December 16, 2014

విష్ణుసహస్రనామాలు 01

విష్ణుసహస్రనామాలు 01

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః || 1 ||

1 విశ్వం (The Universe) 
విష్ణుసహస్రనామ స్తోత్రంలో ప్రారంభమున భగవంతుని "విశ్వం" అని నామకరణం చేయటం జరిగింది. అజ్ఞానాంధకారమును పారద్రోలుటలో ఈ మొదటి నామము జ్ఞానభాస్కర తేజమై విరాజిల్లుతుంది. జగత్సృష్టికి భగవానుడు కారణమై ఉన్నందున తానే సృష్టికర్త  అయ్యెను.    
"విశ్వం" అనగా ఓంకారమని శ్రీ శంకరులు తన భాష్యములో తెలియచేసారు. "ఓమితి బ్రహ్మ, ఓమితీ దగం పర్వం" ఓం అనునదియే బ్రహ్మం. సర్వ వేదములలోని ఓంకారము నేనై ఉన్నానని భగవానుడు బావద్గీతలో విజ్ఞానయోగంలో తెలియచేసాడు. ఎవ్వరైతే ఈ విశ్వమంతయూ బ్రహ్మముకన్నా అన్యము కాదని గ్రహించి, ప్రణవ స్వరూపమని గుర్తించి,దానికి అనుగుణమైన జ్ఞానము కలవాడై జీవించునో అట్టివాడు విశ్వవైభవమును విశ్వనాధుని వైభవముగా దర్శించి జీవించును. రాగద్వేషము అంతరించును. అద్వైతానుభూతి కరతలామలకమగును.

ఆది కారణమైన చైతన్యమే "విశ్వం" అని పిలవబడుతుంది. ఆ కారణ చైతన్యం ఎవరు ? అనే దానికి సమాధానం రెండవ నామం అయిన "విష్ణుః" అనే నామంలో తెలియచేయటం జరిగింది.

2 విష్ణుః (The All -Pervading)
మొదటి నామంలో భగవానుని "విశ్వం" అని తెలియచేసి ఈ రెండవ నామంలో "విష్ణుః" అని తెలియచేయుట భావగర్భితంగా ఉంది. కనిపించి, వినిపించు విశ్వమంతయూ బాహ్య-అంతరములలో నారాయణుడు వ్యాపించి ఉన్నాడని నారాయణోపనిషత్తు తెలియచేస్తోంది. కాబట్టి కనిపించే జగత్తు అంతా నారాయణ స్వరూపము ఐనందున తాను "విశ్వం" అని పిలవబడి "వ్యాసనశీలత్వాత్" అను ధర్మం వాళ్ళ విష్ణువు అయ్యెను. 

"విష్ణుః" అనే నామము పలుకగానే సర్వమును విష్ణు స్వరూపముగా దర్శించగలిగి  ఉండాలి. అంటే మనలో దాగిఉన్న అజ్ఞానము దగ్ధం అవ్వాలి. మనలోని అహంకారాన్ని సమిధిగా మార్చి విష్ణు స్వరూపము అనే యజ్ఞంలో ఆహుతి చెయ్యాలి. అందుచేతనే విష్ణుమూర్తి యజ్ఞస్వరూపుడు అని మూడవ నామంలో తెలియచేయబడుతోంది. 

3 వషట్కారః (He on whose Account Vashatkara is offered)
వషట్కారుడు అని విష్ణుమూర్తిని కీర్తించుట వలన తాను వేదస్వరూపుడని తెలియబడుతున్నాడు. యజ్ఞ నిర్వహణలో మంత్రాలు చదివేటప్పుడు ప్రతీ మంత్రము చివర "వషట్" అను పదముతో ముగుస్తుంది. విష్ణుమూర్తిని ఉద్దేశించి అతని ప్రీత్యర్థము గౌరవించబడు యజ్ఞంలో "వషట్" అనేది పలుకుటచే తాను యజ్ఞస్వరూపుడైన "వషట్కారః"అని పిలవబడుచున్నాడు. విష్ణుమూర్తి వేదస్వరూపుడగుట వలన సర్వమూ తన వశమై ఉన్నది. సర్వం విష్ణుమూర్తియే. మనలను మనం భగవానునికి సమర్పించుకొనుటే ఆత్మయజ్ఞము. యజ్నమే విష్ణువు అని తెలిసింది కదా ! యజ్ఞము (సరైన)కాలములో మొదలై, కాలములో ముగుస్తుంది. యజ్ఞము అనేది కాలపరిధిలో ఉన్నది. అలా అయితే భగవానుడు విష్ణువు కూడా కాలపరిధిలో ఉన్నాడా ? లేడు. మరైతే అతనెలా ఉన్నాడు ? ఈ విషయాన్ని నాల్గవ నామంలో మనం తెలుసుకుందాం.

