October 4, 2018

ద్వారక యాత్ర పూర్తి విశేషాలతో - Dwaraka Tour with Full Details

ద్వారక యాత్ర పూర్తి విశేషాలతో - Dwaraka Tour With Full Details. 

4 సెప్టెంబర్ 2018న సికింద్రాబాద్ నుండి రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరింది. సురేన్ టూర్స్ వారితో యాత్రకి బయలుదేరాము. క్రిందటి సంవత్సరం నవంబర్ లో కాశీ యాత్రకి (9నిద్రలు చెయ్యటానికి) వీరితో మొదటిసారి వెళ్ళాము. ఈ ద్వారకా యాత్ర రెండవసారి. రైలు ఛార్జీ, వసతి, భోజనాలు అన్నీ వారే చూసుకున్నారు. 

యాత్ర నిర్వాహకురాలు శ్రీమతి శారద గారు.(9440734701 -- 7702108471). ఈ యాత్రకి మొత్తం 35 మంది వెళ్ళాము. అందులో నేను, నా స్నేహితులు 10 మంది ఉన్నాము.

Day 1

4/9/18 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ లో రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాము.


Day 2 

5/9/18 మధ్యాహ్నం 2.30 కి అహ్మదాబాద్ లో రైలు దిగాము. స్టేషన్ నుండి అందరు బయటకి వచ్చి బస్సు ఎక్కేసరికి 3.30 అయ్యింది. అక్కడనుండి డాకోర్ చేరుకునేసరికి మాకు ఇంచుమించుగా 2 గంటల సమయం పట్టింది. అక్కడ మాకు అక్షయ అనే Resort లో బస ఏర్పాటు చేసారు. రూమ్స్ లో స్నానాదికాలు ముగించుకొని దగ్గర్లో ఏమైనా ఆలయాలు ఉంటె చూద్దామనుకున్నాం. కానీ దగ్గర్లో ఏమి లేవని తెలుసుకొని, అల్పాహారాలు ముగించుకొని ప్రయాణబడలిక తగ్గించుకోవటానికై త్వరగా రూమ్స్ కి చేరుకొని పడుకున్నాం. 

Day 3 

6/9/18 తెల్లవారు ఝామునే నిద్రలేచి కార్యక్రమాలు పూర్తిచేసుకొని 5.30 అందరు బస్సు ఎక్కిసాము. అక్కడ నుండి అర్థగంట ప్రయాణం చేసి రణచోడ్ రాయ్ ని దర్శించటానికి వెళ్ళాము. ముందుగా ఆలయానికి ప్రక్కనే ఉన్న గోమతీ నదిలో స్నానం చేసి, అనంతరం స్వామిని దర్శించుకున్నాము.


ఉదయాన్నే సుప్రభాతసేవా సమయానికి వెళ్ళటంతో జనాలు ఎక్కువగా ఉన్నారు, తోపులాటలో ఎదో విధంగా స్వామిని దర్శించి బయటపడ్డాం. 


