అపీత కుచాంబ ఎవరు?
శ్రీ శివాయ గురవేనమః -------- అపీతకుచాంబాస్తవము
(మొత్తం 08 శ్లోకాలు మూలం & తాత్పర్యంతో)
ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనల వివరణాయజ్ఞంలో..
రాసినవారు ------
“అరుణాచల నాథం స్మరామి అనిశం-అపీత కుచాంబా సమేతమ్ “
అని ఆ కృతి మొదలు. ఆగిపోయాను. అపీత కుచాంబ ఎవరు? ఆమె వివరాల ఆరాధనలో- అప్పయ్య దీక్షితులవారి అపీతకుచాంబాస్తవము కనబడింది. దానికి తెలుగులో తాత్పర్యం వ్రాయాలని ప్రేరణ కలిగింది.దాని ఫలితమే ఇది.
ఒకసారి శ్రీ అప్పయ్య దీక్షితులు అరుణచలేశ్వర దర్శనం కోసం తిరువన్నామలై వెళ్ళారు. అక్కడ వారికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ సమయంలో ఆయన ఈ స్తవాన్ని రచించి అపీతకుచాంబాదేవిని ప్రార్థించారు. వారికి వెంటనే ఉపశమనం లభించింది. ఇప్పుడు కూడా భక్తితో ఈ స్తవాన్ని పఠించడం ద్వారా జ్వరం మరియు ఇతర రోగాల నుండి ఉపశమనం పొందవచ్చు. మూలపాఠాన్ని , తెలుగు అనువాదాన్ని అమ్మవారి దయతో అందిస్తున్నాను.
01
ఆనంద సింధు లహరీ మమృతాంశుమౌలే-
రాసేవినామమృత-నిర్మిత-వర్తిమక్ష్ణోః .
ఆనందవల్లివితతేరమృతార్ద్రగుచ్ఛం
అంబ స్మరామ్యహమపీతకుచే వపుస్తే
తాత్పర్యం
అరుణాచలేశ్వరుని పట్టమహిషి అయిన అపీతకుచాంబ అమ్మవారియొక్క దివ్య దేహాన్ని స్మరిస్తున్నాను. అమ్మవారు చంద్రశేఖరుని ఆనంద సముద్రము యొక్క ప్రవాహం. ఎప్పుడూ తనను పూజించే వారికి కరుణామృతం నిండిన కళ్ళు గల తల్లి. ఆనందమనే తీగకు కలిగి, అమృతముచే తడిసి ఆర్ద్ర్రంగా ఉన్న పూలగుత్తి.
02
నిర్నిద్ర-కోకనద-కోమలకాంతమంబ
నిత్యం సుధానికరవర్షి పదం త్వదీయం .
మూర్ఛాకరజ్వరరుజా మమ తాపితస్య
మూర్ధ్ని క్షణం సకృదపీతకుచే నిధేహి
తాత్పర్యం
ఓ తల్లి ! ఓ అపీత కుచాంబా ! మృదువైన మరియు మెరిసే నీ పాదాలు అప్పుడే వికసించిన కమలాలు మరియు ఎప్పటికీ అమృతాన్ని వర్షించేవి . నేను మూర్ఛపోతున్నాను. జ్వరం మరియు అనారోగ్యం యొక్క వేడితో బాధపడుతున్నాను.దయచేసి నీ పాదాలను నా తలపై కనీసం క్షణం సేపు ఉంచు.
03
శీతాంశుకోటి సుషమాశిశిరైః కటాక్షైః
అవ్యాజభూత కరుణారస పూరపూర్ణైః .
కర్పూరధూలిమివ దిక్షు సమాకిరద్భిః
అంబ క్షణం స్నపయ మామరుణాద్రిమాన్యే
తాత్పర్యం
అమ్మా! నీయొక్క చూపులు వేలాది చంద్రుల నుండి వెలువడే వెన్నెల జల్లుల వంటివి. ప్రతిఫలాపేక్ష లేని కరుణారసంతో పూర్ణంగా నిండినవి. దిక్కులన్నిటా కర్పూరపు ధూళి వలె వెదజల్లబడుచున్నవి. అమ్మా! అటువంటి నీ యొక్క చూపులు ఒక్క క్షణం నా పైన వర్షింపజేసి నన్ను తడుపు
04
ఆవిర్భవ క్షణమపీతకుచే పురస్తాత్
అంబ జ్వరేణ మహతా మమ తాపితస్య .
