January 27, 2025

రజకుడు గుర్తించిన శ్రీరంగం ఉత్సవమూర్తి నంపెరుమాళ్ విగ్రహం

 రజకుడు గుర్తించిన శ్రీరంగం ఉత్సవమూర్తి నంపెరుమాళ్ విగ్రహం

బట్టలు శుభ్రం చేసే రజకుడు త్రేతాయుగం మరియు ద్వాపర యుగంలో చేసిన పాపాలకు తగిన పరిహారం కలియుగంలో చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఆ రజకుడు వలన మనం ఈరోజు నంపెరుమాళ్ను కన్నుల పండుగగా చూడగలుగుతున్నాము. భూలోక వైకుంఠం అని కీర్తించబడే శ్రీరంగం దాని ప్రియమైన చక్రవర్తిని కోల్పోయి దాని వైభవమును కోల్పోయి యుండెడిది. కానీ ఈ రజకుడు చేసిన అద్భుతమైన సేవ వలన మనం ఆ వైభవమును తిరిగి నోచుకోగలుగుచున్నాము. శ్రీరంగాన్ని ముస్లిం ఆక్రమణదారుడు అబ్దుల్ గఫూర్ ఖాన్ ఆక్రమించుకోవడానికి ముందు పెరియ పెరుమాళ్ సన్నిధిని రక్షించడానికి ఒక రాతి గోడను ఆలయ గర్భగుడి ముందు నిర్మించి..

అర్చావతార విగ్రహమును ముస్లిములకు కానరాక కుండ చేసి తర్వాత శ్రీ పిళ్లైలోకాచార్యులు మరియు ఆయన భక్త బృందం నంపెరుమాళ్ను శ్రీరంగమునుండి దూర దూర ప్రదేశాలకు తీసుకెళ్లారు. నంపెరుమాళ్ భద్రత గురించి భయపడి భక్తులు ఆ విగ్రహాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చాలా దూరం తీసుకువెళ్లారు. అలా అరవై ఏళ్లు గడిచిపోయాయి. భక్త బృందం నంపెరుమాళ్తో దాదాపుగా కర్ణాటకలో కొంచం భాగం మరియు ఆంధ్రప్రదేశ్లతో సహా దక్షిణ భారతదేశం అంతటా పర్యటించారు. ఈలోగా శ్రీరంగంలో దోపిడిదారులు నిష్క్రమించిన తరువాత పూర్తిగా కొత్త తరం వారు వచ్చి ఆలయములో ఉత్సవ విగ్రహము (నాంపెరుమాళ్) లేకపోవడంతో ఆందోళన చెందిన భక్తులు శ్రీరంగం సన్నిధిలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఏర్పాట్లు చేశారు. ఆలయం తన పూర్వపు వైభవాన్ని నెమ్మదిగా సంతరించుకొని ఉత్సవాలు కూడా వాటి పూర్వపు వైభవంతో తిరిగి ప్రారంభమయ్యాయి.

ఒకరోజు ఒక వర్తకుల గుంపు ఒక అడవిలో దారి తప్పి అటూ ఇటూ తిరుగుతూ ఒక ప్రదేశానికి వచ్చి అచట ఉన్న ఖాళీ స్థలము మధ్యలో ఒక అద్భుతమైన శ్రీ మహావిష్ణువు విగ్రహమును చూచారు. వ్యాపారులలో వయసులో పెద్దవాడైన శ్రీరంగ నివాసి ఒకరు శ్రీ రంగనాథుని విగ్రహాన్నిచూసి శ్రీరంగనాధుడిని పోలి ఉన్నదని అరిచాడు. ఇది స్పష్టంగా స్వామి తన ఆచూకీ గురించి ప్రజలకు తెలియజేసే ఒక మార్గం. వ్యాపారులు అద్భుతమైన విగ్రహాన్ని శ్రీరంగానికి తీసుకురాగా ఆలయ సిబ్బంది భట్టర్లు మరియు భక్తులందరికీ పెద్ద సందేహం వచ్చినది. శ్రీరంగంలో నాంపెరుమాళ్ విగ్రహం ఒకటి ఇప్పటికే స్థాపించబడినది మరియు నాంపెరుమాళ్గా పూజించబడుతోంది: ఇప్పుడు మరొక విగ్రహం ఉద్భవించింది. ఆళ్వార్లు మరియు ఆచార్యుల మహిమాన్వితమైన నివాళులర్పించిన కొత్త మూర్తి యొక్క ఆధారాలను కనుగొనడం మరియు నిజమైన నాంపెరుమాళ్ అని నిర్ధారించుకోవడం ఎలా? అసమానమైన అందంతో అందరి మనసులను దోచుకున్న నాంపెరుమాళ్ కొత్త విగ్రహంలో ఎటువంటి దోషం లేకపోయినా ఆళ్వారుల ఆరాధనకు పాత్రుడైన సాక్షాత్తు నాంపెరుమాళ్కు పూజలు చేసేందుకు సార్వభౌమాధికారులు మరియు సామాన్యులు శ్రీరంగం వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. భక్తుల సందిగ్ధం చివరికి ముస్లిం దండయాత్రకు ముందు తన యవ్వనంలో శ్రీరంగం ఆలయానికి నిజాయితీగా సేవ చేసిన ఒక ముదుసలి శ్రీరంగ నివాసి అయిన రజకుడి చెవికి చేరినది. అతను ఇప్పుడు అంధుడు మరియు సగం చెవిటివాడు, కానీ అతని మిగిలిన ఇంద్రియాలు పూర్తిగా చురుకుగా పనిచేస్తున్నాయి. అతను సన్నిధికి చేరుకొని.. భట్టర్లతో మాట్లాడటానికి ప్రయత్నించాడు కానీ అతని వయస్సు మరియు వృద్ధాప్యం కారణంగా ఎవరూ అతనిని పట్టించుకోలేదు. అయితే చివరికి అతను ఆలయ సిబ్బందిలో వయసులో పెద్దవాడైన ఒక అధికారి దృష్టిని ఆకర్షించగలిగి నిజమైన నాంపెరుమాళ్ను గుర్తించగలనని అతనికి ప్రతిపాదించాడు.

వృద్ధుడి ప్రతిపాదనపై అనుమానం వచ్చినప్పటికీ ఆ ఆలయ సిబ్బంది అతన్ని రెండు విగ్రహాల వద్దకు తీసుకెళ్లారు. రజకుడు ఉత్సవ మూర్తులిద్దరికీ తిరుమంజనం చేసి ఆ తిరుమంజనమును తీర్ధముగా ప్రసాదించమని కోరాడు. అతను రెండవ మూర్తి యొక్క పవిత్ర స్నానపు నీటిని తీర్థముగా స్వీకరించినపుడు, రజకుడు ఉల్లాసంగా కేకలు వేసి..

ఇదే నిజమైన నంపెరుమాళ్ అని అధికారులకు చెప్పాడు. ఖచ్చితంగా ఆ విగ్రహమే నాంపెరుమాళ్ అని ఎలా తెలుసుకో గలిగావని ప్రశ్నించగా.... అద్భుతమైన నాంపెరుమాళ్ బట్టల నుండి వెలువడే అద్బుతమైన కస్తూరి వాసన తనకు ఏ రోజునైనను తెలుస్తుంది అని రజకుడు సమాధానమిచ్చాడు. వృద్ధుడు తను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తనకు తన తండ్రి (శ్రీరంగనాథునికి అధికారిక రజకుడు) ఉతకడానికి ఇవ్వబడ్డ నంపెరుమాళ్ బట్టల నుండి పిండిన నీరు ప్రతి దినము తనకు తీర్థముగా ఇవ్వబడెనని మరియు అది కస్తూరి పరిమళాన్ని కలిగి ఉండెడిది.

రెండవ ఉత్సవ మూర్తి తిరుమంజన తీర్థం నుండి వెలువడిన అదే కస్తూరి పరిమళం వలన అదే నిజమైన నంపెరుమాళ్ అని రజకుడు సానుకూలంగా భావించాడు. మిగిలిన కథ సహజంగానే చరిత్ర. కాబట్టి, ఆళ్వార్లను, ఆచార్యులను ప్రేమతో పిచ్చివాళ్లను చేసిన నంపెరుమాళ్ వైభవాన్ని ఈరోజు మనం సేవించగలుగుతున్నామంటే, ఆ రజకులకు మన కృతజ్ఞతలు తెలపాలు, మరియు రజకుడు ఆ రోజు భక్తులకు చెప్పినది కట్టు కథ కాదు.

ఎందుకంటే, నంపెరుమాళ్ బట్టలు ఉతికి, ఎండబెట్టి మరియు ఒత్తి (ఇస్త్రీ)ఒక రజకుడు చేసేవాడనేది నిజానికి నిజం. నాణ్యమైన శుభ్రపరిచిన వస్త్రములు అందించే రజకుని పనితనము శ్రీరామానుజాచార్యులను చాలా ఆకట్టుకున్నట్లు ఈడు వాఖ్యానమునుండి మనం దీనిని నేర్చుకుంటాము.

సన్యాసుల చక్రవర్తి శ్రీ రామానుజలవారు ఈ బట్టలు శుభ్రపరిచే నిష్కళంకమైన సేవలకు చాలా సంతోషించి రజకుడిని పెరియ పెరుమాళ్ వద్దకు తీసుకువెళ్ళి అతని యొక్క పని నాణ్యతను ప్రశంసిస్తూ మాట్లాడారు.

భాష్యకారుడికి శ్రీ రంగనాథుడు, అతను రజకుడి సేవతో నిజంగా సంతోషిస్తున్నాడని మరియు రామావతారం మరియు కృష్ణావతారం సమయంలో చేసిన నేరాలను క్షమించాలని నిర్ణయించుకున్నాను అని జవాబిచ్చాడు. 

శ్రీ రామానుజుల వారి కంటే తక్కువ స్థాయి వ్యక్తి నుండి రజకుడికి లభించిన ప్రశంసలను వివరిస్తూ ఈడు నుండి అద్భుతమైన వాఖ్యలు ఇక్కడ ఉన్నాయి: “ఓరు నాళ్ శ్రీ వైష్ణవ వన్నత్తాన్ తిరుప్పరివట్టంగలై అళగియదగా వాట్టిక్కొండు వాండు ఎమ్పెరుమానరుక్కు కట్టా, పోరా త్రిప్పరాయ్, అవనై పెరుమాళ్తిరువడిగళిలే కైప్పిడిట్టుక్ కొండు పుక్కు,

“నాయంతే! ఇవన్ తిరువరైక్కు ఈడామ్ పడివత్తిన పడి తిరుక్కన్ సాథి అరుళ వేణుమ్”ఉగాందరుళి, ఉదయవరై అరుళపడిత్తు అరుళీ, “ఇవనుక్కగా రాజకన్ నామ్ తిరత్తిల్సీద కుట్రం పొరుత్తొం” ఎండ్రు తిరువుల్లం ఆగి అరుళినారు “ స్వస్తి.

జై శ్రీమన్నారాయణ


పన్నిద్దరాళ్వారుల చరిత్ర , చరితామృతం

పన్నిద్దరాళ్వారుల చరిత్ర, చరితామృతం

భక్తి ప్రవృత్తి శరణాగతి భావాలు అసలు లేనిచో మానవులు నైతికంగా పతనమవుతారని 

తలచిన ఆళ్వారులు. ప్రజలలో భక్తి ప్రవత్తులు పెంపొందించేందుకై కృషి చేసారు. వారు చూపిన భక్తి మార్గాలన్నీ లోక కల్యాణం కోసమే ! నిత్యం భగవంతునే తలుస్తూ, కొలుస్తూ, స్మరిస్తూ, తన్మయంతో సర్వం మరచి, అలౌకికమైన ఆనందానుభూతితో, భగవత్ చరణాలనే సర్వస్వమని భావించి తరించిన మహానుభావులు, సర్వవిశ్వపౌరులు మహామహిమాన్వితులైన మహానుభావులు ఎందరో ! నిరవదికమైన భగవత్ ప్రేమ సాగరంలో మునిగి, ఆర్తితో , పరమాత్మ యొక్క గుణగానం చేస్తూ తరించేవారే ఆళ్వారులు. కారణజన్ములు. 

మానవకోటికంతటికీ ఆదర్శంగా నిలిచినా భాక్తాగ్రేసురులు. ఆళ్వారులు అంటే లోతులను చూసిన వారని అర్థం. దేని లోతులను అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సత్యం లోతులను , ఆనందం లోతులను అని అర్థం చేసుకోవాలని పెద్దల మాట. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఆచార్యత్రయం అంటే శ్రీనాథముని , 

యామునాచార్యులు , రామానుజాచార్యులు ఆళ్వారుల వల్ల ప్రభావితులైన వారే. 

(ఆచార్య త్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు.) 

ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి ఆధారాలు లేవు. 

కాని, నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. ఆచార్యత్రయంలో మొదటి వారైన శ్రీనాథముని క్రీ.శ. 824 లో జన్మించిన వారు. ఆళ్వారులు అంతకు ముందువారే గాని అందులో కొందరు క్రీస్తుకు పూర్వం వారా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

ఆళ్వారులు విష్ణుభక్తిలో పారవశ్యం చెందిన వారు. విష్ణువును గురించి సంస్కృతంలోనూ, తమిళంలోనూ స్తోత్రాలు రచించారు. తమిళంలో రచించిన స్తోత్రాలను ‘పాశురాలు’ అంటారు. పాశురాల సంకలనాన్ని ద్రావిడ వేదం అన్నారు. 

ఆళ్వారులు పదిమంది అని ఒక వాదం , పన్నెండు మంది అని మరో వాదం ఉంది. 

పన్నెండుమంది అనే వాదమే లోకంలో స్థిరపడింది. ‘పన్నిద్దరాళ్వారులు’ అనే పదబంధం వాడుకలో ఉంది. 

‘భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ , శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్‌ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్‌ శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యమ్‌’’ అని పరాశర భట్టర్‌ రచించిన శ్లోకం ఆధారంగా ఆళ్వారులు పదిమందే. కాని , ఇందులో పదాలను చీల్చి శ్రీ అనే శబ్దానికి ఆండాళ్‌ అనీ, యతీంద్ర మిశ్రాన్‌ అనే పదబంధాన్ని రెండుగా చేసి, మిశ్రాన్‌ను మధురకవిగా మార్చినందువల్ల ఆళ్వారులు పన్నిద్దరైనారు. 

పదుగురి పేర్లివి:

1. భూత ఆళ్వారు  - పూదత్త ఆళ్వారు అని వాడుక. 

కౌమోదకి అనే విష్ణు ఆయుధం గద అంశంతో జన్మించాడని ఐతిహ్యం

2. పొయగై ఆళ్వారు. - పాంచజన్యం అనే శంఖం అంశ. సరోయోగ అని కూడా అంటారు.

3. పేయాళ్వార్‌. - మహదాహ్వయ ఆళ్వారు అని వాడుక. నందకం అనే ఖడ్గం అంశ.

4. తిరుమళిశై ఆళ్వారు. భక్తిసార ఆళ్వారు. సుదర్శన చక్రం అంశ.

5. కులశేఖ రాళ్వారు. కౌస్తుభమణి అంశ.

6. తొందర డిప్పొడి ఆళ్వారు. విప్ర నారాయణుడిగా ప్రసిద్ధి. తులసీదళాలు , పుష్పాలతో కూర్చిన వైజయంతీమాల.. వనమాల అంశ. ఇది ఎన్నటికీ వాడని హారమని విశ్వాసం.

7. తిరుప్పాణి ఆళ్వారు. యోగి వాహన ఆళ్వారు. ఇతడు పంచముడిగా జన్మించాడని అంటారు. 

విష్ణువు వక్షస్థలంపై ఉండే శ్రీవత్స లాంఛనం అనే పుట్టుమచ్చ అంశ.

8. తిరుమంగై ఆళ్వారు. పరకాల ఆళ్వారు. క్షత్రియుడిగా జననం. విష్ణువు ఆయుధం శార ఙ్గం అంశం.

9. పెరియాళ్వారు. భట్టనాథ ఆళ్వారు. ఇతడినీ విష్ణుచిత్తుడని కూడా అన్నారు. వైకుంఠంలోని విష్ణువు రథం అంశ. 

10. నమ్మాళ్వారు. పరాంకుశ ఆళ్వారు. విష్వక్సేనుడి అంశ. శూద్రులలో గీత కార్మిక కులంలో జననం.

ఈ పదిమందిగాక ఆండాళును , మధురకవిని కూడా ఆళ్వారులన్నారు. 

పరాశరు భట్టరు శ్లోకంలో శ్రీ అంటే ఆండాళు అని వ్యాఖ్యాతలు అర్థం చెప్పారు. గోదాదేవిగా ఆమె ప్రసిద్ధురాలు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అంటారు. 

పెరియాళ్వారుకు చెందిన తులసివనంలో ఆమె శిశువుగా కనిపించినదని గాథ. కనుక ఆయనే ఆమెకు తండ్రి అని వ్యవహరిస్తారు. 

మిశ్రాన్‌ శబ్దం ఆధారంగా వ్యవహారంలోకి వచ్చిన మధురకవి బ్రాహ్మణ కులజుడు. గరుడాంశగా చెపుతారు. 

భట్టరు శ్లోకంలోని యతీంద్ర పదానికి రామానుజుడని అర్థం చెప్పిన వారున్నారు. కాని, ఇది ఎక్కువ మందికి ఆమోదయోగ్యం కాలేదు.   

వైష్ణవ సాంప్రదాయానికి, భక్తిని జోడించి, ప్రచారం చేసిన ఆళ్వారులు 12 మంది. వారు.

1. పుదత్తాళ్వారు

2. పాయ్ గైయాళ్వారు

3. పేయళ్వారు

4. పెరియాళ్వారు

5. ఆండాళ్

6. తిరుమళిశైయాళ్వారు

7. కులశేఖరాళ్వారు

8. తిరుప్పాణియాళ్వారు

9. తొండరడిప్పాయాళ్వారు

10. తిరుమంగైయాళ్వారు

11. మధురకవియాళ్వారు

12. నమ్మాళ్వారు

అతి సాధారణంగా చెప్పబడే పన్నిద్దరు ఆళ్వారులు , 

వారి సంస్కృత నామములు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

పొయ్‌గయాళ్వార్ - మరొక పేరు సరోయోగి

పూదత్తాళ్వార్ - మరొక పేరు భూతయోగి

పేయాళ్వార్ - మరొక పేరు మహాయోగి

పెరియాళ్వార్ - మరొక పేరు భట్టనాథులు

తిరుమళిశై యాళ్వార్ - మరొక పేరు భక్తిసారులు

కులశేఖరాళ్వార్ - మరొక పేరు కులశేఖరుడు

తిరుప్పాణాళ్వార్ - మరొక పేరు మునివాహనులు

తొండరడిప్పొడి యాళ్వార్ - మరొక పేరు భక్తాంఘ్రి రేణువు

తిరుమంగయాళ్వార్ - మరొక పేరు పరకాలయోగి

ఆళ్వారుక్కు అదియాన్ - మరొక పేరు మధురకవి (శ్రీవైష్ణవ సాంప్రదాయానికి ప్రవర్తకులైన 'ఉడయవర్', 'ఎమ్బెరుమనార్' అనే నామాంతరాలుగల భగవద్రామానుజాచార్యుల వారిని కొంతమంది మధురకవికి మారుగా చేరుస్తారు ఈ పన్నిద్దరిలో.)

ఆండాళ్ - మరొక పేరు గోదాదేవి

నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని .

వీరు ద్వాపర యుగాంతంనుండి కలియుగారంభం మధ్య ఉద్భవించారని సంప్రదాయ గాథలు. 

కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం క్రీ.శ. 7వ శతాబ్దం - 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు. పొయ్‌గయాళ్వారు పాంచజన్యము అంశ అనీ, నమ్మాళ్వారు విష్వక్సేనుని అంశ అనీ - ఇలా ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్క విష్ణుసేవకుని అంశ అని చెబుతారు.

భక్తి ప్రపత్తి యోగముల పరమానందభరితులుగా ఉన్న ఆళ్వారుల దివ్యజీవిత చరితలు, వారి రచనలు దక్షిణాన వైష్ణవ భక్తిప్రాధాన్యతకు, విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూలమయ్యాయి.

1. పుదత్తాళ్వారు 

2. పొయ్’గైయాళ్వారు 

3. పేయళ్వారు

వీరు ముగ్గురుని మూలాళ్వారులు అంటారు. 

కాంచీపురంలో ఒక సరోవరంలో కమలం మధ్యన పొయ్’గైయాళ్వారు జన్మించారు. 

వీరిని ‘కాసారయోగి’ అంటారు. 

ఇప్పుడు మహాబలిపురం ఐన మామల్లపురంలో మాధవీపుష్పంలో పూదత్తాళ్వారు జన్మించారు. 

వీరిని ‘భూతయోగి’ అంటారు. 

ఇప్పుడు మైలాపురం అనబడే మయురపురంలో ఒక సరస్సులోని తెల్లకలువ నుండి పేయాళ్వారు జన్మించారు. వీరిని ‘మహాయోగి’ అని అంటారు. 

ఈ ముగ్గురులో పాయ్’గైయాళ్వారు ఆళ్వారు పరంపరలో మొదటివారుగా చెప్పుకుంటారు. ఈ ముగ్గురు మహానీయుల జన్మ ఒక్కొక్కరోజు వ్యత్యాసంతో జరగటం ఆశ్చర్యకరం. ముందు జన్మించింది పాయ్’గైయాళ్వారు. తర్వాత ఒక్కొక్క రోజు తేడాతో పూదత్తాళ్వారు , పేయాళ్వారు చెబుతారు.

ఈ ముగ్గురు మహాయోగుల కలయిక చాలా ఆసక్తికరంగా జరిగింది. ఒకసారి పాయ్’గైయాళ్వారు, తిరుక్కొమూర్ అనే గ్రామానికి వచ్చారు. చీకటి పడింది. ఆ రాత్రి విశాంత్రి తీసుకోవడానికి ఓ చోటికి చేరుకున్నారు. అనుకోకుండా ఆ చోటికే పూదత్తాళ్వారు వచ్చి , కొంచెం చోటిమ్మని అడిగారు. ఇద్దరు సర్దుకొని కూర్చున్నారు. కొంచెంసేపు తర్వాత పేయాళ్వారు వచ్చి , కొంచెం చోటిమ్మని అడిగారు. ఆ ముగ్గురు విష్ణుభక్తులూ సంతోషంగా , ఆ చిన్నచోటులోనే నిలుచుని సర్దుకున్నారు. గాఢాంధకారం , ఎటు చూసినా కటిక చీకటి. కొంచెంసేపటికి వారికి నాలుగోమనిషి వచ్చి తమ మధ్యన నిల్చున్నాడనే అనుభూతి కలిగింది. కానీ , ఎవరూ కనపడలేదు. వారు ఆశ్చర్యంతో పరంధాముని ప్రార్ధించగా , శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. ఆ మహాయోగులు , ఆనంద పరవశులై తమిళంలో ఆశువుగా మూడు పాశురాలతో ఆ దేవదేవుని స్తుతించి ధన్యులైనారు.

4. తిరుమళిశైయాళ్వారు.

