భక్తి సూక్తి సుమాలు (గుల్లల్ల వీర్రాజుగారు)
భక్తి సుమాలు
శ్రీ గుల్లల్ల వీర్రాజుగారు
శ్రీ గుల్లల్ల వీర్రాజు గారి భక్తి సుమాలు అనే పుస్తకం నుండి42 భక్తి పద్యాలు
01వ పద్యం
ఆది పూజ్యుడవని నిన్ను అనుదినమ్ము
కొలుతునెప్పుడు మానక పలుకవేమి
పాపినంటిని నన్నేల కోపమిడక
ఎలుకవాహన బ్రోవవా అలుకమాని ||
02
శ్రీరఘురామా నినునే
నోరారగ పిలిచినాడ నేరంబగునా
మారాడక రావేలను
కారణమేమయ్యనన్నుగావుము కృష్ణా ll
03
శ్రీ రుక్మిణీశ నినునే
నోరారగ పిలచుచుంటి ననుగనరావా
కారణమేమో తెలియదు
మారాడక నన్నుగావు మనవిని కృష్ణా ll
04
శ్రీ పండరి పురవాసా
ఆపదలో నుంటినయ్యా అభయంబీవా
ఏ పాప మెరుగనంటిని
కాపాడే దొరవు నీవె కావుము కృష్ణా ll
05
గోవర్ధనగిరి నెత్తియు
గోవులగాచితివి నీవు కోరితి నిన్నే
నావల్ల దోషమున్నను
కావగరమ్మంటి నిన్ను కనుమా కృష్ణా ll
06
తల్లివి తండ్రివి నీవని
ఎల్లప్పుడు నిన్ను దలచవేగిర పడితిన్
చల్లని నీదయజూపగ
నల్లని నా స్వామి నిన్ను నమ్మితి కృష్ణా ll
07
యాదవ కుల భూషణ నీ
పాదములను విడువనయ్య పాపిని దేవా
నీదయ లేకున్న మనిషి
సాదరమున నుండలేడు సత్యము కృష్ణా ll
08
సృష్టికి మూలం బీవే
నిష్టతో నినుగొలుచుచుంటి నేరంబౌనా
దుష్టులను దునిమిన మాధవ
అష్టైశ్వర్యంబులడుగ నవనిని కృష్ణా ll
09
గోకుల బాలా కోపమా
సాకగ రావేల నన్ను శౌరీ దయతో
ఎక్కడ నుంటివి కానవు
పెక్కుగ నేసేవ చేయపిలచితి కృష్ణా ll
10
వెన్నలదొంగా ఏమిది
కన్నెలతో నీవుదిరుగ కలగంటిని యా
పన్నగ శయనా పలుకవు
నిన్నున్ విడి యుండలేను నిజముగ కృష్ణా ll
11
కోపంబా నను గావగ
ఆపదలోనుంటినేను ఆదుకొనంగా
నీ పదములు విడువనునే
కాపాడెడుదొరవు నీవె కావుము కృష్ణా ll
12
ద్వారక నగర నివాసీ
కారణమేమయ్య రావు కోపము తగునా
భారము నీదే ననుగన
మారాడక రమ్ము నన్నుమరువకు కృష్ణా ll
13
గోపికలందరు నినుగన
కోపముతో నుండిరయ్య కారణమేమో
ఆపద్బాంధవ అగుపడి
గోపికలను శాంతపరచు గోకుల కృష్ణా ll
14
దుష్టుల శిక్షించగనీ
అష్టమ గర్భమున పుట్టితవనినిగావన్
నిష్టనునినునే గొలచితి
కష్టములను బాపరావ కరుణను కృష్ణా ll
15
మురళీగాన విహారీ
మరువక నినుగొలుచుచుంటి మానక ఎప్పుడున్
వరమీయగ నరుదెంచవె
కరుణాకర కామితమిడి కావుము కృష్ణా ll
16
పండరి పురవాసానను
దండించగ జూతు వేల ధర్మంబేనా
పుండరీకాక్షా నిన్నే
నిండుగ హృదయంబునందు నిలిపితి కృష్ణా ll
17
నల్లని వాడా యే మిది
అల్లరి చాలింకనీవు అగుపడవయ్యా
చల్లని నీ కృపబడయగ
కళ్ళను ప్రాణమునిడుకొని కాచితి కృష్ణా ll
18
నందుని యింటను పెరిగిన
మందరగిరిధరమముగన మరువకుమయ్యా
సుందర రూపా తగునా
బంధము లనుబాపవేమి భారము కృష్ణా ll
19
పన్నగశయనా పలుకవు
కన్నయ్యరావదేమి కారణమయ్యా
అన్నా నీవేదిక్కని
యున్నా నీకొరకు నేను విడువకు కృష్ణా ll
