September 28, 2014

విజయదశమి పత్య్రేకం.....స్త్రీశక్తిని చాటిన దుర్గమ్మ...

విజయదశమి పత్య్రేకం.....స్త్రీశక్తిని చాటిన దుర్గమ్మ


దేవీనవరాత్రుల కథలు, వాటి తాత్వికత, చారిత్రకత పరిశీలిస్తే అది ప్రధానంగా పాలకుల అంటే క్షత్రియుల ఉత్సవమని అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత తమ తమ వృత్తులలో పురోగతిని, విజయాన్ని ఆశించేవారంతా కూడా అమ్మవారిని విజయదశమికి పూజించసాగారని అర్థమవుతుంది. ఇంకాస్త లోతుకు వెళితే వ్యవసాయం, వర్షాభావం కూడా ఈ నవరాత్రి ఉత్సవాల వెనుక ఉన్న రహస్యమనిపిస్తుంది. వర్షం దాని ద్వారా వచ్చే బురద, దాని నుండి పుట్టే క్రిములు, అవి తెచ్చే రోగాలు, వాటి నివారణ ఈ పండుగ వెనుక పురాణ రూపం దాల్చినట్టు కనిపిస్తుంది.

గుబిలి నుంచి పుట్టే మధుకైటభులు. శరీరం నుండి రక్తపు బిందువు పడితే కొత్తజీవికి జన్మనిచ్చే రక్తబీజుడు, రాక్షసుల వాహనాలయిన దున్నలు దశమి గాథలలో కనిసిస్తాయి. ఇలాంటి దృశ్యాలను పరిశీలించిన తరువాత వర్షర్తువులో అనివార్యంగా కనిపించే బాధలు, వాటి మూలాలు గుర్తుకు వస్తాయి. ఇవన్నీ బురద, దోమలు, కీటకాలకు సంబంధించినవే. అమ్మవారు భ్రమరాలను సాయం తీసుకోవడం కూడా అలాంటిదే. దేవీభాగవతంలో కొన్ని వచనాలు ఈ భూమికనే సూచనప్రాయంగా చెబుతాయి ఇలా - ''శరద్వసంత రుతువులలో నానా ప్రకారములగు రోగములు వ్యాపించును. కనుక ఈ రుతువులకు యమదంష్ట్రములని పేరు. ప్రజలకు ఆయురారోగ్యములు కలిగించుటకు ఈ రెండు రుతువుల ప్రారంభమునను నవరాత్ర వ్రతములు నాచరించవలెను''.

పురాతనం


దేవీపూజ అత్యంత ప్రాచీనమైనది. మొహెంజదారో, హరప్పా తవ్వకాలలో బయల్పడిన కొన్ని స్త్రీమూర్తులను మహామాయ ప్రతిమలుగా భావించారు. దేవిని, శివలింగాన్ని అప్పటికే పూజించేవారని అర్థమవుతుంది. తరువాత ఈ దేవికే ఆదిశక్తి అనే పేరు వచ్చింది. ఆమె శివుడికి దేవి అయినప్పటికీ, శివుని మూలకారణం కూడా కావటం విశేషం. బ్రాహ్మణాలలో కూడా దేవీ స్వరూపం కనిపిస్తుంది. ఉపనిషత్తులలో హైమవతిగా, కాళికరాళీగా, శతపథ బ్రాహ్మణంలో అంబికాదేవిగా, ఇతర కావ్యాలలో కాత్యాయని, కన్యాకుమారి, దుర్గి పేర్లతో కనిపిస్తుంది. పరోక్షంగా రామాయణంలోను, ప్రత్యక్షంగా మహాభారతంలోను ఆమె ప్రస్తావన కనిపిస్తుంది. దేవీ ఆరాధన బౌద్ధంలో కూడా కనిపిస్తుంది. మహాయాన సంప్రదాయంలో కనిపించే తారాదేవి వైదికమతంలో కనిపించే శక్తిని పోలి ఉంటుంది. టిబెట్‌, చైనా, ఇండోచైనా వంటి ప్రాంతాలలో తారాదేవి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది.
విజయదశమి