వీరి జన్మ గురించి కొంత విచిత్రంగా చెబుతారు. కాంచీపురానికి దగ్గరలో మహిషాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో భార్గవుడు కనకాంగి దంపతులకు తిరుమళిశైయాళ్వారు జన్మించారు. పుట్టినప్పుడు ఆ బాలునిలో కదలిక లేదట. దుఃఖితులైన తల్లిదండ్రులు ఆ బాలుని అడవిలో ఒక పొదలో పడేశారు. తిరువాలన్ అనే వ్యక్తి అడవి వేటకొచ్చాడు. పొదలో పసిపిల్లాడి ఏడుపు విన్న తిరువాలన్ , ఆ బాలుడ్ని తీసుకెళ్ళి తన భార్య పంకజవల్లి చేతుల్లో పెట్టాడు. ఆ దంపతులు ఆ పిల్లవానికి శివక్కియార్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే ఆ పసివాడి ప్రవర్తన ఆశ్చర్యకరంగా ఉండేది. పాలు తాగేవాడు కాదు. ఆనోటా ఈనోటా ఈవిషయం పల్లెలోని వృద్ధదంపతుల చెవిన పడింది. వారు పాలు తెచ్చి పట్టగానే శివక్కియార్ పాలు తాగేశాడు. ఆ దంపతులు ఆనందంగా , రోజూ పాలు తెచ్చి శివక్కియార్ కి పట్టి , కొంచెం పాలు ప్రసాదంగా తీసుకునేవారు. అధ్బుతమైన సంఘటన. వృద్ధ దంపతులకు కొంత కాలానికి కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి కణ్ణకృష్ణుడు అని పేరు పెట్టుకున్నారు.

శివక్కియార్ పెద్దవాడైనాడు. ఎన్నో విద్యలు నేర్చాడు. దేశాటన చేస్తూ తిరువళ్ళిక్కేణికి చేరుకున్నాడు. అక్కడే తపోదీక్ష స్వీకరించి ఎన్నో సిద్ధులు సాధించాడు. తిరువళ్ళిక్కేణికి మైలాపురం దగ్గరే. మైలాపురంలోనే పేయాళ్వారు నివాసం. వారు ఆనోట ఈనోట శివక్కియార్ గురించి విన్నారు. అతనిని ఎలాగైనా వైష్ణవునిగా చేయాలని సంకల్పించుకున్నారు. ఒకసారి శివక్కియార్ అటువైపుగా వెళుతుండగా , పేయాళ్వారు చూశారు. అదే మంచి సమయమని శివక్కియార్ చూస్తుండగా , తోటలో చెట్లను తల్లక్రిందులుగా పాతారు. అది చూసి పరిహసించిన శివక్కియార్ తో వాదించి వైష్ణవునిగా మార్చారు పేయాళ్వారు. అప్పటినుంచి శివక్కియార్ ని భక్తిసారుడు అని పిలిచేవారు. భక్తిసారుడు కాంచీపురం వచ్చాడు. అప్పుడే కణ్ణకృష్ణుడు కూడా అక్కడికి వచ్చాడు. కాంచీపురం దేవాలయం వద్ద ఒక వృద్ధురాలైన దేవాంగన ఉండేది. ఆమె రోజూ దేవాలయాన్ని , భక్తిసారుని ఆశ్రమ పరిసరాలని శుభ్రం చేస్తుండేది. ఆమె శ్రద్దకి తృప్తి చెందిన భక్తిసారుడు , ఆ దేవాంగనకి యవ్వనాన్ని ప్రసాదించాడు. ఆ దేవాంగన అందాన్ని చూసి మోహించిన కాంచీపురం రాజు ఆమెని పెళ్ళాడాడు. తనకు కూడా యౌవ్వనాన్ని ప్రసాదించమని భక్తిసారుని బ్రతిమాలాడాడు. కానీ భక్తిసారుడు నిరాకరించాడు. రాజు కోపంతో భక్తిసారుని కాంచీపురం వదలి వెళ్ళి పోవలసిందిగా ఆజ్ఞాపించాడు. భక్తిసారుడు రాజాజ్ఞను శిరసావహించి , కణ్ణకృష్ణునితో పాటు కాంచీపురం నుండి వెళ్ళిపోయాడు. ఆలయంలో శేషశాయి కూడా అదృశ్యమయ్యాడు. తన తప్పు తెలుసుకున్న రాజు భక్తిసారునికి క్షమాపణలు చెప్పి , కాంచీపురానికి రావలసిందని సగౌరవంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత తిరుమళిశై ఆళ్వారు అని పిలవబడే భక్తిసారుడు కుంభకోణం చేరి , ఎన్నో మహిమలు చూపించాడు. విష్ణుదేవుని కీర్తిస్తూ , ఎన్నో రచనలు చేసాడు. ‘తిరుచ్చందవిరుత్తం’, ‘నాన్ముఖం తిరు అందాది’ – ఈ రెండు గ్రంథాలు ప్రసిద్ధాలు. 

వీరు కుంభకోణంలోనే ఎన్నో ఏళ్లు తపస్సు చేసి , ఎన్నో మహిమలు చూపి , భక్తితత్త్వాన్ని ప్రచారం చేసి విష్ణుసాయుజ్యం పొందారు.

5.నమ్మాళ్వారు , 

6.మధుర కవి.

వైష్ణవ సంప్రదాయ గురువులలో నమ్మాళ్వారు స్థానం విశిష్టమైంది. వీరి తండ్రి తిరుక్కూరుగూరు పాలకుడైన శూద్ర ప్రభువుకారుడు. తల్లి ఉజయనంగ. సంతానం లేని వీరు తిరుక్కురుల గుడికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించగా, భక్తికి మెచ్చి, తానే స్వయంగా కుమారుడిగా జన్మిస్తానని వరం ఇచ్చాడు విష్ణుమూర్తి. కొన్నాళ్ళకు వారి కలలపంటగా కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి మారుడు అని పేరు పెట్టుకున్నారు. అయితే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎంతకాలమో లేదు. ఆ పిల్లవాడు కళ్ళు తెరవడు. పాలు తాగాడు. ఇదంతా చూసిన మంత్రులు పిల్లవాడిని స్వామి ఆలయానికి తీసుకెళ్ళమని సలహా ఇచ్చారు. రాజుకీ అదే మంచిది అనిపించి , మారుడిని తీసుకొని ఆలయానికి వెళ్లాడు. పిల్లవాడిని విష్ణుసన్నిధిలో పడుకోబెట్టారు. మారుడు కళ్ళు తెరచి , స్వామిని చూసి పాక్కుంటూ దగ్గరలో ఉన్న చింతచెట్టు దగ్గరకెళ్ళాడు. తొర్రలో దూరాడు. పద్మాసనంతో తపోనిష్ణుడైనాడు. ఆ పిల్లవాడు సామాన్యుడు కాదని , కారణజన్ముడని , దైవాంశసంభూతుడని అందరికీ అర్థమైపోయింది. కారుడు కూడా చింతపడకుండా , మనస్సు గట్టి చేసుకొని , మారుడికి తపోభంగం కలగకుండా కట్టుదిట్టం చేశాడు. నిద్రాహారాలు లేకుండా తీవ్రమైన తపోదీక్షలో ఉన్న మారుని చుట్టూ గొప్ప తేజస్సు ప్రకాశించింది. అతనే నమ్మాళ్వారు.

పాండ్యదేశంలో గోళూరు అనే గ్రామం. ఆ గ్రామంలో నారాయణుడు అనే బ్రాహ్మణునికి ఒకే పుత్రుడు. ఆ పిల్లవాడు అతి చిన్న వయసులోనే వేదవేదాంగాలు , చదివాడు. సంసార తాపత్రయాలకు విముఖుడై , దేశాటన చేస్తూ బదిరికాశ్రమం చేరాడు. అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసి అయోధ్యా నగరానికి వచ్చాడు. ఒకరాత్రి అతనికి దక్షిణ దిశనుంచి మహాతేజస్సు కనబడింది. దానికి కారణం అన్వేషిస్తూ తిరుక్కడూరు చేరాడు. ఆయనే మధురకవి. విష్ణ్వాలయంలో చింతచెట్టు తొర్రలో తపోదీక్షలో ఉన్న తేజోమూర్తిని చూసి పరవశించి పోయాడు. వారితో మాట్లాడాలనే ఉత్సాహముతో పెద్దగా శబ్దం చేశాడు. తపోభంగమై కళ్ళు తెరిచిన నమ్మాళ్వారు , మధురకవి అడిగిన సందేహాలకన్నింటికి చక్కని వివరణలు ఇచ్చారు. మధురకవి అయన చెంత మోకరిల్లి తన గురువుగా స్వీకరించాడు. 

సంవత్సరాలు గడిచిపోయాయి. భక్తి పరిపక్వత చెందిన నమ్మాళ్వారు తనలో ఉప్పొంగే భావాలను, గ్రంథస్థం చేశాడు. ‘తిరువిరుత్తం’, ‘తిరువాశరియం’, ‘తిరువందాది’, ‘తిరువయిమొళి’ వీరి ముఖ్య గ్రంథాలు. శఠులను అంటే వంచకులను అణచుటచే, సంసారదోషాలను నిర్జించుటచే ఈయనకు ‘శఠకోపుడు’ అని, ఆదినాధ స్వామి ప్రసాదించిన పొగడపూల మాల ధరించటంచే ‘వకుళాభరణుడు’ అని, పరమతాలను విరసించటంవల్ల ‘వరాంకుశుడని’ పిలవబడేవాడు. ఎందరికో సన్నిహితుడై , ముక్తి పొందే తరుణోపాయం ఉపదేశించటం వల్ల ‘నమ్మాళ్వారు’ అన్నారు.

‘నమ్’ అంటే మన. నమ్ + ఆళ్వార్ = మన ఆళ్వార్. 

వైష్ణవ ప్రచారంలో అతి ముఖమైన మహానీయులలో ఒకరైన నమ్మాళ్వార్ 35వ ఏట పరమపదం చేరారు. నమ్మాళ్వారుకి ముఖ్యశిష్యులై , ఆయన అడుగుజాడలలో నడిచి , వైష్ణవ సాంప్రదాయానికి అశేషమైన ప్రాచుర్యానికి తోడ్పడిన మధురకవి , జీవితమంతా విష్ణు చరణ సేవలో గడిపి భగవదైక్యం చెందారు. వారు రచించిన భగవన్నుతి ‘కణ్ణిమణ్ శిరుత్తాయి’.

7. కులశేఖరాళ్వారు

భక్తకోటికి , భక్తిసంభరితమైన ‘ముకుందమాల’ ను అందించిన కులశేఖరాళ్వారుని ఎరుగనివారు, తలచని వారు ఉండరు. కులశేఖరాళ్వారుల తండ్రి ‘కొల్ల’ (నేటి క్విలన్) పరిపాలకుడు ధృఢవ్రతుడు. అల్లారుముద్దుగా పెరిగిన బిడ్డ సకల శాస్త్రపారంగతుడైనాడు. తండ్రి దృష్టి వానప్రస్థాశ్రమం స్వీకరించిన తరువాత రాజ్యభారాన్ని తాను తీసుకున్నాడు. రాజ్యపాలనలో క్షణం తీరికలేక తలమునకలై ఉన్నా , కులశేఖరుల దృష్టి ఆధ్యాత్మికత్వం పైనే ఉండేది. ప్రాపంచిక సుఖాలకు విముఖుడై, శ్రీరామచంద్రుని శరణంటూ ‘పెరుమాల్ తిరుమొళి’ అనే దివ్య ప్రబంధాన్ని రచించారు. ఈయన భక్తికి మెచ్చిన స్సేనముదలి అనే వైష్ణవాచార్యులు పంచసంస్కార దీక్షను ఇచ్చి అనుగ్రహించారు. అది మొదలు కులశేఖరాళ్వారులో భక్తి రెట్టింపైంది. శ్రీరంగనాథుని దర్శించాలని తపనపడ్డాడు. కానీ , మంత్రులు ఈయనవెళితే మళ్ళీ తిరిగిరాడని శంకించి, వైష్ణవాచార్యునే దూరం చెయ్యాలని ఆలోచించారు. పూజాగృహంలోని రత్నహారాన్ని దాచి, ఆ నేరం ఆచార్యుని మీద మోపారు. నేరాన్ని నిర్ధారించుకోవటానికి ఒక కుండలో విషసర్పాన్ని ఉంచి , తన ఉంగరాన్ని అందులో వేసి, తన గురువుపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచి , కులశేఖరులు ఉంగరాన్ని పైకి తీసారు. మంత్రులు తమ తప్పిదానికి సిగ్గుపడి క్షమాపణలు అడిగారు. జీవితకాలమంతా పరమాత్మ సేవలో తరించినారాయన.ఎక్కువ కీర్తనలలో శ్రీరాముని స్తుతించాడు. తిరుమలలో బంగారు వాకిలి వద్దనున్న మెట్టును ఇతని పేరుమీద కులశేఖర పడి అని అంటారు.

8.పెరియాళ్వారు , 

9.ఆండాళ్ళు.

పెరియాళ్వారు అసలు పేరు విష్ణుచిత్తుడు. ఈయన తల్లిదండ్రులు ముకుందా చార్యులు , పద్మావతీదేవి. ముకుందాచార్యులు శ్రీవిల్లిపుత్తూరు విష్ణ్వాలయంలో పరిచారకుడు. చిన్నప్పటినుంచి విష్ణుచిత్తుడు తిరుమంత్రమైన అష్టాక్షరీమంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. ఒకసారి విష్ణుచిత్తుడు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ, మాలాకారుని తరింప చేసిన ఘట్టం విన్నాడు. తాను కూడా అట్లాగే తరించాలని , స్వయంగా చక్కటి పూలతోట పెంచి, ఆ తోటలో పూలతో విష్ణుమూర్తిని పూజించి ఆనందించేవాడు. ఆ కాలంలో మధురను వల్లభరాయుడు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు రాత్రి పూట మారువేషంలో తిరుగుతూ ప్రజల కష్ణసుఖాలను కనిపెడుతుండేవాడు. ఒకరోజు రాత్రి తిరుగుతూ తిరుగుతూ , ఒక అరుగు మీద పడుకున్న బ్రాహ్మణుని చూశాడు. ఆ బ్రహ్మానుడు మహాజ్ఞాని అని గ్రహించి , నమస్కరించి , తనకేదైనా ఉపదేశించమని అర్థించాడు. ఆ బ్రాహ్మణుడు వార్థక్యం రాకముందే పరమాత్మ యందు అనురక్తి పెంచుకొమ్మని సోదాహారణగా బోధించాడు. రాజు నిజమందిరం చేరి ఆ రాత్రంతా ఆలోచించాడు. మర్నాడు పొద్దున్నే పండితసభ ఏర్పాటు చేశాడు. సభ మధ్యలో స్తంభం పాతించి, దాని మీద బంగారు నాణేలు నింపిన సంచి కట్టించాడు. పండిత సభలో గెలిచిన వారికి ఆ నాణేల సంచి బహుకరించబడుతుందని, ఆ విజేతయే తన గురువని ప్రకటించాడు. ఎందరో పండిత ప్రకాండులు వచ్చారు. 

విష్ణుచిత్తుడు (పెరియాళ్వారు) కూడా వచ్చారు. పరమేశ్వర ప్రేరణతో పండితులతో వాదించి విజయం పొందారు. పరమానంద భారితుడైన రాజు, పెరియాళ్వారును గురుపీఠం పై ఉపవిష్టులను చేసి, గజారోహణం చేయించాడు.

ఒకరోజు పెరియాళ్వారు తోటపని చేస్తుండగా , వారికి , జనకమహారాజుకి సీతమ్మ లభించినట్లు , ఒక బాలిక దొరికింది. ఆ బాలికను భాగవత్ప్రసాదంగా భావించి , గోదాదేవి అని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కారణజన్మురాలు గోదాదేవి , నిత్యం విష్ణునామం స్మరిస్తూనే ఉండేది. బాలిక పెరిగి పెద్దదైంది. మహావిష్ణువునే మనసులో భర్తగా భావించి తన్మయత్వం చెందేది. తండ్రితోపాటు మాలలల్లేది. తండ్రి లేనపుడు ఆ మాలను తాను తలలో మురిపెంగా ధరించి , ఆపై శ్రీరంగనాథునికి అలంకరించేది. అనుకోకుండా ఒకరోజు పెరియాళ్వారు అది గమనించారు. గోదాదేవిని మందలించి , ఆ రోజు మాలను శ్రీరంగనాథునికి అలంకరించలేదు. ఆ రాత్రి శ్రీరంగనాథుడు పెరియాళ్వారుకి కలలో కనిపించి , తనకు గోదాదేవి ధరించిన మాలలే ఇష్టమని , వాటినే తనకు అలంకరించమని ఆదేశించాడు. గోదాదేవి వయసుతో పాటు భక్తి కూడా పెరిగింది. శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ ‘తిరుప్పావై’ అనే 30 పాశురాలు ,   ‘నాచ్చియార్ తిరుమొళి’ అనే 140 పాశురాలు వ్రాసింది. ఆ పాశురాలను పాడుకుంటూ తనను తాను మరిచిపోయేది.గోదాదేవికి వివాహ ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆమె శ్రీమహావిష్ణువును తప్ప ఎవరినీ వివాహమాడనని ఖచ్చితంగా చెప్పింది. 

108 శ్రీమహావిష్ణుక్షేత్రాలలో , శ్రీరంగంలో శ్రీరంగానాథుడే తనకు ఇష్టుడని , ఆయనకిచ్చి వివాహం చేయమని కోరింది. మహదానందంగా విష్ణుచిత్తుడు గోదాదేవికి , శ్రీరంగనాథుడికి వివాహం జరిపించాడు. వివాహానంతరం ఆలయం లోనికి వెళ్ళిన గోదాదేవి క్షణమాత్రంలో ఆర్చామూర్తిలో ఐక్యం అయింది. గోదాదేవికే భక్తులను రక్షించేది అనే అర్థంతో ‘ఆండాళ్ళు’ అని , స్వామికి తాను ధరించిన మాలలే అలంకరింపజేయటం చేత ‘శూదికొడుత్తాళి’ అని పేర్లతో ప్రసిద్ధికెక్కింది.

10. నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని

క్రీ.శ. 798 కలంవాడు కావచ్చును. పుట్టుక రీత్యా శూద్రుడు. ఆళ్వారులలో నమ్మాళ్వారుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. మిగిలిన ఆళ్వారులందరూ శరీరం , నమ్మాళ్వారులు శరీరి. జ్ఞాని. శ్రీవైష్ణవం దీక్షను తీసికొనేవారు తమ ప్రస్తుత గురువునుండి నమ్మాళ్వారు వరకూ అంజలి ఘటిస్తారు. దేవాలయాలలో 'శఠగోపం' పెట్టడం అనేది ఈ 'శఠకోపముని' పేరుమీద మొదలయిన ఆచారమే. తన జీవితకాలం అంతా ఒక చింతచెట్టు క్రిందనే గడిపాడు. నమ్మాళ్వారు రచించిన నాలుగు దివ్య ప్రబంధాలూ నాలుగు ద్రవిడ వేదాలుగా ప్రశస్తమయ్యాయి.ఇతడు యోగాభ్యాసపరుడు. నాధముని, మధురకవి అనువారలీతని శిష్యులు. ఈతడు విష్ణుసారమ్యమును, సర్వ వ్యాపిత్వమును మోక్షదాయకత్వమును గూర్చి తన రచనలలో హెచ్చుగా ప్రతిపాదించాడు. ఈతని కాలమునకు దక్షిణదేశమున జైన బౌద్ధ మతములు క్షీనదశనొంది శైవవైష్ణవములకు గల స్పర్ధకూడ కొంత తగ్గిపోయినట్లు కనబడును.

11. మధురకవి యాళ్వార్.

ఇతను బ్రాహ్మణుడు. తక్కిన ఆళ్వారులు శ్రీమన్నారాయణుని కీర్తించగా మధురకవి మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే కీర్తించాడు. ఇతని గురుస్తోత్రం శ్రీవైష్ణవులకు చాలా ముఖ్యమైన ప్రార్థన.

🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏

January 25, 2025

95 దివ్యదేశాల యాత్ర Day - 2

 95 దివ్యదేశాల యాత్ర Day - 2

Day - 2  (13/12/24)

ముందుగా (91వ దివ్యదేశం) తిరునీర్మలై ని దర్శించుకున్నాము. 

నీరవణ్ణన్ పెరుమాళ్ - అణిమామలార్ మంగైనాయకి  

ఈ క్షేత్రాన్ని తోయాద్రి లేదా తోతాద్రి అని కూడా అంటారు. మహావిష్ణువు స్వయంభూగా వెలసిన 8 క్షేత్రాలలో ఇది ఒకటి. 

శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలసిన క్షేత్రాలని స్వయం వ్యక్త క్షేత్రాలు అని అంటారు. అవి ఎనిమిది ఉన్నాయి. వాటిలో తిరునీర్మలై ఒకటి. మిగిలినవి శ్రీరంగం, తిరుమల, శ్రీముష్ణం, బదరీ, నైమిశారణ్యం, పుష్కరం & ముక్తినాథ్. 

ఇక్కడ కొండపైన & దిగువున 2 ఆలయాలు ఉన్నాయి. 

కొండ ఎక్కాలి అంటే 200 మెట్లు ఎక్కాలి. కొండదిగి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా అన్ని మెట్లని లెక్కపెట్టుకుంటూ వచ్చాను. అందుకే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.  ఓపిక ఉన్నవాళ్ళు కొండా ఎక్కవచ్చు, లేనివాళ్ళు దిగువున ఉన్న ఆలయంలో స్వామిని దర్శించుకోవచ్చును. 










ఇవన్నీ కొండపైన ఆలయం ఫోటోలు 



ఇవి కొండా దిగువన ఉన్న ఆలయం ఫోటోలు 

2) తరువాత తిరునిన్రవూర్ (89వ దివ్యదేశం)

భక్తవత్సల పెరుమాళ్ - ఎన్నపెత్త తాయార్ 



3) తరవాత (90వ దివ్యదేశం)  తిరువళ్ళూరు

వీరరాఘవ పెరుమాళ్ - కనకవల్లీ తాయారు 

తిరువళ్ళూరు చేరుకునేసరికి 12.30 దాటింది ఆలయం మూసివేశారు. అక్కడే ఒక ఫంక్షనుహాలులో భోజనాలు ముగించుకొని, కాసేపు విశ్రాంతి తీసుకొన్నాము. ఆలయం తెరిచే సమయానికి ముందు అక్కడ ఉన్న హృత్పాపనాశ పుష్కరిణికి ప్రదక్షిణ చేసి వచ్చేసరికి ఆలయం తెరిచారు. స్వామిని దర్శించుకున్నాము. ఆలయంలో ఉన్న వీరరాఘవ పెరుమాళ్ ని వైద్యనాథ పెరుమాళ్ అని కూడా అంటారు. 





తరవాత అభిమానదేశమైన శ్రీ పెరంబుదూరు వెళ్ళాము 

ఆదికేశవ పెరుమాళ్ - యతిరాజనాథవల్లతాయార్ 

శ్రీవైష్ణవులకు ఇష్టమైన క్షేత్రం - శ్రీమత్ భగవత్ రామానుజులు అవతార స్థలం ఇది. ఈ క్షేత్రాన్నే భూతపురి అని కూడా అంటారు. 