20
నీగళమున హారమునయి
భోగమునే నందు లాగ భాగ్యమునీవా
నాగతి నీవే యనుచును
వేగమెరమ్మనుచు నిన్ను వేడితి కృష్ణా ll
21
కోపం బేలను నాపయి
కాపాడవదేల నన్ను కారణమేమో
పాపిని నేనని విడువకు
గోపాలా కావు మింక గోకుల కృష్ణా ll
22
కన్నులకేల నగుపడవు
వెన్నల దొంగా మరువక వేగమెరావా
పన్నగశయనా తగునా
కన్నయ్యా బ్రోవవేమి కరుణను కృష్ణా ll
23
కరుణామయడవు నీవని
చరణమ్ములు విడువనంటి చక్కని తండ్రీ
కరి నేలిన దొరవనుచును
నిరతరము నిను కొలుచుచుంటి నిజముగ కృష్ణా ll
24
ఎన్నకు నాతప్పుల నిక
కన్నయ్య బ్రోవరావ కనికరముననే
విన్నపములు వినమంటిని
నిన్నికనే విడువనయ్య నిజముగ కృష్ణా ll
25
రమ్మని పిలిచితి నినునే
కమ్మని విలుకాని తండ్రి గాంచగ రావా
నమ్మితి నయ్యా నిజముగ
సమ్మతి బ్రోవు మింక నన్నా కృష్ణా ll
26
మురళీమోహన మరువను
కరుణతో నన్నేలవేమి కారణమయ్యా
నిరతమునిన్నే కొలిచితి
పరమాత్మ పలుకవేమి పాపము కృష్ణా ll
27
కరుణాకరుడవు నీవని
మరువకనే పిలుచుచుంటి మాధవరావా
మరుపా దీనునిబ్రోవగ
నిరతము నీసేవచేయనిలచితి కృష్ణా ll
28
ధనధాన్యమడుగ లేదిక
వనమాలీ మొరవినిమరి పరుగిడిరావా
కనుమిక దాసుని కరుణను
ఫణిశయనా పలుకవేమి పంతము కృష్ణా ll
29
పేద కుచేలుని బాధలు
మోదముతో దీర్చినావు మోహనరూపా
కాదనకయ్యా ననుగన
బాధలె యేపగిదిగన్న బాపుము కృష్ణా ll
30
ఎన్నగ నాతరమానిను
కన్నయ్యానీదు మహిమ కమనీయంబే
ఎన్నడు నినుగాంతునొమరి
పన్నగశయనా పలుకవు పంతమ కృష్ణా ll
31
యాదవకుల భూషణ యో
మాధవ మధు సూదన నిను మరువనుదేవా
వాదములేలను ననుగన
మోదముతో బ్రోవరమ్ము మోహన కృష్ణా ll
32
దేవకితనయా నినుగని
సేవలుచేయంగనుంటి స్వామిరావా
నావల్ల నేరమున్నను
బ్రోవగరమ్మి కననుగని బేలను కృష్ణా ll
33
కోరను కానివి యిమ్మని
కోర్కెలు నేనెన్నడు నిను గోపకిశోరా
మీరను నీ మంబెపుడును
నోరారగరమ్మనంటి నేరమ కృష్ణా ll
34
భక్తుల విడువవు నీవని
శక్తి కొలది నేగొలచిన శౌరీ రావా
నిక్కము నీకృప బడయగ
మక్కువతో బిలచుచుంటి మనవిను కృష్ణా ll
35
నిందలు భరింప జాలను
నందకుమారా వినుమిక నను గన రావా
సుందర వదన ముకుందుడ
బంధములను బాపరావ బాగుగ కృష్ణా ll
36
మురళీగానవిహారీ
మరుపాననుకావగాను మొరవినిరావా
పరమాత్మా పరికించుము
నిరతము నిను గొలుచుచుంటి నిజముగ కృష్ణా ll
37
కమ్మని విలుకాని పితా
పొమ్మనుట న్యాయమగున పాపిని కానే
ఇమ్మహి నీకన్ననెవరు
ముమ్మాటికీ ననదగు మురళీ కృష్ణా ll
38
పన్నగ శయన పరాకా
విన్నపమును ఏలవినవు వివరించితి గా
ఎన్నోయిడుములకోర్చితి
మన్నించవదేలనయ్య మనవిని కృష్ణా ll
39
హరినీవే దిక్కనినే
మరిమరి నినువేడుచుంటి మనవినిరావా
కరి నేలినదొర వీవని
శరణంటిని కావమేమి శాపమ కృష్ణా ll
40
ఆశతొనిను నేవేడితి
కేశవ దయజూపరావ కోపమదేలన్
