ఉన్న సముద్రం ఒడ్డు వరకు బస్సు వెళ్ళింది, అక్కడ నుండి పెద్ద పడవలో బయలుదేరి ద్వీపం మధ్యలో ఉన్న నాగదేవత ఆలయానికి వెళ్ళాము. ఆ ఆలయం పునరుద్ధరణలో ఉండటం వలన ప్రధాన ఆలయంలో ఉన్న మూర్తిని బాలాలయంలో ఉంచారు, అక్కడే ఉన్న అన్ని మూర్తులను దర్శించుకున్నాము. మేము అక్కడికి 20వ తేదీన వెళ్ళాము కదా .... 24న విగ్రహ ప్రతిష్ఠ జరగనున్నది, అందుకు ఏర్పాట్లు చాలా బాగా ఘనంగా చేస్తున్నారు. శ్రీలంకలో చూడవలసిన ఆలయాలలో ఇది కూడా ఒక ప్రధానమైన ఆలయం. దర్శనం అనంతరం అక్కడ నుండి మళ్ళీ పడవలో ఇవతలి ఒడ్డుకి వచ్చి బస్సు ఎక్కి రాత్రి టిఫిన్స్ చేసుకొని అనురాధపురాలో హోటల్ కి చేరాము.
21/1/24. (ఆదివారం)
ఉదయం హోటల్ లోనే అల్పాహారాలు ముగించుకుని బయలుదేరాము, ముందుగా *రావణ ఉష్ణ కుండాలని* చూసాము. 7 ఉష్ణ కుండాలు ఉన్నాయి. పర్వత ప్రాంతంలో ఉష్ణ కుండాలు ఉండటం విశేషంగా అనిపించింది. తరవాత అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటిదైన శక్తిపీఠం *లంకాయాం శాంకరీ దేవీ* ని దర్శించాము. అమ్మవారు చాలా బావున్నారు, ఆలయం కూడా చాలా బావుంది, ఆకర్షణీయంగా ఉన్నది. అక్కడ ఆలయంలో అందరం కూర్చొని *లలితా సహస్రం పారాయణ* చేసాము. అనంతరం భోజనాలు చేసి వెళుతున్న త్రోవలో అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఏనుగుల గుంపుని చూసాము. తరవాత ఒక ఆయుర్వేద మసాజ్ సెంటర్ వద్ద బస్సుని ఆపారు, బస్సులో కొంతమంది మసాజ్ చేయించుకున్నారు. మిగిలిన వారము అంతా హోటల్ కి వెళ్ళాము. మసాజ్ అనంతరం వాళ్ళంతా బస్సులో హోటల్ కి చేరుకున్నారు. ఆ రాత్రికి సిగిరియాలో హోటల్ లో ఉన్నాము.
22/1/24. సోమవారం
*సిగిరియా పర్వతం* ఎక్కాలి అంటే 1300 మెట్లు ఉంటాయి అన్నారు, అందుకే ఎవ్వరం కొండ ఎక్కే సాహసం చేయలేక దూరం నుండే చూసి ఊరుకున్నాము. తరవాత *విలేజ్ సఫారీ* అని ఒక సఫారీకి తీసుకొని వెళ్ళారు. అది ఏమిటంటే కొంత దూరం ఎడ్లబండిలో ప్రయాణం, తరవాత కొంతదూరం నడక, తరవాత ఒక పడవలో విహారం, అనంతరం ఒక పల్లె వాతావరణంలో ఉన్న ఒక ఇంటిలో (గుడిసెలో) వారు పూర్వకాలంలో వాడే రోలు- రోకలి, తిరగలి, కట్టెలతో వండే మట్టి పొయ్యిలు, వాటి పైన వండిన కొన్ని ఆహార పదార్థాలు వండి ఇచ్చారు, అవి తిని వారు ఇచ్చిన మూలికల తేనీరు (herbal tea) రుచి చూసాము. కొంతసేపు అందరూ ఆనందంతో డప్పు వాయిస్తూ నాట్యం చేశారు. తరవాత వచ్చి బస్సు ఎక్కి *బుద్ధుడి గోల్డెన్ టెంపుల్* కి వెళ్ళాము. అక్కడికి చేరేసరికి మధ్యాహ్నం 12.30 అయ్యింది, అదే సమయానికి అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ..... బుద్ధుని ఆలయంలో ఉన్న ధ్యాన మందిరంలో అందరం కూర్చొని రామాయణంలో బాలకాండలో శ్రీరామ జనన ఘట్టం అందరం కలసి పారాయణ చేసాము. పారాయణ చేసే అవకాశం లభించినందుకు అందరూ ఆనందించాము. తరవాత భోజనం కోసమని *స్పైస్ గార్డెన్* లో ఉన్న హోటల్ కి వెళ్ళాము. భోజనాల తరవాత ఆ గార్డెన్ లో ఉన్న లవంగ, ఏలకులు, దాల్చినచెక్క, మిరియాలు వంటి కొన్ని మొక్కలని చూసాము, మూలికలతో చేసిన కొన్ని ఆయుర్వేద క్రీములు, పేస్టులు వంటి కొన్ని పదార్ధాలని ఉపయోగాలను చెప్పారు. కొంతమంది వాటిని కొనుక్కున్నారు.