ఇక్కడ ఉన్న రామానుజుల మూర్తి విశేషం ఏమిటంటే,

ఒకరోజు రామానుజల భక్తులు ఒకరు వచ్చి భక్తితో సమీపించి, ఆచార్య మీరు ఈ భూమిపై శ్రీ వైష్ణవ ధర్మమును ప్రచారం చేయుటకు అవతరించారు. తర్వాత తరములవారికి మీ గురించి తెలియజేయుటకు, మిమ్మల్ని పూజించుటకు, మీ విగ్రహము ఈ భూతపురిలో ప్రతిష్టించుటకు అనుమతి ఇవ్వండి అని అన్నారు. భక్తుని కోరికను రామానుజులు అంగీకరించారు. వెంటనే వారి విగ్రహము లోహంతో తయారు చేయించారు భక్తులు. వారు ఆ విగ్రహమును తెచ్చి ఆచార్యులకి చూపించారు అంతట రామానుజులవారు ఆ విగ్రహమును పైనుంచి కింద వరకు పరిశీలనగా చూసి సంతోషము వ్యక్తపరిచి, ఆ విగ్రహమును ఆలింగనం చేసుకుని తమ దివ్య శక్తిని అందులో ప్రవేశపెట్టిరి. అంతట ఆ విగ్రహమును ఒక పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి పుష్య మాసంలో, పుష్యమి నక్షత్రంలో, గురువారం నాడు ఆ విగ్రహమును శ్రీపెరంబుదూరులో ప్రతిష్టించరి. అక్కడ శ్రీపెరంబుదూరులో అభిషేకం చేసినప్పుడు, ఇక్కడ శ్రీరంగంలో రామానుజులవారు ఉక్కిరిబిక్కిరి అయ్యిరి. అంటే శ్రీపెరంబుదూరులో ఉన్న మూర్తి సజీవ మూర్తి అని మనకు తెలుస్తున్నది. 

రామానుజులు వేంచేసియున్న కాలంలో ప్రతిష్టించబడిన దివ్య మంగళ మూర్తులు మూడు. మొదటిది శ్రీపెరంబుదూరులో తాను అభిమానించిన దివ్యమంగళ విగ్రహం. రెండవది తిరునారాయణపురం అంటే మేల్కోటలో భక్తులు అభిమానించి ప్రతిష్టించిన తిరుమేని విగ్రహం. మూడవది శ్రీరంగం ఇది తానాన తిరుమేని అంటారు అంటే తానే అయి తానే అయినా తిరుమేని. 

మేము శ్రీపెరంబుదూరు ఆలయానికి చేరే సమయానికి తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం ఆ రోజున. తిరుమంగై ఆళ్వార్ మరియు రామానుజుల వారు ఊరేగింపు అయ్యి పల్లకీలలో ఆలయానికి తిరిగి వచ్చే సమయానికి మేము ఆలయానికి వెళ్ళాము. ఇద్దరు ఆళ్వార్ లకి గజరాజు వింజామర వీస్తున్న దృశ్యం చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉందో. 











అక్కడితో మా రెండవరోజు యాత్ర ముగిసింది.  91, 90 & 89  అంటే 3 దివ్యదేశాలు 1 అభిమాన దేశం దర్శనాలు అయ్యాయి. 




January 24, 2025

95 దివ్యదేశాల యాత్ర Day - 1

 95 దివ్యదేశాల యాత్ర Day - 1

జై శ్రీమన్నారాయణ 🙏

95 దివ్యదేశాల యాత్రకి 2024 డిసెంబర్ 11 సాయంత్రం బయలుదేరాము. 28 సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకున్నాము. 

హైదరాబాద్ నుండి ముగ్గురం, వైజాగ్ నుండి ఇద్దరూ మొత్తం మా బ్యాచ్ ఐదుగురం వెళ్ళాము. యాత్రలో మొత్తం 30 మంది యాత్రికులము ఉన్నాము. 

ఏలూరు "లీలా ట్రావెల్స్" వాళ్ళతో వెళ్ళాము. ఆర్గనైజర్ "దానకర్ణ" గారు. మాకు గైడ్ లాగా వచ్చిన ఆవిడ "ధనలక్ష్మి" గారు. ఆవిడ ప్రతీ దివ్య దేశానికి (ఆలయానికి) వెళ్ళే ముందు ఆ ఆలయ చరిత్ర & వివరాలు  అన్నీ వివరంగా చెప్పారు. అలా చెప్పటం వలన అక్కడ ఉన్న పెరుమాళ్ళని చక్కగా సేవించుకోవటం అయ్యేది. 

11/12/24 సాయంత్రం 6.30 కి సికింద్రాబాద్ లో ట్రెయిన్ ఎక్కి, 12 ఉదయం 6.50 కి చెన్నై ఎగ్మోర్ లో దిగాము. అక్కడే వెయిటింగ్ రూమ్స్ లో స్నానాలు చేసి, పక్కనే ఉన్న హోటల్ లో ట్రావెల్స్ వాళ్ళు ఫలహారాలు పెట్టించారు, తినేసి 10.15 కి బస్ ఎక్కి మా యాత్రని మొదలుపెట్టాము. 

యాత్రలో మొత్తం 30 మంది యాత్రికులము ఉన్నాము. అందరికీ సౌకర్యంగా ఉంటుందని 2 బస్సులలో అందరినీ తీసుకొనివెళ్ళారు. ముందుగా

Day -1 (12/12/24)

1). తిరువల్లిక్కేణి  (94 వ దివ్యదేశం) 








మూలవరులు .... పార్థసారథి పెరుమాళ్ - రుక్మిణీ తాయార్ 
దీనినే పార్థసారథి ఆలయం అని అంటారు. చెన్నైలోని ట్రిప్లికేన్లో ఈ దివ్యదేశము ఉన్నది. 
ఆలయ చరిత్రని కొంచెం తెలుసుకుందాము.  

పురాణగాథ/పార్థసారధి: పూర్వము సుమతి అను రాజు వెంకటేశ్వరస్వామిని దర్శించి "మహాభారత యుద్ధ సమయమున అర్జునునకు సారథిపై గీతోపదేశము చేయుచున్న రూపములో దర్శనము కావలెను" అని కోరెను. కలలో సుమతికి దర్శనమొసగి బృందారణ్యమును సందర్శించినచో నీ కోరిక నెరవేరును అని స్వామి చెప్పెను. కలియుగములో వ్యాస మహర్షి తన శిష్యుడైన ఆత్రేయ ఋషిని బృందారణ్యమునకు వెళ్ళి తపస్సు చేయమని చెప్పెను. వ్యాస మహర్షి తన శిష్యునకు శ్రీమన్నారాయణుని సుందర విగ్రహమును ఆరాధన కొరకు ఇచ్చెను. అత్రి బృందారణ్యము చేరి కైరవేణి తీరమున తపస్సు ప్రారంభించెను. అదే సమయమునకు అచ్చట చేరుకొన్న సుమతి గీతోపదేశము చేయు పార్థసారధి స్వామివారి దివ్యమంగళ విగ్రహముగా గుర్తించి స్తుతించెను.

ఆనాటి మూర్తే నేడు ఉత్సవ మూర్తిగా మనకు దర్శన మిస్తారు. అంతేకాదు ఆనాటి భారతయుద్ధంలో తగిలిన బాణపు గుర్తులు నేటికి కనుపిస్తాయి. ఉత్సవ మూర్తిలో ఒక విశేషం ఉన్నది. ఎప్పుడు నీల వర్ణంలో ప్రకాశించే ఈ ఉత్సవమూర్తి ముఖ పద్మం అభిషేకానంతరం రెండు గంటల పాటు బంగారు రంగులో దర్శన మివ్వడం ఒక విశేషం. ఇక్కడ శ్రీకృష్ణుడు సకుటుంబంగా అన్న బలరాముడు, దేవేరి రుక్మిణి, తమ్ముడు సాత్యకి, కుమారుడు ప్రద్యుముడు, మనుమడు అనిరుద్దుడు వారితో కలసి ఇక్కడ సాక్షాత్కరించాడు. అత్రి మహా మునికి ప్రత్యక్షమైన నరసింహస్వామిని కూడ మనం ఇక్కడ దర్శించవచ్చు. మూలవర్లు యోగ నరసింహం ఉత్సవమూర్తి శాంత నరసింహుడు వీరినే తెళ్ళియళగియ సింగర్ అని పేరు.      

రంగనాథులు : శ్రీరంగంలో పడమర దిశగా పవళించిన స్వామి ఇచ్చట దక్షిణ దిశగా శిరస్సు వంచి పవళించుట గమనించవలసిన విశేషము. మాసి మాసము శుక్లపక్షములో స్వామి వారి కళ్యాణము వైభవంగా జరుగును. ఒకసారి శ్రీ మహలక్ష్మి శ్రీహరిపై అలుక పూని ఈబృందావన క్షేత్రములో ఒక చందన వృక్షము ఛాయలో పసి పాపగా అవతరించి పవళించింది. అచ్చట ఉన్న సప్త ఋషులు పాపను కనుగొని వేదవల్లి అని నామకరణము చేసి పెంచ సాగిరి. యుక్తవయస్కురాలైన దేవకన్యను పోలిన ఆమెను కనుగొని ఋషులు ఆనందించారు. శ్రీహరి యువరాజు వలె ఆమెకు దర్శన మిచ్చెను. ఆమె ఆయనను మన్నాధన్ అని పిలిచినది. మన్నాధన్ అనగా "శాశ్వతుడైన పతి దేవా” అని అర్థము. భృగు మహర్షి ఆ యువరాజును శ్రీమన్నారాయణునిగా గుర్తించి వారిరువురికీ వివాహం జరిపెను. భృగు మహర్షి కోరికపై రంగనాథ, వేదవల్లులు ఇచ్చట వేంచేసి వెలసినారు. స్వామిని మన్నధర్ స్వామి అని కూడా పిలుస్తారు.


గజేంద్రవరదన్ పూర్వము సప్తరోమనుడు అను భక్తుడు శ్రీమన్నారాయణుని దర్శనము కోరి బృందారణ్యములో తపమాచరించెను. స్వామి దర్శనమీయగా గజేంద్రుని రక్షణ సమయంలో నున్న రూపములో దర్శనమివ్వమని కోరెను. వారి కోరికను మన్నించి గరుడవాహనా రూఢుడై వెలసి స్వామి తన భక్తుని కటాక్షించెను.

చక్రవర్తి తిరుమగన్ : పాండ్యనాడులో పండరము అను పర్వతము కలదు. అచట శశి వదనుడు అను ముని తపస్సు చేయుచుండెను. విశ్వామిత్రుని తపస్సు భంగపరచినటుల శశివదనుని తపము భంగపరచుటకై హైలై అను అప్సరసను ఇంద్రుడు పంపెను. శశివదనుడు హైలైను మోహించి ఆమె ద్వారా ఒక కుమారుని పొందెను, శశివదనుడు, హైలై కుమారుని ఒక గుహలో వదలి ఎవరి దారిన వారు వెళ్ళి పోయిరి. గుహలో యున్న తేనె తుట్టెల నుండి తేనె చుక్కలుగా శిశువు నోటిలో పడగా వాని ఆకలి తీరినది. తేనె త్రాగి పెరిగి పెద్ద వాడైన వానిని మధుమన్ అని పిలువసాగిరి. కాలక్రమంలో వానికి గార్గేయ మహర్షి దర్శనమొసగి బృందారణ్యములో తపము నాచరించిన శ్రీరామ సాక్షాత్కారము లభించునని ఆదేశించెను. మధుమన్ బృందారణ్యము చేరి తపము చేయనారంభించెను. వాని తపమునకు మెచ్చి శ్రీరామచంద్రుడు సతీ, సోదర సమేతంగా దర్శనమొసగెను. అటుల మధుమన్ తపఃఫలముగా శ్రీరామచంద్రులు నేటికీ మనందరకు యీ కోవెలలో దర్శనభాగ్యము కలిగించుచున్నారు.


2) తరువాత రెండవ (93 వ)దివ్యదేశాన్ని  స్థలశయన పెరుమాళ్ ని దర్శించాము 

ఉలగ ఉయ్యనిండ్రాణ్ పెరుమాళ్ -  నీలమంగై నాచ్చియర్ 

ఇది మహాబలిపురంలోని సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం పూదత్తాళ్వార్ అవతరించిన స్థలము.  



పూదత్తాళ్వార్ అవతరించిన స్థలము.  



3). తిరువిడవేందై (92 వ దివ్యదేశం)

 శ్రీలక్ష్మీ ఆదివరాహస్వామి (నిత్యకళ్యాణ పెరుమాళ్) - కోమలవల్లీ తయార్


చెన్నైకి 47 కిమీ దూరంలో, మహాబలిపురానికి వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి పెళ్ళికాని వారు వచ్చి స్వామిని దర్శిస్తే పెళ్ళి అవుతుంది అని అంటారు. అందుకే ఈ ప్రాంతానికి నిత్యకల్యాణపురి అని అంటారు.      

మొదటిరోజు 3 దివ్యదేశాలని (94, 93, 92)  దర్శించుకున్నాము.

November 16, 2024

సౌందర్య లహరి తెలుగు పద్యాలు 11 To 15

సౌందర్య లహరి తెలుగు పద్యాలు  11 To 15

సౌందర్య లహరి తెలుగు పద్యాలు 

రచన - శ్రీమాన్. చింతా రామకృష్ణారావు గారు 

సంగీతం & గానం - శ్రీమతి వల్లూరి సరస్వతీ గారు





సౌందర్య లహరి తెలుగు పద్యాలు 6 To 10

 సౌందర్య లహరి తెలుగు పద్యాలు  6 To 10

సౌందర్య లహరి తెలుగు పద్యాలు 

రచన - శ్రీమాన్. చింతా రామకృష్ణారావు గారు 

సంగీతం & గానం - శ్రీమతి వల్లూరి సరస్వతీ గారు




సౌందర్య లహరి తెలుగు పద్యాలు 1 To 5

సౌందర్య లహరి తెలుగు పద్యాలు  1 To 5

సౌందర్య లహరి తెలుగు పద్యాలు 

రచన - శ్రీమాన్. చింతా రామకృష్ణారావు గారు 

సంగీతం & గానం - శ్రీమతి వల్లూరి సరస్వతీ గారు



October 4, 2024

సౌందర్య లహరి తెలుగు పద్యాలు

సౌందర్య లహరి తెలుగు పద్యాలు 

రచన - శ్రీమాన్. చింతా రామకృష్ణారావు గారు 

సంగీతం & గానం - శ్రీమతి వల్లూరి సరస్వతీ గారు

1  

శా.  అమ్మా! నీ వతఁడై రహించుటనె చేయంగల్గు నీ సృష్టి తా

నెమ్మిన్, గల్గని నాడహో, కదలగానే లేడుగా సాంబుఁ డో

యమ్మా!  శంభుఁడు, బ్రహ్మయున్, హరియు నిన్నర్చించ దీపింత్రు,  ని

న్నిమ్మేనన్ దగ నెట్లు కొల్చెదరిలన్ హీనంపుపుణ్యుల్, సతీ!. ॥

భావము.

భగవతీ! ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు శివుడు తనంతగా తాను స్పందించడు స్పందించలేడు జగత్ రచన జరుగుటకు శక్తి తోడ్పాటు తప్పనిసరి . కేశవ చతుర్ముఖాదుల జరగాలన్నా శక్తి తోడ్పాటు తప్పనిసరి. ఆ కదిలే శక్తే అమ్మవారు. శివ కేశవ బ్రహ్మ అందరికీ ప్రోత్సాహకంలాగా తోడ్పడే అమ్మ, నా వంటి శక్తిహీనుడు నీ అనుగ్రహం పొందుట ఎలా తల్లి?

శా.  నీ పాదాంబుజ రేణువున్ గొని, జగన్నిర్మాణ మా పద్మజుం

డోపున్ జేయఁగ, విష్ణు వా రజమునే యొప్పార కష్టంబుతో 

దీపింపన్ దగ వేయి శీర్షములతో ధీరాత్ముఁడై మోయునే,

యాపాదాబ్జము దాల్చు రేణువు శివుండత్యంత ప్రీతిన్ మెయిన్.॥ 

భావము.

ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు జ్ఞానశక్తి మూడు శక్తులుగా ఈ జగతిని నడిపించేది ఆ అమ్మే బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరులే తమ తమ పరిధిలోని కార్యములను ఈ దివ్యమైన తల్లి ద్వారానే చేస్తూ శక్తివంతులుగా గుర్తించబడుతున్నారు

సీ.  అజ్ఞాన తిమిరాననలమటించెడువారి కమిత! సూర్యోదయమయిన పురివి,

మందబుద్ధులకును మహిత చైతన్యమన్ మంచి పూవులనొల్కు మధువువీవు,

దారిద్ర్యముననున్న వారిని కరుణించు చింతామణులహార కాంతివీవు,

సంసార సాగర సంలగ్నులకు నిలన్ ధరణిఁ గాచిన కిరిదంష్ట్రవీవు.


తే.గీ.  శంకరుని యాత్మలో వెల్గు శశివి నీవు,

రామకృష్ణుని కవితాభిరామమీవు,

పాఠకుల చిత్తముల నిల్చు ప్రతిభవీవు,

నిన్ను సేవించువారిలోనున్నదీవు.॥ 

భావము.

అవిద్య అనే లోపల చీకటిని పోగొట్టగల అమ్మవారి కరుణా పాద రేణువు మందబుద్ధులలో జడత్వమును పోగొట్టగల చైతన్యము తీసుకురాగల తేనె ప్రవాహం లాంటిది అమ్మవారి కరుణ దరిద్రము పోగొట్టగల మరియు ఐశ్వర్యము ఇవ్వగల చింతామణి మాల లాంటిది అమ్మవారి కరుణ హిరణ్యాక్షుడు సముద్రంలో పడవేసిన భూమి మునిగిపోతున్నప్పుడు ప్రజలను రక్షించుటకు వరాహ రూపమును ఆ భూమిని పైకి తీసుకువచ్చి శ్రీమహావిష్ణువు దంత ద్వయము లాంటిది.

4

సీ.  నీకంటెనన్యులౌ నిఖిలదేవతలెన్న నభయముద్రను గల్గి యలరుదురిల,

శ్రీద! వరాభయచిహ్నముల్ ప్రకటితముద్రల నభినయము గల తల్లి

వీవేను, ముఖ్యమౌ యీశ్వరీ! సృష్టిలో కారణమొకటుండె కనగ నిజము,

కోరక ముందేను కోరికలను తీర్చి నీ పాదముల్ భీతినే దహించు,


తే.గీ.  అట్టి నీ పాదములు నేను పట్టనుంటి,

శరణు కోరుచు, మా యమ్మ! శరణమిమ్మ.

రామకృష్ణుని కవితలో ప్రాణమగుచు

వెలుఁగు మాయమ్మ! నిన్ను నే విడువనమ్మ! ॥ 

భావము.

ప్రపంచంలోని అందరి దేవుళ్ళు దేవతలు తిరస్కరించిన అమ్మ నువ్వు ఒక్కదానివే అడక్కుండానే వరాలు ఇస్తావు కానీ ఎంత గొప్ప వరములు ఇచ్చిన ప్రపంచమునకు అనగా బయటకి నీవు ఇట్లా వరములు ఇస్తున్నట్లుగా తెలియపరచవు నా సేద తీర్చుటకు నీ పాద రేణువులు చాలు తల్లి.

5

ఉ.  నీ యభయమ్మునొంది హరి నేర్పుగ స్త్రీ యవతారమెత్తి, తా

మాయను ముంచె నా శివుని, మన్మధుడున్ నిను పూజ చేయుటన్

శ్రేయము పొందె, భార్య రతి ప్రేమను చూరకొనంగఁ గల్గె, సు

జ్ఞేయము నీ మహత్త్వమిదె, చేసెద నీకు నమశ్శతంబులన్. ॥ 

భావము.

నిన్ను పూజించిన వారికి అందరికీ కోరిన వరములను ఇస్తావు నిన్ను కోరి స్త్రీ రూపము పొందిన శ్రీ విష్ణువు కూడా నిన్ను పూజిస్తాడు. మన్మధుడు తన భార్య మెప్పు పొందే శరీరమును పొందాడు. జితేంద్రుయులైన ఋషి మునులను సైతము పరవశము చేయు శరీర సౌందర్యమును పొందాడు. 

6

సీ. హేమాద్రి పుత్రి! నిన్నేమని పొగడుదు, నీచూపు పడెనేని నిత్య శుభము

లందగవచ్చును, మందస్మితా! నీదు కడగంటి చూపునన్ కంతుడిలను

పూలవిల్లే కల్గి, పూర్తిగా తుమ్మెదల్ నారిగా కల్గియనారతంబు

నైదు బాణములనే, యాయుధంబుగ కల్గి, జడుఁడుగా నుండియు వడివడిగను


తే.గీ. మలయ మారుత రథముపై మసలుచుండి

సృష్టినే గెల్చుచుండె, నీ దృష్టికొఱకు

భక్తులల్లాడుచుంద్రు నీ ప్రాపుఁ గోరి,

చూచి రక్షించు, నేనునున్ వేచియుంటి. ॥

భావము.

ఓ హిమవత్పర్వత రాజపుత్రీ! పుష్పమయమైన ధనుస్సు తుమ్మెద వరుసతో కూర్చిన వింటి త్రాడు లెక్కకు ఐదు మాత్రమే బాణములు అల్పాయిష్కుడు జడుడు అయిన వసంతుడు నీ చెలికాడు మలయ మారుతమే నీ రథము ఏమాత్రం సమర్థము మరియు సమర్థనీయము కానివగు ఇట్టి సాధన సామాగ్రులతో కనీసం శరీరం కూడా లేనివాడయినను మన్మధుడు నిన్ను ఆరాధించి అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షములు పొంది ఈ జగత్తును జయించుచున్నాడు కదా.

7

సీ. మణుల గజ్జియలతో మహనీయ మేఖలన్ మిలమిల కనిపించు మెఱుపుతోడ, గున్నయేనుగు యొక్క కుంభంబులన్ బోలు పాలిండ్ల బరువుచే వంగి యున్న సన్నని నడుముతో, శరదిందుముఖముతో, చెరకు విల్లును, పూలచెండుటమ్ము నంకుశమ్మును గల్గి, యరచేతఁ బాశమ్ము కల్గి చూపులనహంకారమొప్పి

తే.గీ. లోకములనేలు మాతల్లి శ్రీకరముగ మాకునెదురుగ నిలుచుత మమ్ము గావ, జన్మసాఫల్యమొసఁగంగ, సన్నుతముగ ముక్తి సామ్రాజ్యమీయంగ పొలుపుమీర. ॥ భావము. చిరు సవ్వడి చేయు గజ్జల మొలనూలు కలదియు గున్న ఏనుగు కుంభములను పోలు స్థనములు కలిగి కొద్దిగా ఉండునట్లు కనబడినదియు సన్నని నడుము కలదియు శరదృతువు నందలి పరిపూర్ణమైన పున్నమి చంద్రుని పోలెడు ముఖము కలదియు క్రమంగా నాలుగు చేతులలోనూ ధనుస్సు బాణము పాశము అంకుశము ధరించి ఉన్నదియు త్రిపుర హరుడు అయిన శివుని యొక్క ప్రకృతి స్వరూపము అగు జగన్మాత మాకు సాక్షాత్కరించుగాక. 8

సీ. అమృత సింధువు మధ్య నమరిన రతనాల దీవియందున్నట్టి దివ్యమైన కల్పవృక్షంబుల ఘన కదంబముల పూ తోట లోపలనున్న మేటియైన చింతామణులనొప్పు శ్రీకరంబైనట్టి గృహములో శివునియాకృతిగనున్న మంచంబున శివుని మంగళోరువు గొప్ప స్థానంబుగాఁ గల జ్ఞానపూర్ణ

తే.గీ. వర దయానంద ఝరివైన భవ్యరూప! ధన్య జీవులు కొందరే ధరను నీకు సేవ చేయగాఁ దగుదురు, చిత్తమలర నిన్ను సేవింపనీ, సతీ! నిరుపమాన! ॥ భావము. జగజ్జనని సుధా సముద్రము నందలి మధ్యప్రదేశము నందు కల్పవృక్షముల వరుసచే చుట్టబడిన మణిమయ ద్వీపము నందు కడిమి చెట్ల ఉద్యానవనములో కట్టబడిన చింతామణులచే కట్టబడిన గృహమునందు, శివకార మంచము నందు సదాశివుని తొడను నిలయముగా కలిగి జ్ఞానానంద తరంగ రూపమున ఉన్న నిన్ను కృతార్థులైన ఎవరో కొందరు మాత్రమే సేవించి తరించుచున్నారు. 9

సీ. పూజ్య పృథ్వీ తత్వముగను మూలాధారమున నుండు తల్లివి ఘనతరముగ, జలతత్త్వముగ నీవు కలుగుచు మణిపూర చక్రమందున నొప్పు చక్కనమ్మ! యగ్ని తత్త్వమ్ముగా నమరియుంటివిగ స్వాధిష్టాన చక్రాన దివ్యముగను, వాయు తత్త్వమ్ముగా వరలి యుంటివి యనాహత చక్రమందున నుతిగ జనని!