పోషకుడవు నీవంటిని
పాశములెడబాపరమ్ము పరుగున కృష్ణా ll
41
భారంబని యెంచకు నే
నిరతము నీదయబడయగ నిలచితి దేవా
వెరవకు ననుసాకగరా
మరువకు మీ దీనుని మొర మహిలో కృష్ణా ll
42
ఏమని దెలిపెద నయ్యా
నామదినిను గాంచనుండె ననుగన మయ్యా
ఏమదిరావిటు లెందుకు
నీమముతో గొలుచుచుంటి నిజముగ కృష్ణా ll
సూక్తి సుమాలు
43
మమత అనురాగముల మాటమరచిపోయి
మానవత్వపు విలువలు మంటగలిపి
మనగజూచుచు నుండిరి మనజులిపుడు
జనన మొందితి నెందుకీ జగతిలోన ll
44
నాది నావార నెడి ఆశ అధిక మయ్యె
పరులబాధలుకనలేరు పగను పెంచి
కరుణజూపరు మనసు కరుడుగట్టె
జననమొందితి నెందుకీ జగతిలోన ll
45
ఎన్ని ఘోరాలు అవనిలో ఎన్నలేము
నీతినియమాలు గోతిలోపాతిపెట్టి
సాటి మనిషిని మనిషిగా చూడరసలు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
46
కూడుగుడ్డకు కరువైన కూలివాడు
సుఖమనునది యెరుగక సమసిపోయి
అసువులర్పించుచుండి రీ అవనిలోన
జననమొందితి నెందుకీ జగతిలోన ll
47
దీనజనులను బ్రోవగ కానరారు
ఎన్ని ఇడుములు పడుచున్నవినరు గోడు
పాపభీతి విడనాడి బరగుచుండె
జననమొందితి నెందుకీ జగతిలోన ll
48
మారణాయుధములే నేడుమరచిపోరు
చేరనీయరు మరెవరినిచెలిమి మరచి
ఎందుజూచిన వారలేముందు నుండు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
49
పాపపుణ్యాల భేదముప్రక్కనెట్టి
దానధర్మాలు అనునవేమనసు నిడరు
వేనవేలుగా ఘోరాలు కానవచ్చె
జననమొందితి నెందుకీ జగతిలోన ll
50
కాంతనుగనిన యంతలో వింతగాను
వెకిలి చేష్టలు చేయుచు వెనుకనడచి
ఎంతగా విసిగించును కొంతమంది
జననమొందితి నెందుకీ జగతిలోన ll
51
పదవికాంక్షను విడలేక పరుగులెత్తి
పతన మౌదురు ఎందుకూ పనికిరాక
పదవిలేకున్న బ్రతుకులు బరువుకావె
జననమొందితి నెందుకీ జగతిలోన ll
52
ధనము కలిగియున్న జనులు ధరణిలోన
కనులు పొరలు గప్పితిరుగు కాలమంత
కడకు ఏరీతి గడచునో కానకుండె
జననమొందితి నెందుకీ జగతిలోన ll
53
గొప్పలెన్ని యొజెప్పును కొంతమంది
ముప్పు వచ్చుననెడి మాట ముందు మరచి
మునిగిపోయిన తరువాత మిగులునేమి
జననమొందితి నెందుకీ జగతిలోన ll
54
మాట తప్పనివారు యీపూట లేరు
సాటివారల కష్టాల మాట వినరు
ఆత్మసౌందర్యమను నదే అసలు లేదు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
55
వేషభాషల మార్పుతో విలువనొంద
తెలివితప్పినమనవారు తిరుగుచుండె
వున్న సంప్రదాయమునకు వన్నెతేరు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
56
పరుగులెత్తును ఓటుకు పరువు మరచి
పదవి ముఖ్యము వారికి ప్రజలుకారు
పదవికోసమెందులకని ప్రాకులాట
జననమొందితి నెందుకీ జగతిలోన ll
57
గద్దెమీదను కూర్చున్న పెద్దవారు
బుద్ధి వక్రించు నెందుకో హద్దుమీరి
బడుగు వారికి యిక్కట్లు బాపబోరు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
