February 27, 2014

మహాశివరాత్రి నోము కథ

మహాశివరాత్రి నోము కథ 


పూర్వకాలంలో ఒకానొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతడు ఎంతటి విద్యాసంపన్నుడో, అంతటి దారిద్ర్యము అతడ్ని వెంటాడుతుండేది. ఎంత ప్రయత్నించినా అతని చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు, దానికి తోడు అతని ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉండేది. ఇటువంటి పరిస్థితులలో మరొకరిని ఇబ్బంది పెట్టటం దేనికి అని, వివాహం చేసుకోవటం మానేసాడు. నా అని చెప్పుకోవటానికి ఎవ్వరూ లేక, సేవలు చేయటానికి భార్య లేక, నరకయాతనలు పడుతూండేవాడు. క్రమంగా కొద్దిరొజులకి అతనికి జీవితం మీద విరక్తి వచ్చి, ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రాణాలు తీసుకోవటం శాస్త్రసమ్మతం కాదని, నారుపోసినవాడే నీరుపోస్తాడు అని కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నాడు. కానీ, మరికొద్దిరోజులకి అతనిలో సహనం నశించి, ఇక ప్రాణత్యాగం తప్పనిసరి అని గట్టి నిర్ణయం తీసుకొని, నీటిలో పడాలా ? అగ్నిలో దూకాలా ? కత్తులతో పొడుచుకోవాలా ? విషాన్ని మింగాలా ? అని రకరకాలుగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. అతనికి కలలో సాక్షాత్తు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి "ప్రాణాలు తీసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు ? సదాశివుని కంటే దయామయుడు వేరే ఎవరు లేరు కదా ? అతనిని పూజించి, కీర్తించి, అతని కరుణా - కటాక్షాలు నీవు పొంది, నీ జన్మని సార్థకం చేసుకో" అని చెప్పి అంతర్థానమయ్యెను. 

దేవి ప్రత్యక్షమయ్యినందుకు సంతోషించి, నిద్ర మేల్కొని, ఉదయాన్నే ఒక పండితుని వద్దకు వెళ్ళి, తను పడుతున్న బాధలని, తనకు వచ్చిన స్వప్నాన్ని వివరించి, తనేమి చెయ్యాలని అడుగగా, ఆ పండితుడు  "నీకు స్వప్నంలో దేవి దర్శనం అవ్వటం చాలా అదృష్టం. ఆమె ప్రత్యక్షమయ్యి ఆ సదాశివుని ప్రార్థించమని నీకు తెలియచేసింది, నీవు ధన్యుడవయ్యావు. ఇక శివుని పూజించే విధానం అంటే, ప్రతీమాసంలో ఆఖరి మూడవరోజు (అంటే అమావాస్య ముందు వచ్చే త్రయోదశి)ని మాసశివరాత్రి అంటారు. ఆ రోజు నదీస్నానం చేసి, ఉపవాసం ఉండి, ఆ రాత్రంతా శివనామార్చనతో జాగారణతో గడిపి, సూర్యోదయ సమయంలో శివలింగాన్ని పూజించాలి. ఈవిధంగా మహాశివరాత్రి వరకు చెయ్యు, ఆరోజు నీకు కలిగినంతలో ఎవరికైనా ఒక ఫలమో, తృణమో ఇచ్చుకొని, వారి ఆశీర్వాదం పొందితే, నీకున్న ఈతిబాధలన్నీ తొలగిపోతాయి, నీకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది." ఆ బ్రాహ్మణుడు పండితుడు చెప్పిన విధంగానే భక్తి - శ్రద్ధలతో శివరాత్రి నోము నోచుకొని, సుఖసంతోషాలతో జీవితం గడిపాడు. 


ఉద్యాపన 
ప్రతీ మాసశివరాత్రికి శివలింగార్చన చేసి, ఉపవాసం, జాగరణ చెయ్యాలి. ఈవిధంగా సంవత్సర కాలం ప్రతీమాసశివరాత్రినాడు చేస్తూ, ఆ మరుసటిరోజున ఒక నిరుపేదకు మనకు కలిగినంతలో అన్నదానం చెయ్యాలి. మహాశివరాత్రి రోజున సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, శివాక్షరిని జపిస్తూ, శివునికి అర్చన చెయ్యాలి. పండితుల ఆశీర్వచనం తీసుకోవాలి. 

శివోహం...... హరహర మహాదేవ శంభో శంకర   

                                                          

No comments:

Post a Comment