తే.గీ. యల విశుద్ధచక్రాన నీ వాకసముగ, మనసు వగుచు నాజ్ఞాచక్రమునను నిలిచి, మరి సహస్రారము సుషుమ్న మార్గమునను చేరి, పతితోడ విహరించు ధీరవమ్మ! ॥ భావము. మూలాధార చక్రము నందు పృధ్వీ తత్వమును, స్వాధిష్ఠాన చక్రము నందు జల తత్వమును, మణిపూరక చక్రము నందు అగ్ని తత్వమును, అనాహత చక్రము నందు వాయు తత్వమును, విశుద్ధ చక్రము నందు ఆకాశ తత్వమును, భ్రూ మధ్యమున ఉన్న ఆజ్ఞా చక్రము నందు మనస్తత్వమును ఈ విధముగా కుల మార్గము చేధించుకొని పోయి సహస్రార కమలములందు రహసి అనగా ఏకాంతముగా ఉన్న నీ పతి దేవుడైన సదాశివునితో కలిసి రహస్యంగా విహరించుచున్నావు. 10

సీ. శ్రీపాదముల నుండి చిందుచుఁ బ్రవహించు నమృతవర్షంబుతో నలరు నీవు నిండుగ డబ్బది రెండు వేలున్నట్టి నాడీప్రపంచమున్ దడుపుచుండి, యమృతాతిశయమున యలరెడి చంద్రుని కాంతిని కలుగుచు, కదలుచుండి మరల మూలాధార మహిత చక్రము చేరి, స్వస్వరూపంబగు సర్పరూప

తే.గీ. మునను చుట్టగాచుట్టుకొనిన జననివి, నీవె కుండలినీశక్తి, నిదురపోవు చుందువమ్మరో! మాలోన నుందు వీవె. వందనమ్ములు చేసెద నిందువదన! ॥ భావము. అమ్మా ! నీ పాదకమల ద్వయము నుండి జాలువారు అమృతపు ధారా వాహినిచే శరీరము నందలి డెభైరెండువేల నాడీ మండలము మార్గము నంతనూ తడిపి, అమృత చంద్రకాంతులు గల చంద్రుని, అనగా సహస్రార చక్రమును వీడి స్వస్థానమైన మూలాధార చక్రము చేరి, అక్కడ నీ స్వరూపమును సర్పము వలె అధిష్టించబడిన, వర్తులాకరముగా నుండు సర్పము వలె ఉందువు.

11

సీ. శ్రీచక్రమది నాల్గు శివచక్రములు, వాటి నుండియే విడివడి యున్న శక్తి చక్రమ్ము లైదుతోఁ జక్కఁగ నున్నట్టి, సృష్టికి మూలమై చెలగుచున్న తత్త్వమ్ముతోఁ గూడి తనరు నీ వాసమౌ శ్రీచక్రమందలి చెలగు కోణ ములనష్టదళముల నలపద్మషోడశమును మేఖలాతంత్రముగను, మూడు

తే.గీ. భూపురములును కలిసిన మొత్తమటుల నలుబదియు నాలుగంచులు కలిగి యుండె, నమ్మ నీవాసమపురూపమైనదమ్మ! నెమ్మి నిన్ను నేఁ బూజింతునమ్మ నమ్మి. ॥ భావము. అమ్మా ఈశ్వరీ ~ శ్రీచక్రం~ నాలుగు శివచక్రాలు, వాటినుండి విడివడిన ఐదు శక్తి చక్రాలతో ఉన్నది. ప్రపంచానికి మూలకారణమైన తత్త్వముతో కూడిన నీ నివాసమైన శ్రీచక్రంలోని కోణాలు~ అష్టదళాలు~ షోడశదళ పద్మాలు~ మేఖలాతంత్రంగా మూడు భూపురాలు కలిసి నలభైనాలుగు అంచులు కలిగి వున్నది. 12

శా. నీ సౌందర్యము పోల్చఁ జాలరు భవానీ! బ్రహ్మసుత్రాములున్ నీ సౌందర్యము గాంచి యప్సరసలున్ నిన్బోలలేనందునన్ ధ్యాసన్ నిల్పి మహేశ్వరున్ మనములన్ ధ్యానించి తాదాత్మ్యతన్ భాసింపంగను జూతురైక్యమగుచున్, భక్తిప్రదా! శాంభవీ! ॥ భావము. ఓహిమవత్పర్వత రాజ తనయా ! నీ సౌందర్యమును పోల్చుటకు బ్రహ్మదేవుడు మొదలయిన కవి పుంగవులు కూడా సమర్ధులు కాకుండిరి. ఎందువలన అనగా సృష్టి లోని సౌందర్య రాశులు అయిన అప్సరసలు కూడా నీ అందమునకు ఆశ్చర్యము పొంది, తాము నీతో సరిపోలము అని మనస్సులో శివునితో ఐక్యము కోరుతున్నారుట. 13

శా. కన్నుల్ కాంతి విహీనమై జడుఁడునై కాలంబె తాఁ జెల్లెనం చెన్నంజాలిన వానిపైన బడినన్ హృద్యంపు నీ చూపహో! కన్నెల్ చూడగ నెంచి వానిని మదిన్ గాంక్షించుచున్ బయ్యెదల్ క్రన్నన్ జారఁగ నీవి, మేఖలలు జారన్, బర్వునన్ వత్తురే. ॥ భావము. ఎంతటి వృద్ధుడైనను, వికారము గొల్పు చూపు గలవాడైనను గోప్యమైన విషయములందు జడుడైనను, అమ్మా! నీ క్రీగంటి చూపులకు నోచుకున్నచో బంధము నుండి విదువడును. కడవల వంటి నీ కరుణా కటాక్షముతో హఠాత్తుగా తెగిపడిపోయిన, మొలనూళ్ళు కలవారై, విడిపోయిన పోకముడులు కలవారై, వందల కొలది యవ్వన దశలో ఉన్న వృద్ధరాండ్రు అనగా వస్త్రధారణ కేశ సంస్కారము సంగతి మర్చిపోయి, నిన్ను అనుసరించి నీ కొరకు వెంట పరిగెత్తుతున్నారు.

14

సీ. భూతత్త్వముననొప్పి పూజ్య మూలాధార ముననేబదారు కిరణములుండ, జలతత్త్వముననున్న చక్కని మణిపూరముననేబదియురెండు ఘనతనుండ, నగ్నితత్త్వంబుననలరి స్వాధిష్ఠానముననరువదిరెండుప్రనుతినుండ, వాయు తత్త్వము తోడవ ననాహతమునందు నేబది నాలుగుధృతిని యుండ, నాకాశ తత్త్వాన నలవిశుద్ధమునందు డెబ్బదిరెండుఘటిల్లియుండ, మానస తత్త్వాన మహిత యాజ్ఞాచక్రముననరువదినాల్గువినుతినొప్ప

తే.గీ. నట్టి వాని సహస్రారమందునున్న బైందవ స్థానమున నీదు పాదపంక జంబు లొప్పి యుండును తేజసంబు తోడ, నట్టి నిన్ గొల్తునమ్మరో! యనుపమముగ. ॥ భావము. అమ్మా ! సాధకుని దేహమందు పృధ్వీ తత్వముతో ఉన్న మూలాధారమునందు ఏబది ఆరును, జల తత్వముతో ఉన్న మణిపూరము నందు ఏబది రెండునూ, అగ్నితత్వమగు స్వాదిస్ఠానమునందు అరువది రెండునూ, వాయుతత్వముతో కూడిన అనాహతమునందు ఏబది నాలుగునూ, ఆకాశతత్వమయిన విశుద్ధచక్రమునందు డెబ్బది రెండునూ, మనస్తత్వముతో కూడిన ఆజ్ఞాచక్రమందు అరువది నాలుగున్నూ కిరణములు గలవో వాని పై భాగమున ఉండు సహస్రదళ మధ్యనున్న బైందవ స్థానమున నీ యొక్క పాదముల జంట నర్తించును. 15

సీ. శరదిందు చంద్రికల్ సరితూగనంతటి నిర్మలదేహంపు నెలతవీవు, పిల్ల జాబిలి తోడనల్ల జడలతోడ నుతకిరీటమునొప్పు యతివవీవు, కోరికల్ తీర్చెడి తీరైన వరముద్ర, భయమును బాపు నభయపు ముద్ర, స్పటిక మాలను దాల్చి, సన్నుతంబుగ దివ్య పుస్తకంబును దాల్చి నిస్తులవయి

తే.గీ. యొప్పు నీకు వందనములు గొప్పగాను చేయు సజ్జనులకునబ్బు శ్రీకరముగ మధువు, గోక్షీర, ఫలరస మాధురులను మించు వాగ్ధాటి భువిపైన మేల్తరముగ. ॥ భావము. అమ్మా ! శరత్కాలమునందు ఉండు వెన్నెల వలె నిర్మలమయిన శరీరము కల దానవు, పిల్ల జాబిల్లితో కూడిన జడ ముడి ఉన్న కిరీటము కల దానవు, కోరికలు తీర్చు వరముద్ర, భయమును పోగొట్టు అభయముద్ర కల దానవు, స్ఫటిక పూసల జపమాలను, పుస్తకమును చేతుల యందు ధరించిన నిన్ను ఒక్క పరి అయినా నమస్కరించు సజ్జనులకు తేనె, ఆవు పాలు, ద్రాక్ష పండ్ల యొక్క మధురములను అందించు వాక్కులు రాకుండా యెట్లు ఉండును. తప్పక వచ్చును కదా !

16

చం. కవుల మనంబులన్ జలజ గౌరవ సద్వన సూర్యకాంతివౌ

ప్రవర మనోజ్ఞమౌ నరుణ పావననామ! నినున్ భజించుచున్

బ్రవరులు బ్రహ్మరాణివలె భాసిలు దివ్య రసప్రథాన సు

శ్రవణ కుతూహలంబయిన చక్కని వాగ్ఝరితో రహింతురే. భావము. అమ్మా ! కవి శ్రేష్ఠుల చిత్తములనెడి పద్మ వనములకు బాల సూర్యుని కాంతివగు అరుణ అను నామము కల నిన్ను ఏ కొందరు సత్పురుషులు సేవించుచున్నారో వారు బ్రహ్మ ప్రియురాలు అగు సరస్వతీదేవి వలె మిక్కిలి శృంగార రస ప్రధానములతో గంభీరములు అయిన వాక్కులతో సత్పురుషుల హృదయాలను రంజింప చేయు చున్నారు కదా !

17

సీ. అనుపమవాక్కునకును మూలహేతువై చంద్రకాంతిమణుల చక్కనైన ముక్కల కాంతులఁ బోలి వశిన్యాది శక్తులతోఁ గూడ చక్కగ నిను నెవరు ధ్యానింతురో యిలపైన వారలు మహనీయ సుకవుల మాన్యతయును, రసవత్తరంబును, రమ్య సరస్వతీ ముఖపద్మసంభూత పూజ్య వాక్సు ధామోద మధుర మహావచనంబులన్ కమనీయమైనట్టి కావ్యకర్త

తే.గీ. యగుట నిక్కంబు, శాంభవీ! ప్రగణితముగ, శక్తి సామర్ధ్యముల ననురక్తితోడ నాకునొసగంగ వేడెదన్ శ్రీకరముగ నిన్ను కవితలన్ వర్ణింప నిరుపమముగ. ॥ భావము. అమ్మా ! వాక్కునకు మూలకారణమైన, చంద్రకాంతిమణుల ముక్కల కాంతులను బోలెడు, వశిని మొదలగు శక్తులతోగూడ ఎవడు నిన్ను ధ్యానించునో, అతడు మహానుభావులైనవారివలె రసవత్తర మైన, సరస్వతీ దేవి ముఖపద్మము నుండి వెలువడే ఆమోదయోగ్యమైన, మధురమైన వచనములతో కూడిన కావ్యకర్త అగుచున్నాడు. 18

సీ. తరుణ తరుణి కాంతిఁ దలఁదన్ను కాంతితో వెలిగెడి నీదైన వెలుగు లమరి యాకాశమున్ భూమినంతటన్ కాంతులు చెలగు నా యరుణిమన్ దలచు నెవ్వ డట్టి సాధకునకు ననుపమరీతిని బెదరుచూపులతోడ ముదము గదుర నూర్వసీ మున్నగు సర్వాంగసుందరుల్వశముకాకెట్టులమసలగలరు?

తే.గీ. నిన్ను నిరతంబుఁ గొలిచెడి నిత్యభక్తి నాకొసంగుము మాయమ్మ! శ్రీకరముగ, నీదు పాద పరాగమే ప్రభను గొలుపు నాకు ప్రాపింపఁ జేయుమో నయనిధాన! ॥ భావము. ఉదయసూర్యునియొక్క కాంతినిబోలు నీ దేహకాంతులచేత సమస్త ఆకాశము భూమిని అరుణవర్ణమునందు నిమగ్నమైనదానినిగా ఏ సాధకుడు స్మరించునో వానికి బెదురుచుండు అడివిలేళ్ళయొక్క సిగ్గుతో కూడిన కన్నులతో, ఊర్వశిలాంటి దేవతా స్త్రీలు ఎందరెందరో ఎట్లు వశముకాకుండా ఉందురు? 19

సీ. శ్రీచక్రముననున్నచిన్మయ బిందువున్ నీముఖసీమగాఁ బ్రేమఁ గనుచు, దానిక్రిందను కుచ ద్వయము నాక్రిందను శివునర్థభాగమౌభవుని సతిని, బిందువు క్రిందను వెలుగు త్రికోణాన క్లీమ్ బీజమున్ మదిన్ లీలఁ గనుచు నెవరుందురో వార లెవరినైననుగాని మోహంబులో ముంచి ముగ్ధులవఁగఁ

తే.గీ. జేయఁ గలుగుదురోయమ్మ! శ్రీకరమగు దివ్యమైనట్టి యీ శక్తి భవ్యమైన నీదు మేరువుదమ్మరో! నిజము గనిన నమ్మ! నీపాదములకు నే నంజలింతు. ॥ భావము. పరమేశ్వరీ! ముఖమును బిందువునందు అనగా ఆజ్ఞాచక్రమునందు ధ్యానము చేసి, దాని క్రిందిభాగమునందు అనాహతను ధ్యానము చేసి, దాని క్రిందిభాగమునందు మూలాధారమును ధ్యానము చేసిన, భక్తునకు వెంటనే స్త్రీ వ్యామోహము నుండి విడివడుట స్వల్పవిషయము. శీఘ్రముగా భ్రమ నుండి విడివడి, పరమాత్మను విశుద్ధచక్రమునందు మూడు లోకములయందు ధ్యానించును. 20

సీ. ఆపాద మస్తకంబంతటి కిరణాలఁ బ్రసరించు నమృతమ్ము నసమరీతిఁ గురిపించుచున్నట్టి నిరుపమ శశిశిలా మూర్తిగా భావించి స్ఫూర్తితోడ నే సాధకుండు నిన్ హితముతోఁ బ్రార్థించునట్టివాఁ డసమానుఁడయిన గొప్ప గరుడుని యట్టుల నురగ దంష్ట్రల నుండి వెల్వడు విషమును వింతగాను

తే.గీ. బాపువాఁడగుచుండెను, జ్వరముతోడ బాధనందువారికి బాధఁ బాయఁజేయు కంటిచూపుచేఁ దగ్గించఁ గలుగుచుండు నమ్మ! నా వందనము లందుకొమ్మ నీవు. ॥ భావము. అమ్మా ! పాదములు మొదలు శరీరము అంతటి కిరణముల నుండి ప్రసరించు చున్న అమృతమును కురిపించుచున్న చంద్రకాంత శిల్పా మూర్తిగా నిన్ను ఏ సాధకుడు ప్రార్ధించు చున్నాడో అట్టి వాడు గరుత్మంతుని వలె పాముల నుండీ వెలువడుచున్న విషమును హరింప చేయుచున్నాడు, జ్వరముతో భాధింప పడు వానిని అమృతము ధారగా కలిగిన తన నాడుల యొక్క శీతలమయిన చూపుచేత జ్వరబాధను తగ్గించి సుఖమును కలుగ చేయుచున్నాడు కదా!

21

సీ.  మెరుపు తీగను బోలు మేలైన కాంతితో చంద్రసూర్యాగ్నుల సహజమైన

రూపంబుతోనొప్పి, రూఢిగ షట్ చక్ర ములపైన నొప్పెడి మూలమైన

వర సహస్రారాన వరలు నీ సత్ కళన్ కామాదులొందిన క్షాళనమును

మనసులన్ గాంచుచు మహితాత్ము లానంద లహరులందేలుదు రిహము మరచి,


తే.గీ.  ఎంత వర్ణించినన్ నిన్ను కొంతె యగును,

శంకరాచార్యులే కాదు శంకరుఁడును

నిన్ను వర్ణింపలేడమ్మ! నిరుపమాన

సగుణనిర్గుణసాక్షివో చక్కనమ్మ!

భావము .

తల్లీ! భగవతీ! మెరుపుతీగవంటిది; సూర్యచంద్రాగ్ని ప్రభసమాన మైనది; షట్చక్రాలలో ఉపరిదైనది ఐన సహస్రార మహాపద్మాటవిలో కూర్చున్న నీ సదాఖ్య ( శివ శక్తుల సాయుజ్యం ; ప్రకృతి పురుషుల కలయిక ) కళను మహాత్ములు, పరిపక్వచిత్తులు పరమాహ్లాద లహరిగా అనుభూతినొందుతున్నారు. అంటే నిరతిశయానందాన్ని సదా పొందుతున్నారనిభావము. 

22

ఉ.  అమ్మ! భవాని! దాసుఁడననంటిని, యిట్టుల నోటివెంట నే

నమ్మ! భవాని యంటినని యార్ద్రమనంబున, దేవతాళిచే

నెమ్మిని సేవలన్ గొనెడి నిత్యవసంత సుపాదపద్మ పీ

ఠమ్మునఁ జేరఁజేయుచు నెడందను నన్ గని ముక్తి నిత్తువే. ॥

భావము.

అమ్మా ! భవానీ నీ యొక్క దాసుడు అయిన నా మీద నీ యొక్క దయతో కూడిన చూపులు ప్రసరించుమని వేడుటకు సిద్ధపడి అమ్మా భవానీ అని రెండు పలుకులు నోటి వెంట రాగానే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలగువారి కిరీటములచే నీరాజనము చేయుచున్న పాదపద్మములు గల నీ సాయుజ్యమును ఇచ్చుచున్నావు కదా ! 

23

సీ.  వామ భాగమునందు వరలుచు శివునిలో, సంతృప్తి కనకేమొ శంభురాణి!

మిగిలిన దేహాన మేలుగా నిలిచినట్లనిపించుచుండెనో యమ్మ! కనఁగ,

నా మది ముకురాన నీ మాన్య తేజంబు కనిపించునట్టులో కంబు కంఠి!

ఉదయభానుని తేజమది నీదు దేహంబు నందుండి రవి కోరి పొందియుండు


తే.గీ.  నంతచక్కని కాంతితో సుంత వంగి

స్థనభరంబుననన్నట్లు సన్నుతముగ

మూడు కన్నులతో వంపు తోడనొప్పె,

నీవు శివతత్త్వపూర్ణ వో నిరుపమాంబ!. ॥

భావము.

ఓ జగన్మాతా! తల్లీ! అమ్మా! నీవు ముందర శివశంభుడి వామ భాగాన్ని గ్రహించావు.అయినా నీకు తనివి తీర లేదనిపిస్తుంది.ఎందుకంటే తనివితీరని మనస్సుతో అర్థనారీశ్వరుడి ఆ మిగిలిన సగ భాగంకూడా ఆక్రమించావనిపిస్తుంది. నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందంటే నా హృదయఫలకం పైన విరాజిల్లుతున్న నీ దివ్య స్వరూపం అలా గోచరిస్తున్నది. నీ దివ్య స్వరూపం ఉదయ భానుడి కాంతితో సాటి వచ్చే కెంపు కాంతులతో ఒప్పారుతూ వుంది. పాలిండ్ల జంటతో యించుక ముందుకు వంగినట్లు కనపడుతూ వుంది. ఆ నీ దివ్య స్వరూపం మూడు కన్నులు కలిగి, వంపు తిరిగిన చంద్రకళ శిరోమణిగా ఉన్న కిరీటంతో సొంపారుతూ, విరాజిల్లితుంది. దీని భావం ఏందంటే అమ్మవారు తనలో శివతత్త్వాన్ని లయం చేసుకున్నారని.

24

ఉ.  నీ కను సన్నలన్ విధి గణించి సృజించును సృష్టి, విష్ణు వా

శ్రీకర సృష్టిఁ బెంచు, హృతిఁ జేయు శివుండది, కల్పమంతమం

దా కరుణాత్ముఁడౌ శివుఁడె యంతయు లోనికి చేర్చుకొంచు, తా

నీ కను సన్నలన్ మరల నేర్పునఁ జేయఁగఁ జేయు వారిచే. ॥

భావము.

ఓ మాతా! తల్లీ! భగవతీ! అమ్మా! సృష్టికి కర్త అయిన బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. మహావిష్ణువు ఏమో రక్షిస్తున్నాడు. రుద్రుడు ఏమో విశ్వాన్ని లయింప చేస్తున్నాడు. కల్పాంతం లో మహేశ్వరుడు ఈ బ్రహ్మ, విష్ణువు, రుద్రులను తనలో లీనం చేసుకొని సదాశివతత్త్వంలో అంతర్భూతం చేస్తున్నాడు. ఈ ప్రకారంగా ఈ బ్రహ్మాండం అంతా లయమయిపోతుంది. మళ్ళీ  ఆ సదాశివుడు కల్పాదిలో నీవు నీ కనుబొమ్మలను ఒక్క క్షణం కదిలించగానే, అదే ఆజ్ఞగా  గ్రహించి ఈ నాలుగు తత్త్వాలతో మళ్ళీ యథావిధిగా సృష్ట్యాది కార్యాలు జరిపిస్తున్నాడు. 

25

ఉ.  నీదు గుణత్రయంబున గణింప త్రిమూర్తులు పుట్టిరోసతీ!

నీ దరి నిల్చి మ్రొక్కిన, గణింతురు వారలు వారికన్నటుల్,

మోదముతోడ నిన్నుఁ గని పూజ్యముగా మది నిల్పి గొల్తురే,

నీ దయ కల్గినన్ గలుగు నీ పద పంకజ సేవ మాకిలన్. ॥

భావము.

ఓ మాతా! తల్లీ! అమ్మా! శివానీ! త్రిమూర్తులు నీ త్రిగుణాలవలన జనించిన వారే కదా. కావున నీ చరణాలకు మేము చేసే పూజే వారికి కూడా చేసే పూజ అవుతుంది. వారికి ఇంక వేరే పూజలు అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎల్లప్పుడూ నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచ్చిత పీఠానికి దగ్గరగా చేరి, చేతులు తమ మణిమయ శిరోమకుటాలకు తాకేటట్లు పెట్టుకొని నీకు మొక్కుతూ వుంటారు. సర్వకాల సర్వావస్థలలో నీ ఆజ్ఞను శిరసావహిస్తుంటారు. కాబట్టి ఆతల్లి పాదసేవ ఆమె కటాక్షిస్తేనే మనకు దక్కేది అని దీని అంతరార్థము.