రణచోడ్ రాయ్ చరిత్ర:- (పంచ ద్వారకలలో ఇది మొదటిది)
డాకోర్ లో బోధనా అనే భక్తుడు ఉండేవాడు. అతని పెరటిలో తులసి వనాన్ని పెంచుతూ ఉండేవాడు. నెలకి ఒకమారు అంటే ప్రతీ పౌర్ణమికి డాకోర్ నుండి ద్వారకకి కాలినడకన వెళ్ళి భగవాన్ శ్రీకృష్ణునికి అతని వనంలో ఉన్న తులసిని తీసుకువెళ్ళి సమర్పించి, స్వామిని దర్శించి వస్తూ ఉండేవాడంట. కొంతకాలానికి అతను ముసలివాడు అయ్యాడు. కాలినడకన ద్వారకకి చేరుకోవటానికి అతను పడే శ్రమని చూసి "తనని డాకోర్ తీసుకొనివెళ్ళి అక్కడే తనకి పూజలు నిర్వహించమని" శ్రీకృష్ణుడే స్వయంగా బోధనతో చెప్పాడంట. ఒకరోజు అర్థరాత్రి వేళలో బోధన ద్వారక నుండి శ్రీకృష్ణుని విగ్రహాన్ని దొంగిలించి డాకోర్ కి తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న ద్వారక పూజారులు,ప్రజలు కృష్ణుని వెతుక్కుంటూ డాకోర్ కి చేరుకున్నారు. అంతట కృష్ణుడు తనని గోమతి నదిలో దాచి ఉంచమని బోధన్ కి చెప్పాడు, బోధన అలాగే చేసాడు. నదిలో దాచాడన్న విషయం తెలుసుకొని ద్వారకావాసులు కర్రలతో కొడుతూ విగ్రహాన్ని వెతకసాగారు. కర్రల దెబ్బలు తగిలి విగ్రహం నుండి రక్తం స్రవించటం జరిగింది. ఎక్కడైతే కృష్ణుని విగ్రహం నుండి రక్తం వచ్చిందో ఆ ప్రదేశమంతా నదిలో నీరు ఎర్రగా మారిపోయింది. మిగిలిన నది నీరు మామూలుగా ఉందట. మొత్తానికి కృష్ణుని విగ్రహం నదిలోనుండి బయటకు తీశారు. కర్రలతో పొడిచిన గుర్తులు కృష్ణుడి విగ్రహంపై కనిపించాయి. ద్వారకావాసులు కృష్ణుని విగ్రహం ఐనా ఇవ్వు, లేదా విగ్రహం అంత బరువైన బంగారమైన ఇవ్వమని బోధనా ని అడిగారు. కృష్ణుని ఇవ్వలేను ... బంగారమే ఇస్తాను అని అన్నాడు. మాటైతే ఇచ్చాడు గానీ, అంత బంగారం తన దగ్గర ఎక్కడిది అని బాధపడ్డాడు. తనవద్ద ఉన్నది భార్య ముక్కుపుడక మాత్రమే. దానినే తరాజులో ఒకపక్క వేసి, మరోవైపు విగ్రహాన్ని ఉంచారు, తన భక్తుడైన బోధనాని రక్షించటానికై భగవానుడు తన బరువును తగ్గించి, ముక్కుపుడకతో సమానంగా తూగాడు. ఇక ఏమీ చెయ్యలేక ద్వారకావాసులు, పూజారులు తిరిగి ద్వారకకి వెళ్ళిపోయారు. ఈవిధంగా శ్రీకృష్ణపరమాత్ముడు డాకోర్ లోనే ఉండి అక్కడివారితో పూజలందుకుంటున్నాడు. వారానికి ఒక్కరోజు మాత్రమే ద్వారకలో, మిగిలిన ఆరు రోజులు రణచోడ్ రాయ్ లో కృష్ణుడు ఉంటాడని అంటుంటారు. 

శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్న తరవాత అల్పాహారాలు చేసి, భావనగర్ లో సముద్రం మధ్యలో ఉన్న నిష్కళంక మహాదేవ్ ని దర్శించటానికి 8.45 కి బస్సు బయలుదేరింది.


నిష్కళంక మహాదేవ్ చరిత్ర 

నిష్కళంక - అనగా నిర్దోషమైన అంటే దోషములను పోగొట్టే,......మహాదేవ్ - అంటే మహాదేవుడు శివుడు అని అర్థం. ఈ నిష్కళంక మహాదేవ్ ని ప్రార్థించినా, పూజించినా, దర్శించినా మనం చేసిన దోషాలన్నీ పోతాయి అని ప్రతీతి.

మహాభారత యుద్ధం జరిగిన తరవాత శ్రీకృషుడు పాండవులకి తమ పాప పరిహారం చేసుకోవటానికై శివుడిని ఆరాధించమని చెప్పి, నల్ల ఆవు, నల్ల ఝoడా తీసుకొని వెళ్ళండి, ఎప్పుడైతే ఆ రెండూ తెల్లగా మారుతాయో అప్పుడు మీ పాపములు తొలగిపోయినట్టే అని తెలియచేసాడంట. పాండవులు సముద్రం మధ్యలో 5 శివలింగాలని ప్రతిష్ఠించి పూజలు చేసి వారి పాపాలను, దోషాలను తొలగించుకున్నారని చెబుతుంటారు.
                                 
