కాకాసురుని కైవల్య భక్తి
అశోకవనంలో గల సీతాదేవి హనుమంతునికి జ్ఞాపికగా కాకాసురుని కథను తెలిపినది. భగవంతుని శక్తి నుండి తప్పించుకొనుట ఎవ్వరికీ సాధ్యం కాదు. భగవంతుని చరణాల వద్ద చేరి, శరణు కోరితే ఎంతటి మహత్తర ఘోర పాపమైన తొలగిపోతుంది అన్న సత్యం ఈ కథలో మనకు తెలుస్తుంది.
చిత్రకూట పర్వతమునకు ఈశాన్యములో గల ఒక ఉప పర్వతంపై సిద్ధాశ్రమము కలదు. అందు సీతారాములు తపసాశ్రమవాసులుగా ఉండగా ఒకరోజు దేవేంద్రుని సంతతియైన ఒక కాకి (వాయసము) సీతాదేవి వక్షమును తన ముక్కుతో పొడిచి, రక్తమాంసాలను భుజించవలెనని ప్రయత్నించినది. సీతాదేవి ఆ కాకిని అదిలించి, తన బాధను దిగమ్రింగుకుని, శ్రీరాముని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. మరల అ కాకి తిరిగి వచ్చి సీతమ్మను బాధ పెట్టగా శ్రీరాముడు గమనించి, కోపించి ఒక దర్భను తీసుకొని దానిని బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి కాకిపై ప్రయోగించెను. దానితో కాకి భయంతో ఆ అస్త్రము నుండి తప్పించుకొనుటకు లోకములన్నిటినీ తిరిగినది, ఎవ్వరూ ఆ కాకిని ఆ అస్త్రము నుండి తప్పించుటకు అశక్తులమని తెలిపి, తమ నిస్సహాయతను వేలిబుచ్చగా, చివరకు కాకి తానూ తప్పుచేసినప్పటికి, తనను రక్షించి, క్షమించేది, విశాలహృదయమ శ్రీరామనికే కలదని తలచి, శ్రీరాముని శరణుకోరి అతని పాదములపై పడినది.
సర్వలోకశరణ్యుడైన శ్రీరాముడు ఆ కాకిని చూసి దయాద్రహృదయుడై పశ్చాత్తాపంతో కూడిన ఆ కాకిని రక్షించవలెనని నిశ్చయించి, బ్రహ్మాస్త్రమును ఒకసారి ప్రయోగించినచో దానిని ఉపసంహరించుట సాధ్యముకాదని గ్రహించినవాడై, ఏదో ఒక స్వల్పశిక్షతో ఆఅస్త్రమును శాంతింపచేయవలెనని తలచి, అకాకి కోరిక మీదట కుడికన్నును తొలగించి, ప్రమాదమునుండి రక్షించెను.
ఎంతటి మహత్తర పాపమును చేసినప్పటికీ, పశ్చాత్తాపంతో ఆ దేవదేవుని శరణుకోరితే తప్పక రక్షణపొందవచ్చునని ఈ కథ మనకు తెలియచేస్తుంది.
(అందుకే సామెత వచ్చింది----"చావుతప్పి కన్ను లొట్టపోయింది" అని)
No comments:
Post a Comment