26   

చం.  కలిగెడి యా మహా ప్రళయ కాలమునందున బ్రహ్మ, విష్ణు రు

ద్రులు, యముఁడున్, గుబేరుఁడు, నరుల్దివిజాధిపుడింద్రుడున్, మునుల్

కలియుటనిక్కమెన్నగను కాలగతిన్, గమనించి చూడగన్

గలియుచు నిన్ను గూడి కరకంఠుడు తాను సుఖించునేకదా. ॥ 

భావము.

అమ్మా ! మహా ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ, విష్ణువు కూడా అంతమును పొందెదరు. అందరికీ మృత్యు పాశములు వేయు యముడు కూడా మృత్యువును పొందుచున్నాడు. ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణము చెందు చున్నాడు. ఇంద్రుడు మున్నగు దేవతలు, మునులు కూడా అంతము చెందుచున్నారు. అటువంటి మహా ప్రళయమునందు కూడా నీ పతి యగు సదాశివుడు నిన్ను చేరి స్వేచ్చగా నీతో విహారము చేయుచున్నాడు కదా ! 

27 

తే.గీ.  నా క్రియాకల్పముల్ చూడ నాదు జపము,

నాదు ముద్రలున్ గమనమున్ నయనిధాన!

నీకు నా ప్రదక్షిణలగు! నేను నీకు

నిచ్చునట్టి హవిస్సులౌ నిచటి భుక్తి,

నా విలాసంబులవియెల్ల నతులు నీకు. ||

భావము.

ఆత్మార్పణ-దృష్టితో నేను నీకు చేయు జపము నా సమస్తమైన క్రియాకల్పములు, నా ముద్రలు, నా గమనములు,  నేను చేయు ప్రదక్షిణలు,  భోజనాదులు, నీకు సమర్పించు హవిస్సులు,  ప్రణామములు, సాష్టాంగ నమస్కారములు, సుఖకరమైన నా విలాసములు, అన్నీ నీ సేవలే, నీ పూజలే.  

28

మ.  సుధ సేవించియు మృత్యువొందుదురుగా సోలంగ నా కల్పమా

విధి యింద్రాదులు, కాలకూట విషమున్ విశ్వేశుఁడే త్రాగియున్

వ్యధనే పొందడు, నిన్నుఁ జేరి మనుటన్, భాస్వంత తాటంకముల్

సుధలన్ జిందుచు రక్షణన్ గొలుపనో, శుభ్రాంతరంగప్రభా! ॥ 

భావము.

తల్లీ ! బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల సకల దేవతలూ భయంకరమైన జరామృత్యువులను హరించే అమృతాన్ని గ్రోలియు ప్రళయకాలంలో మరణిస్తున్నారు. అతిభయంకరమై లోకాలను దహించే కాలకూటమనే మహావిషాన్ని భక్షించిననూ నీ పతి శివుడికి మరణం సంభవించలేదు. ఇందుకు ముఖ్యకారణం నీ చెవులకు భాసిల్లే రత్నతాటంకాల ( రత్నాల కమ్మల) ప్రభావమే కదా! ( తల్లియొక్క తేజస్సు మహిమ అంత అద్భుతమైనదని భావము) 

29

సీ.  విధికిరీటంబిది పదిలంబుగా నీవు తప్పించుకొని నడు, తగులకుండ,

హరి కిరీటంబది, యటు కాలు మోపకు, కాలుకు తగిలిన కందిపోవు,

నింద్రమకుటమది, యిటుప్రక్క పోబోకు, తగిలినచో బాధ తప్పదమ్మ,

ప్రణమిల్లుచుండిన భక్తుల మకుటమ్ము లనుచుపరిజనంబులనెడివాక్కు 


తే.గీ.  లటకు నరుదెంచుచున్ననీ నిటలనయను

నకు పరిజనులముందున నయతనొప్పి

రాజిలుచును సర్వోత్కర్షతో జయంబు

గొల్పును సదాశివునిగొల్చు కూర్మి జనని! || 

భావము.

అమ్మా! నీ ముందున్న  బ్రహ్మను తప్పించుకొని దూరముగా నడువుము.  విష్ణుమూర్తియొక్క కిరీటమును తప్పించుకొని దూరముగానుండుము.  మహేంద్రుని తప్పించుకొని  దూరముగా నడువుము. వీరు నమస్కరించుచుండగా,  నీ మందిరమునకు వచ్చిన,   పరమేశ్వరునకు వెంటనే, నీ పరిజనుల ముందు సర్వోత్కర్షతో విరాజిల్లు చున్నది. మూడు గ్రంథులుదాటి సదాశివస్థితికి చేరిన/చేరగలిగిన సాధకునకు జయమును గొల్పును.

30

శా.  అమ్మా! నిత్యవు! నీ పదాబ్జ జనితంబౌ కాంతులే సిద్ధులో

యమ్మా వాటికి మద్ధ్యనున్న నిను తామంచెంచు భక్తుండు తా

నెమ్మిన్ సాంబు సమృద్ధినైన గొనఁ డా నిత్యాత్మునే యెన్నుచున్

సమ్మాన్యంబుగ హారతిచ్చతనికిన్, శంభుస్థ కాలాగ్నియున్. || 

భావము.

ఓ ఆద్యంతాలు లేని మాతా! నీ పాదాలనుండి జనించిన కాంతులైన అణిమాది అష్టసిద్దులచే పరివేష్టింప బడియున్న నీదివ్యరూపాన్ని ఏ భక్తుడైతే పూర్తి తాదాత్మ్యంతో ధ్యానిస్తాడో అతడు త్రినయనుడని పేరుగల సదాశివుడి నిండు ఐశ్వర్యాన్ని కూడా తృణీకరించగలడు. . ఆ సాధకుడికి మహాప్రళయకాలంలో జ్వలించిన అగ్ని నీరాజనం గావించటంలో ఆశ్చర్యమేముంది? ( శ్రీదేవితో తాదాత్మ్యం పొందిన సాధకుడు శ్రీదేవియే .ఆమెకు ప్రళయాగ్ని నీరాజనాలర్పిస్తుంది ). జగత్తు ప్రణమిల్లును.

31 

సీ.  అరువదినాలుగౌ యపురూప తంత్రముల్ ప్రభవింపఁ జేసెను భవుఁడు తలచి,

యొక్కొక్కటొక్కొక్కటొప్పుగానొరలించి కోరిన విధముగా దారి చూపి,

హరుఁడు విశ్రమమొంది, హరుపత్నియౌ దేవి హరుని యాజ్ఞాపింప వరలఁజేసె

శ్రీవిద్యననితరచిద్భాసమగు విద్య, విశ్వమందున బ్రహ్మ విద్య కలుగ


తే.గీ.  నాత్మనే దెల్పెడి దరయ నాత్మ విద్య,

రెంటికిసమన్వయముగూర్చి శ్రేయమునిడు

నట్టిదగు విద్య శ్రీవిద్య, పట్టినేర్పె,

ముక్తి నిడునట్టి యీ విద్య పూజ్య శివుఁడు. ॥ 

భావము.

అమ్మా, భగవతీ! పశుపతి అరవై నాలుగు విధాలైన మహామాయా శంబరాది తంత్రాలను ఈ భూమండలంలో ప్రవేశపెట్టాడు . సకలసిద్ది ప్రదాయకమూ , ఐహిక ఫల ప్రదాయికాలూ ఐన ఈ తంత్రాలద్వారా సమస్త ప్రపంచాన్ని మోహింపజేసి మిన్నకున్నాడు .మళ్ళా నీ అభీష్టం మేరకు ధర్మార్ధ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలను ప్రసాదించేదైన నీ ఈ తంత్రాన్ని ( శ్రీవిద్యా తంత్రాన్ని ) ఈ లోకానికి ప్రసాదించాడు .

32 

మ.  శివుఁడున్ శక్తియు కాముఁడున్ క్షితి, గభస్తీచంద్రులున్ మన్మధుం

డవలన్ హంసయు, శక్రుఁడున్, గన ఘనంబౌ నా పరాశక్తియున్,

భవుడౌ మన్మధుఁడున్, దగన్ హరియు, నీ భవ్యాళి సంకేత స

ద్భవ హృల్లేఖలు చేరగా తుదల, నీ భాస్వంత మంత్రంబగున్. ॥ 

భావము.

ఓ జననీ! శివుడు, శక్తి, కాముడు, క్షితి; ~ రవి, శీతకిరణుడు, స్మరుడు, హంసుడు, శక్రుడు;~ పరాశక్తి, మన్మథుడు, హరి అనేవారి సంకేతాలైన వర్ణాలు, మూడు హృల్లేఖలు, చివరలో చేరగా ఆ వర్ణాలు ఓ మాతా! నీ నామరూపాలవుతున్నాయి (నీ మంత్రమవుతున్నవి). (మంత్రం క ఏ ఈ ల హ్రీం, హ స క హ ల హ్రీం, స క ల హ్రీం, అని. ఇదే పంచదశీ మంత్రం లేక పంచదశాక్షరీ మంత్ర మవుతోందని తెలియనగును).

33 

మ.  స్మర బీజంబును, యోని బీజమును, శ్రీ మాతృప్రభా బీజమున్,

వరలన్ నీదగు నామమంత్రములకున్ ప్రారంభమున్ నిల్పుచున్

వరచింతామణి  తావళాంచితులు సద్భావుల్ శివాగ్నిన్, నినున్, 

బరమానందము తోడఁ జేయుదురు సద్భావంబుతో హోమమున్ ॥ 

భావము.

ఓ నిత్యస్వరూపిణీ! నీ మంత్రానికి ముందు కామరాజబీజం , భువనేశ్వరీ బీజం, లక్ష్మీ బీజం, (ఈ మూడింటి ఐం హ్రీం శ్రీం) కలిపి నిరవధిక మహాభోగరసికులు సకల సిరులను వాంఛిస్తూ , చింతామణులనే రత్నాలతో కూర్పబడిన అక్షమాలలను చేతుల్లో ధరించి , కామధేనువుయొక్క నేతి ధారలతో శివాగ్నిలో అనేక ఆహుతులర్పిస్తూ , హోమం చేస్తూ నిన్ను సేవించుచున్నారు.

34

చం.  శివునకు దేహమీవెగ, ప్రసిద్ధిగ నీవల సూర్య చంద్రులన్

గవలిగ వక్షమందుఁ గల కాంతవు, నిన్ శివుఁడంచు నెంచినన్

బ్రవిమల శేషి యా శివుఁడు, వర్ధిలు శేషము నీవె చూడగా,

భవుఁడు పరుండు, నీవు పరభవ్యుని సంతసమమ్మరో! సతీ! ॥ 

భావము.

ఓ భగవతీ! నవాత్మకుఁడయిన శంభునకు సూర్యచంద్రులు వక్షోరుహములుగా కలిగి ఉన్న నీవు శరీరమగుచున్నావు. కాబట్టి అతఁడు శేషి.  నీవు శేషము అగుచున్నారు. ఆయన పరుఁడు. నీవు పరానందవు. మీ యిద్దరికినీ ఉభయ సాధారణ సంబంధము కలదు. 

35

సీ.  ఆజ్ఞా సుచక్రాన నల మనస్తత్త్వమై, యలవిశుద్ధినిజూడ నాకసముగ,

వర యనాహతమున వాయుతత్త్వంబుగా, నా మణిపూరమం దగ్నిగాను,

జలతత్త్వముగ నీవు కలిగి స్వాధిష్ఠాన, నరయ మూలాధారమందు పృథ్వి

గను నీవె యుంటివి, ఘనముగా సృష్టితో పరిణమింపగఁ జేయ వరలు నీవె


తే.గీ.  స్వస్వరూపమున్ శివునిగా సరగున గని

యనుపమానంద భైరవునాకృతి గను

ధారణను జేయుచున్ సతీ! స్మేర ముఖిగ

నుండి భక్తులన్ గాచుచు నుందువమ్మ. ॥

భావము.

ఆజ్ఞాచక్రమునందలి మనస్తత్వమును, విశుద్ధిలోని ఆకాశతత్వమును,  అనాహతలోని వాయుతత్వమును, మణిపురలోని అగ్నితత్వమును,  స్వాధిష్ఠానలోని జలతత్వమును, మూలాధారచక్రములోని పృధ్వితత్వమును, నీవే తప్ప ఇంకొకరు లేరు. నీవే నీ స్వస్వరూపమును ప్రపంచరూపముతో పరిణమింపచేయుటకు, చిచ్ఛక్తియుతుడైన ఆ ఆనంద భైరవుని లేదా శివ తత్వమును శివయువతి భావముచే ధరించుచున్నావు.

36

సీ.  నీకు చెందినదైన నిరుప మాజ్ఞాచక్ర రవికోటిశశికాంతిఁ గ్రాలునట్టి

పరమచిచ్ఛక్తిచే నిరువైపులందునన్ గలిగిన పరుఁడైన కాలగళుని

చేరి చేసెదనతుల్, గౌరీపతిని భక్తి నారాధనము చేయు ననుపముఁడగు

సాధకుండిద్ధర చక్కగా రవిచంద్ర కాంతికిన్ గనరాక, కానబడక


తే.గీ.  బాహ్యదృష్టికి, నేకాంత భాసమాన

గణ్యమౌ సహస్రారమన్ కమలమునను

నిరుపమానందుఁడై యొప్పి మురియుచుండు

నమ్మ! నీ దయ నాపైన క్రమ్మనిమ్ము.॥ 

భావము.

నీ సంబంధిత ఆజ్ఞా చక్రమందున్న కోటి సూర్య చంద్ర కాంతులను ధరించిన,  పరమగు చిచ్ఛక్తివలన కలిసిన రెండు ప్రక్కలు కలవాడును, పరుడు అయిన శంభుని నమస్కరించుచున్నాను,  ఆ శంభుని భక్తితో ఆరాధించి సాధకుడు రవి చంద్రుల ప్రకాశమునకు అగోచరమై, బాహ్యదృష్టికి అందని ఏకాంతమైన సహస్రార కమలమునందు నివసిస్తున్నాడు. 

37

ఉ.  నీదు విశుద్ధ చక్రమున నిర్మలమౌ దివితత్త్వ హేతువౌ

జోదుగవెల్గు నాశివుని, శొభిలుచుండెడి నిన్నుఁ గొల్చెదన్

మోదమునొప్పుమీ కళలుపూర్ణముగా లభియింపఁ వీడెడున్

నాదగు చీకటుల్, మదిననంత మహాద్భుత కాంతినొప్పెదన్. ॥ 

భావము.

అమ్మా ! నీ విశుద్ధి చక్రమున దోషము లేని స్ఫటిక మణి వలె నిర్మలుడునూ ఆకాశ తత్వము ఉత్పాదకమునకు  కారణమయిన శివతత్వమును, శివునితో సమానమయిన యత్నము గల దేవియగు నిన్ను నేను  పూజింతును. అట్టి శివాశివులు అయిన మీ నుండి వచ్చుచున్న శశి కిరణములతో సాటి గల కాంతుల చేత జగత్తు ఎగరగొట్టబడిన అజ్ఞానము కలదయిచకోరపక్షి వలే ప్రకాశించును కదా ! 

38

తే.గీ.  జ్ఞాన సుమ మధువును కోరు, కరుణనొప్పు

యోగులగువారి మదులలోనుండు, మంచి

నే గ్రహించు హంసలజంటనే సతంబు

మదిని నినిపికొల్చెదనమ్మ! మన్ననమున. ॥ 

భావము.

వికసించుచున్న, జ్ఞాన పద్మమునందలి తేనె మాత్రమె ఇష్టపడునది,  యోగీశ్వరుల మనస్సులో చరించునది ఇట్టిదని చెప్పుటకు వీలులేని రాజ హంసల జంటను సేవించెదను, పరస్పర మథుర సంభాషణలవలన 18 విద్యల యొక్క పరిణామము, ఏ హంసలజంట అవలక్షణములనుండి సమస్తమైన సద్గుణ సముదాయమును నీళ్ళనుండి పాలను గ్రహించుచున్నదో. 

39 

సీ.  నీదు స్వాధిష్ఠాన నిరుపమ చక్రాన నగ్ని తత్త్వంబున నమరుయుండు,

నగ్నిరూపుండైన యాశివున్ స్తుతియింతు, సమయ పేరునగల సన్నుత మగు

మహిమాన్వితంబైనమాతృస్వరూపిణీ! నిన్నునున్ దలచుచు సన్నుతింతు,

నేకాగ్రతను జేయునీశుని ధ్యానాగ్నినిని లోకములు కాలుననెడియపుడు


తే.గీ.  నీదు కృపనొప్పు చూడ్కులునిరుపమాన

పూర్ణ శశిచంద్రికలె యార్పు పూర్తిగాను,

లోకములనేలు జనని! సులోచనాంబ! 

వందనంబులు చేసెద నందుకొనుము. ॥

భావము.

స్వాధిష్ఠానచక్రమునందలి అగ్నితత్వమును అధిష్ఠించి ఎల్లప్పుడు, ఆ అగ్ని రూపుడయిన శివుడిని స్తుతించెదను. అదే విధముగా ‘సమయ’ అనుపేరుగల మహిమాన్వితమైన నిన్ను స్తుతించెదను. మిక్కిలి గొప్పదై  ఏకాగ్రతతో కూడిన   ఆ పరమేశ్వరుని ధ్యానాగ్ని చూపు భూలోకాది లోకములను దహించును. ,  నీ కృపతో కూడిన చూపు శీతలమును ఉపశమనమును కావించుచున్నది. 

40

సీ.  మణిపూర చక్రమే మహిత వాసమ్ముగా కలిగి చీకటినట వెలుగునదియు,

కలిగిన శక్తిచే వెలుగులీనునదియు, వెలుగులీనెడిరత్న ములను గలిగి

యున్న యింద్రధనువు నొప్పుచు, జగతిని శివరవి తప్తమౌ చిక్కుచున్న

ముల్లోకములకును పూర్ణ వృష్టి నొసగు మేఘమౌ జననిని మేలు గొలుతు.


తే.గీ.  అమ్మ! నీ దివ్య రూపంబు కమ్మగాను

వర్ణనము చేయు శక్తితో పరగనిమ్మ!

నమ్మి నినుఁగొల్చుచుంటినోయమ్మ నేను,

వందనంబులు చేసెద నందుకొనుము. ॥ 

భావము.

అమ్మా! మణిపురచక్రమే నివాసముగా కలిగి, చీకటికి శతృవై ప్రకాశించు శక్తిచేత విద్యుల్లత మెరుపుగల,  ప్రకాశించుచున్న వివిధములైన రత్నములతోకూడిన ఆభరణములచే కూడిన ఇంద్రధనుస్సువలె వెలుగునదియు,  నీలి వన్నెలుగల, శివునిచే దగ్ధమైన, మూడులోకములగూర్చి వర్షించునది అయిన ఇట్టిది అని చెప్పుటకు వీలుకాని మేఘ స్వరూపమయిన శివుని, ధ్యాన స్వరూపమును సేవించెదను.

41

సీ.  నీదు మూలాధార నిర్మల చక్రాన సమయా యనెడి గొప్ప శక్తిఁ గూడి

ప్రవర శృంగారాది నవరసమ్ములనొప్పు నానంద తాండవమమరఁ జేయు

నిన్ను నేను నవాత్ముని మహదానందభై రవుని దలంచెద, ప్రళయ దగ్ధ

లోకాల సృజనకై శ్రీకరముగ కూడి యిటులొప్పు మీచేత యీ జగమ్ము


తే.గీ.  తల్లిదండ్రులు కలదిగా తలతు నేను,

లోకములనేలు తలిదండ్రులేకమగుచు

దివ్యదర్శనభాగ్యమీ దీనునకిడ

వేడుకొందును, నిలుడిల నీడవోలె. ॥ 

భావము.

నీ మూలాధార చక్రమునందు నృత్యాసక్తిగల ‘సమయా’ అనే పేరుగల శక్తితోకూడి, శృంగారాది నవరసములతో నొప్పారుచు  ప్రళయమునందు అద్భుతమైన తాండవ నాట్యమును అభినయించు శివుని తలచెదను. నవాత్మునిగా తలచెదను. ఆనందభైరవునిగా తలచెదను.  ప్రళయాగ్నికి దగ్ధమైన లోకములను మరల   జగదుత్పత్తి కార్యమును ఉద్దేశించి ఈ ఆనంద మహాభైరవులచేత కరుణచేత,  ఈ ఇద్దరి కలయికతో ఈ జగత్తు తల్లీ తండ్రి కలదని తెలుసుకొనుచున్నాను.

42

సీ.  హిమగిరి నందినీ! సముచితముగ సూర్యులందరిన్ మణులుగ పొందబడిన

నీ స్వర్ణమకుటమున్ నియతితో కీర్తించునెవ్వం  డతం డిల నెంచకున్నె

ద్వాదశాదిత్యుల వరలెడు మణికాంతి సోకుచు నొప్పెడి సోముని గని

యింద్ర ధనుస్సుగా, సాంద్రకృపాంబ! తత్ కల్యాణతేజంబు ఘనతరంబు.


తే.గీ. నీ కిరీటంబు తేజంబు నే దలంచి

యాత్మలోతృప్తినందెదనమ్మ కృపను

నీవు నామదిలోననే నిలిచి యుండి

మకుట తేజంబు కననిమ్ము సుకరముగను. ॥ 

భావము.

ఓ హిమగిరితనయా! పార్వతీ! మణి భావమును పొందిన ద్వాదశ సూర్యుల చేత దట్టముగా కూర్పబడిన నీ బంగారు కిరీటాన్ని ఎవడు కీర్తిస్తాడో _ ఆ కవీశ్వరుడు గోళాకారంగాయున్న ఆ కిరీటములో కుదుళ్ళయందు బిగించబడిన ద్వాదశాదిత్యులనే మణుల కాంతుల ప్రసారంతో, చిత్ర విచిత్ర వర్ణములు గల చంద్ర ఖండాన్ని చూసి , అది ఇంద్రుని ధనస్సు అని ఎందుకు భావన చేయకుండా వుంటాడు. (చంద్ర రేఖను తన మనస్సులో ధ్యానించి ధ్యానించి అది తప్పక ఇంద్రధనుస్సు అని నిశ్చయ బుద్ధి ని కల్గించు కుంటాడని భావము ) పండ్రెండుగురు సూర్యులు దేవి కిరీటములో మణులైయుంటారు. అందులో చంద్ర రేఖ కూడా వుంటుంది. ఆ సూర్య కాంతుల ప్రతిఫలంతో కూడిన చంద్ర వంక వర్ణించు వారికి ఇంద్రధనుస్సనే భావాన్ని తప్పక కల్గిస్తుంది.

43

తే.గీ.  నల్లకలువలన్, మేఘమునల్లఁ బోలు

శ్లక్ష్ణమగు స్నిగ్ధమగు కురుల్ చక్కగాను

మాదు మదులలోఁ జీకటిన్ మాపు, కల్ప

కుసుమములు వాసనలు పొందఁ గోరి నీదు

కురుల వసియించె నని దల్తు గుణనిధాన! ॥ 

భావము.

అమ్మా, వికసించిన నల్లకలువల వలె నల్లని మేఘమువలె సుగంధముతో ఉన్న మెత్తని నీ కురులు మా అజ్ఞాన అంథకారమును తొలగించునుగాక, ఇంద్రుని ఉద్యానవనమునందలి కల్పవృక్షముల పుష్పములు, తన సహజ సువాసనను పొందుటకు, ఇచ్చట వసించుచున్నవని తలచెదను.