మార్గమధ్యంలో 1.30 కి బస్సుని ఆపి, భోజనాలు ముగించుకొని మళ్ళీ అర్థగంటలో బయలుదేరాము. మధ్యాహ్నం 3 అయ్యేసరికి భావనగర్ లో ఉన్న కొలియాక్ అనే ప్రాంతానికి చేరుకున్నాము. బస్సు దిగి అందరం సముద్రం మధ్యలో ఉన్న శివలింగాలని చూడాలని సముద్రం ఒడ్డుకి పరుగులు తీసాము. మేము వెళ్ళిన సమయానికి స్వామిని దర్శించుకునే అవకాశం ఉందో లేదో అని అందరికీ ఆత్రంగా ఉంది. ఇంకా సముద్రం వెనక్కి వెళ్ళలేదు. అక్కడ వారిని అడిగితే 5 గంటకి నీరు వెనక్కి వెళ్లవచ్చును, అప్పుడు మీరు వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చును అని చెప్పారు. అప్పటికి అందరం తేలికపడ్డాము.

నిష్కళంకుడిని దర్శించుకోవటానికి చిన్నపిల్లల్లా నీటిలో ఆడుతూ, పాడుతూ  మేము ఎలా వెళ్ళామో ఈ క్రింది వీడియోలో చూడండి.









ఇక్కడ సముద్రానికి కెరటాలు పెద్ద ఎత్తుగా ఏమీ రాలేదు. సముద్రంలోకి ఎంత దూరం వెళ్ళినా మోకాలి లోతు, ఇంకా ఐతే నడుం వరకు నీరు ఉంటుంది. అంతకు మించి లోతు లేనేలేదు.

పంచ పాండవులచే ప్రతిష్టింపబడిన ఈ నిష్కళంక మహాదేవ్ ని దర్శించాలంటే సముద్రం ఒడ్డు నుండి సుమారుగా 1.5 కిలోమీటరు నడుచుకొని వెళ్ళాలి. అప్పుడే సముద్రం నడిబొడ్డులో ఉన్న ఆ లింగాలని మనం దర్శించగలం. 


సముద్రంలో ఉన్న శివలింగాలు ఎలా కనిపిస్తాయి అని మనకి సందేహం కలగవచ్చును. ఇక్కడ సముద్రంలో ఉన్న నీరు 6 గంటలు వెనక్కి వెళ్ళి, 6 గంటల తరవాత మరల ముందుకి వస్తుంది. ఈ విధంగా రోజుకి రెండుసార్లు జరుగుతుందట. ప్రతీరోజూ ఒకే సమయానికి నీరు వెనక్కి వెళుతుంది అనే నియమం లేదు. ఒక్కోరోజు ఒక్కో సమయంలో వెనక్కి జరగవచ్చును. అది ఉదయం 8 గంటలకి అవ్వచ్చును, లేదా 10 గంటలకి అవ్వొచ్చును. అమావాస్య, పౌర్ణమి రోజులలో ఇంకా ఎక్కువసేపు నీరు వెనక్కి వెళుతుంది. ఆ సమయాలలో స్వామికి ... ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. 

4.30 వరకు ఒడ్డునే ఉండి సేదదీరాము. అప్పటికే జనాలు సముద్రంలో తడుసుకుంటూ, ఆడుకుంటూ ముందు ముందుకి నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. వారిని చూసి ఉత్సాహం ఆపుకోలేక మేము కూడా కొంతమంది నీటిలో తడుస్తూ, నడుస్తూ ముందుకి సాగాము. మొత్తానికి 5.15 అయ్యేసరికి సముద్రం శివలింగాలకి వెనక్కి వెళ్ళిపోయింది. ఒడ్డు నుండి చూస్తే కనుచూపు మేరలో ఎక్కడా నీరు కనిపించలేదు. ఒడ్డు నుండి 2 Km దూరంగా వెనక్కి వెళ్ళిపోయింది. అందరికీ భలే వింతగా, విచిత్రంగా అనిపించింది. సముద్రమేమిటి వెనక్కి వెళ్ళిపోవటమేమిటి అని. 

సముద్రంలో నీరు ఉండగానే మేము కూడా నీటిలో నుండే ప్రయాణించి శివలింగాలని చూడటానికి మొత్తానికి చేరుకున్నాము. 