58
నీతినియమాలు విడిచిరి నేటి జనులు
ఖ్యాతి కాంక్షతో ధనమును కూడబెట్టి
అడ్డదారులు త్రొక్కుచు నధములైరి
జననమొందితి నెందుకీ జగతిలోన ll
59
ఎందుగాంచిన మోసము చిందులేసి
మంచి చెడ్డల మాటలు మరచినారు
మానవత్వపు విలువలు మంట గలిపె
జననమొందితి నెందుకీ జగతిలోన ll
60
ఎక్కడున్నది న్యాయము ఒక్క రయిన
చెప్పగానుండరు భయము చెందునేమొ
ధనముచాటున దాగుంది ధర్మబుద్ధి
జననమొందితి నెందుకీ జగతిలోన ll
61
మనసు నందున మలినమ్ము మాటతీపి
మమత అనురాగముల మాట మెరుగుపరచి
మానవత్వపు విలువలు మంటగలిపె
జననమొందితి నెందుకీ జగతిలోన ll
62
నిందమోయుటే నిరుపేద ఎందుగనిన
నిలువ నీయరు ఎందుకో నీతివిడిచి
గొప్పవారెప్పుడును తప్పు ఒప్పుకోరు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
63
పేదగా పుట్టుటేవారి పెద్దతప్పు
జీవితాంతము బాధలు చిక్కులేను
మమత పంచెడిమనుషులు మరుగుపడెను
జననమొందితి నెందుకీ జగతిలోన ll
64
కష్టనష్టముల కోర్చి కార్మికుండు
కటిక దారిద్ర్యమే మిగులు కాలమంత
కనరు వారిని యజమాని కనికరించి
జననమొందితి నెందుకీ జగతిలోన ll
65
కన్నులుండియు కనలేరు కరుణమరచి
కన్నవారిని కష్టాలకడకు నెట్టు
కరుడుకట్టిన మనసుతో కాలమంత
జననమొందితి నెందుకీ జగతిలోన ll
66
ఆలిమాటకు విలువిచ్చి అమ్మమాట
వినని వారుండె యిలలోన విరివిగాను
అమ్మ అనురాగమంతయు ఆవిరవగ
జననమొందితి నెందుకీ జగతిలోన ll
67
కన్నబిడ్డ బాధలుగాంచి మిన్నకుండు
తల్లితండ్రుల తపనను తలచరెవరు
ఏమియును చేయలేకను ఏడ్చుచుండ
జననమొందితి నెందుకీ జగతిలోన ll
68
భర్తయెడలను భయముతో దిరుగుచున్న
విడువకుండను హింసించు విరివిగాను
విధిని ఎదిరించి దిరుగుట ఎవరితరము
జననమొందితి నెందుకీ జగతిలోన ll
69
ఎంతచేసిన కోడలు ఎవరుగనరు
వింత మనుషులుగా మారు విరివిగాను
అంతమెప్పుడోతెలియదు అవనిలోన
జననమొందితి నెందుకీ జగతిలోన ll
70
అత్తమామల కెంతయు ననుదినమ్ము
వేళతప్పక సేవింప విలువలేదు
విడుచు కోపాగ్ని జ్వాలలు విరివిగాను
జననమొందితి నెందుకీ జగతిలోన ll
71
కష్టనష్టాల కోర్చును కాలికి భార్య
బంధములనేమరచుచును భర్తఎపుడు
అధికధనముకై ఆశించు అత్తనుండి
జననమొందితి నెందుకీ జగతిలోన ll
72
తల్లితండ్రులు తనయులకెల్ల వేళ
కంటిరెప్పలై కాపాడి కదలుచుండు
కనికరమ్ముజూపరు కడకువారు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
73
తల్లిదండ్రుల ప్రేమతో ఎల్లవేళ
జూచువారెందరీనాడు జెప్పలేము
తల్లిదండ్రుల బాధించు తనయులేల
జననమొందితి నెందుకీ జగతిలోన ll
74
అమ్మకువిలువనీయరు అహముతోడ
అమ్మయను మాటలోనున్న కమ్మదనము
తేనెకన్నను మధురము తెలుసుకొనరు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
75
కన్నప్రేమకు విలువనీయకున్నవారు