44

సీ.  శ్రీమాత! నీదగు సీమంత మార్గంబు నీ ముఖ సౌందర్య నిరుపమాన

గంగా లహరి పోలి పొంగుచు సాగెడి మార్గమా యననొప్పె మహిత గతిని,

యందలి సిందూరమందగించుచు బాల సూర్య కిరణకాంతి సొబగులీని,

కటికచీకటిపోలు కచపాళి రిపులచే చెరబట్టఁ బడినట్లు చిక్కి యచట

తే.గీ.  

మెరియుచుండె నీ సీమంత మరసి చూడ,

నట్టి సిందూర సీమంత మమ్మ! మాకు

క్షేమమును గల్గఁ జేయుత చిత్తమలర,

వందనంబులు చేసెద నందుకొనుము. . ॥ 

భావము.

అమ్మా! నీ ముఖ సౌందర్యపు టలల ప్రవాహమందు పారుచున్నదారివలెనున్న నీ పాపిడి,  దట్టముగానున్న కురుల చీకటి శత్రువుల బృందముచేత బందీకృతమైన ప్రాతః కాల సూర్యునివలె, సింధూరం పెట్టుకున్నదై, మాకు క్షేమం కలుగచేయుచున్నది.

45

సీ.  స్వాభావికంబుగా వంకరలౌ తుమ్మెదలవంటి ముంగురుల్ దర్పమెలర

నందగించెడి నీదు సుందరమగు మోము పంకేరుహంబులన్ పరిహసించు,

చిఱునవ్వుతోఁ గూడు శ్రీకరమగు దంతకాంతి, కేసరకాంతి, ఘనతరమగు

సౌగంధ్య పూర్ణమై చక్కనౌ ముఖమొప్పు నా ముఖపద్మమ్ము నలరియున్న


తే.గీ. సుందరత్వమున్ గనుచుండి సోమశేఖ

రుని కనులను ద్విరేఫముల్ కనును మత్తు,

నట్టి నీ పాదములను నే పట్టి విడువ

నీదు కృపఁ జూపు మమ్మ! నన్నాదుకొనుమ. ॥ 

భావము. 

సహజముగా వంకరగానున్న తుమ్మెదల కాంతి వంటి కాంతి గల ముంగురులతో చుట్టఁబడిన నీ వదనము కమలముల యొక్క శోభను పరిహసించుచున్నది. చిఱునవ్వుతో కూడిన దంతముల కాంతి కేసరముల కాంతితో మంచి పరిమళము గల ఆ నీ ముఖమును మన్మధుని దహించినట్టి శివుని యొక్క కన్నులనే తుమ్మెదలు చూస్తూ మత్తును పొందుచున్నవి.

46

శా.  లావణ్యాంచిత సల్లలాట కలనా! శ్లాఘింతునద్దానినే

భావంబందున నర్థచంద్రుఁడనుచున్ భాసించుటన్ గాంచి,పై

నావంకన్ గల నీ కిరీట శశి వ్యత్యస్తంబుగాఁ గూడుటన్

భావింపన్  సుధఁజిందు పూర్ణ శశియౌ బ్రహ్మాండభాండోదరీ! ॥ 

భావము.

దేవీ నీ నుదురు నిర్మలమైన లావణ్యమును, నిర్మల మైన కాంతియు కలిగియున్నది. దీనికి గల లావణ్యా న్నీ, కాంతినీబట్టి చూస్తే , బ్రహ్మ ఒకే చంద్ర బింబాన్ని రెండు ఖండములుగా జేసి ఆరెంటిలో క్రింది ఖండాన్నినీ కిరీటములో చంద్ర శకలము గానూ, పై ఖండాన్ని కిరీటంలోని చంద్ర ఖండానికి ఎదురు దిశలో నీ నుదురు గానూ అమర్చినాడని ఊహిస్తున్నాను. ఎందుకనగా ఈ రెంటిలో పై ఖండాన్ని క్రింది కి గానీ క్రింది ఖండాన్ని పైకిగానీజరిపి, ఈ రెండు ముక్కల నాలుగు కొనలలో, రెండేసి ఒక్కొక్క చోట కలిసేటట్లు అమృతపు వెన్నెలతో అతికితే, పున్నమినాటి చంద్రుడు అవుతాడు. అనగా నీ లలాటము పున్నమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్నది.

47

తే.గీ.  భువన భయ హర వ్యసన! కన్ బొమలు నీవి

మరుని విల్ త్రాడు లాగెడి కరణినొప్ప,

పిడికిటనుపట్టి యున్నట్లు వింటిత్రాడు 

మధ్య కనరాని మరువిల్లు మదిని తోచు. ॥ 

భావము.

ఓ ఉమాదేవీ! లోకములయొక్క భయాన్ని పోగొట్టుటయందు ఆసక్తి గల తల్లీ ! నా కంటికి నీ కనుబొమలు మన్మథుని ధనస్సువలె అగుపిస్తున్నాయి. తుమ్మెదల కాంతివంటి కాంతి కల్గిన నీ కన్నులు, ఆధనుస్సుకుకూర్చబడిన వింటినారివలె కనిపిస్తూ ఉన్నాయి . నీ కనుబొమలు కొంచెము వంగి ఉన్నాయి . మన్మథుడు ఆవింటిని తన ఎడమచేతి ముంజేతితోనూ ,పిడికిలితోనూ పట్టుకొన్నందువల్ల వింటి నడిమి భాగము కానరాక దాగియున్న మన్మథుని కోదండముగా (విల్లుగా) నాకంటికి తోచుచున్నది.

48

తే.గీ.  పగలు కొలుపు నీ కుడికన్ను పరగు రవిని,

రాత్రి నెడమకన్నది కొల్పు రాజుఁ గలిగి,

నడిమి నేత్రమగ్నియగుటన్ నడుపు సంధ్య,

కాలరూపమే నీవమ్మ కమలనయన! ॥ 

భావము.

ఓ జగన్మాతా ! నీ కుడికన్ను సూర్యుని రూపం . అందువల్ల అది పగటిని కలిగిస్తున్నది . నీ ఎడమ కన్ను చంద్రుని స్వరూపం. అందువల్ల అది రాత్రి ని తలపిస్తున్నది. కొంచముగావికసించిన బంగారు కమలము వంటిదైన నీనొసటియందున్న మూడవ నేత్రము యొక్క దృష్టి , దివారాత్రముల మధ్య సంచరిస్తున్న ప్రాతస్సంధ్య, సాయంసంధ్య, అనే ఉభయ సంధ్యా కాలములనూ చక్కగా ధరిస్తున్నది. (అనగా ఉభయ సంధ్యలనూ పుట్టిస్తున్నది).

49

శా.  అమ్మా! నీ కను చూపులా విరివియై యత్యంత తేజంబులై,

నెమ్మిన్ మంగళ హేతువై, విజిత సన్నీలోత్పలోత్తేజమై,

యిమ్మున్ సత్కరుణాప్రవాహ ఝరియై, హృద్భా! యనిర్వాచ్యజీ

వమ్మై, మాధురినొప్పి, కాచునదియై, భాసిల్లు పల్ పట్టణా

ర్థమ్మౌచున్, వర నామరూపమగుచున్, ధాత్రిన్ బ్రకాశించునే. ॥

భావము.

దేవీ ! నీచూపు విశాలమై "విశాల" అనే నగరము యొక్క పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై యున్నది . కళ్యాణప్రదమై "కళ్యాణి" అనే పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై ఉన్నది . చక్కని కాంతి కల్గి నల్ల కలువల చేత ఎదుర్కొన బడుటకు వీలు కానిదై(నల్ల కలువలను మించిన నేత్ర సౌందర్యంకలదై "అయోధ్యా" నగరము పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై యున్నది. కృపామృతధారలకు ఆధారమై "ధారా" నగరము పేరుతో వ్యవహరింౘ డానికి తగినదై ఉన్నది. అవ్యక్త మధురమై "మధురా" నగరము అను పేరుతో పిలువబడుటకు తగినదై ఉన్నది . లోపల వైశాల్య ముగలదై " భోగవతి" అనే నగర నామముతో వ్యవహరించుటకు తగిన దైయున్నది. ఆశ్రితులను రక్షించు నదై "అవంతీ" నగరము అనే పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై యున్నది.ఆయానగరముల యొక్క విజయముకలదై " విజయ నగరము" అనే పేరుతో వ్యవహరింప యోగ్యమై _ నిశ్చయముగా ప్రకాశిస్తున్నది.

50

చం.  కవుల కవిత్వసన్మధువు కమ్మగ ప్రీతిని గ్రోలనెంచియున్, 

చెవులను వీడనట్టివియు, శ్రీకరమైన సునేత్ర సన్మిషన్,

ప్రవిమల తేజ సద్భ్రమర భాతిని జూచి యసూయఁ జెంది, మూ

డవదగు నేత్ర మెఱ్ఱఁబడె నమ్మరొ నీకు, మనోహరాకృతీ! ॥ 

భావము.

దేవీ కవీశ్వరులు రసవత్తరముగా రచించిన రచనలు అనే మకరందమును ఆస్వాదించుట యందు ప్రీతి కలిగి నట్టియు , అందుచే చెవుల జంటను విడువ నట్టివియు , నవ రసములనూ ఆస్వాదించుట యందు మిక్కిలి ఆసక్తి కలిగినట్టివియు అయిన నీ కడగంటి చూపులు అనే మిషతో ఉన్న తుమ్మెదల జంటను చూచి, అసూయ చేతనో ఏమో నీ ఫాలనేత్రము కొంచము ఎర్రవారినది.

51

ఉ.  సారస నేత్ర! నీ కనులు శర్వునెడన్ గురిపించు దివ్య శృం

గారము, నారడిన్ గొలుపు కల్మషులందు, భయానకంబు సం

చార భుజంగ భూషలన, స్వర్ఝరిపైన ననన్యరోషమున్,

కోరుచు నా పయిన్ గరుణ, గోపతి గాధలకద్భుతంబు నా

వీరము పద్మరోచులను, విస్త్రుత హాసము మిత్రపాళికిన్,

చేరఁగ వచ్చు భక్తులకు శ్రీలను గొల్పుచు నొప్పుచుండెనే. ॥

భావము.

తల్లీ! నీ కన్నులు శివుని ఫాలభాగము చూచినప్పుడు అద్భుత రసమును, శివుని సర్పములను చూచినప్పుడు భయానకరసమును, పద్మముల ప్రకాశముతో వీరరసమును, సఖులయందు స్నేహముతో హాస రసమును, నావంటి భక్తులయెడల  అనుగ్రహమువలన  కరుణ రసమును కలిగి యుండును.

52

సీ.  గిరిరాజకన్యకా! పరికింపగా నీదు కర్ణంతమున్నట్టి కంటి చూపు

మదను నారవబాణ మహిమతోనొప్పుచు త్రిపురాసురాంతకు దివ్యమతిని

శృంగార భావనల్ చెలగునట్లుగఁ జేయు చున్నదో జగదంబ! మన్ననముగ, 

బలశాలియౌ శివున్ బలహీనునిగఁ జేసె మానసమందున మరులు కొలిపి,


తే.గీ. కరుణకాకరంబైనట్టి కనులు నీవి

భక్తపాళిని కాపాడు శక్తి కలవి,

నేను నీ భక్తుఁడను, కృపన్ నీవు నన్ను

కరుణఁ జూచుచున్ గాపాడు కమల నయన! ॥

భావము.

ఓ జగన్మాతా! ఆకర్ణాంతం విశాలములైన నీ కడగంటి చూపులు. మన్మధుని విల్లుకు ఎక్కుపెట్టబడిన ఆతని 6వ బాణం - (చివరిబాణం - అస్త్రంతో సమానం అయినది) లా కనిపిస్తూ, మన్మధుని దహించి- కామమును జయించానని భావించిన, త్రిపురములను మట్టుబెట్టగలిగిన - నీ పతి అయిన పరమశివునిలో సైతమూ, శృంగార భావరసా విష్కరణను చేయుచున్నది!

53

తే.గీ.  అర్థ వలయ నేత్రత్రయ మమరె నీకు

మూడు వర్ణంబుల లయము పొందినట్టి

బ్రహ్మవిష్ణుమహేశులన్ వరలఁజేయ

త్రిగుణ తేజంబునొప్పెను త్రినయనములు. ॥ 

భావము. 

శివుని ప్రియురాలైన దేవీ! ఓ పార్వతీ ! ఈ కన్పిస్తున్న నీ మూడు కన్నులునూ, అర్ధ వలయాకారంగా విలాసము కొఱకై తీర్చి దిద్ధి న కాటుక కలిగినవియై, విభజింప బడిన ఎరుపు, తెలుపు, నలుపు అనే మూడు వర్ణములు కలిగినవియై యుండి, ప్రళయ సమయమున నీ యందు లీనమైన బ్రహ్మ , విష్ణు, రుద్రులనే దేవతలను, తిరిగి ఈ బ్రహ్మాండము నందు సృష్టించడానికై సత్వరజస్తమో గుణములనే మూడు గుణములనూ ధరిస్తున్నావా అన్నట్లు ప్రకాశిస్తున్నాయి.

54

శా.  మమ్ముం జేయగ సత్ పవిత్రులుగ నమ్మా! సద్దయార్ద్రంపు శో

ణమ్మున్ శ్వేతము,కృష్ణమున్,గలుగు జ్ఞానంబిచ్చు నీ మూడు నే

త్రమ్ముల్ శోణను,గంగ నా యముననిద్ధాత్రిన్ గృపన్నొక్కెడన్

నెమ్మిన్ మూడగు తీర్థముల్ నిలిపితే, నిన్ గొల్వ నే నేర్తునే? ॥

భావము.

పశుపతియైనశివునియందులగ్నమైనచిత్తము కలదానా ! దేవీ దయారసముతో కూడిన యెరుపు, తెలుపు, నలుపు కాంతులు కలవైన నీ కన్నులచే ఎర్రని జలప్రవాహముగల శోణ నదము, తెల్లని జల ప్రవాహము గల గంగ, నీల జలప్రవాహముగల యమున అనే మూడు నదుల సంగమ స్థానమును మమ్ము లను పవిత్రులనుగాచేయటానికైమాకుసంపాదించిఇస్తున్నావు.ఇదినిజము.

55

కం.  నీ కనులు మూసి తెరచిన 

లోకమె ప్రళయంబునకును లోనగునమ్మా!

లోకప్రళయము నిలుపన్

నీ కనులను మూయవీవు నిత్యముగ సతీ! ॥

భావము.

ఓ తల్లీ! పర్వతరాజ పుత్రికా! నీ కను రెప్పలు మూతపడడం వల్ల జగత్తుకు ప్రళయమున్నూ , కను రెప్పలుతెరచు కోవడం వలన జగత్తు సృష్టించ బడుతుందని పండితులు తెలుపుచున్నారు. ఈ విధంగా నీనిమేష, ఉన్మేషముల వలన జగత్తు యొక్క ఉత్పత్తి వినాశ ములు జరుగుతున్నవని , దానిని ప్రళయము నుండి రక్షించు కొనుటకై నీ రెప్పలు వికసించుట వలన పుట్టిన ఈ సర్వ జగత్తునూ నాశనం పొందకుండా కాపాడడానికై, నీవు కనురెప్పలు మూయడం మానివేశావని భావిస్తున్నాను .

56

సీ.  అమ్మ నీకండ్లతో నెమ్మిఁ బోల్చుకొనెడి మత్స్యముల్ బెదరుచు మడుగులోన

దాగు, నీ చెవులలోఁ దమ గుట్టు చెప్పు నీ కన్నులనుచు, మచ్చకంటి! వినితె?

మడుగులందున రాత్రి వెలుగు, పగటిపూట వెలుగు నీ కనులందు గలువ, కనుమ,

మహిత కర్ణాంతమౌ మహనీయ నేత్రవు, కరుణఁ జూపెడితల్లి! కనకదుర్గ!


తే.గీ. మ చ్చ కంటివి నీవమ్మ! మాదు జనని!

కలువ కంటివి, నీరూపుఁ గనెడి కనులు

కనులు నిజముగ, కాకున్న కనులు కావు, 

నిన్నుఁ గాంచగాఁ జేయుమా నేర్పునొసఁగి. ॥ 

భావము.

అమ్మా! ఓ అపర్ణా! నీ చెవులకు తాకుతున్నట్లు నీ కనులు కనబడటం వలన, ఆ చెవులకు తమ రహస్యం వెల్లడి కాకుండా తమను అమ్మ కళ్ళతో పోల్చుకున్న చేపలు బెదిరి తమ రూపాలను కనబడనీయకుండా నీటిలో దాక్కున్నాయి. నీ కనులలో నున్న కాంతియైన సౌభాగ్య లక్ష్మి ని కలువలు ఆవిష్కరించాయని నీ చెవులతో నేత్రాలు చెబుతాయేమోనని భయపడి ఆ పూవుని విడిచి రాత్రి సమయంలో ఆ పూవుల రేకు డిప్పలను తెరిచి ప్రవేశిస్తోంది. అమ్మ సౌందర్యముతో తమను తాము పోల్చుకున్నామనే బెరుకు వీటిచే ఆ పని చేయింస్తోంది కదా.

57

ఉ.  దీనుఁడనమ్మ! దూరముగ తేజము కోల్పడి యున్న నాపయిన్

నీ నయన ప్రదీప్తి నిక  నిత్యముగా ప్రసరింపనీయుమా,

హానియొకింతయున్ గలుగదమ్మరొ నీకుఁ, నమస్కరించెదన్,

యేణభృతుండు వెన్నెలనదెక్కడనైనను పంచు తీరునన్. ॥

భావము.

తల్లీ! పార్వతీదేవీ! నీ నేత్రము మిక్కిలి దీర్ఘమైకొంచముగా వికసించిన నల్ల కలువల కాంతి వంటి కాంతితో చక్కగా ఉన్నది. నేను నిన్ను శ్రద్ధ గా ఉపాసించలేని దీనుడను. కాబట్టి ఎంత దూరమైనా ప్రసరింప జేయగల నీ కడగంటి చూపును నీకు మిక్కిలి దూరంలో ఉన్న నాపై కూడా ప్రసరింప జేసి, నీ దృష్టి నుండి ప్రసరించే కృపారసముతో నన్ను కూడా(తడుపుము) స్నానమాడింపుము. నీవు నీ కడగంటి చూపులోని కృపారసముతో తడిపినంత మాత్రము చేతనే , నేను ధన్యుడ నవుతాను. ఈ మాత్రం నన్ను కనికరించడం వలన నీకు ఏ విధమైన లోటూరాదు. (నీకు పోయేదేమీలేదు) నీ వామ నేత్రమయిన చంద్రుడు , తన కిరణాలను అడవి లోనూ రాజభవనముల మీదనూ సమముగానే ప్రసరింపజేస్తున్నాడుకదా!

58

ఉ.  వంకరనుండు నీ కణఁత భాగములన్ గిరిరాజపుత్రికా!

జంకరదెవ్వరున్ దలపఁ జక్కని కాముని విల్లటంచు, న

వ్వంకను కన్నులడ్డముగ భాసిలుచున్ మది నమ్ము విల్లుపై

నంకితమైనటుల్ తలచునట్టులఁనొప్పుచునుండెనొప్పుగన్. ॥ 

భావము.

ఓ పర్వతరాజ పుత్రీ ! పార్వతీ ! అందముగా వక్రముగా ఉన్న నీ చెవితమ్మల జంటను చూస్తే, భావుకులకు అవి పుష్ప బాణుడైన మన్మథుడి ధనస్సులో ఏమో అనే భావన కలిగి , చూడ ముచ్చటగా ఉంటుంది . ఎందుకంటే , నీ కడగంటి ప్రసారము , అడ్డముగా తిరిగి చెవి త్రోవను దాటి , (చెవుల అంచుల వరకు చేరి) ప్రకాశిస్తూ బాణములు సంధింప బడుతున్నాయనే ఊహను కల్గిస్తుంది. (దేవి క్రీగంటి చూపులు, మన్మథుడి పూల బాణాలని , శ్రీదేవి చెవి తమ్మెలు (కణతలు), మన్మథుని ధనస్సులనీ భ్రాంతిని కల్గిస్తున్నాయి). వంగిన విల్లు లేదా ఎక్కుపెట్టిన విల్లు నుంచి బాణ పరంపర వర్షించడం సహజమేకదా! ఇక్కడ వర్షించేవి ఎటువంటి బాణాలు ? కరుణా కటాక్షములనే చూపుల బాణాలు . అవి కడగంటి నుంచి మొదలై, చెవుల పర్యంతమేగాక. చెవులనూదాటిపోతూన్నాయికదా!

59

చం.  సురుచిరమైన నీ ముఖము, సుందర గండ యుగంబు గొప్పగా

మెరియుచు నీదు కమ్మల భ్రమింపగఁ జేసెడుఁ నాల్గు చక్రముల్

ధర మరు తేరిఁ బోల, శశి  ధత్ర సుచక్ర ధరా రథాన సుం

దరహరుఁడెక్కియుండ హరినందనుఁడేచుచుఁ బ్రేమఁ గొల్పెనే. ॥ 

భావము. 

తల్లీ, వీ మెఱుఁగుచెక్కిళులయందు ప్రతిఫలించి నాలుగుగాఁ దోచుచున్న రెండుకమ్మలు గల యీ నీ ముఖమును జూచి యిది నాలుగు చక్రములు గల మన్మథుని తేరుగాఁ దలంచెదను. దేని నెక్కి మన్మథుఁడు సూర్యచంద్రులు గాండ్లుగాఁగల భూమియను రథము నెక్కి గొప్ప ప్రమథ సైన్యమును వెంటఁ దీసికొనివచ్చిన యీశ్వరునితో నళుకులేక ప్రతిఘటించుచున్నాఁడు.

60

శా.  వాణీ గానసుధాస్రవంతి కుశలత్వప్రాభవంబీవు సు

జ్ఞానీ! దోసిటఁ గ్రోలుచున్ వర శిరఃకంపంబుతో నెన్నుటన్

మాణిక్యాంచిత కర్ణభూషలటులే మార్మ్రోగు కంపించుచున్

దానిన్ సత్ప్రణవంబుఁ బోలెడి ఝణత్కారంబహో! శ్లాఘ్యమే. ॥

భావము. 

అమ్మా శర్వాణి,  సరస్వతీదేవియొక్క మథుర గానామృతముయొక్క సౌభాగ్య సంపదను, ఎడతెగని దోసిళ్ళతో త్రాగుచు ఆశ్చర్యముతో కంపించు శిరస్సుగల నీ కర్ణాభరణములన్నియు, అధికఝణఝణధ్వనులతో అనగా అధిక ఓంకారనాదములు ప్రతిమాటలుగా  పలుకు చున్నవి.

61

చం.  హిమగిరి వంశ కేతన! మహేశ్వరి! నీ దగు ఘ్రాణ వంశ మ

ద్ది మహిత సత్ఫలంబులిడు, దేవి! త్వదీయ కృపన్, గనంగ, న

క్రము తన లోన నిందు వర రత్నముదాల్చుచు నిందునాడి మా

ర్గమున గమించుదానినె దగన్ బయటన్ ధరియించె గొప్పగన్. ॥ 61॥

(నక్రము=ముక్కు,ఇందు(వర)రత్నము=ముత్యము,ఇందు నాడి=ఇడానాడి)

భావము. 