                            అక్కడ ఉన్న శివలింగాలు ఇవి 





మా గ్రూప్ 10 మంది అక్కడ తీసుకున్న ఫోటో. మాతో పాటు టూర్ లో వచ్చిన మరొక స్నేహితురాలు. 
మొత్తానికి పంచపాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలని దర్శించి వచ్చాము. వెళ్ళేటప్పుడు నీటిలో ప్రయాణం చేసాము. వచ్చేటప్పుడు నీరు లేని మార్గంలో చాలా త్వరగా నడచి రాగలిగాము.

బస్సు వద్దకి అందరు చేరేసరికి రాత్రికి వేడివేడిగా తయారై సిద్ధంగా ఉన్న అల్పాహారాన్ని తిని, బస్సు బయలుదేరేసరికి రాత్రి 9 గంటలు అయ్యింది. ఇప్పుడు మా ప్రయాణం సోమనాథ్ కి. రాత్రంతా ప్రయాణం చేసి ప్రొద్దున్నే 6 గంటలకి సోమనాథ్ చేరుకున్నాము. 

Day 4 

7/9/18 ఉదయం 6 గంటలకి సోమనాథ్ లో హోటల్ రూములకి చేరుకొని, స్నానాదికాలు ముగించుకొని, ఫలహారాలు చేసి, సోమనాథ్ లో చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలు చూడటానికి బస్సులో 10 గంటలకి బయలుదేరాము. ముందుగా భాల్ కా తీర్థ్ .... అంటే భగవాన్ శ్రీకృష్ణపరమాత్మ బోయవాని బాణం వలన నిర్యాణం చెందిన ప్రదేశం చూసాము. 






ఇక్కడ ఆటోలు విచిత్రంగా ఉన్నాయి. బైక్ ఇంజన్ కి వెనుక రెండు చక్రాలు, ఒక తొట్టె తగిలించి ఆటోలుగా నడుపుతున్నారు. 

తరవాత గీతామందిరం చూసాము. 
                                 గీతామందిరానికి దారి 


                                       గీతామందిరం 



గీతామందిరానికి ప్రక్కనే బలరామ గుహ ఉన్నది. అక్కడ బలరాముడు ఆదిశేషు అవతారంలో ఉన్నాడు.



గీతామందిరానికి కొంచెం దూరంలో ఉన్న శారదా పీఠం చూసాము.
శారదా పీఠంలో ఉన్న కొన్ని దేవుని విగ్రహాలు 





శారదా పీఠానికి ఎదురుగా ఉన్న త్రివేణీ సంగమం చూసాము.

త్రివేణి సంగమం ......... కపిల+సరస్వతి+హిరణ్ ఈ మూడు నదులు కలిసిన సంగమం ..... మరియు ఈ మూడు నదులు సాగరంలో కలసిన సంగమ ప్రదేశమే ఈ త్రివేణీ సంగమం. 





ఆ తరువాత సోమనాథ ఆలయానికి వెళ్ళి సోమనాథుడిని దర్శించి 2.30 కి అందరం మా వసతి గృహాలకి చేరుకున్నాము.

సోమనాథ్ చరిత:- 
ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా అంటారు. ఆలయంలో ఉన్న శివలింగం 4 అడుగుల ఎత్తులో ఉంటుందట.

దక్షుడి 27 (నక్షత్రాలకి) కుమార్తెలకి చంద్రుడు భర్త.  చంద్రుడు కేవలం రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకొంటే దక్షుడు ఆగ్రహించి, చంద్రుడిని శపిస్తాడు. ఆ  కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధిని పోగొట్టుకోవటానికై  చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి, తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్ధము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలు అందరిని సమానంగా చూసుకొమ్మని చంద్రుడికి సలహా ఇచ్చి, శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి, చంద్రునిచే  ప్రతిష్ఠించిన శివలింగంలో తాను శాశ్వతంగా ఉంటానని మాట ఇచ్చాడు. చంద్రునిచే ప్రతిష్ఠించిన శివుడు కాబట్టి ఇక్కడ శివయ్యని సోమనాథుడు అని పిలుస్తారు.