కొల్లలున్నారు జగతిలో నొళ్ళు మరచి
కాలమేరీతి గడచుకొనలేరు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
76
తొల్లిగడచిన రోజులు మళ్ళిరావు
తల్లిమాటకు విలువీయ తలచరేల
ఎల్లవేళల ఆలికై తల్లడిల్లి
జననమొందితి నెందుకీ జగతిలోన ll
77
విద్యనేర్చిన వారికె విలువలేదు
మద్యమును త్రాగి యువతయు మసలుచుండె
పెద్దలందున వినయము సద్దుమణిగె
జననమొందితి నెందుకీ జగతిలోన ll
78
కలిమికలదని ఎందరో చెలిమిమరచె
కలిమి కలకాలముండదు కనరువారు
చెలిమికున్న విలువెంతొ చెప్పలేరు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
79
వృద్ధులగు తల్లిదండ్రుల శ్రద్ధ తోడ
జూడరెందుకో తనయులు వీడనుండు
కాలమేరీతిగడుపునొ కానలేరు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
80
తనకు పెట్టకున్నను హానీ తలపదసలు
అట్టితల్లిని గాంచని తనయులుండె
తల్లిమనస్సు నెరుగని తనయులేల
జననమొందితి నెందుకీ జగతిలోన ll
81
కోరుకున్నదానిని సమకూర్చు సతిగ
కొడుకు ఆనందమే తను కోరుకొనును
అతడు ఆలిపై అనురాగ మమరియుండు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
82
అమ్మఅనురాగమునకిక అంతులేదు
అట్టి అమ్మనుజూడక ఎట్టులుండు
మనసు మారును ఎందుకోమహినిజూడ
జననమొందితి నెందుకీ జగతిలోన ll
83
ఇష్టమున్ననులేకున్నను కష్టమైన
విసుగు చెందకనే భార్య మసలుచుండు
నేరమన్నది లేకున్న వూరుకోరు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
84
ఎక్కడెంత జూచిన గాని ఒక్కరే ని
మమతఅనురాగముల తోడమసలువారు
జూడలేకుంటిమీనాడు చోద్యమేమొ
జననమొందితి నెందుకీ జగతిలోన ll
85
అక్కచెల్లెళ్ళు అనురాగమంతరించె
తల్లిదండ్రుల నేవేళ తలపరసలు
ఆలి అనురాగమునకెంతొ ఆశనిడుచు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
86
ఆస్తికొరకన్నను తాను హత్యచేసి
అనుభవించగజూసెడి ఘనులు మెండు
గడువజాలదు కాలము గనరువారు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
87
అమ్మఆశలు నెరవేర్చ అతడుగనడు
అమ్మకన్నను భార్యయే అధికమగును
ఆలిమాటకు విలువిచ్చి అడుగులిడును
జననమొందితి నెందుకీ జగతిలోన ll
88
ధనముకుండెడి విలువ యీ ధరణిలోన
ఎందుగాంచిన కనరాదు ఏమివింత
ధనములేకున్న బ్రతుకులు దుర్లభమ్మె
జననమొందితి నెందుకీ జగతిలోన ll
89
ధనబలము కలవారలు ధర్మము విడి
కండబలమదికలవారు కరుణమరచె
కూడుదొరకని దళితులు కృంగిపోయె
జననమొందితి నెందుకీ జగతిలోన ll
90
జన్మఆఖరివరకు అమ్మఋణము
దీర్చుకున్నను భువిలోన దిరుగుటేల
భార్యకొరకు బంధములను బాపుకొనుచు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
91
బాల్యమందున బంగరు బాటగాను
యవ్వనంబున వాడని పువ్వుయగును
అత్తవారింట అడుగిడి అంతమగును
జననమొందితి నెందుకీ జగతిలోన ll
92
హద్దులను మీరి అహముతో పెద్దలందు
