శ్రీ భావనారాయణ స్వామివారి క్షేత్రమహాత్యం (సర్పవరం)
శ్రీ లక్ష్మీ వల్లభారంభాం విఖనోముని మధ్యమాం
అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం
అష్టోత్తర శతంలోకే మమక్షేత్రాణి నారదా
తేషాం సర్పపురీ క్షేత్రే యవమాత్రాధకం ఫలం
భావనారాయణ శ్రీమాన్ ఆరూఢ పతగేశ్వరః
ఆవిర్భభువనే నారదాయ మహాత్మనే ll
ఆంధ్రప్రదేశ్ నందు తూర్పుగోదావరి జిల్లాలోగల పుణ్యక్షేత్రాలలో సర్పవరం "విష్ణుక్షేత్రమై" పురాతన ప్రసిద్ధమైనది. ఈ క్షేత్రమహత్యం బ్రహ్మవైవర్త పురాణం, కాశీ ఖండం, భీమఖండం లలో ఉన్నది. శ్రీనాథుడు, కూచిమంచి తిమ్మకవి పండితులు ఎందరో ఈ క్షేత్ర మహత్యమును విశేషంగా వర్ణించారు. గోదావరీ నదికి తూర్పుగాను, తుల్యభాగీనదికి ఉత్తరంగానూ, పూర్వసముద్ర తీరంగానూ, కాకినాడకి దగ్గరలోను ఈ క్షేత్రం ఉన్నది.
స్వామివారి ఆలయం విశాలమైన ప్రాకారము, ఉత్తర దిక్కున గాలిగోపురము, తూర్పు దిక్కున సింహద్వారము ఉన్నవి.
ఆలయమునకు దక్షిణమున పూలతోట, ఉత్తరమున కళ్యాణమండపము, తూర్పున ధ్వజస్థంభం, ఆలయంలోకి ప్రవేశించగానే ప్రదక్షిణముగా వెళ్ళినట్లయితే ముందుగా శ్రీ ఆళ్వారాధులు, వారి ప్రక్కనే మరొక సన్నిధిలో పురాణసిద్ధమైన అభయహస్తము, శంఖము, చక్రము, గదా హస్తము, వక్షస్థలమున లక్ష్మీదేవితో మూల భావన్నారాయణస్వామి ఉన్నారు. అక్కడ నుండి పశ్చిమం వైపుకి ప్రదక్షిణగా వెళితే, గరుడవాహనంపై శ్రీమహావిష్ణువు కూర్చొని ఉన్న పాతాళ భావన్నారాయణస్వామివారి సన్నిధి, ప్రక్కనే మనవాళ్ళ మహాముని సన్నిధులు ఉంటాయి, వీరికి ఎదురుగా లక్ష్మీదేవి సన్నిధి కూడా ఉన్నది. ఆ ప్రక్కనే ఆస్థానమంటపము, సేవకులైన జయవిజయుల విగ్రహాలు ఉన్నవి. లోపలికి గర్భాలయమున రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భావనారాయణస్వామివారిని మనం దర్శించవచ్చును.
ఈ క్షేత్రమును త్రిలింగ క్షోణి వైకుంఠము అని కూడా అంటారు. ఇక్కడ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భావనారాయణుని నారదమహర్షి ప్రతిష్ఠించారు.
అనంతుడు అనే సర్పము శ్రీ మూల భావనారాయణుని ప్రతిష్ఠించినది.
గరుడ వాహనముపై మహావిష్ణువు పాతాళ భావనారాయణునిగా స్వయంభూగా వెలసి యున్నారు.
పురాణగాథ:-
ఒక రోజున సత్యలోకంలో బ్రహ్మ, శంకరుడు, ఇంద్రాది దేవతలు, మహాఋషులు, సప్తఋషులు, అష్టదిక్పాలకులు, తుంబురుడు, నారదుడు, మొదలగువారు అందరూ సభచేసి యున్నారు. సభలో మంచి - చెడ్డలు అన్నీ చర్చించుకుంటూ "విష్ణుమాయను కనుగొన్నవారు ఎవరైనా ఉన్నారా?" అని బ్రహ్మ ప్రశించెను. అందుకు ఎవరూ సమాధానము చెప్పలేకపోయారు. అంతట నారదమహర్షి నిలబడి "విష్ణుమాయను నేనే కనుగొంటాను, అహర్నిసలు విష్ణునామ సంకీర్తనం చేసేవాడిని, త్రిలోక సంచారిని, కనుక నేనే కనుగొందును" అని గర్వంగా పలికెను. ఆ మాటలు విన్న అక్కడున్న పెద్దలందరూ అది నీకు సాధ్యము కాదు అని పలికిరి.
