95 దివ్యదేశాల యాత్ర Day - 2
Day - 2 (13/12/24)
ముందుగా (91వ దివ్యదేశం) తిరునీర్మలై ని దర్శించుకున్నాము.
నీరవణ్ణన్ పెరుమాళ్ - అణిమామలార్ మంగైనాయకి
ఈ క్షేత్రాన్ని తోయాద్రి లేదా తోతాద్రి అని కూడా అంటారు. మహావిష్ణువు స్వయంభూగా వెలసిన 8 క్షేత్రాలలో ఇది ఒకటి.
శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలసిన క్షేత్రాలని స్వయం వ్యక్త క్షేత్రాలు అని అంటారు. అవి ఎనిమిది ఉన్నాయి. వాటిలో తిరునీర్మలై ఒకటి. మిగిలినవి శ్రీరంగం, తిరుమల, శ్రీముష్ణం, బదరీ, నైమిశారణ్యం, పుష్కరం & ముక్తినాథ్.
ఇక్కడ కొండపైన & దిగువున 2 ఆలయాలు ఉన్నాయి.
కొండ ఎక్కాలి అంటే 200 మెట్లు ఎక్కాలి. కొండదిగి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా అన్ని మెట్లని లెక్కపెట్టుకుంటూ వచ్చాను. అందుకే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఓపిక ఉన్నవాళ్ళు కొండా ఎక్కవచ్చు, లేనివాళ్ళు దిగువున ఉన్న ఆలయంలో స్వామిని దర్శించుకోవచ్చును.
2) తరువాత తిరునిన్రవూర్ (89వ దివ్యదేశం)
భక్తవత్సల పెరుమాళ్ - ఎన్నపెత్త తాయార్
3) తరవాత (90వ దివ్యదేశం) తిరువళ్ళూరు
వీరరాఘవ పెరుమాళ్ - కనకవల్లీ తాయారు
తిరువళ్ళూరు చేరుకునేసరికి 12.30 దాటింది ఆలయం మూసివేశారు. అక్కడే ఒక ఫంక్షనుహాలులో భోజనాలు ముగించుకొని, కాసేపు విశ్రాంతి తీసుకొన్నాము. ఆలయం తెరిచే సమయానికి ముందు అక్కడ ఉన్న హృత్పాపనాశ పుష్కరిణికి ప్రదక్షిణ చేసి వచ్చేసరికి ఆలయం తెరిచారు. స్వామిని దర్శించుకున్నాము. ఆలయంలో ఉన్న వీరరాఘవ పెరుమాళ్ ని వైద్యనాథ పెరుమాళ్ అని కూడా అంటారు.
తరవాత అభిమానదేశమైన శ్రీ పెరంబుదూరు వెళ్ళాము
ఆదికేశవ పెరుమాళ్ - యతిరాజనాథవల్లతాయార్
శ్రీవైష్ణవులకు ఇష్టమైన క్షేత్రం - శ్రీమత్ భగవత్ రామానుజులు అవతార స్థలం ఇది. ఈ క్షేత్రాన్నే భూతపురి అని కూడా అంటారు.
ఇక్కడ ఉన్న రామానుజుల మూర్తి విశేషం ఏమిటంటే,
ఒకరోజు రామానుజల భక్తులు ఒకరు వచ్చి భక్తితో సమీపించి, ఆచార్య మీరు ఈ భూమిపై శ్రీ వైష్ణవ ధర్మమును ప్రచారం చేయుటకు అవతరించారు. తర్వాత తరములవారికి మీ గురించి తెలియజేయుటకు, మిమ్మల్ని పూజించుటకు, మీ విగ్రహము ఈ భూతపురిలో ప్రతిష్టించుటకు అనుమతి ఇవ్వండి అని అన్నారు. భక్తుని కోరికను రామానుజులు అంగీకరించారు. వెంటనే వారి విగ్రహము లోహంతో తయారు చేయించారు భక్తులు. వారు ఆ విగ్రహమును తెచ్చి ఆచార్యులకి చూపించారు అంతట రామానుజులవారు ఆ విగ్రహమును పైనుంచి కింద వరకు పరిశీలనగా చూసి సంతోషము వ్యక్తపరిచి, ఆ విగ్రహమును ఆలింగనం చేసుకుని తమ దివ్య శక్తిని అందులో ప్రవేశపెట్టిరి. అంతట ఆ విగ్రహమును ఒక పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి పుష్య మాసంలో, పుష్యమి నక్షత్రంలో, గురువారం నాడు ఆ విగ్రహమును శ్రీపెరంబుదూరులో ప్రతిష్టించరి. అక్కడ శ్రీపెరంబుదూరులో అభిషేకం చేసినప్పుడు, ఇక్కడ శ్రీరంగంలో రామానుజులవారు ఉక్కిరిబిక్కిరి అయ్యిరి. అంటే శ్రీపెరంబుదూరులో ఉన్న మూర్తి సజీవ మూర్తి అని మనకు తెలుస్తున్నది.
రామానుజులు వేంచేసియున్న కాలంలో ప్రతిష్టించబడిన దివ్య మంగళ మూర్తులు మూడు. మొదటిది శ్రీపెరంబుదూరులో తాను అభిమానించిన దివ్యమంగళ విగ్రహం. రెండవది తిరునారాయణపురం అంటే మేల్కోటలో భక్తులు అభిమానించి ప్రతిష్టించిన తిరుమేని విగ్రహం. మూడవది శ్రీరంగం ఇది తానాన తిరుమేని అంటారు అంటే తానే అయి తానే అయినా తిరుమేని.
మేము శ్రీపెరంబుదూరు ఆలయానికి చేరే సమయానికి తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం ఆ రోజున. తిరుమంగై ఆళ్వార్ మరియు రామానుజుల వారు ఊరేగింపు అయ్యి పల్లకీలలో ఆలయానికి తిరిగి వచ్చే సమయానికి మేము ఆలయానికి వెళ్ళాము. ఇద్దరు ఆళ్వార్ లకి గజరాజు వింజామర వీస్తున్న దృశ్యం చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉందో.
అక్కడితో మా రెండవరోజు యాత్ర ముగిసింది. 91, 90 & 89 అంటే 3 దివ్యదేశాలు 1 అభిమాన దేశం దర్శనాలు అయ్యాయి.
No comments:
Post a Comment