ఈ ఆలయంపై పదహారుసార్లు దాడులు జరిగాయంట. అయినా అన్నిసార్లూ పునర్నిర్మాణం జరుగుతూనే ఉందట. అందువల్లే ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా చెబుతుంటారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన అనంతరం జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకి వచ్చిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు, ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారంట. పటేల్ మరణానంతరం భారతదేశపు మరొక మంత్రి అయిన కె.ఎమ్.మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి అని చెప్పారు.


ఆరోజు శివయ్యకి శ్వేతపుష్ప అలంకరణ చేసారు..... తెల్లని పుష్పాల మధ్యన శివయ్య ఎంత అందంగా ఉన్నాడో మాటల్లో వర్ణించలేము, చూసి తరించాల్సినదే.

ఆరోజు మేము చూసిన పుష్పాలంకరణ ఇదే విధంగా  ఉంది. (ఈ ఫోటో గూగుల్ నుండి సేకరించబడినది.) ఆలయంలోనికి మొబైల్స్, కెమెరాలు అనుమతి లేదు.


                                                                       
సోమనాథుని ప్రధాన ఆలయానికి బయటకి వచ్చిన తరవాత ఎడమచేతి ప్రక్కనే స్వామి పాత ఆలయం ఉంది. అదే ఇంతకు ముందు ప్రధాన ఆలయమంట. ఇప్పుడు ఉన్నది విధ్వంసాల అనంతరం నూతనంగా నిర్మించిన ఆలయం అని చెప్పారు. స్వామికి అభిషేకాలు, పూజలు చేయించుకోవాలంటే పురానా ఆలయంలోనే చేస్తారంట. సాయంత్రం 5గంటలకి అక్కడే స్వామికి అభిషేకాలు చేయించుకొన్నాము. ఈ పాత ఆలయంలో స్వామికి ఫోటోలు తీసుకోవటానికి అనుమతి ఉంది. అందుకే అభిషేకం అనంతరం స్వామి పుష్పాలంకరణకి ఫోటోలు తీసుకున్నాము.



ప్రధాన ఆలయంలో స్వామి హారతి చూసి, 9 గంటలకి రూమ్స్ కి చేరుకున్నాము.

Day 5 

8/9/18 ఉదయాన్నే 5 గంటలకి త్రివేణీ సంగమంలో స్నానం చేసుకొని, సోమనాథుని నిజస్వరూపాన్ని(ఏ అలంకరణా లేకుండా ఉన్న శివలింగాన్ని)  దర్శించి, హారతి చూసుకొని 7 గంటలకి మా బసకి చేరుకున్నాము.
                           (ఈ ఫోటో గూగుల్ నుండి సేకరణ) 




8.45 కి అందరు ఫలహారాలు ముగించుకొని బస్సులో కూర్చున్నాము. అప్పుడు మా ప్రయాణం ద్వారక చేరుకోవటానికి ప్రారంభమయ్యింది.

దారిలో మధ్యాహ్నం 12గంటలకి పోరుబందరులో ఉన్న శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడైన సుధాముడు(కుచేలుడు) కలుసుకునే చోటే  "సుధామాపురి" చూసాము. ఎక్కడైనా ఆలయాలు అంటే భగవంతునికే ఉంటాయి. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ(భగవంతుని)కి భక్తుడైన సుధామునికి ఆలయం ఉండటం విశేషం.



సుధామా ఇల్లు ఉన్న ప్రదేశంలో ఇప్పుడు ఉన్న ఈ శ్రీకృష్ణ మందిరం నిర్మించారు అని చెప్పారు.  




తరవాత పోరుబందరులో ఉన్న మన జాతిపిత మహాత్మాగాంధీ జన్మస్థలం చూసాము. గాంధీగారి భవనం అంతా వీడియోతీసాను. ఈ క్రింది వీడియో చుడండి.







ఈ స్వస్తిక్ గుర్తు ఉన్న ప్రదేశంలో గాంధీగారు జన్మించారు.  
గాంధీగారు వాడిన చరఖా 
స్నేహితులతో 

అన్నీ చూసాక సాయంత్రం 6 గంటలకి ద్వారకకి చేరుకున్నాము. రూమ్స్ లో సామాను ఉంచి కొంచెం ఫ్రెష్ అయ్యి కృష్ణయ్యని(ద్వారకాధీశుడిని) చూడటానికి అందరం బయలుదేరాం.