హిమగిరి వంశధ్వజమునకు పతాకము వంటి ఓ హైమవతీ ! నీ నాసిక అను వెదురు దండము  లోపల ముత్యములను ధరించుచున్నదని చెప్పవచ్చును. కారణమేమనగా – నీ నాసాదండము ముత్యములతో సమృద్దిగా నిండి వుండగా చంద్ర సంబంధమైన వామనిశ్వాస మార్గము ద్వారా (ముక్కుకు ఎడమవైపు) ముత్యము బయటకు వచ్చి నాసికకు కింద కొన యందు ముత్యముతో కూడిన ఆభరణమగుచున్నది గదా! ఆ నీ నాసావంశదండముమాకు తగిన విధముగా కోరిన వాటిని ప్రాప్తింపచేయుగాక! 

62 

మ.  జననీ! నీ యధరారుణప్రభలు సాజంబమ్మ! నే దెల్పెద

న్వినుతింపందగు పోలికన్, బగడమే బింబంబు పుట్టించినన్

ఘనమౌ నీ యధరారుణప్రభలనే కల్గించు నవ్వాటికిన్,

విన సొంపౌ తగు సామ్యమున్ దలపగా వ్రీడన్ మదిన్ బొందదే? ॥ 

 భావము. 

సుందరమైన దంత పంక్తిగల దేవీ! సహజముగానే పూర్తిగా కెంపురంగులో ఉండు నీ రెండు పెదవులకు చక్కని పోలికను చెప్పెదను. పగడపు తీగ పండును పండించగలిగినచో, అది నీ పెదవులను పోల్చుటకు సరిపోవచ్చును. దొండపండువలె ఉన్నవని చెప్పవచ్చును. కానీ, అవి నీ పెదవుల ఎరుపురంగు వాటిపై ప్రతిఫలించగా, ఎరుపుదనమును పొందినవని వాటి “బింబము” (దొండపండుకు మరో పేరు) అన్న పేరే చెప్పుచున్నది.  మరి, నీ ఎర్రని పెదవులలో కనీసము 16వ వంతు సామ్యమును కలిగినవని చెప్పుకొనుటకైనా అవి సిగ్గుపడతాయి.

63 

శా.  అమలా! నీ నగుమోము చంద్రికలనే యాస్వాదనన్ జేయ, ను

త్తమ మాధుర్యము నాల్కలన్ నిలిచె మాతా! యీ చకోరాళికిన్,

రమణీ! చంద్రునినుండియామ్లరుచులన్ బ్రార్థించి యాచంద్రికల్

ప్రముదంబున్ గొను కాంచికన్ నిశలలో భావింప చిత్రంబిదే. ॥ 

 భావము. 

తల్లీ! జగజ్జననీ! నీ ముఖము అనే చంద్రుని యొక్క చిరునవ్వు అను వెన్నెలనంత అమితముగా గ్రోలిన చకోర పక్షులకు, ఆ వెన్నెల వెర్రి తీపిగా ఉండుట చేత వాని నాలుకలు ఆ తీపితో చచ్చుబారి, రుచి కూడా పట్టనివయ్యెను. అందువలన ఆ చకోర పక్షులు ఏదైనా పుల్లగా ఉండు వాటిని త్రాగి, తీపితో నాలిక మొద్దుబారి, మొద్దుబారిన తనమును పోగొట్టు కొనదలచి, చంద్రుని వెన్నెల అను అమృతమును, బియ్యపు కడుగు నీరు లేదా అన్నపు గంజి అను భ్రాంతితో ప్రతి రాత్రి మిక్కిలిగా త్రాగుచున్నవి. (అంటే అమ్మ చిరునవ్వు అమృతం కంటే మిన్నగా ఉన్నదని భావము).

64

చం.  సతతము నీ సదాశివుని సన్నుతిఁ జేయుచునుండుటన్ సతీ!

యతులిత జిహ్వ యెఱ్ఱఁబడెనమ్మరొ నీకు, గణింపగా, సర

స్వతి సతతంబు నాల్కపయి సన్నుతినొప్పుచునుండుటన్ లస

న్నుతమగు పద్మరాగ రుచితో పరిణామము పొందియుండెడిన్. ॥ 

భావము. 

తల్లీ! జగజ్జననీ! నీ నాలుక, నిరంతరము నీ పతియైన సదాశివుని విజయ గుణగణముల చరిత్రలను, ఎడతెరిపి లేకుండా చెప్పుచుండుట వలన, మందార పుష్పము యొక్క ఎర్రని కాంతులు గలదై ప్రకాశించుచుండుటయేగాక, తన నాలుక యందే ఎప్పుడూ ఆసీనురాలై, పూర్తిగా స్ఫటికము వలె తెల్లగా ఉండే సరస్వతీ దేవిని సైతము పద్మరాగమణి కాంతులతో ఎర్రని రూపముగల దానిగా మార్చుచున్నది.

65 

తే.గీ.  పావకియు నింద్రవిష్ణువుల్ బవరవిజయు

లయి నినున్ గాంచ తలపాగ లచట వదలి

కవచములు దాల్చి శివమాల్యము విడి నీదు

వదన తాంబూల మందగ  వచ్చిరమ్మ. ॥ 

భావము.

తల్లీ! జగజ్జననీ! యుధ్ధమునందు రాక్షసులను జయించి తమ తలపాగలను తీసివేసి, కవచములు మాత్రము ధరించిన వారై, యుద్ధరంగము నుండి మరలి వచ్చుచు, ప్రమథగణములలో ఒకడైన చండునికి చెందు- శివుడు స్వీకరించి విడిచిన గంధ తాంబూలాదికములను వదలి, జగదంబ నివాసమునకు  వచ్చిన కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువులు- నీ నోటినుండి వెలువడి వచ్చిన తాంబూలపు ముద్దలను గ్రహించగా ఆ తాంబూలపు ముద్దలలో చంద్రుని వలె స్వచ్చముగాను, నిర్మలముగాను ఉండు పచ్చ కర్పూరపు తునకలు గూడా పూర్తిగా నమలబడి, మ్రింగబడి ఆ తాంబూలములు పూర్తిగా జీర్ణమై లీనమైపోవుచున్నవి.

66

ఉ.  వాణి విపంచిపై శివుని పావనసచ్చరితంబు మీటుచున్

నీ నయవాక్సుధార్ణవము నెమ్మిని భావనఁ జేసి దానితో

వీణియ పోలదంచు కని వేగమె కొంగున కప్పె వీణనే,

ప్రాణము నీవెయై మదిని వర్ధిలు తల్లి! నమస్కరించెదన్. ॥ 

భావము. 

తల్లీ! సరస్వతీదేవి వీణను శృతిచేసి నీ ఎదుట పశుపతి వీరగాధలను గానం చేస్తూంటె నువ్వు ఆనందం పొంది , ఆమెపాటను మెచ్చుకుంటూ ప్రశంసా వాక్యాలు చెబుతుంటె , నీ వాజ్మాధుర్యం తన వీణానాదంకంటె మాధుర్యం కలదని తెలిసి ఆమె తనవీణను కనపడకుండా వస్త్రంతో కప్పి దాస్తుంది.

67

చం.  జనకుఁడు ప్రేమగా నిమురు చక్కని నీ చుబుకంబు, నీ ధవుం

డనవరతంబు నీ యధరమానెడి వేడ్కను తొట్రుబాటుతోఁ

జనువున పట్టి తేల్చుకద చక్కని మోవి, సఖుండు చేతఁ లే 

పిన ముఖమన్ లసన్ముకురవృంతము, నాకదిపోల్చ సాధ్యమా. ॥ 

భావము. 

ఓ గిరి రాజకుమారీ! తండ్రి అయిన హిమవంతుని చేత, అమితమైన వాత్సల్యముతో మునివేళ్ళతో తాకబడినది, అధరామృతపానమునందలి ఆతృత, తొట్రుపాటులతో శివునిచే మాటి మాటికీ పైకెత్తబడినది, శంభుని హస్తమును చేకొనతగినది, సరిపోల్చతగినది ఏమీ లేనిది అయిన- నీ ముఖము అను అద్దమును పుచ్చుకొనుటకు, అందమైన పిడివలె నున్న నీ ముద్దులొలుకు చుబుకమును(గడ్డము)ను ఏ విధముగా వర్ణించగలను?

68

చం.  పురహరు బాహు బంధమునఁ బొల్పగు నీదగు కంఠనాళమే

సురనుత! కంటకాంకుర ప్రశోభితవారిజనాళమట్లు కాన్

వరలుచు గంధ పంకమున భాసిలె హారము నాళమట్లుగన్.

నిరుపమ! నిన్ మదిన్ నిలిపి నేను భజించెదఁ గాంచుమా కృపన్. ॥ 

భావము. 

తల్లీ! జగజ్జననీ! పురహరుని బాహువులతో, కౌగిలింతలతో నిత్యము గగుర్పాటుతో రోమాంచితమై, కింది భాగము సహజముగానే స్వచ్చముగా ఉండి- నల్లగా, విస్తారముగా ఉన్న అగరుగంధపు సువాసనతో, తామరుతూడు అందమును మించిన ముత్యాల హారముతో ఉండుటవలన – నీ మెడ నీ ముఖమనే పద్మమునకు ఒక కాడవలె ఉన్నది.

69

తే.గీ.  గమక గీతైక నిపుణ! నీ కంఠ రేఖ

లు తగె మూడు సూత్రపు ముడులువలెనమ్మ!

షడ్జ, మధ్యమ, గాంధార, సంస్తుతగతి

కమరు హద్దన నొప్పె, మహత్వముగను. ॥ 

భావము. 

సంగీత స్వరగాననిపుణీ, జగజ్జననీ! నీ కంఠము నందు కనబడు మూడు భాగ్యరేఖలు – వివాహ సమయమునందు పెక్కు నూలు పోగులతో ముప్పేటలుగా కూర్చబడి కట్టిన సూత్రమును గుర్తుతెచ్చుచు, నానా విధములైన మధుర రాగములకు ఆశ్రయ స్థానములైన షడ్జమ, మధ్యమ, గాంధార గ్రామముల ఉనికి యొక్క నియమము కొరకు ఏర్పరచిన సరిహద్దుల వలె ఉన్నట్లు శోభాయామానముగా ప్రకాశించుచున్నవి.

70

శా.  అమ్మా! శూలి నఖంబులన్ జిదిమె నమ్మా! నాదు శీర్షంబటం

చిమ్మా రక్షణమంచు బ్రహ్మ గిలితో నీశాని! శీర్షాళితో

నెమ్మిన్ నీ మృదుహస్తపల్లవములన్ నేర్పార వేడెన్, సతీ!

యిమ్మా మాకును నీదు రక్ష జననీ! హృద్యంబుగా నెల్లెడన్. ॥ 

భావము. 

తల్లీ జగజ్జననీ! తామర తూడువలె మృదువుగా తీగలవలె ఉండు నీ బాహువుల చక్కదనమును చూసి, బ్రహ్మ తన నాలుగు ముఖములతో – పూర్వము తన ఐదవ శిరస్సును గోటితో గిల్లి వేసిన శివుని గోళ్ళకు భయపడుచూ, ఒక్కసారిగా తన మిగిలిన నాలుగు శిరస్సులకు నీ నాలుగు హస్తముల నుండి అభయ దానము కోరుచూ, నిన్ను స్తుతించుచున్నాడు.

71

చం.  విరియుచునున్న తామరల విస్తృతశోభనె వెక్కిరించు నీ

మురిపెము గొల్పు చేతులను బోల్చగ నాకది సాధ్యమౌనొకో?

సరసున క్రీడసల్పురమ చక్కగనున్నెడ, పాదలత్తుక

స్ఫురణను బొందినన్ దగును బోల్చఁగఁ గొంత, నిజంబు పార్వతీ! ॥ 

భావము. 

ఓ తల్లీ! ఉమా, భవానీ, కళ్యాణీ! కాత్యాయనీ! సూర్యోదయ కాలమున వికసించుచున్న క్రొత్తతామరపూవు కాంతిని పరిహసించు చున్న గోళ్ల యొక్క ప్రకాశముచేత విలసిల్లుచున్న నీ హస్తముల యొక్క సౌందర్యమును ఏప్రకారముగా, అలంకార శోభితముగా వర్ణింపగలను ? ఒకవేళ - కమలములను తనపాదపీఠముగా చేసుకున్న లక్ష్మి దేవి చరణముల లత్తు కరసము (పారాణి) అంటుట వలన లేత ఎరుపురంగుకు వచ్చిన కమలములు - కొంతవరకూ, నీ కరముల కాంతి లేశమునకు సాదృశము కాగలదేమో.

72  

ఉ. నీ కుచ యుగ్మమున్ గని గణేశుఁడటన్ తన కుంభ యుగ్మమే 

నీకటు కల్గినట్టుల గణించుచు తా తడిమెన్ స్వకుంభముల్, 

ఏక నిమేషమందునె గణేశుని, సన్నుత శూర క్రౌంచభే

ద్యాకలిఁ దీర్చు నీ చనులు హాయిగ మమ్ములఁ గాచుఁగావుతన్. ॥ 

భావము. 

తల్లీ జగన్మాతా! నీ పుత్రులైన విఘ్నేశ్వర కుమార స్వాములచే, చనుబాలు ద్రావబడిన, నీకు చకుంభములు మా సర్వ క్లేశములను పోగొట్టుగాక! అమాయకుడైన బాల్య చాపల్యంతో కూడిన - విఘ్నేశ్వరుడు. నీ చనుబాలు ద్రావుచూ, మధ్యలో నీ స్తనములు తన చేతులతో తడివి ఒకవేళ తన కుంభస్థలం అక్కడకు వచ్చిందేమోనని భయపడి  తన తలపై కుంభస్థలం వుందో లేదోనని అనుమానం వచ్చి, తొండముతో తన తలను తడవుకొనటమనే చేష్టతో, తలి తండ్రులైన నీకు ఈశ్వరునికీ సోదరుడైన కుమారస్వామికీ -నవ్వు తెప్పించు చున్నాడు.

73 

చం.  అమిత సుధారసాంచితము లద్దిన కెంపులకుప్పెలెన్న నీ

విమలపయోధరంబులు, స్రవించెడి పాలను గ్రోలుటన్ సదా

హిమగిరి వంశ కేతన మహేశ్వరి! నీ వరపుత్రులిద్దరున్

బ్రముదముతోడ బాలురుగ వర్ధిలు చుండిరి బ్రహ్మచారులై. ॥ 

భావము.

అమ్మా! హిమవంతుని వంశమనే ధ్వజమునకుపతాక అయిన ఓ పార్వతీమాతా! నీ కుచములు అమృత రసముతో నిండి, మాణిక్యములతో నిర్మింపబడిన కుప్పెలు అనుటకు మాకు ఎటువంటి సందేహమునూ లేదు. ఎందుకు అనగా ఆ కుచముల పాలు త్రాగిన గణపతి, కుమారస్వామి ఇప్పటికినీ బాలురు గానే ఉన్నారు కదా!

74 

ఉ.  అమ్మరొ! నీదుహారము గజాసురకుంభజముత్యభాసితం

బెమ్మెయిఁ జూడ నిర్మలమహీనశుభాస్పద దోషదూరమో

యమ్మ! నిజారుణద్యుతి శుభాధర బింబము నుండి సోకి సాం

తమ్మును చిత్రవర్ణమయి త్ర్యక్షుని కీర్తి వహించె చూడగన్. ॥ 

భావము. 

అమ్మా! నీ మెడలో ధరించిన హారము గజాసురుని కుంభస్థలమునుండి పుట్టిన ముత్యములచే కూర్చబడినదియూ, దోష రహితమై నిర్మలమైనదియూ, దొండపండు వంటి పెదవి యొక్క కాంతులచే చిత్ర వర్ణముగా చేయబడి ఈశ్వరుని పరాక్రమము తో కూడిన కీర్తి ని వహించుచున్నట్లుగా కనబడుచున్నది.

75

మ.  హృదయోద్భూత మహత్వ వాఙ్మయ సుధా ధృత్వంబుగానెంచెదన్

క్షుధపోకార్పెడి నీదు స్తన్యమును, నాకున్ నీవు వాత్సల్య మొ

ప్పదయన్ బట్టిన కారణంబుననె యీ బాలుండు ప్రౌఢంపు సత్

సుధలన్ జిందెడి ప్రౌఢసత్ కవితలన్ శోభిల్లెనొక్కండుగా. ॥ 

భావము. 

అమ్మా! పర్వత నందినీ! నీ చనుబాలను హృదయము నుండి ప్రవహించుచున్న వాజ్మయముతో నిండిన పాలసముద్రము వలె నేను తలచు చున్నాను. ఎందువలన అనగా వాత్సల్యముతో నీవు ఇచ్చిన స్తన్యము త్రాగి ఈ ద్రవిడ బాలుడు ( శ్రీ శంకర భగవత్పాదులు) కవులలో మనోహరుడు అయిన కవి కాజాలెను కదా !

76

శా.  శ్రీమాతా! మదనుండు దగ్ధమగుచున్ శ్రీశంభు కోపాగ్నిలో

నీమంబొప్పగ రక్షకై దుమికె తా నీ నాభి సత్రమ్ములో,

ధీమంతుండు ప్రశాంతిఁబొందె శిఖి శాంతించన్ బొగల్ వెల్వడెన్

ధూమంబున్ గనుగొంచు నెంచితది నీ నూగారుగా శాంభవీ! ॥ 

భావము. 

అమ్మా! పర్వతరాజ కుమారీ ! మన్మధుడు పరమ శివుని కోపాగ్ని కీలలతో దహింప బడిన శరీరముతో నీ యొక్క లోతయిన నాభి మడువున దూకి తనను తాను కాపాడుకొనెను. కాలుచున్న వాని శరీరము చల్లారుట చేత వెడలిన పొగ తీగ బయల్పడగా , దానిని నీ యొక్క నూగారు ప్రాంతముగా కనబడుచున్నది కదా!

77 

మ.  జననీ! నీ కృశమధ్యమందుఁ గలదౌ సన్నంపు నూగారునే

కనినన్ నీ కుచపాళి మధ్యఁ గల యాకాశంబు సన్నంబు కాన్ 

ఘనమౌతా కృశియించి నల్లఁబడి యా కాళింది జారంగ ని

ట్లనవద్యంబగు  నూగుగాఁ దలతురే యారాధ్యులౌ పండితుల్. ॥ 

భావము. 

ఓ భగవతీ! యమునానదీ తరంగంవలె సన్ననిదై, నీ కృశమధ్యంలో అగపడే నూగారనే చిన్నవస్తువును చూసి యోచించగా - నీ కుచముల మధ్యనున్న ఆకాశం ఆకుచములురెండు పరస్పరం ఒరయటం వల్ల ఆఒరపిడికి తాళలేక నలిగినల్లనై సన్నగా కిందికి నాభివరకు లక్క జారినట్లు జారినదిగా వున్నది.

78 

ఉ.  నీదగు నాభి, గాంగ నుతనిర్ఝరలో సుడి, గుబ్బమొగ్గలన్

మోదము నిల్పు రోమలత మూలము, మన్మధతేజవహ్నికిన్

పాదగునగ్నిగుండ, మనవద్యరతీగృహ మాత్రిశూలికిన్

శ్రీద సునేత్రపర్వగుహ సీమపు ద్వారమవర్ణ్యమమ్మరో! ॥ 

భావము. 

ఓ హిమగిరికన్యకా ! నీ నాభి చలనంలేని గంగానది నీటి సుడిగాను , పాలిండ్లనే పూమొగ్గలకు ఆధారమైన రోమరాజి అనే తీగయొక్క పాదుగాను , మన్మధుడి తేజస్సనే అగ్నికి హోమకుండంగాను , మరుని చెలువ ఐన రతీదేవికి శృంగారభవనంగాను , నీ పతి ఐన సదాశివుడి నయనాల తపస్సిధ్ధికి గుహాద్వారమై , అనిర్వాచ్యమై , అతిసుందరమై సర్వోత్కర్షతో ప్రకాశించుచున్నది.

79 

ఉ.  శైలతనూజ! నీ నడుము చక్కని నీ స్తనభారమోపమిన్

బేలవమై కృశించి జడిపించును తా విఱుగంగనున్నటుల్

వాలిన యేటిగట్టుపయి వాలినచెట్టును బోలి, నీకికన్

మేలగుగాత, నీ నడుము మేలుగ వర్ధిలుగాక నిచ్చలున్. ॥ 

భావము. 

ఓ శైలతనయా ! ఓ నారీ తిలకమా ! సన్ననిదీ , పాలిండ్ల భారంచేత బడలినదీ క్రిందకువంగి తెగుతున్నదో అన్నట్లున్నదీ , కట్టతెగిన ఏటిగట్టునందలి చెట్టుతో సమానమైన స్ధితిని పొందినదీ , ఐన నీ నడుము చిరకాలం సురక్షితంగా వుండుగాక.

80 

చం.  చెమరుచు నీదు పార్శ్వముల చీలునొ చోలమనంగ నొత్తు నీ

విమల పయోధరంబులను విస్తృతిఁగొల్పెడి మన్మధుండు భం

గము కలిగింపరాదనుచు కౌనునకొప్ప వళీలతాళితో

సముచితరీతిఁ గట్టినటు చక్కగ నొప్పుచు నున్నదమ్మరో! ॥ 

భావము. 

ఓ ప్రకాశించే రూపుగల దేవీ! ఎప్పటికప్పుడే చెమట పోస్తున్న పార్శ్వాములలో అంటుకొనివున్న రవికెను పిగుల్చుచున్నవీ , బాహుమూలల సమీప ప్రదేశాలను ఒరయుచున్నవీ, బంగారుకలశంవలె ఒప్పారుచున్నవీ ఐన కుచములను నిర్మిస్తూన్న మన్మధుడు, యీ (స్తనభారంవల్ల ) భంగం కలుగరాదని నడుమును కాపాడటానికి అడవిలతలచేత ముప్పేటగా కట్టబడెనా అన్నట్లు నీ పొట్టమీద మూడుముడతలు తోచుతున్నవి.

81 

చం.  తనదు గురుత్వమున్, విరివి, తండ్రి నితంబము నుండి తీసి నీ

కని యరణం బొసంగుటను కల్గిన నీదు నితంబ భారమీ

ఘన ధరభారమున్ గెలిచె కప్పి విశాలతనొప్పి హైమ! నీ 

జనకుని కీర్తిపెంపయెను చక్కగ నీవు వెలుంగుచుండుటన్.

భావము.

ఓ గిరిజా ! పర్వతరాజగు నీ తండ్రి పామవంతుడు బరువును, విశాలత్వమును, తనకు చెందినకొండనడుమ యందు గల చదునైన ప్రదేశము నుండి వేరుచేసి తీసి కూతురునకు తండ్రీ యిచ్చు స్త్రీ ధనము రూపముగా సమర్శించెను, ఇందువలననే, నీ యొక్కకనబడుచున్నపిఋదుల యొక్క అతిశయము, గొప్పగా బరువు గలదియు, విశాలమైనదగుచు, సమస్తమైనభూమిని, ఆచ్చాదించుచున్నది. అనగా, కప్పుచున్నది. చులకన చేయుచున్నది, అనగా - తన కంటె తక్కువ చేయుచున్నదికూడా.

82 

మ.  గిరిజా! సన్నుత! యో విధిజ్ఞ! జయసంకేతమ్మ!  నీ యూరువుల్

కరి తొండమ్ముల, నవ్యదివ్య కదళీకాండమ్ములన్ గెల్చునే,

పరమేశానుని సత్ప్రదక్షిణవిధిన్ బ్రార్థించుటన్ జానువుల్

కరి కుంభమ్ముల మించియుండె, కన సంకాశమ్మె లేదీశ్వరీ! ॥ 

భావము. 