విష్ణువు భస్మాసురుని నుండి తనని ఏవిధమగా కాపాడెనో భస్మాసుర వృత్తాంతం చెప్పెను శివుడు.
"నేను హంస వాహనంపై త్రిలోకాలు సంచరిస్తూ ఉన్న సమయంలో మధ్యలో ఒక అందమైన ఉద్యానవనము కనిపించగా అందులో ప్రవేశించగా, అక్కడ కోనేరు తామర పుష్పాలతో చాలా అందంగా కనిపించినది. ఆ వనమంతా చక్కని పరిమళాలు వెదజల్లుచుండుట చూసి..... ఈసమయంలో సరస్వతి నా ప్రక్కన ఉంటే బాగుండును అనుకొనుచుండగా ఒక స్త్రీ ఎదురుగా కనబడినది. నేను ఆమెను సమీపిస్తుండగా, అందక వనం అంతా పరుగులు పెట్టింది, చివరికి ఆమెను పట్టుకునేసరికి శ్రీమహావిష్ణువు శంఖచక్రములతో దర్శనమిచ్చెను. సిగ్గుతో నేను సత్యలోకమునకు మరలెను. ఇది నాకు ఎదురయిన విష్ణుమాయ" అని బ్రహ్మ చెప్పెను. కనుక విష్ణుమూర్తి యొక్క మాయను కనుగొనుట కష్టమని బ్రహ్మ నారదునికి చెప్పెను. అయినాసరే నారదుడు అతని మాటలు చెవిన పెట్టలేదు. భూలోకములో మానవజన్మను ఎత్తి అనుభవించెదవు అని చెప్పి బ్రహ్మ సభను ముగించెను. అంతట ఎవరి లోకమునకు వారు వెళ్ళిరి.
కొంతకాలమునకు నారదుడు మూడు లోకములు సంచరించి భూలోకములో తిరుగుతూ ఉండగా సాయం సమయమున ఒక కొలను కనిపిస్తే సంధ్యావందనం(అర్ఘ్యం ఇచ్చెదను) చేసెదను అని అనుకొనుచూండగానే ఎదురుగా ఒక కొలను కనబడెను. కొలనువద్దకు వెళ్ళి ఒక గట్టుమీద కమండలము, తుంభుర ఉంచి, స్నానము చేయుటకు కొలనులోదిగి మూడుసార్లు మునిగి లేచేసరికి నారదునికి స్త్రీ రూపము వచ్చినది. గట్టుమీద కమండలం, తుంభుర మాయమయ్యెను.
నారద సరస్సు
ఇక చేసేదేమీలేక ఆ అడవిలోనే పండ్లూ, కాయలూ తినుచూ తిరుగుచుండెను. కొంతకాలమునకు అక్కడకు దగ్గరలో ఉన్న పీఠికాపురము(ప్రస్తుత పిఠాపురం)ను పలిచు నికుంఠమణి మహారాజు వేట నిమిత్తం అటుగా ఆ అడవిలోకి వచ్చెను. సాయంసమయం అవ్వటంతో సైన్యమును రాజ్యమునకు తిరిగి పంపి అతని గుఱ్ఱమును తీసుకొని కాలినడకన బయలుదేరి వస్తూన్న సమయంలో కొలనువద్ద స్త్రీ రూపంలో ఉన్న నారదుడు కనిపించెను. అంతట రాజు ఆశ్చర్యపడుతూ ఆ స్త్రీ వద్దకు వెళ్ళి నీది ఏదేశము? నీవు ఇక్కడ ఉండుటకు కారణము ఏమిటి? అని అడిగెను. నారదుడు అందుకు సమాధానంగా తనకేమీ తెలియదని చెప్పెను.