కృష్ణయ్య దర్శనం చేసుకొని, రాత్రి హారతి చూసుకొని 9 గంటలకి బసకి చేరుకున్నాము.

Day 6

9/9/18 ఉదయాన్నే 6 గంటలకి వెళ్ళి కృష్ణుడిని దర్శించి, ఉదయ హారతిని చూసి, 8 గంటలకి బసకి చేరుకున్నాము.

ద్వారక చరిత్ర:-
ద్వారకానాథ్‌ ఆలయం 2000-2200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మునిమనుమడు వజ్రనాభుడు నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయం 5 అంతస్థులతో, 72 ముఖ్య స్థంభాలతో ఉంటుంది. గుడిపైన సూర్యచంద్రుల ఝoడా ఉంటుంది. ప్రతీరోజు ఆ ఝoడాను ఐదు సార్లు మారుస్తారు. ఆ ఝoడాను మార్చటం మేము ఉన్న రెండురోజులు చూసాము. గుడి గోపురం 78 మీటర్ల ఎత్తు ఉంటుంది. గుడికి రెండు ద్వారాలున్నాయి. మోక్ష ద్వారం, స్వర్గద్వారం. 

ఇది ప్రాచీనమైన నాలుగు ధామము(ద్వారక, బద్రీనాథ్‌, పూరి, రామేశ్వరము)లలో ఒకటి.

ప్రస్తుతం ద్వారకలో ఉండే దేవాలయాన్ని గతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పరిపాలనా భవనంగా ఉపయోగించాడట. శ్రీకృష్ణుడు భేట్‌ ద్వారకలో సముద్రంలోగల గుట్టపై అష్టభార్యలతో నివాసం ఉండేవాడంట.

ద్వారకాధీశుని ప్రధాన ఆలయంచుట్టూ చాలా ఉపాలయాలు ఉన్నాయి. కృష్ణుని ఆలయం ఎదురుగానే దేవకీమాత ఆలయం ఉంది, ఆమె ప్రక్కనే రాధాకృష్ణ మందిరం ఉంది. ఇంకా అనిరుద్, ప్రద్యుమ్న, సత్యన్నారాయణ స్వామి, శ్రీకుశేశ్వరస్వామి, శ్రీ కశ్యపరాయ-విష్ణు, కాశీ విశ్వేశ్వరుడు, దత్తాత్రేయుడు, గాయత్రీమాత, లక్ష్మీదేవి, పురుషోత్తమరాయ్, దుర్వాసముని, అష్టపట్టపురాణుల మందిరాలు, సత్యభామ-జాంబవతి, శ్రీమాధవరాయ్ మందిరం, బలదేవ్ జీ, విట్టల్ జీ మొదలగునవి ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల వారి శారదా పీఠం, అందులో చంద్రమౌళీశ్వరుని ఆలయం ఉంది.

అల్పాహారాలు అయ్యాక 9 గంటలకి ద్వారక చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలని చూడటానికి మా బస్సు బయలుదేరింది.
                     ముందుగా రుక్మిణీ మందిరం చూసాము.