నవరాత్రులకు పరాకాష్టగా జరుపుకునే ఉత్సవమే విజయదశమి. దీనినే దసరా అని, దశరా అని కూడా అంటారు. ఆశ్వయుజ శుద్ధ దశమినాడు ఈ ఉత్సవం జరుగుతుంది. ఆశ్వయుజ శుక్ల దశమి సాయంకాలనక్షత్రోదయవేళను విజయం అంటారు. ఆ సమయం అన్ని సంకల్పాలకు ఉత్తమమైనది అని పురాతన శాస్త్రవేత్తలు భావించారు. విజయదశమి ఉత్సవం ఇప్పుడు ఏ రూపంలో ఉన్నా దాని అసలు ఉద్దేశం, స్వరూపం ఇది -

దశమినాడు అపరాజితను (పార్వతీదేవి పేరే. బెంగాల్‌లో ఎక్కువగా వాడతారు)పూజించాలి. అపరాజిత అంటే పరాజయం లేనిది అని అర్థం. సీమోల్లంఘన చేసి (పొలిమేరదాటి). శమీపూజ చేయాలి. దేశాంతరం వెళ్ళదలచినవారు ఆనాడే బయలుదేరాలి. శమీపూజను మధ్యాహ్నం వేళ గ్రామానికి ఈశాన్య దిక్కుగా వెళ్ళి నేల శుభ్రంగా ఉన్నచోట అలికి, కుంకుమతో, చందనంతో అష్టదళపద్మం వేసి చేయాలి. పురోహితుడు మంత్రి వెంటరాగా రాజు గుర్రంమీద శమీవృక్షం దగ్గరకు వెళ్ళి పూజలు చేయాలని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి.ఈ సందర్భంగా శత్రువు బొమ్మను చేసి దానిని అస్త్రంతో కొట్టే సంప్రదాయం కూడా ఉండేది. విచిత్రం ఏమిటంటే రాముడు, పాండవులు, ఆర్యులు, శివాజీ, కృష్ణదేవరాయలు వరకు ఈ పండుగతో పాలకులందరికీ సంబంధం ఉన్నట్టు కథలూ, గాథలూ ఎన్నో ఉన్నా, ఈ పండుగ మూలం గురించి స్పష్టమైన సమాచారం దొరకదు.పురాతన గ్రంథాలలో కొన్ని చారిత్రక వర్ణనలు తప్ప ఇంకేమీ దొరకవు.

కాకా కాల్కేకర్‌ అనే చరిత్రకారుడు విజయదశమిని హిందూ సమాజంలోని నాలుగు వర్ణాలకూ చెందినదిగా చెప్పారు.సరస్వతీపూజ బ్రాహ్మణులకు ప్రధానం కాగా, ఆయుధపూజ క్షత్రియులకు సంబంధిం చినది. సీమోల్లంఘన వైశ్యులకు ప్రధానం. (వ్యాపార విస్తరణ దీని ఉద్దేశం కావొచ్చు) వ్యవసాయం, ప్రకృతి రక్షణ మిగిలిన కులాలకు ముఖ్యం. పూర్వం సైన్యంలో పార్ట్‌ టైం సైనికులే ఉండేవారు. వీరు మిగతా రోజులలో వ్యవసాయం చేసేవారు. శివాజీ సేనలు కూడా అంతే.

