April 22, 2014

బేలూరు

బేలూరు


బేలూరు నగరం--కర్ణాటక రాష్ట్రం లో......బెంగుళూరుకు సమీపంలో ఉంది...

దక్షిణ బెనారస్ గా పేరు గాంచిన బేలూరు-- శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. జైన మరియు వైష్ణవ సంస్కృతికి ప్రతీకమైన ఈ పురాతన నగరం "వేలాపురి" అని కూడా పిలవబడేది.

బేలూరు నందు చెన్నకేశవ ఆలయం శిల్పకళకు ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ ఉన్న శిల్పకళ, కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా... భారతదేశంలోనే ఉత్తమ శిల్పకళగా పేరొందినది. విష్ణువర్ధనుడు అనే హొయసల రాజు 1117 లో తన దిగ్విజయములకు స్మారకంగా ఈ చేన్నకేశవ ఆలయమును నిర్మించాడు. అందుకే ఇక్కడ దేవుడిని విజయనారాయణ అని కూడా పిలుస్తారు. దీనిని పూర్తిచెయ్యటానికి 103 సంవత్సరాలు పట్టిందట.

ఈ దేవాలయానికి వెలుపలి భాగంలో ఉన్న చిన్న గుడిలో షట్కోణాకారం లో సుదర్శన విగ్రహం ఉంది.... ఈ దేవస్థానం లో రెండు గర్భగుడిలు ఉన్నాయి. ఈ దేవాలయం ముఖద్వారం పైన, ఎత్తైన గోపురం కట్టబడి ఉన్నది.  బలిష్టతకు మరియు భద్రతకు సంకేతమైన ఏనుగుల వరుస.... దానిపైన సింహాల వరస....ఆపైన  రామాయణ -- మహాభారత దృశ్యాలు.... మధ్య - మధ్యలో హంసలు.... వివిధ భంగిమలలో చెక్కబడిన చిన్న చిన్న విగ్రహాలు..... ఈ విధంగా గోడల మీద చాలా ఆకర్షణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయానికి చుట్టూ 42 అందమైన శిల్పాలు మనం చూడవచ్చును.


ఒక శిల్పము యొక్క విశిష్టత ఏమిటంటే--- సుందరి మరియు చిలుక----ఒక శిల్పం ఎడమ చేతిలో ఉన్న చిలుకతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆమె కుడిచేతికి ఉన్న గాజులను మనం పైకి... క్రిందికి కదపవచ్చును. అంటే అప్పటి కాలంలో శిల్పుల నైపుణ్యం మనం చూసి తరించవలసిందే కానీ వర్ణించలేము.

చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రవేశించినంతనే జయవిజయుల విగాహాలను మనం చూడవచ్చును. గర్భగుడిలో ఉన్న రాళ్ళను...స్తంభాలను.... బంగారము మరియు రాగిరేకులతో  తాపడం చేసారు. గర్భగుడిలో ఉన్న చెన్నకేశవ స్వామి----మహావిష్ణువు అవతారములలో ఒకటైన -- మోహినీ అవతార రూపంలో... పట్టు చీర మరియు ముక్కుపుడక... పూలను ధరించిన రూపంలో మనకు దర్శనమిస్తాడు...స్వామికి ఇరుపక్కల దేవేరులు ఇద్దరూ కొలువు తీరి ఉన్నారు.

ఈ దేవాలయమునికి దక్షిణభాగంలో.... కప్పెచెన్నగరాయ అనే దేవాలయం ఉంది. చాలా ఆకర్షణీయంగా కనబడుతున్న కప్పెచెన్నగరాయ విగ్రహాన్ని విష్ణువర్ధన మహారాజు యొక్క పట్టపురాణి శాంతలాదేవి ప్రతిష్టించారు. ఈ దేవాలయానికి పేరు ఎలా వచ్చింది అనటానికి, ఒక చిన్న కథ ప్రచారంలో ఉంది.

అమరశిల్పి జక్కన్న తన స్వగ్రామాన్ని వదిలిపెట్టి దేశపర్యటన చేస్తూ బేలూరుకి చేరుకొని, అక్కడ జరుగుతున్న దేవాలయ నిర్మాణంలో కార్యక్రమంలో నిమగ్నుడై ఉంటాడు. అతని కుమారుడైన డంకణాచారి కూడా మంచి శిల్పి అని పేరు తెచ్చుకొని బెలూరుకి చేరుకుంటాడు...... ఐతే తనతండ్రి ఒక శిల్పి అని తెలియదు. జక్కన్న ఈ దేవుని విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో.....డంకణ ఈ విగ్రహంలో చిన్న లోపం ఉన్నదని తెలుసుకొని చెబుతాడు. కానీ జక్కన్న దీనిలో లోపంలేదు...... లోపాన్ని చూపితే తనచేతిని నరుక్కుంటాను అని అన్నాడు. అర్చకులు ఆ లోపాన్ని పరీక్షించుటకు విగ్రహానికి చుట్టూ గంధాన్ని పూసి ఎండబెడతారు. చివరకు గంధం అంతా ఎండిపోయి.... లోపం ఉన్నచోట ఎండకుండా తడిగా ఉంటుంది. అక్కడ పగులగొట్టగా జీవమున్న కప్పు కనిపిస్తుంది. అందువలన ఈ విగ్రహానికి కప్పెచెన్నగరాయ అని పేరు వచ్చింది.... దేవాలయానికి కూడా అదే పేరు సార్థకమయ్యింది. అనంతరం జక్కన్న తన చేతిని నరికించుకుంటాడు..... ఆపై ఆ యువశిల్పి తన కొడుకు అని తెలుసుకొని సంతోషపడతాడు....

తరవాత జక్కన్న-- కొడుకుతో  తన స్వగ్రామానికి తిరిగివచ్చి.... కొడుకు సాయంతో చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని చెక్కుతాడు..... విగ్రహం పూర్తిఅయ్యిన వెంటనే జక్కన్నకు తనచెయ్యి తిరిగివచ్చిందని చెబుతుంటారు..... ఈ సందర్భంగా ఆ ఊరికి కైదాళ అనే పేరు వచ్చింది. కైదాళ అంటే పోయినచేయ్యి తిరిగివచ్చుట అని అర్థం.

ఈ చేన్నకేశవ ఆలయంలో చాలావరకు శిల్పాలు జక్కన్న చెక్కినవే అని చెబుతారు.

చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో విచిత్రమైన  42 అడుగుల ఎత్తు ఉన్న ఒక స్తంభం ఉన్నది. ఇది ఏకశిలతో చెక్కబడినది. మరియు తనభారాన్ని తానే మోసుకుంటున్నది. దీనిని గురుత్వాకర్షణ స్థంభం అంటారు.


No comments:

Post a Comment