అంతట ఆ రాజు నారదునుని తన వెంట పిఠాపురమునకు తీసుకువెళ్ళి, ఆ స్త్రీ యొక్క చిత్రపటమును వేయించి, అన్ని దేశములకు పంపించి, ఏ పట్టణములోనైనా ఆ స్త్రీకి సంబంధించిన బంధువులు ఉన్నట్లయితే వారు వచ్చి ఆమెను తీసుకువెళ్ళవలసిందిగా టముకు(దండోరా) వేయించెను. కొంతకాలము వేచిచూసేను, ఎవరూ ఆమె కోసం రానందువల్ల..... ఆమెను వివాహం చేసుకోవలెనని సంకల్పించి, రాజు ఆమెను అడిగెను......అందుకు స్త్రీ రూపంలోనున్న నారదుడు అంగీకరించెను. కొంతకాలమునకు వారికి 60 మంది కుమారులు కలిగిరి. వారి పేర్లు (ప్రస్తుతము మనకు వాడుకలోనున్న) 60 తెలుగుసంవత్సరములు. వారందరూ రాజ్యపాలన సవ్యంగా చేస్తుండగా, కొంతకాలమునకు పరదేశపురాజు నిపుంజయ మహారాజు యుద్ధమునకు వర్తమానము పంపెను. అంతట ఇరు దేశాలమధ్య ఘోర యుద్ధం జరిగి, నికుంఠ మహారాజు, వారి 60 మంది పుత్రులు వీరస్వర్గం పొందిరి. పిఠాపురం నుండి యుద్ధభూమికి స్త్రీ రూపంలో ఉన్న నారదుడు వచ్చి తనవారందరూ మరణించుట చూసి దుఃఖించెను. ఆకలి దప్పికలతో తిరుగుతున్న స్త్రీ(నారదుని)కి ఒక వృక్షమునకు ఫలము కనిపించగా, అందుకొనుటకు ఎంత ప్రయత్నించినా ఫలితము దక్కలేదు. ఆ ఫలమును కోసుకొని భుజించుటకు చుట్టుప్రక్కల ఏమీ కనబడక, అక్కడ ప్రక్కనే ఉన్న శవములను ఈడ్చుకొనివచ్చి, మెట్లుగా చేసుకొనెను...... అయిననూ ఫలములు అందలేదు. తన భర్త యొక్క శవమును కూడా ఈడ్చుకువచ్చి మెట్టుగా వేసెను. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఒక బ్రాహ్మణుని వేషంలో అక్కడకు వచ్చి అది ఏమి పని అని అడుగగా, ఆకలిబాధ తీర్చుకొనుటకు అని చెప్పి..... జరిగిన వృత్తాంతము అంతా బ్రాహ్మణునికి చెప్పగా..... అంతా విని బ్రాహ్మణరూపంలో ఉన్న మహావిష్ణువు "నీవు అశుచిగా ఉండుటవలన ఆకలిబాధ తీరదు ..... కనుక నీవు శుచిగా స్నానము చేసి ఆకలిబాధ తీర్చుకో అని చెప్పెను. ఆ స్త్రీ బ్రాహ్మణుని వేడుకొనగా ఆయన ఇదివరకు ఉన్న సరస్సు ప్రక్కనే మరొక సరస్సును సృష్టించి, ఆ స్త్రీని ఎడమచేయి పైకి ఎత్తి మూడుసార్లు మునిగి స్నానము చేయమని ఆ సరస్సు వద్దకు తీసుకొని వచ్చెను. వెంటనే ఆ స్త్రీ సరస్సులో మునిగి లేచేసరికి బ్రాహ్మణ రూపంలో నున్న విష్ణువు మాయమయ్యెను. స్త్రీకి పురుష రూపము వచ్చింది. కానీ ఎడమచేతికి గాజులు ఉన్నాయి. పూర్వజ్ఞ్ఞానము వచ్చింది.
తనచేతికి గాజులు ఉండుటకు కారణము ఏమని తన జ్ఞాన దృష్టితో చూడగా, సత్యలోకంలో జరిగిన సంఘటన అంతా జ్ఞప్తికి వచ్చి...... ఇది అంతా విష్ణుమూర్తి యొక్క మాయ అని గ్రహించి, పాతాళ భావనారాయణుని సన్నిధిలో పదివేల సంవత్సరాలు తపస్సు చేసెను. అంతట గరుడ వాహనుడై శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకోమని అడుగగా, తన ఎడమచేతికి ఉన్న గాజులు పోవాలి అని...... నీవు ఇదే రూపంలో అంటే గరుడ వాహనుడివై ఇక్కడ వెలసి, భక్తులకు కనువిందు చేయమని కోరెను. ఈ క్షేత్రమందు నారదుని యొక్క గర్వభావము తొలగిపోయింది కనుక ఇక్కడ వెలసిన శ్రీమహావిష్ణువును "శ్రీ భావనారాయణ స్వామి" అని అంటారు.
ఇక్కడ మాఘమాసంలో నాలుగు ఆదివారములు తీర్థము, వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం చాలా వైభవంగా జరుపుతారు.
శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భావనారాయణార్పణమస్తు
చాల సంతోషం శ్వేతా వాసుకి గారు... మా నాన్న గారి పుట్టిన ఊరు సర్పవరం ఇంద్రకంటి వారి ఇంట్లో...
ReplyDeleteనేను తరచు అక్కడికి వెడతాను... నాకు ఇప్పటికి అర్ధం కాని విషయం అంత పెద్ద ఊరు ఎలా అంతరించి దా ....
ధన్య వాదాలు...
ధన్యవాదాలు అప్పారావు పెద్దనాన్నగారు __//\\__
Delete