బుద్ధిహీనులై మెలుగును కొద్దిమంది
వినయమనునది యిసుమంత కనగలేరు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
93
అక్కచెల్లెండ్రు అభిమానమెక్కడుంది
అన్నతమ్ముల అనురాగమంతరించె
ఆస్తి ఒక్కటే వారికి అవసరమ్ము
జననమొందితి నెందుకీ జగతిలోన ll
94
ఆడపడుచుల యాగడంబంతు లేదు
అత్తమామల పెత్తనమాపలేరు
భార్యఅనుమాట మరచును భర్తకూడ
జననమొందితి నెందుకీ జగతిలోన ll
95
అత్తకోడళ్ళు అనుబంధ మంతరించె
ఆలుమగలను మాటకు అర్థమేది
ఇంటిపనిమనిషిగమారె నింతి భార్య
జననమొందితి నెందుకీ జగతిలోన ll
96
పుట్టినింటిను విడిచితా మెట్టినింట
అడుగుపెట్టిన వనితకు ఆదరమ్ము
అసలుజూపరు అత్తింటి అతివలెపుడు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
97
కన్నబిడ్డలను వదలివున్నవారు
భార్యాభర్తలు పనిచేయబరగుచుండె
ప్రేమతోడను పిల్లల్ని పెంచునెపుడు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
98
బోసి నవ్వుల మురిపాలు లేశమైన
జూడనోచని బ్రతుకులు వీడలేరు
ఆలుమగలకుసంపదే అవసరమ్ము
జననమొందితి నెందుకీ జగతిలోన ll
99
అడిగినట్టి కానుకలిచ్చి అత్తవారి
ఇంటికంపిన కూతురు కంటినీరు
కార్చుట మిగులు అబలకు కాలమంత
జననమొందితి నెందుకీ జగతిలోన ll
100
అత్తఒక ఇంటికోడలే అనుటమరచి
పెత్తనముతోడ కోడలి పొత్తుమరచి
ఎక్కుపెట్టును అస్త్రములెన్నియైన
జననమొందితి నెందుకీ జగతిలోన ll
101
అత్తామామలందణకువ అసలు నిడరు
పెత్తనముచేయ నెంతైన నొత్తిడిడుచు
నిత్యమాయింట నిలుచును నిప్పురగడ
జననమొందితి నెందుకీ జగతిలోన ll
102
ధనమదముతొడ నెపుడు దిరుగునొకడు
పదవి గర్వముతోడను బరుగునొకడు
పాపభీతిని విడనాడి వరలునొకడు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
103
మద్యపానముసేవించి మసలువారు
మత్తుమందులకలవడి మాటరాని
మందుబాబుల మనసుమారునెపుడు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
104
తుదకు మిగులునదేమని ముందు గనరు
వెళ్ళిపోవునప్పుడదేది వెంటరాదు
అన్నితెలిసియు కూడను మిన్నకుండు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
105
అన్ని జన్మలకన్న మిన్నయనెడి
మనుజ జన్మకున్న విలువమరచినారు
మనిషి విలువలు మరువక మసలరేల
జననమొందితి నెందుకీ జగతిలోన ll
106
తనకులేకున్న కొడుకుకై తల్లడిల్లు
కన్నవారిఋణము దీర్చుకొనగవారు
కన్నులుండియు బాగుగా గాంచలేరు
జననమొందితి నెందుకీ జగతిలోన ll
107
ఎన్నిఇడుమలు నెదురైన అన్ని మరచి
వున్నఆస్తిని తెగనమ్మికన్నవారి
కంటి నీరేమిగిల్చిన కొమరులుండె
జననమొందితి నెందుకీ జగతిలోన ll
108
మనసునందున మలినము మరుగుపరచి
మానవత్వపు విలువలు మరువకుండ
మమత అనురాగములతోడ మసలుచున్న
నిలుచు నీ కీర్తి ఎప్పుడూ నింగికెగసి ll
No comments:
Post a Comment