రుక్మిణీ మందిరం చరిత్ర:- 
శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవితో  కలిసి   గురువైన దుర్వాస మహర్షిని    తమ ఇంటికి  భోజనానికి  ఆహ్వానిస్తాడు. దుర్వాస ముని తాను ఎక్కిన రధాన్ని శ్రీకృష్ణుడు, రుక్మిణీ దేవులు స్వయంగా వారే వచ్చి, లాగి తీసుకువెళ్ళాలి అని కోరుతాడు. అంతట వారిరువురు రథాన్ని లాగుతుండగా కొద్ది దూరం వెళ్ళేసరికి  రుక్మిణీ దేవికి అలసట వచ్చి, దాహం వేయసాగింది. శ్రీకృష్ణునికి చెప్పగా శ్రీకృష్ణుడు తన కాలి బొటన వేలితో భూమిని తవ్వాడు. భూమిలోనుంచి  గంగమ్మ పైకి వచ్చింది. రుక్మిణి దేవి ఆ నీటితో తన దాహాన్ని తీర్చుకుంది. దుర్వాసుడు తనకి నీరు ఇవ్వకుండా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి నీరు ఇచ్చినందుకు  కోపం వచ్చి రుక్మిణీ దేవిని శ్రికృష్ణుడిని విడిపోమ్మని శపించాడు.  సముద్రపు  ఒడ్డున వున్నా రుక్మిణీ దేవి   ఆలయం చుట్టుపక్కల  మైదానమే  కనిపిస్తుంది. అంతే కాదు  గోమతి నదికి చుట్టుపక్కల 40 కి.మి. వరకు మంచి నీరు లభించదని. అంతా ఉప్పు నీరే అవ్వాలని  శపించాడట. అందుకే  గోమతి నది నీరు ఇక్కడ తియ్యగా కాకుండా ఉప్పగా ఉంటుందని అక్కడ పూజారులు ఈ కథని వివరించి మాకు చెప్పారు. ఈ కథకి సంబంధించిన ఫోటోలు ఆలయంలో ఉన్నాయి. కానీ మమ్మల్ని ఫోటోలు తీయనీయలేదు.

మనకి  ద్వారకలో శ్రీ కృష్ణ ఆలయం పక్కనే, అష్ట భార్యలు ఉన్న మందిరాలూ  కనిపిస్తాయి. కాని  వాటిల్లో  రుక్మిణీ దేవి మందిరం కనిపించదు.  రాధాకృష్ణుల మందిరం, మిగతా  దేవేరుల మందిరాలు ఒకే చోట  వున్నాయి.

తరవాత సముద్రం మధ్యలో నిర్మించబడిన శ్రీకృష్ణుని మందిరం చూడటానికి భేట్ ద్వారక వెళ్ళాము. ఈ భేట్ ద్వారక వెళ్ళాలంటే ఒడ్డున ఉన్న బోట్ ఎక్కి వెళ్ళాలి. సుమారుగా 15 - 20 నిముషాలు బోట్లో ప్రయాణించాక భేట్ ద్వారక చేరుకుంటాము.






(ఒక్కో బోట్లో సుమారుగా 100 నుండి 150 వరకు జనాలు ఎక్కుతున్నారు. మనిషికి 20 రూపాయలు తీసుకున్నారు. అంటే ఇది ఒకప్రక్క చార్జీ. రానూపోనూ 40 అయ్యింది..... ఎవరైనా వెళితే ఎంత అవుతుందో తెలియచేయటానికే చెప్పాను.)

ఆవలి ఒడ్డున పడవ దిగాక ఇలా వంతెన దాటి ఊరిలోకి వెళ్ళాలంటే సుమారుగా 1Km దూరం ఉంటుంది. కానీ మాకేమీ దూరం అనిపించలేదు. నడవగలిగే వారు నడిచెయ్యొచ్చును. నడవలేనివారు అక్కడ బల్ల బండీలు ఉన్నాయి. వాటి మీద కూర్చుని వెళ్ళొచ్చును.

                                భేట్ ద్వారక ప్రవేశద్వారం     


ప్రవేశద్వారం దాటగానే కౌంటర్ లో మొబైల్స్ & కెమారాలు ఇచ్చెయ్యాలి. అందుకే ఫోటోలు ఏమీ తియ్యటానికి కుదరలేదు.

ఇక్కడ కృష్ణ మందిరం, బలరామ మందిరం, కృష్ణుని అష్టభార్యల మందిరాలు ఉన్నాయంట. కానీ మేము వెళ్ళేసరికి 12 గంటలు అయ్యింది. 12.30 కే ఆలయం మూసేస్తారంట. అందుకే కృష్ణ మందిరం తప్పించి ఇంకేమీ చూసే అవకాశం కుదరలేదు. ఎవరైనా అన్నీ తిరిగి చూడాలి అంటే 9 గంటలకి అక్కడికి చేరుకుంటే ప్రశాంతంగా అన్నీ తిరిగి చూసి రావచ్చును. మాకు ఆవిషయం ముందుగా తెలియలేదు.
                           తరవాత గోపీతాలాబ్ చేరుకున్నాం. 


