July 20, 2013

గిరి ప్రదక్షిణ (ఆషాఢ పౌర్ణమి)

గిరి ప్రదక్షిణ (ఆషాఢ పౌర్ణమి)




ఆషాఢ పౌర్ణమి అంటే గురుపూజ, వ్యాసజయంతి... అని మాత్రమే తెలుసును అందరికీ.... ఆషాఢ పౌర్ణమికి మరో విశేషం కూడా ఉంది. అదే సింహాచల గిరి ప్రదక్షిణ. 

కొన్నికొన్ని ప్రాంతాలలో గిరిప్రదక్షిణలు చేస్తారని మనకి తెలుసు. అరుణాచలంలో అనునిత్యం గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా సింహాచలంలో సంవత్సరానికి ఒక్కరోజు అంటే ఆషాఢ పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేస్తారు. 

అక్షయతృతీయ నాటి రాత్రి సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామికి చందనము వేస్తారు. ఆ రోజును చందనయాత్ర అంటారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఆ స్వామియొక్క నిజరూప దర్శనము మనకు లభిస్తుంది. మిగిలిన రోజులలో స్వామి చందనంలో ఉంటారు. ఈ స్వామికి వైశాఖ పౌర్ణమికి 4 మణుగులు, జ్యేష్ట పౌర్ణమికి 4 మణుగులు మరియు ఆషాఢ పౌర్ణమి కి 4 మణుగులు వేస్తారు. ఈ ఆషాఢ పౌర్ణమి కి స్వామికి 12 మణుగుల చందన పూత పూర్తి అయ్యి స్వామి పరిపూర్ణంగా కనిపిస్తారు. పౌర్ణమి దేవతలకి ప్రీతికరమైన రోజు. ఈ పరిపూర్ణ ఆకారాన్ని చూసి తరించటానికి ముక్కోటి దేవతలంతా సింహగిరికి ఆషాఢపౌర్ణమి నాడు విచ్చేస్తారు. కనుక ముందు రోజు రాత్రినుండే ప్రజలు గిరి ప్రదక్షిణ చేసి, పౌర్ణమి రోజు ముక్కోటిదేవతలతో కూడిన సింహాద్రినాథుడిని దర్శించుకుంటారు.

గిరి ప్రదక్షిణ చేసేవారు చతుర్ధశి నాటి సాయంత్రం మొదటగా తొలిపావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి, నడక ప్రారంభిస్తారు. దారిలో భక్తుల కోసం..... వివిధ సేవాసంస్థల వారు మంచినీరు, మజ్జిగలు మరియు ప్రసాదాలు వంటి సౌకర్యాలు కల్పిస్తారు. పౌర్ణమి నాటి ఉదయానికి మరల తొలిపావంచా చేరుకొని, మెట్లమార్గం ద్వారా కొండను ఎక్కి స్వామిని దర్శించి... మరల మెట్ల మార్గంలో క్రిందికి దిగుతారు. ఈ విధంగా చేస్తేనే పరిపూర్ణ గిరిప్రదిక్షిణ అవుతుంది.

మన జీవితంలో ఒక్కసారి ఐనా ముక్కోటిదేవతలతో కూడిన సింహాద్రినాథుని దర్శిస్తే మన జన్మకు సార్థకత చేకూరుతుంది.






1 comment: