95 దివ్యదేశాల యాత్ర Day - 1
జై శ్రీమన్నారాయణ 🙏
95 దివ్యదేశాల యాత్రకి 2024 డిసెంబర్ 11 సాయంత్రం బయలుదేరాము. 28 సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకున్నాము.
హైదరాబాద్ నుండి ముగ్గురం, వైజాగ్ నుండి ఇద్దరూ మొత్తం మా బ్యాచ్ ఐదుగురం వెళ్ళాము. యాత్రలో మొత్తం 30 మంది యాత్రికులము ఉన్నాము.
ఏలూరు "లీలా ట్రావెల్స్" వాళ్ళతో వెళ్ళాము. ఆర్గనైజర్ "దానకర్ణ" గారు. మాకు గైడ్ లాగా వచ్చిన ఆవిడ "ధనలక్ష్మి" గారు. ఆవిడ ప్రతీ దివ్య దేశానికి (ఆలయానికి) వెళ్ళే ముందు ఆ ఆలయ చరిత్ర & వివరాలు అన్నీ వివరంగా చెప్పారు. అలా చెప్పటం వలన అక్కడ ఉన్న పెరుమాళ్ళని చక్కగా సేవించుకోవటం అయ్యేది.
11/12/24 సాయంత్రం 6.30 కి సికింద్రాబాద్ లో ట్రెయిన్ ఎక్కి, 12 ఉదయం 6.50 కి చెన్నై ఎగ్మోర్ లో దిగాము. అక్కడే వెయిటింగ్ రూమ్స్ లో స్నానాలు చేసి, పక్కనే ఉన్న హోటల్ లో ట్రావెల్స్ వాళ్ళు ఫలహారాలు పెట్టించారు, తినేసి 10.15 కి బస్ ఎక్కి మా యాత్రని మొదలుపెట్టాము.
యాత్రలో మొత్తం 30 మంది యాత్రికులము ఉన్నాము. అందరికీ సౌకర్యంగా ఉంటుందని 2 బస్సులలో అందరినీ తీసుకొనివెళ్ళారు. ముందుగా
Day -1 (12/12/24)
1). తిరువల్లిక్కేణి (94 వ దివ్యదేశం)
పురాణగాథ/పార్థసారధి: పూర్వము సుమతి అను రాజు వెంకటేశ్వరస్వామిని దర్శించి "మహాభారత యుద్ధ సమయమున అర్జునునకు సారథిపై గీతోపదేశము చేయుచున్న రూపములో దర్శనము కావలెను" అని కోరెను. కలలో సుమతికి దర్శనమొసగి బృందారణ్యమును సందర్శించినచో నీ కోరిక నెరవేరును అని స్వామి చెప్పెను. కలియుగములో వ్యాస మహర్షి తన శిష్యుడైన ఆత్రేయ ఋషిని బృందారణ్యమునకు వెళ్ళి తపస్సు చేయమని చెప్పెను. వ్యాస మహర్షి తన శిష్యునకు శ్రీమన్నారాయణుని సుందర విగ్రహమును ఆరాధన కొరకు ఇచ్చెను. అత్రి బృందారణ్యము చేరి కైరవేణి తీరమున తపస్సు ప్రారంభించెను. అదే సమయమునకు అచ్చట చేరుకొన్న సుమతి గీతోపదేశము చేయు పార్థసారధి స్వామివారి దివ్యమంగళ విగ్రహముగా గుర్తించి స్తుతించెను.
ఆనాటి మూర్తే నేడు ఉత్సవ మూర్తిగా మనకు దర్శన మిస్తారు. అంతేకాదు ఆనాటి భారతయుద్ధంలో తగిలిన బాణపు గుర్తులు నేటికి కనుపిస్తాయి. ఉత్సవ మూర్తిలో ఒక విశేషం ఉన్నది. ఎప్పుడు నీల వర్ణంలో ప్రకాశించే ఈ ఉత్సవమూర్తి ముఖ పద్మం అభిషేకానంతరం రెండు గంటల పాటు బంగారు రంగులో దర్శన మివ్వడం ఒక విశేషం. ఇక్కడ శ్రీకృష్ణుడు సకుటుంబంగా అన్న బలరాముడు, దేవేరి రుక్మిణి, తమ్ముడు సాత్యకి, కుమారుడు ప్రద్యుముడు, మనుమడు అనిరుద్దుడు వారితో కలసి ఇక్కడ సాక్షాత్కరించాడు. అత్రి మహా మునికి ప్రత్యక్షమైన నరసింహస్వామిని కూడ మనం ఇక్కడ దర్శించవచ్చు. మూలవర్లు యోగ నరసింహం ఉత్సవమూర్తి శాంత నరసింహుడు వీరినే తెళ్ళియళగియ సింగర్ అని పేరు.
