March 28, 2015

శ్రీ రామతీర్థ క్షేత్ర మహాత్మ్యం

శ్రీ రామతీర్థ క్షేత్ర మహాత్మ్యం

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | 
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||


రామతీర్థం ఆంధ్రప్రదేశంలో విజయనగరంకు 12కి.మీ. దూరంలో చంపావతీ నదికి దగ్గరలో భాస్కర పుష్కరిణికి, నీలాచలమునాకు మధ్యన ఉంది. ఈ క్షేత్రంలో సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుని ఆలయం ఉంది. 


క్షేత్ర మహాత్మ్యం

ద్వాపరయుగంలో జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసానికి వెళుతూ శ్రీకృష్ణుని కూడా తోడురమ్మన్నారు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు "నేను రామావతార సమయంలో దండకారణ్య ప్రాంతంలో సీతా లక్ష్మణులతో తిరిగాను,  ఆ ప్రాంతానికి మీరు వెళ్ళినప్పుడు మీరు ఈ విగ్రహాలని పూజిస్తే, రామచంద్రుడు(అంటే నేనే) మీ వనవాస కాలంలో మీకు తోడుగా ఉండి, రక్షిస్తాడు" అని చెప్పి సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను తాను సృష్టించి వారికి (పాండవులకు)  ఇచ్చి వనవాసానికి పంపాడు. 

పాండవులు దండకారణ్యం చేరగానే ఒక దేవాలయాన్ని నిర్మించి, కృష్ణుడు ఇచ్చిన విగ్రహాలని అక్కడ ప్రతిష్టించి, రామచంద్రుణ్ణి సేవిస్తూ, వారి వనవాస కాలాన్ని ఆనందంగా గడుపుతూ, అజ్ఞాతవాసానికి వెళుతూ "వేదగర్భుడు" అనే వైఖానస వైష్ణవునికి వారు నిర్మించిన ఆలయాన్ని అప్పగించి వెళ్ళారు. అయితే కొంతకాలానికి బౌద్ధ భిక్షువులు (క్రీllపూll 6వ శతాబ్దంలో) ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని వాళ్ళ మత ప్రచారాన్ని చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ మత సిద్ధాంతమైన   విగ్రహారాధన నిషేధానికి భయపడిపోయి వేదగర్భుని వంశీయులు సీతా రామ లక్ష్మణుల విగ్రహాలని భూగర్భంలో భద్రపరచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. 

ఇప్పటి విజయనగర సంస్థాదీశులైన పూసపాటి వంశీయులు ఈ రామతీర్థం ప్రాంతానికి 5 కి.మీ. దూరంలో కుంభిళాపురాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాళ్ళు. 1650-1696 సంవత్సరంలలో  పూసపాటి సీతారామచంద్ర మహారాజు ధర్మ రక్షణగా ప్రజలను పాలిస్తూ ఉండేవారు. ఆ రాజ్యంలో ప్రజలు దండకారణ్య ప్రాంతంలో వంటచెరకు, కందమూలాలు, వివిధ ఫలాలను సేకరించటం కోసం వెళుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఏకుల కులానికి చెందినా పుట్టు మూగ ఐన ఒక ముసలిది కూడా అరణ్యానికి వెళ్ళింది. ఆరోజు మధ్యాహ్నం చిన్నిచిన్ని చినులతో మొదలైన వర్షం కొద్దిసేపటికే కుంభవృష్టిగా మారింది. అక్కడికి వచ్చిన జనం అంతా వారివారి ఇళ్ళకు పరుగు పరుగున వెళ్ళిపోయారు. పరుగు పెట్టలేని ముసలిది మాత్రం ఎక్కడికీ వెళ్ళలేక ఒక వెదురు పొదమాటున తలదాచుకుంది. చీకటి పడిన సమయానికి ముసలికి భయంవేసి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ సమయంలో ముదుసలికి ఎదురుగా పెద్దగా వెలుతురు వచ్చి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యి ...... ముదుసలిని ఊరు, పేరు అడుగగా, ముదుసలి తనకు మాటలు రావని మూగ సైగలు చేసి చెప్పింది. వెంటనే శ్రీరాముడు దర్భకొనలను తీసుకొని ఆమె నాలుకపై బీజాక్షరములు రాసి , ఆమెకు మాటలు వచ్చేటట్టు చేసాడు. వెంటనే ఆమె "నాది  కుంభిళాపురం రాజ్యం, పూసపాటి సీతారామచంద్ర మహారాజు మా రాజుగారు" అని చెప్పింది. "మేము ఇక్కడ చాలాకాలం నుండి కొలువైఉన్నాము, మీ రాజుగారితో చెప్పి మాకు ఆలయం నిర్మించి, ధూపదీపనైవేద్యాలు ఏర్పాటు చెయ్యమని చెప్పు" అని ముదుసలికి చెప్పి అంతర్ధానమయ్యాడు. అదేరోజు తెల్లవారుఝామున రాజుగారికి కలలో కనిపించి మూగదైన ముదుసలి చెప్పిన విధంగా చెయ్యు" అని శ్రీరాముడు అజ్ఞాపించాడు. 