యేన త్వదంఘ్రిరుచిజాల-సుధాప్రవాహే
మగ్నస్తదైవ తనుతాపమముం త్యజేయం
తాత్పర్యం
అమ్మా! నా శరీరము జ్వరము వలన చాలా తాపముతో ఉంది. నువ్వు ఒక్క క్షణమైనా నా ముందు కనబడి నీ పాదాలనుండి జాలువారే అమృత సముద్రాన్ని నా పైనుండి ప్రవహింపజేయుము. నేను ఆ ప్రవాహంలో మునకలువేసి నా శరీరములో ఉన్న తాపమును పోగొట్టుకొంటాను.
05
నానావిధైర్నలిన-జాతలిపిప్రకౢప్తైః
ఆనీతమూర్ఛమధికం క్షుభితైర్జ్వరాద్యైః .
ఆశ్వాసయ క్షణమపీతకుచే కరాగ్ర-
క్రీడాకనత్కనకహల్లకసౌరభేణ
తాత్పర్యం
అనేక రకాలయిన పద్మ దళాలతో చికిత్స ఉన్నప్పటికీ నా మతిమరుపుతో పాటు నా జ్వరం పెరుగుతున్నది, ఓ అపీత కుచాంబా ! నీ చేతిలో ఆడుతున్న ఆ బంగారు తామరసౌరభాన్ని నాకు అనుగ్రహిస్తూ ఒక్క క్షణం నాకు భరోసా ఇవ్వు. ఆశ్వాసించు.
06
కంఠే విషం విషముచో భుజగాః కపర్దే
పార్శ్వే చ భూతపతయః ప్రమథాశ్చ భీమాః .
శోణాచలేశముపసృత్య భజేత కో వా
న స్యాత్తవాంబ సవిధే యది సన్నిధానం
తాత్పర్యం
ఓ అపీత కుచాంబా ! నీ భర్త శివుని గొంతులో విషం; జుట్టులో విషం-వెలువడే సర్పాలు; పక్కపక్కనే భయంకరమైన భయంకరమయిన భూతాలు. నువ్వు గనుక అతని పక్కన లేకపోతే ఆ అరుణాచల ప్రభువును ఎవరు ఆరాధిస్తారు? ”
07
శక్తిర్జగజ్జననపాలన-భంజనేషు
భోగేషు దివ్యమహిషీ తరుణేందుమౌలేః .
సిద్ధిఃకరప్రణయినీ తవ సన్నిధానం
యన్నాసి తస్య తదపీతకుచే న జానే
తాత్పర్యం
ఓ అపీత కుచాంబా ! సృష్టి, రక్షణ మరియు విధ్వంసానికి కారణమయిన శక్తిదాయినీ! చంద్రుని తలపై ధరించిన శివుని యొక్క గొప్పరాణీ! కోరిన కోరికలు ప్రేమతో నెరవేర్చు నీ యొక్క గొప్ప దయకు మించి- నాకు ఇంకా ఏమీ తెలియదు
08
త్వం సాక్షిణీ ప్రళయ భైరవతాండవానాం
త్వం శేషిణీ సహరిధాతృ చరాచరాణాం .
త్వం మోచినీ సకల సంసృతి జాలకానాం
త్వాం బ్రహ్మసంవిదమపీతకుచే నమామి
తాత్పర్యం
ఓ అపీత కుచాంబా! శివుడి విధ్వంస నృత్యానికి నువ్వు సాక్షి. సృష్టి వినాశనంలో విష్ణువు, బ్రహ్మ మరియు ఇతరుల అంతర్థానం తరువాతకూడా మిగిలి ఉన్నదానివి. నువ్వు అనేక రూపాల్లో మోక్షాన్ని అందిస్తావు. నువ్వు బ్రహ్మజ్ఞాన స్వరూపిణివి.
No comments:
Post a Comment