నైమిశారణ్యంలో ఉన్న శ్రీ చక్రతీర్థం చిత్రాలు (Photos of Naimisaranyam)
పూర్వకాలంలో 88 వేలమంది ఋషులు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకి వెళ్ళి, వారు తపస్సు చేసుకోవటానికి అనుకూలమైన స్థలం ఏదో తెలపమని అడిగితే, అప్పుడు బ్రహ్మ తన మనోబలంతో ఒక చక్రాన్ని తయారుచేసి, విసరి, ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అదే అనుకూలమైనది అని చెప్పాడు. ఆ చక్రం తిరుగుతూ, తిరుగుతూ ఉండగా దానినే అనుసరిస్తూ ఋషులంతా వెళ్ళారు. ఆ చక్రం 14 లోకాలు తిరుగి ఎక్కడా ఆగకుండా ఈ నైమిశారణ్యంలోకి వచ్చింది. ఈ స్థలం భూమికి మధ్యభాగం అని, ఋషులు తపస్సు చేసుకోవటానికి అనుకూలమైన ప్రాంతమని, సత్కర్మయాగయజ్ఞాలు ఇక్కడ చేసుకోవచ్చు అని బ్రహ్మ చెప్పాడు. ఆ చక్రం(నేమి) భూమిని తవ్వుకుంటూ పాతాళమునకు వెళ్ళిపోతూ ఉంటే ఋషులు భయపడటం చూసి, బ్రహ్మ ఆదిపరాశక్తిని ప్రార్థించాడు. బ్రహ్మ యొక్క ప్రార్థనను విన్న లలితాదేవి ఆ చక్రాన్ని ఆపింది. అప్పటినుండి లలితాదేవి ప్రసిద్ధమైన ఈ స్థలం నైమిశారణ్యమై లలితాదేవి ఇక్కడ ప్రత్యక్షమై ఋషుల కోరిక ప్రకారం ఇక్కడ జరిగే హోమ, యజ్ఞ, యాగములను జయప్రదం చేస్తూ, వారి జీవితాల్లో నిరాశ లేకుండా అన్నీ సఫలం అయ్యేటట్టు చేస్తోంది.
బ్రహ్మ తన హృదయం నుండి సృష్టించిన మనోమయ చక్రం యొక్క నేమి అంటే "అంచు చీలిన ప్రదేశం" అగుటచే ఇది నైమిశారణ్యంగా పిలువబడుతోంది.
చక్రతీర్థంలో స్నానంచేసిన వారికి కష్టములు తొలగిపోయి ముక్తిని పొందుతారు. చక్రతీర్థంలో స్నానం చేస్తే సూర్యగ్రహణం సమయంలో కురుక్షేత్రంలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందంట.
No comments:
Post a Comment