మహారాజు పొద్దున్నే నిద్రలేవగానే మంత్రులను, పురోహితులను పిలిపించి తనకి వచ్చిన కలను తెలియచేసాడు. ఇంతలో పుట్టుమూగ అయిన ముసలిదానికి మాటలు వచ్చాయి అనే వార్త నగరమంతా వ్యాపించింది. ఆ విషయం తెలుసుకున్న మహారాజు ఆమెని సభకు పిలిపించి, విషయమంతా తెలుసుకున్నాడు. వెంటనే రాజు స్వామిని  దర్శించటం కోసం తన చతురంగ బలాలతో అరణ్యానికి బయలుదేరాడు, దారిలో జంతువులను వేటాడుతూ  ముదుసలి చెప్పిన స్థలానికి చేరుకున్నాడు. రాముని విగ్రహలకోసం ఎంత వెతికినా అక్కడ నీటి మడుగు తప్ప ఏమీ  కనిపించకపోయేసరికి నిరాశ చెంది, రాజు తపస్సు చేయటానికి సిద్ధమయ్యాడు.... వెంటనే అశరీరవాణి "ఓ రాజా ! ఈ ముసలిది పూర్వజన్మలో చేసుకున్న  పుణ్యం వల్ల మా దర్శనం దొరికింది. నువ్వు మమ్ములను వెదుకుతూ వచ్చే దారిలో జంతువులను వేటాడి చంపావు.... ఆ కారణంగా నీకు మా దర్శనం దొరకలేదు. నువ్వు రేపటిరోజున శుచిగా వస్తే మా విగ్రహాలు నీకు లభిస్తాయి, వాటిని నీవు ఇక్కడికి దగ్గరలో ఉన్న నీలాచలం(నల్లనికొండ) పక్కన ఉన్న శ్వేతాచలం (తెల్లనికొండ) కొండపైన ఉన్న జీర్ణ ఆలయాన్ని పునరుద్ధరించి అందులో మా విగ్రహాలని ప్రతిష్టించి ధూప దీప నైవేద్యాలను ఏర్పాటు చెయ్యు" అని ఆదేశించెను.


మరుసటిరోజు పొద్దున్నే నిద్రలేచి, తన కార్యక్రమాలను ముగించుకొని ఆ పుణ్యస్థలానికి చేరుకోగా ఆ నీటిమడుగున సీతా రామ లక్ష్మణ విగ్రహాలు దొరికాయి. శ్వేతాచలం పైన ఉన్న ఆలయం జీర్ణం అగుటచే ఆ స్థానంలోనే మళ్ళీ కొత్త ఆలయాన్ని నిర్మించి, ఉత్తరాయణం వచ్చిన తరువాత మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) రోజున ప్రతిష్టించాడు. స్వామివారికి అర్చన కోసం గోదావరీ తీర ప్రాంతం నుండి వైఖానస అర్చకులను రప్పించారు. వాళ్ళ సంతతి వారే ఈరోజుకీ అర్చనలు చేస్తున్నారు. 


శ్రీరామస్వామివారి విగ్రహాలు నీటి యందు లభించాయి కనుక నీరు అనగా "తీర్థం" కనుక ఈ క్షేత్రాన్ని "రామతీర్థం" అని పేరు వచ్చిందని అంటూ ఉంటారు. అయితే దీనిని "ఆరామతీర్థం" అని కూడా అంటుంటారు. "ఆరామ" అనగానే బౌద్ధారామం గుర్తుకువస్తుంది.   


విశాఖ ఉత్సవ్ జరిగిన సమయంలో సముద్రం ఒడ్డున దేవాలయాల నమూనాలు నిర్మించి ఉంచినచోట రామతీర్థం ఆలయం వాళ్ళు క్షేత్రమహాత్మ్యం పుస్తకాలని అందరికీ పంచారు ...... ఆ పుస్తకం నుండి ఈ సమాచారాన్ని నేను సేకరించి ఇక్కడ రాసాను . 


  సర్వేజనా సుఖినోభవంతు 

No comments:

Post a Comment