4 భూతభవ్యభవత్ప్రభుః (The Lord of Present Past and Future)
భూత భవిష్య వర్తమానముల యందు విస్వమంతటికీ అధినేతగా భగవానుడు ఉన్నాడు. కాలము మనస్సు నుండి ఆవిర్భవించింది. కాలమంతా భగవానుని యందే నడుస్తున్నది. భగవానుడు తాను కాలస్వరూపుడై, కాలాతీతుడై ఉన్నాడు. భూత భవిష్య వర్తమానములు తనలో అంశ మాత్రమై ఉన్నాయి. మూడు కాలాలలో జరిగే సంఘటనలను తాను చూస్తూనే(గమనిస్తూనే) ఉంటాడు. అతని ఆజ్ఞకు లోబడియే సర్వం నడుస్తుంది. కనుక భగవానునికి అన్యమైనది ఏదియూ త్రికాలముల యందు లేకపోవుటచే తాను "భూతభవ్యభవత్ప్రభుః" అని పిలవబడుతున్నది.   

భూత భవిష్య వర్తమానముల యందలి సకలమునకు తానూ ప్రభువని తెలియచేయబడింది. ప్రభువు అనగా అధినేత, మరి భగవానుడు ప్రభువు అయితే తాను పాలించే సృష్టి తనదా ?లేక తాను పాలించుటకు మరొకరు సృష్టించినదా ? దీనికి వివరణ వచ్చే నామంలో వివరించబడింది.

5 భూతకృద్ (The Evolver of Being)

త్రికాలవేది అయిన విష్ణుమూర్తియే భూతములను సృష్టించి "భూతకృద్" అయ్యెను. తానే రజోగుణముతో కూడి బ్రహ్మయై సృష్టి చేసి "భూతకృద్" అయ్యెను. తానే తమోగుణముతో కూడి రుద్రుడై "కృతంతి" సంహారము చేసి "భూతకృద్" అయ్యెను. రజోతమోగుణ సమన్వితుడై తాను సృష్టి సంహారములు సాగించగా తనలోని సత్వగుణము ఏమయ్యింది ? ఇందుకు వివరణ రాబోయే నామంలో మనం తెలుసుకుందాం.

.6 భూతభృత్(The Sustainer of Beings)
రజో తమోగుణ సమన్వితుడైన సృష్టి సంహారములు చేసిన భగవానుడు సత్వగుణముతో కూడి భూతస్రష్టయై "భూతభృత్" అయ్యెను. తనలోని సత్వగుణమే స్థితి కారణం అయ్యెను. "భూతభృత్" అనగా జీవులందరినీ పోషించువాడు అని భావం. ఎలా పోషించగలడు అనే విషయాన్ని తరువాత నామంలో తెలుసుకుందాం.

7 భావః (The Absolute Existence)
సమస్త చరాచర భూత ప్రపంచమంతయూ తానే వ్యాపించి ఉండుటచే భగవానుడు "భావః" అని తెలియబడుతున్నాడు. తాను తయారుచేసిన సృష్టి తనకంటే అన్యముకాకపోవుట వలన తానూ సర్వవ్యాపి అయ్యాడు. "భవతీతి భావః" అగుట వలన "భావః" అని కీర్తించబడుతున్నాడు. విశ్వమంతయూ తానై ఉండుటచే "భావః" అయినాడు. మరి విశ్వమునకు నశించు స్వభావం ఉన్నది కదా ? విశ్వమే నారాయణుడు అయినచో నారాయణుడు మాత్రము నశించడా ? దీనికి సమాధానం తరవాత నామంలో తెలుస్తుంది.

8 భూతాత్మా (The Self of Beings)
సర్వ జీవకోటి యందు అంతర్యామిగా ఉండువాడు "భూతాత్మా" అని పిలువబడుతాడు. సర్వభూతాంతరాత్మకుడైన తాను సమస్త శరీర మనుగడకు కరయై, సాక్షియై ఉండు చైతన్యము అగుటచే "భూతాత్మా" అని పిలవబడినాడు. భగవానుడు సాక్షి చైతన్యమై "భూతాత్మా" అని పిలవబడినట్లయితే సృష్టి స్థితుల యందు ఉత్సాహమును చూపు శక్తి ఏది ? అది కూడా భగవానుడే ... ఆ విషయం వచ్చే నామంలో మనకు తెలుస్తుంది.

9 భూతభావనః (The Generator అఫ్ Beings)
జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడై "భూతభావనః" అని పిలువబడ్డాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించుటచేత, భగవానుడు "భూతభావనః" అని కీర్తించబడినాడు. అందుచేతనే భగవానుని "జగత్పిత" అంటారు.

"భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే" అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముని విభూతియోగంలో కీర్తించాడు.
            

2 comments:

  1. చాలా వివరంగా తెలిపారు ధన్యవాదాలు

    ReplyDelete