హంపీ ఘనత

హంపీ విజయనగరంలో విజయదశమి ఉత్సవాలు విశేషంగా జరిగేవని చరిత్ర చెబుతున్నది. కృష్ణరాయల కాలానికి ఈ ఉత్సవాలు తారాస్థాయిలో జరుగుతూ ఉండేవని అనుకోవాలి. అప్పుడు నవరాత్రులన్ని దినాలూ దేవిని అలంకరించి పూజించేవారు. అసంఖ్యాకంగా బలులు ఇచ్చేవారు. ఆయుధపూజ పెద్దఎత్తున జరిగేది. ప్రభువు కొలువుదీరి ప్రజల యోగక్షేమాలను స్వయంగా తెలుసుకునే కార్యక్రమం కూడా ఉండేది. సామంతులు వచ్చి రాజుకు కానుకలు ఇచ్చేవారు. నృత్యాలు, మల్లయుద్ధాలు ఉండేవి. సూర్యుడు అస్తమించగానే వేలాది కాగడాలు రాజ్యంలో వెలిగేవి. బాణసంచా కాల్చేవారు. ఈ సందర్భంగా జరిగే ఊరేగింపుకు ప్రత్యేకత ఉంది. ఈ ఊరేగింపులో మొదట రథాలు, తరువాత అలంకరించిన ఏనుగులు, ఆ పై గుర్రాల వరసలు, వాటి వెనుక వేదపారాయణం చేస్తూ పురోహిత బృందాలు, తరువాత ఉద్యోగులు, సేవికలు నడిచేవారు. ఇదంతా పేస్‌ అనే విదేశీ యాత్రికుడి వర్ణన. ఇది స్వప్నమా, వాస్తవమా అనుకున్నాడట ఆయన. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన మరో యాత్రికుడు అబ్దుల్‌ రజాక్‌ కూడా మంచి వర్ణన ఇచ్చాడు. 'చక్రవర్తి పాలెగాండ్రను రాజధానికి పిలిచేవాడు. మూడు, నాలుగు మాసాలు ప్రయాణించి వీరు వచ్చేవారు. వేయి ఏనుగులకు రంగులు వేసి, ఆలంకారాలు చేసి పండుగరోజులలో మైదానాలలో నిలిపి ఉంచేవారు. భవనాలలో అన్ని అంతస్థులను చిత్రాలతో అలంకరించేవారు. గారడి ప్రదర్శనలు, భోగపు స్త్రీల నృత్యాలు జరిగేవి' అని రాశాడు. హంపీ శిథిలాలలో మహర్నవమి దిబ్బ అని పిలిచే ఒక స్థలం నేటికీ ఉంది. పేస్‌ ఒక సందర్భంలో అక్కడ రోజూ ఎన్ని గొర్రెలను, దున్నలను బలి ఇచ్చేవారో కూడా రాశాడు. సాలిటేర్‌ అనే మరో చరిత్రకారుడు మరో ఘట్టం నమోదు చేశాడు. 'సోషల్‌ అండ్‌ పొలిటికల్‌ లైఫ్‌ ఇన్‌ ది విజయనగర ఎంఫైర్‌' అనే పుస్తకంలో ఇది ఉంది. ఒకసారి కృష్ణరాయలు వేటకు వెళ్లినపుడు పెద్ద అడవి దున్నను పట్టించాడట. దానిని దేవీనవరాత్రుల సమయంలో బలి ఇవ్వాలని ఆయన అనుకున్నాడు. అయితే బలి ఇచ్చే ఏ జంతువయినా ఒక్క వేటుతో తలపడేట్టు నరకాలి. ఈ దున్నను చూసి ఎవరూ ముందుకు రాకపోతే విశ్వనాథనాయకుడు ముందుకు వచ్చి ఒక్కవేటుతోనే దాని తల తెగగొట్టాడట.

రాజస్థాన్‌లోని మేవాడ్‌లో దేవీప్రతిమకు బదులు ఖడ్గాన్ని ఉంచి పూజలు చేసే ఆచారం

ఉండేది. ఖండపరశువు (గొడ్డలి) ని కూడా పూజించే ఆచారం ఉంది. మొగలుల మీద ఛత్రపతి శివాజీ ఎన్నో యుద్ధాలు చేశాడు. మరాఠా చరిత్రలో యుద్ధారంభానికి, విజయదశమికి అవినాభావ సంబంధం కనిపిస్తుంది. శివాజీ సైనికులు దసరా వరకు పొలం పనులు చేసుకునేవారట. అన్ని పనులు పూర్తయి కోతలు మాత్రమే మిగిలి ఉండేనాటికి ఈ పండుగ వచ్చేది. కోతల పనిని స్త్రీలు, బాలలు, వృద్ధులకు అప్పజెప్పి దసరాకు సేనలలో చేరడానికి వారంతా సిద్ధపడి ఉండేవారట.

దసరా అనగానే ఇప్పటికీ కొన్ని వేడుకలు మన కళ్ళ ముందు కదులుతాయి. ఢిల్లీలో రావణదహనం, మైసూర్‌లో ఉత్సవాలు, విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ ఉత్సవం వంటివి అందులో కొన్ని. బడిపిల్లలు గ్రామమంతా తిరుగుతూ 'అయ్యవారికి చాలు ఆరు వరహాలు.. పిల్లవాళ్ళకు చాలు పప్పుబెల్లాలు' అంటూ పాడుకోవడం ఈ పండుగ సంప్రదాయంలో ఒక కొసమెరుపు కావచ్చు.


No comments:

Post a Comment