December 17, 2014

చీకట్లో చిరు దీపాన్ని వెలిగించుదాం

చీకట్లో చిరు దీపాన్ని వెలిగించుదాం 



ఒకానొక ఆశ్రమంలో ఒకనాడు ఒక శిష్యుడు అతని గురువు దగ్గరకు వచ్చి - "గురువర్యా ! నా ఆధ్యాత్మిక సాధన ముందుకు సాగడంలేదు. ఉపవాసాలు చేస్తున్నాను, పుణ్యక్షేత్రాలని దర్శిస్తున్నాను, పూజలూ, యజ్ఞయాగాదులు చేశాను" ఈ విధంగా చెప్పుకుంటూ పోతున్న శిష్యుని మాటలను మధ్యలోనే ఆపి "నీవు ఎవరికైనా సేవ చేసావా ?" అని గురువుగారు అడిగి, అక్కడనుండి వెళ్ళిపోయారు. ఎవరికైనా ఏదైనా మనం సేవ(సహాయం) అనేది చెయ్యాలి. అది మానవ సహజ లక్షణం. ప్రతీప్రాణీ తాను ఇతరులకు ఏదో ఒకరకంగా సేవ చేస్తూనే ఉంటుంది. సేవలో - ఆస్తికుడు దేవుడిని తెలుసుకుంటాడు. నాస్తికుడు తనను తాను తెలుసుకుంటాడు. 

**************************

మరికొద్ది రోజుల్లో ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది కదా ! మనం కొత్త కొత్త తీర్మానాలని చేసుకుంటూ ఉంటాం. ఎలాగంటే నేను - నాకుటుంబం - నా కేరీర్ అనుకుంటూ. మన తీర్మానాలు అయితే బాగానే ఉన్నాయి. మనకోసం మనం ఆలోచిస్తున్నాం తీర్మానాలు చేసుకుంటున్నాం. మరి ఇతరుల కోసం ఏదైనా చేద్దామని ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నామా ? లేదే...... ఇతరులకు ఏమైనా సహాయం చేస్తున్నామా ? ఊహూ అదీ లేదు. కొద్దిమంది మేం ఇతరులకు సహాయం చేస్తున్నాం అని అంటారు. అది ఏవిధంగానో తెలుసా ? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనం(vehicle)  ఆగినప్పుడు యాచకుడికి ఒక రూపాయి వేయటం, భూకంపాలు - వరదలు వచ్చినప్పుడు వందో, రెందొండలో విరాళంగా ఇవ్వటం, పాతబట్టలని పెద్దమనస్సు చేసుకుని పనివాళ్ళకి ఇవ్వటం. ఇవన్నీ దానధర్మాల క్రింద జమ అవుతాయి. సహాయం అని అనిపించుకోదు కదా ? మనం చెయ్యాల్సినది - బాధ్యతగా మనవంతు సహాయం ఇతరులకు, సమాజానికి అందించటం. అది ఏవిధంగా అంటే నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం...... ఇలాగ మనచుట్టూ అనేకానేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించటంలో మన వంతు బాధ్యత (పాత్ర) ఎంతవరకు అని అలోచించి వీలైతే పరిష్కరించాలి. 



***************************

పైన మనం చెప్పుకున్న సమస్యలకి సహాయం చెయ్యాలి అంటే మనం మహాత్ములం అవ్వనక్కరలేదు. మానవత్వం చూపించటానికి మథర్థెరీసా రావక్కరలేదు. అటువంటివారి వారసత్వం మనం అందిపుచ్చుకొని, మనచుట్టూ ఉన్నవారిని కూడా మనతో కలుపుకుంటూ మన వంతు బాధ్యతగా ఇతరుల సమస్యలు పరిష్కరిస్తూ ఉండాలి. అలా చేసేవారు మన మధ్య, మన చుట్టూ కూడా ఉంటారు, ఉన్నారు కూడా. అటువంటి వారిని గుర్తించి, గౌరవించటం మన బాధ్యత. మనకి చేతనైనంత సహాయసహకారాలు వారికి అందించటం మన కనీస కర్తవ్యం. ఆ దిశగా ఒక హృదయపూర్వక తీర్మానంతో మనం చేయిచేయి కలిపి కొత్త సంవత్సరంలోకి అడుగులు వేద్దాం రండి పదండి.

                                                                                                                ...........మీ శ్వేతవాసుకి   


కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం.



                                           

No comments:

Post a Comment