రంగనాథులు : శ్రీరంగంలో పడమర దిశగా పవళించిన స్వామి ఇచ్చట దక్షిణ దిశగా శిరస్సు వంచి పవళించుట గమనించవలసిన విశేషము. మాసి మాసము శుక్లపక్షములో స్వామి వారి కళ్యాణము వైభవంగా జరుగును. ఒకసారి శ్రీ మహలక్ష్మి శ్రీహరిపై అలుక పూని ఈబృందావన క్షేత్రములో ఒక చందన వృక్షము ఛాయలో పసి పాపగా అవతరించి పవళించింది. అచ్చట ఉన్న సప్త ఋషులు పాపను కనుగొని వేదవల్లి అని నామకరణము చేసి పెంచ సాగిరి. యుక్తవయస్కురాలైన దేవకన్యను పోలిన ఆమెను కనుగొని ఋషులు ఆనందించారు. శ్రీహరి యువరాజు వలె ఆమెకు దర్శన మిచ్చెను. ఆమె ఆయనను మన్నాధన్ అని పిలిచినది. మన్నాధన్ అనగా "శాశ్వతుడైన పతి దేవా” అని అర్థము. భృగు మహర్షి ఆ యువరాజును శ్రీమన్నారాయణునిగా గుర్తించి వారిరువురికీ వివాహం జరిపెను. భృగు మహర్షి కోరికపై రంగనాథ, వేదవల్లులు ఇచ్చట వేంచేసి వెలసినారు. స్వామిని మన్నధర్ స్వామి అని కూడా పిలుస్తారు.
గజేంద్రవరదన్ పూర్వము సప్తరోమనుడు అను భక్తుడు శ్రీమన్నారాయణుని దర్శనము కోరి బృందారణ్యములో తపమాచరించెను. స్వామి దర్శనమీయగా గజేంద్రుని రక్షణ సమయంలో నున్న రూపములో దర్శనమివ్వమని కోరెను. వారి కోరికను మన్నించి గరుడవాహనా రూఢుడై వెలసి స్వామి తన భక్తుని కటాక్షించెను.
చక్రవర్తి తిరుమగన్ : పాండ్యనాడులో పండరము అను పర్వతము కలదు. అచట శశి వదనుడు అను ముని తపస్సు చేయుచుండెను. విశ్వామిత్రుని తపస్సు భంగపరచినటుల శశివదనుని తపము భంగపరచుటకై హైలై అను అప్సరసను ఇంద్రుడు పంపెను. శశివదనుడు హైలైను మోహించి ఆమె ద్వారా ఒక కుమారుని పొందెను, శశివదనుడు, హైలై కుమారుని ఒక గుహలో వదలి ఎవరి దారిన వారు వెళ్ళి పోయిరి. గుహలో యున్న తేనె తుట్టెల నుండి తేనె చుక్కలుగా శిశువు నోటిలో పడగా వాని ఆకలి తీరినది. తేనె త్రాగి పెరిగి పెద్ద వాడైన వానిని మధుమన్ అని పిలువసాగిరి. కాలక్రమంలో వానికి గార్గేయ మహర్షి దర్శనమొసగి బృందారణ్యములో తపము నాచరించిన శ్రీరామ సాక్షాత్కారము లభించునని ఆదేశించెను. మధుమన్ బృందారణ్యము చేరి తపము చేయనారంభించెను. వాని తపమునకు మెచ్చి శ్రీరామచంద్రుడు సతీ, సోదర సమేతంగా దర్శనమొసగెను. అటుల మధుమన్ తపఃఫలముగా శ్రీరామచంద్రులు నేటికీ మనందరకు యీ కోవెలలో దర్శనభాగ్యము కలిగించుచున్నారు.
2) తరువాత రెండవ (93 వ)దివ్యదేశాన్ని స్థలశయన పెరుమాళ్ ని దర్శించాము
ఉలగ ఉయ్యనిండ్రాణ్ పెరుమాళ్ - నీలమంగై నాచ్చియర్
ఇది మహాబలిపురంలోని సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం పూదత్తాళ్వార్ అవతరించిన స్థలము.
3). తిరువిడవేందై (92 వ దివ్యదేశం)
శ్రీలక్ష్మీ ఆదివరాహస్వామి (నిత్యకళ్యాణ పెరుమాళ్) - కోమలవల్లీ తయార్
చెన్నైకి 47 కిమీ దూరంలో, మహాబలిపురానికి వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి పెళ్ళికాని వారు వచ్చి స్వామిని దర్శిస్తే పెళ్ళి అవుతుంది అని అంటారు. అందుకే ఈ ప్రాంతానికి నిత్యకల్యాణపురి అని అంటారు.
మొదటిరోజు 3 దివ్యదేశాలని (94, 93, 92) దర్శించుకున్నాము.
No comments:
Post a Comment