తరవాత అక్కడ నుండి *ముత్తుమలి అమ్మన్* ఆలయానికి వెళ్ళాము, తరవాత *మురుగన్ ఆలయం* ని దర్శించుకున్నాము. ఈ ఆలయం విశేషం ఏమిటంటే --- *సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఆలయాన్ని తెరుస్తారు అంట .... అదీ కూడా ఒక్క ఘంట మాత్రమే ఉంటుంది అంట* చాలా విచిత్రంగా అనిపించింది, చరిత్ర ఏమిటో తరవాత తెలుసుకోవాలి. ఆ రాత్రికి కాండీలో హోటల్ లో ఉన్నాము.
23/1/24. మంగళవారం
ఉదయం హోటల్ లో అల్పాహారం చేసి ముందుగా టీ ఫ్యాక్టరీ చూడటానికి వెళ్ళాము. అక్కడ టీ ఆకుల నుండి టీపొడి ఎలా తయారుచేస్తారో చూపించారు. టీ తోటలకు వెళ్ళి చూసాము. అక్కడే తయారుచేసిన టీపొడిని కొంతమంది కొనుక్కున్నారు. తరవాత *హనుమాన్ ఆలయం* ని దర్శించుకున్నాము. ఆ ఆలయం వద్దనే ఉన్న హోటల్ లో భోజనాలు చేసి మళ్ళీ బయలుదేరాము. ఆరోజు మా గ్రూప్ లో ఉన్న రాధ పిన్నిగారు పుట్టినరోజు అయ్యింది.
అనంతరం *సీతావాటిక* కి వెళ్ళాము. ఈ ప్రదేశంలోనే అశోక వృక్షాల నడుమ సీతాదేవి వనవాసం చేసింది. *అశోక వృక్షం* పై నుండి క్రిందకి వచ్చి సీతమ్మని దర్శించిన హనుమంతుడు ఒక్కసారిగా కిందకి దూకగానే పడిన *పాదముద్ర* అక్కడ ఉన్నది. *సీతానది* ఉన్నది. ఈ నది *సీతాదేవి కన్నీరు* అని కొంతమంది, సీతమ్మవారు కాలకృత్యాలు తీర్చుకున్నది ఈ నది ఒడ్డునే అని రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఏది నిజమో తెలియదు కానీ సీతనది మాత్రం పవిత్రం అని అనుకుంటున్నాము. అక్కడే ఉన్న హనుమ ఆలయం ఎదుట అందరం *సుందరకాండలోని, సీతమ్మవారికి హనుమ శ్రీరాముడి అంగుళీయకం ఇచ్చిన సర్గ* పారాయణం చేసాము.
అవన్నీ చూసిన తరవాత కొద్ది దూరంలో ఉన్న *గాయత్రీమాత మందిరం* చూసాము. ఇది 108 అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా చెబుతారు. అనంతరం కాండీలో ఉన్న హోటల్ కి వచ్చాము.
24/1/24. బుధవారం
ఉదయం హోటల్ లో అల్పాహారం తరవాత *రంగురాళ్ళ మ్యూజియం* ని చూసాము, తరవాత *బుద్ధుని బంగారపు పన్ను* ఆలయానికి వెళ్ళాము. తరవాత భోజనాలు చేసి, పిన్నెవాలాలో ఉన్న ఏనుగుల ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ చాలా ఏనుగులు ఉన్నాయి. ఆశ్రమం లోనికి వెళ్ళి ఏనుగులని చూడటానికి శ్రీలంక రూపాయలలో 3500 -/- టికెట్. ఆసక్తి ఉన్నవారు కొందరు వెళ్ళి చూసి వచ్చారు. అక్కడ విశేషమైన ఒక దుకాణం ఉన్నది. అందులో కొన్ని వస్తువులు ఏనుగు పేడతో చేసినవి ఉన్నాయి. పుస్తకాలు, కొన్ని షోకేస్ వస్తువులు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి.
తరవాత కొలంబో సిటీకి వచ్చాము. అక్కడ సమయం లేక *లోటస్ టెంపుల్, ఏంగిల్ బిల్డింగ్* బస్సులో నుండే చూసాము. తరవాత *గంగరామ ఆలయం* (అంటే ఇది కూడా ఒక బౌద్ధ ఆరామమే) చూసాము. అనంతరం రాత్రి డిన్నర్ పూర్తి చేసుకొని 10 గంటలకి Airport కి చేరుకున్నాం.
అంతటితో మా *శ్రీలంక యాత్ర* పూర్తి అయ్యింది.
రాత్రి 3 గంటలకి చెన్నైకి వెళ్ళటానికి మా ఫ్లైట్. Airport లో ఫార్మాలటీస్ పూర్తిచేసుకొని, 3కి ఫ్లైట్ ఎక్కాము, 4.15 కి చెన్నై Airport లో దిగాము. అక్కడ నుండి ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరుకున్నాం. *ఇది నా మొదటి విదేశీయాన యాత్రా విశేషాలు.*😊
యాత్రని నిర్వహించిన రామానుజ టూర్స్ & ట్రావెల్స్ ఆర్గనైజర్ *అవసరాల రామనుజాచార్యులు* గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 🙏🙏🙏
యాత్రలో అందరూ చాలా బాగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించినందుకు ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు.🙏🙏🙏
నేను రాసిన యాత్రా విశేషాలు ఓపికగా చదివి, నన్ను తిట్టుకోకుండా ఉన్న ప్రతీ ఒక్కరికీ నా నమస్కారాలు. 🙇♀️🙏😄😀😆🥳🥳🥳🥳🥳🥳
*సర్వేజనా సుఖినోభవంతు* 🙏
No comments:
Post a Comment