ఓ హిమగిరిపుత్రీ! వేదార్ధవిధి నెఱిగి అనుష్ఠించే రాణీ, నీ ఊరుపులు అందంలో గజరాజాల తొండములను ,బంగారు అరటిస్థంభాల సముదాయములను ధిక్కరిస్తున్నవి. నీ రెండు ఊరుపులు (తొడల) చేత జయించి , శోభనములై వర్తులములు కలిగినవీ భర్త ఐన పరమేశ్వరుడికి మొక్కటంచేత గట్టిపడినవైన నీ జానువులు , దిగ్గజాల కుంభస్థలముల జంటలను కూడ జయించి ప్రకాశిస్తున్నాయి.(ఈ బ్రహ్మాండమే అమ్మ స్వరూపమైనప్పుడు సృష్టిలోని ఏ శరీరం ఆమె సౌందర్యంతో తులతూగ గలదు ? తులతూగలేదు అని భావము).

83 

చం.  మదనుఁడు శంభునిన్ గెలువ మాతరొ! తా శరపంచకంబునే

పదిగనొనర్పనెంచి, తమ పాదపు వ్రేళ్ళను, పిక్కలన్ దగన్ 

మది శరపాళిగా, దొనగ, మన్ననఁ జేసె, నఖాళిముల్కులా

పదునుగ చేయబడ్డ సురపాళికిరీటపుకెంపులే కనన్. ॥ 

భావము. 

ఓ హిమగిరిసుతా! మన్మధుడు రుద్రుణ్ణి ఓడించటానికి తన ఐదుబాణాలు చాలవని వాటిని పదిబాణాలు చేసుకోనెంచి , నీ పిక్కలను అమ్ముల పొదులుగాను, కాలివ్రేళ్ళను బాణాలుగాను , నఖాగ్రాలను బాణాల కొనలందు పదనుబెట్టి ఉంచిన ఉక్కుముక్కలుగాను గావించుకొన్నాడు .( నమస్కరిస్తూన్న దేవతల కిరీటాలలోని మణులనే ఒరపిడి రాళ్ళచే నఖాగ్రాలనే ములుకులు పదను పెట్టబడినవి). 

84 

శా.  ఏ నీ పాదజలంబులాయెను హరుండే తాల్చు నా గంగగా,

యే నీ పాదపు కాంతిఁ గొల్పు ననఘుండే దాల్చు చూడామణి

న్నే నీ పాదములన్ ధరించు శ్రుతులున్ ధ్యేయంబుతో నెప్పుడు

న్నా నీ పాదములుంచు నాదు తలపైనమ్మా! కృపన్, నిత్యమున్. ॥ 

భావము. 

ఓ లోకమాతా! ఏ నీ చరణాలకు శివుడి జటాజూటంలో వర్తించే గంగ పాదప్రక్షాళన జలం అవుతుందో, ఏ నీ చరణలత్తుక రసంపు కాంతికెంజాయలు శ్రీ మహావిష్ణువు మణిమయ కిరీటానికి వెలుగును ఆపాదిస్తున్నాయో, శ్రుతులశిరస్సులైన ఉపనిషత్తులు ఏ నీ పదాలను సిగపువ్వుగా ధరిస్తున్నవో, ఓ మాతా! కృపతో కూడిన చిత్తంగల దానవైన నీవు, ఆ నీ చరణాలను నాశిరస్సుమీద కూడా ఉంచు.

85 

మ.  నయనానందకరంబుగా వెలుగు గణ్యంబైన పారాణితో.

జయ కంకేళికి తాకుటెంచి హరుఁ డీర్ష్యన్ బొంది యా పాదముల్ 

ప్రియమొప్పన్ దగులంగఁ గోరుఁ దనకున్, శ్రీదేవి! నీ పాదముల్ 

జయదంబై కృపఁ జూడ నన్నుఁ గొలుతున్ జక్కంగ నే భక్తితోన్.||

భావము. 

ఓ భగవతీ! లత్తుక రసంచే తడిసి కెంపుగొన్నదై , చూచువారి కనుదమ్ములకు మిగుల సొంపు నింపు గొలిపేదై చక్కగా వెలుగొందుతున్న నీ పాదద్వయానికి నమస్కరిస్తున్నాం. పశుపతి ఐన శివుడు ఏనీ పాదపద్మ తాడనాన్ని కోరుతూ , ఆతాడన భాగ్యానికి నోచుకునే అలరుల తోటలోని అశోకవృక్షాన్ని గాంచి దానిపై అసూయపడుతున్నాడో అట్టి నీ చరణారవిందాలకు నమస్కరిస్తున్నాను.

86 

చం.  పొరపడి నీ సపత్ని తలపున్ బ్రకటించియు మిన్నకున్న, నీ

చరణముతోడ తన్నితివి శంభుని, యందేలధ్వానమేర్పడన్,

మురియుచునున్న శంకరునిముంచుచు ప్రేమను కిల్కిలధ్వనుల్

సరసతఁ గాముడొప్పె గుణసంస్తుత! శాంభవి! నీవెఱుంగవా? ॥ 

భావము. 

తల్లీ! పొరపాటుగా నీదగ్గర సవతి పేరు జెప్పి తరువాత ఏమీ చేయటానికి తోచక వెలవెలబాటుచే లొంగిన భర్తను, నీ చరణ కమలంతో నుదుట తాడనం జరుపగా గాంచి శివుడికి శత్రువైన మన్మధుడు (ఇలాగైనా తనపగ తీరేట్లు శాస్తి జరిగిందని) నీ కాలి అందెల మ్రోతలచేత కిలకిలారావాన్ని గావించారు.

87 

ఉ.  నీ పదపద్మముల్ నిశిని, నిత్యము విచ్చి హిమాద్రినుండియున్,

మాపటి యంతమందయిన మాయవు, భక్తులకెల్ల సంపదల్

ప్రాపితమౌనటుల్ కనెడు, పద్మచయంబు నిశిన్ గృశించుటన్

నీ పదపాళిఁ బోలదుగ, నిత్యశుభంకరి! దివ్యశాంకరీ! ॥ 

భావము. 

ఓ జననీ! మంచుకొండలలో సైతం కుంచించుకు పోకుండా ఉండగలిగేవీ రాత్రీ పగలు వికసిస్తూ నీ భక్తులకు అనూన సంపదలను కలిగించేవీ ఐన నీ పాద కమలాలతో , మంచుచేత నశింపజేయదగినదీ లక్ష్మీదేవికి ఆలవాలమై రాత్రివేళలో ముడుచుకొని పోయేదీ ఐన సామాన్య కమలం ఏవిధంగానూ సరితూగదని చెప్పడంలో ఆశ్చర్యం ఏమున్నది ? 

88 

శా.  ఆమ్మా! కీర్తికి దావలంబగుచు, ఘోరాఘంబులన్, వ్యాధులన్,

నెమ్మిన్ బాపు సుకోమలంబయినవౌ నీ పాద పద్మమ్ములన్

సమ్మాన్యుల్ కమఠంపు కర్పరమనున్, సామ్యంబె? శ్రీకంఠుఁ డో

యమ్మా! పెండ్లికి బండరాతిపయినె ట్లానించె నీ పాదముల్. ॥ 

భావము. 

ఓ దేవీ! కీర్తికినెలవై సంకటములను పారదోలు కుసుమసుకుమారమగు నీపాదమును మహాకవులు క్రూరముగా తాబేటిబొచ్చెతో నెట్లుపోల్చిరో తెలియదు. వివాహకాలమందు శంకరుడు తాను దయగలవాడయ్యుండి రెండుచేతులతోబట్టి యెట్లుసన్నెకంటి (నూఱుడుఱాయి) ని నొక్కించెనో తెలియదు.

89 

చం.  దివిజులనంతభోగు, లటఁ దీర్చును కోర్కెలువారికే సదా

దివిఁగల కల్పకంబు, మరి దివ్యపు నీ పదపాళి పేదకున్

ప్రవిమలసంపదాళినిడు, భవ్యపు నీకర చంద్ర సత్ప్రభల్

దివిఁగలస్త్రీల హస్తములు దించఁగఁ జేయును, చండికా! సతీ! ॥

భావము .

చండీ నామంతో శోభిల్లే తల్లీ! నీ పాదాలు, సకలసంపదలతో తులతూగుతున్న దేవతలకు మాత్రమే కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని తలదన్నుతూ , దీనజనులకు మంగళకరమైన అధిక సంపదలను ఒసగుతున్నాయి. నీ గోళ్ళు దేవతాస్త్రీల కరపద్మాలను ముకుళింపజేసే చంద్రుడిలా శోభిల్లుతున్నాయి.

90 

మ.  ఘన మందార సుపుష్పగుచ్ఛములు నీకల్యాణపాదాళి, భా

వనఁ జేయంగ మరందముల్ జిలుకుచున్ భాగ్యాళినిచ్చున్గదా,

నిను భావించెడి నాదు జీవన సుకాండి క్షోభలే వాయుతన్

వినుతిన్ నీపదపద్మసన్మధువులేప్రీతిన్ సదా క్రోలుటన్. ॥ 90 ॥ (సుకాండి=తుమ్మెద)

భావము. 

తల్లీ! భగవతీ! జగన్మాతా! దీనుల కెల్లరకును, వాంఛానురూపమైన (వారి వారి కోర్కెలననుసరించి) సంపదను నిరంతరం ప్రసాదించేదియును, మిక్కిలి సౌందర్యము, లావణ్య సమూహము అనుపూ దేనియను (మకరందమును) వెదజల్లుచున్నదియు, కల్పవృక్ష రూపమైన నీ పాద పద్మముల యందు.మనస్సు + పంచేంద్రియములు అనెడి ఆరు పాదముల భ్రమరమునై నీ పాదకమలములందలి మకరందమును గ్రోలుదును గాక.

91 

శా.  నిత్యంబున్ కలహంసలెన్ని గనుచున్  నీదౌ పదన్యాసమున్

ప్రత్యేకంబుగ నేర్చుచుండె జననీ! వర్ధిల్లగా నెంచి, యౌ

న్నత్యంబుం గొలుపంగ శిక్షణము గ్రన్నన్ నేర్పునట్లొప్పుచున్

నిత్యంబీవు ధరించునందెల రవల్ స్నిగ్ధంబుగా నొప్పెడిన్. ॥ 

భావము. 

ఓ చారుచరితా! నీ అద్భుత గమన విన్యాసాన్ని గాంచి నడక నేర్చుకోదలచినవై, నీ పెంపుడు హంసలు తొట్రుపాటు చెందుతూ నీ గమన విలాసాన్ని వీడకున్నవి. అందువల్ల నీ పాద కమలం కెంపులు మొదలగు రత్నాలు తాపిన అందియ మ్రోతలనే నెపంతో, ఆరాజహంసకు ఖేలన శిక్షను గరుపుతున్నట్లుగా ఉన్నది.

92 

చం.  శివుఁడును, బ్రహ్మ విష్ణువులు, శ్రీకర రుద్రుఁడు నోమదంబ! నీ

కు విమల భక్తి మంచమునకున్ దగ నాలుగు కోడులైరి, నీ

వవిరళరీతి మంచమున హాయిగ విశ్రమమంద నా సదా

శివుఁడు త్వదీయ తేజమును చెన్నుగ నొంది ముదంబునొందెడున్. ॥ 

భావము. 

హే భగవతీ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే అదికార పురుషులు నలుగురు మహేశ్వరతత్వంలో అంతర్గతులైనవారు కాబట్టి నువ్వు అధిష్టించే మంచముయొక్క నాలుగు కోడులై వున్నారు. సదాశివుడు విమలకాంతి ఘటనారూపం వ్యాజాన దుప్పటమగుతూ , నీ మేనికాంతులు ప్రతిఫలించటంచేత ఎర్రబారిమూర్తిమంతమైన శృంగారరసంవలె నయనాలకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ( తెల్లని కాంతిగల శివుడు దేవి మేని ఎర్రని కాంతులు ప్రతిఫలించగా ఎర్రనివాడై ఆమెను సేవిస్తున్నాడని భావము.)

93 

చం.  జనని యరాళ కేశములు, చక్కని నవ్వు, శిరీషపేశలం

బనఁదగు చిత్తమున్, సుకుచ భార నితంబము లొప్పియుండి వీ

క్షణముల గాచు నీ జగతి సన్నుతమౌ దయతోడనొప్పె నా

ఘనమగు శ్రీసదాశివుని కమ్మని యా యరుణప్రభాధృతిన్. ॥ 

భావము.

తల్లీ! శంభుడి అనిర్వాచ్యమైన అరాళా అనేశక్తి నీ కురులలో ప్రకాశిస్తోంది. చిరునవ్వులో నీదు సహజమైన సరళా అనేశక్తి ప్రకాశిస్తూంది. చిత్తంలో దిరిసెన పువ్వులాగా మిక్కిలి మెత్తనైన శక్తి ప్రకాశిస్తోంది. స్తనప్రదేశంలో సన్నికల్లు శోభగల శక్తి ప్రకాశిస్తోంది. పిరుదులలో స్థూలశక్తి ప్రకాశిస్తూంది. దేవి జగత్తును రక్షించటానికి అరుణ అనే శక్తీ, కరుణ అనే శక్తీ భాసిల్లుతున్నాయి.

94 

చం. చందురుఁడంచునెంచునది చంద్రుఁడు కాదు, సుగంధ పేటియే, 

యందలి మచ్చ నీదగు ప్రియంబగు కస్తురి, యెవ్వరెన్నుచున్ 

జందురుడందురందరది చక్కని నీ జలకంపు తావగున్,

చందురునొప్పునాకళలు చక్కని కప్పురఖండికల్ సతీ!

యందవి నీవు వాడ విధి యాత్రముతోడను నింపువెండియున్. ॥ 

భావము. 

మాతా! లోకంలోని జనులు అఙ్ఞానంతో దేన్ని చంద్రమండలమని తలచుతున్నారో , నిజానికది మరకత మణులచే చేయబడి నీవు కస్తూరి మొదలైన వస్తువులు ఉంచుకోనే భరిణ , చంద్రుడి కలంకంగాభావించబడుచున్నది . నువ్వు ఉపయోగించేకస్తూరి. దేన్ని చంద్రుడనుకుంటున్నారో అది నువ్వు జలకమాడే పన్నీరు నింపిన కుప్పె. చద్రకళలని భావించబడుతున్నవి పచ్చకప్పురపు ఖండాలు .నీవు ఉపయోగించటం వలన తరుగుతున్న ఈ వస్తువులను నీదు సేవకుడైన బ్రహ్నమరల నింపుతున్నాడు.

95 

ఉ.  పట్టపురాణివాశివుని పార్వతి! నీ పద దర్శనంబహో

యెట్టులఁ గల్గు పాపులకు? నింద్రుఁడు మున్నగువారలున్ నినున్

బట్టుగచూడ ద్వారములబైటనెయుండియు సిద్దులొందిరో

గట్టుతనూజ! నే నెటుల గాంచగఁజాలుదు నిన్ భజింపగన్? ॥ 

భావము. 

తల్లీ! భగవతీ! నువ్వు శివుడి పట్టపుదేవి వవుతావు. అందువల్ల నిన్ను పూజించే భాగ్యం చపలచిత్తులైన వారికి లభించదు. ఇంద్రుడు మొదలైన దేవతలు నీ ద్వారాల చెంత అణిమాది అష్టసిద్దులతోపాటు కావలి కాస్తున్నారు. ( చంచల చిత్తులుకాని సమయాచారులకే శ్రీ దేవి పాదాంబుజ సేవ లభిస్తుంది. . ఇంద్రాదులకు సైతం అష్టసిద్దులు లభిస్తాయి కానీ అమ్మపాదసేవాభాగ్యము లభించదని భావము.)

96 

సీ.  బ్రహ్మరాణిని గొల్చి భవ్య సత్ కవులయి వాణీపతిగ కీర్తిఁ బరగువారు,

శ్రీలక్ష్మినే గొల్చి శ్రీదేవి కృపచేత ధనికులై పేరొంది ధనపతులుగ

వెలుఁగువారు కలరు, విశ్వేశుఁడొక్కఁడే పార్వతీపతియని ప్రబలు ధాత్రి,

పతిని వీడక నిత్యమతనినే యెదనిల్పి పరవశించెడి నిన్ను బడయనేర


తే.గీ.  దవని కురవకమయిననో యమ్మ! నీదు

యెదను పులకించు భాగ్యము నిందువదన!

నీదుపతిఁగూడి యున్న నిన్ నాదు మదిని 

నిలిపి పులకించనిమ్ము నన్ నీరజాక్షి! ॥ 

భావము. 

పార్వతీ, సరస్వతీవ్రసాదముగల కవులందఱును సరస్వతీపతులే, కొంచెముధనముగలవాఁ డెల్ల లక్ష్మీపతియే, ఓ పతివ్రతాతిలకమా! నీ కథ మాత్ర మట్లుగాదు. నీకుచసంగ మొక యీశ్వరునకుఁ దక్క దోహదమను పేర న చేతనమగు గోరింటకుఁగూడ దొరకుట యరుదు.

97 

శా.  నిన్నేబ్రహ్మకు పత్నిగాఁ దలచుచున్ నిత్యంబు సేవింతు రా

నిన్నే విష్ణుని పత్నిగాఁ గొలుచుచున్ నేర్పార పూజింతు రా

నిన్నే శంభుని పత్నిగాఁ దలతురే నిత్యంబు వేదజ్ఞు లే

మన్నన్ వేరగు శక్తి వీ జగతి మోహభ్రాంతులన్ గొల్పితే.

భావము. 

ఓ పరబ్రహ్మ పట్టపుదేవీ! ఆగమవిధులు నిన్నే బ్రహ్మ పత్నివైన సరస్వతి అంటారు. నిన్నే శ్రీహరి పత్ని లక్ష్మి అంటారు. నిన్నే హరుని సహచారి ఐన గిరితనయ అంటారు. కానీ నువ్వు ఈమువ్వురికంటే వేరై నాల్గవదేవియై ఇట్టిదట్టిదని వచింప నలవిగాని ఆమెవై అనిర్వాచ్యవై, దేశ కాల వస్తువులకు అపరిచ్ఛిన్నమై, భేదించరాని మహాప్రభావం కలిగినదానవై, శుద్దవిద్యలో అంతర్గతమైన మహామాయవై, మాయాతత్త్వ మవుతూ ఈ ప్రపంచాన్ని నానా విధాలుగా మోహ పెట్టుతున్నావు.

98 

శా.  శ్రీలన్జిందు కవిత్వమొందగను నీ చెంతున్న విద్యార్థినే,

నీ లాక్షారస యుక్త పాదజలమున్ నే గ్రోలగానెప్పుడౌన్?

చాలున్ మూకకుఁ బల్కుశక్తినిడుచున్ సత్కైతలల్లించనా

మేలౌశారదవీటిఁబోలు రయి భూమిన్ నాకదెట్లబ్బునో?

భావము. 

అమ్మా! లత్తుక రసంతో కలిసిన నీ పాద ప్రక్షాళన జలాన్ని విద్యార్ధినైన నేను ఎప్పుడు గ్రోలతానో చెప్పు. సరస్వతీ మోము తారలోని తాంబూలరసమనదగ్గ నీ పాద ప్రక్షాళిత జలము మూగవారికి సైతం కవిత్వరచనా సౌభాగ్యాన్ని ప్రసాదించగలదు. ఆ లక్తకరసం నాకు ఎప్పుడు ప్రసాదిస్తావో గదా! నీ పాద ప్రక్షాళిత జలాన్ని నాకు ప్రసాదించి నాముఖం నుండి కవితా సుధారస ధారలను ఎప్పుడు ప్రవహింపజేస్తావో గదా! 

99 

మ.  నిను సేవించెడివాఁడు దివ్య ధనుఁడై, నిష్ణాతుఁడై విద్యలన్,

ఘనుఁడౌ బ్రహ్మకు, పద్మగర్భునకుఁ, గాకన్నీర్ష్యచేఁ గొల్పు, తా

తనువున్ దీప్తిని గల్గి యా రతిపునీతన్ మార్చు, నిస్సారమౌ

తనువున్ వీడి నిరంతముక్తిని గొనున్ తా సాంబునే దల్చుచున్. ॥ 

భావము. 

అమ్మా! ఓభగవతీ! నిన్ను ఉపాసించేవారు సరస్వతీ దేవినీ (సర్వవిద్యలను) లక్ష్మీదేవినీ (సర్వసంపదలను ) పొంది వాళ్ళభర్తలైన బ్రహ్మవిష్ణువులకు వైరిగా మారుతున్నారు . రమ్య శరీరంచే రతీదేవిని సైతం ఆకర్షించి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు. పశుతుల్య శరీరాన్ని తొలగించుకొని , జీవన్ముక్తుడై కేవలం సదాశివ తత్త్వాత్ముడై పరానంద సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు. 

100 

సీ.  నీ చేతి దివిటీల నీరాజనంబును సూర్యదేవునికిచ్చుచున్నయట్లు,

శశికాంతిశిలనుండి జాలువారెడి బిందు జలములనర్ఘ్యంబు శశికొసంగు

నట్లుదకంబులనర్ఘ్యంబుదధికిచ్చినట్టుల నీ నుండి యిట్టులేను

నీ నుండి పొడమిన నిరుపమ వాగ్ఘరిన్ నిను నుతియించుచున్ నిలిచితిటుల,


తే.గీ. ధన్య జీవుఁడనయితి  సౌందర్యలహరి

శంకరులు వ్రాయఁ దెలిఁగించి, శాశ్వతమగు

ముక్తి, సత్కీర్తి, నొసఁగెడి శక్తి! జనని!

యంకితము చేసితిని నీకు నందుకొనుము. ॥ 

భావము. 

ఓ భగవతీ!స్వకీయాలైన చేతి దివిటీల జ్వాలలచేత సూర్యుడికి ఆరతి గావిస్తూన్నట్లు చంద్రకాంత శిలనుండి శ్రవిస్తూన్న జలబిందువులచేత చంద్రుడికి ఆర్ఘం సమర్పిస్తూన్నట్లూ, ఉదకాలచే సముద్రుడికి తృప్తికారణమైన తర్పణం కావిస్తూన్నట్లూ , నీ వల్ల పొడిమినటువంటి నీ స్వరూపాలైన వాక్కుల కూర్పులచే నిన్ను నేను స్తుతిస్తున్నాను.

సౌందర్యలహరి స్తోత్రం సంపూర్ణం.

ఫలశ్రుతి

శా.  శ్రీమన్మంగళ శాంభవీ! లలిత! హృచ్ఛ్రీచక్ర సంచారిణీ!

సామాన్యుల్ కన నే రచించిన కృతిన్ సౌందర్య సద్వీచికన్

క్షేమంబొంద పఠింపఁగాఁ దలతు రా చిన్మార్గులన్ బ్రోవుమా, 

నీ మంత్రాక్షరి పాఠకాళికిడుమా నిర్వాణ సంపత్ప్రభల్.


నివేదన

శా. శ్రీమతా! వరలోకపావని! సతీ! చింతాన్వయుండన్, భవత్

ప్రేమన్ గాంచెడి రామకృష్ణను, జగద్విఖ్యాత సౌందర్యమన్

ధీమత్ శంకర సత్ కృతిన్ లహరినే తెన్గించితిన్ శ్రీసతీ!

క్షేమంబున్ గలిగింప పాఠకులకున్ చిద్రూపిణీ! కావుమా.


అంకితము.

ఉ. సాకల్యంబుగఁ దెల్గులో మలచితిన్ సౌందర్య సద్వీచికన్

నీకే యంకితమిత్తునమ్మ! కొనుమా! నీవే కృపన్ దీని, నో

శ్రీ కల్యాణి! భవాంబుధిన్ గడపుమా, చిత్తంబునందుండుమా,

నీకున్ మ్రొక్కెద భక్తితోడను భవానీ! సమ్మతిన్ గాంచుమా!