ఇక్కడ ఉన్న రాధాకృష్ణుల మందిరం దర్శించాము.






తాలాబ్ అంటే చెరువు. గోపితాలాబ్ అంటే కృష్ణుని చెరువు అని అర్థం. ఈ చెరువులో ఉన్న మట్టితోనే చందనం తయారుచేస్తారంట. అందుకే ఈ చందనాన్ని గోపీ చందనం అంటారు.
                          కృష్ణ భక్తులు ధరించే చందనం ఇదే 


ఇంతకీ ఈ తాలాబ్ లో నీరు లేదు. అంతా ఎండిపోయి ఉంది.

తరవాత నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాము.





నాగేశ్వర జ్యోతిర్లింగం చరిత్ర:- 
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది 10వ జ్యోతిర్లింగం.
దారుకఅనే పేరుగల ఒకానొక రాక్షసి పార్వతిదేవి వరదానము వలన ఆమె చాలా గర్వముతో ఉండేది. దారుకుడు అనే రాక్షసుడు ఆమె భర్త. అతడు అనేకమంది రాక్షసులను వెంటబెట్టుకొని మునులను, ప్రజలను  సంహరిస్తూ ఉండేవాడు. అతడు ప్రజల యజ్ఞములను, ధర్మాన్ని నాశనము చేస్తూ తిరుగుతూండేవాడు. పడమట సముద్రతీరాన్న ఒక వనము ఉండేది. దారుక తన భర్తతో కూడి ఇష్టము వచ్చినట్లు వనమునందు విహరిస్తూ.  అందరిని భయపెట్టుచుండెడిది. దారుకునిచే పీడితులైన ప్రజలు ఔర్వక మహర్షిని ఆశ్రయించి, ఆయనకు తమ దుఃఖమును తెలియచేసారు. ఔర్వుడు శరణు కోరి వచ్చినవారిని రక్షించుటకై ఆ రాక్షసులను ఈవిధంగా శపించాడు. - "ఈ రాక్షసులు భూమిమీదనున్న ప్రాణులను హింసించినా లేక యజ్ఞములను ధ్వంసము చేసినా తమ ప్రాణములను పోగొట్టుకొంటారు." అని. 

భూమండలం మీద ఎవరినీ ఏమీ చేయలేక ఆ వనమును ఉన్నదున్నట్లు తీసుకొనిపోయి సముద్రమునందు ఆ రాక్షసి నివసించెను. రాక్షసులు నీటిలో నిర్భయముగ నివసిస్తుండేవారు. ఓడలలో వర్తకానికై వచ్చే వారిని కొల్లగొడుతూ, వారిని చెరసాలలో వేసి హింసిస్తూ ఉండేవారు. 

ఆ రాక్షసులు ఒకసారి సుప్రియుడనే వైశ్య శివభక్తుని చెరసాలలో బంధించి హింసిస్తూ ఉండేవారు. సుప్రియుడు మహాశివభక్తుడు కావడంతో చెరసాలలోని మట్టినంతటినీ ఒకచోట చేర్చి, దానిలో కొద్దిగా నీళ్లుపోసి, ఒక శివలింగాన్ని తయారు చేసుకుని, శివుణ్ణి పూజించసాగాడు. ఆ ఘటన చూసి దారుకుడు సుప్రియుడిని బెదిరించాడు, అయినా వినలేదు. ఇలా లాభం లేదని, శిరస్సుని ఖండించబోయాడు, అప్పుడు ఆ పార్థివలింగం నుంచి శివుడు ఒక జ్యోతి రూపంలో ప్రత్యక్షమై, ఆ రాక్షసుని తన త్రిశూలంతో ఒక్క దెబ్బకొట్టి, దుష్టులైన వాడి అనుచరగణాన్ని భస్మం చేశాడు. సుప్రియుని ప్రార్థన మేరకు మహాశివుడు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు.  

ఆలయంలోనికి మొబైల్స్ & కెమారాలు తీసుకువెళ్ళొచ్చును, కానీ గర్భాలయంలో ఫోటోలు తీయటానికి అనుమతి లేదు.
                        గూగుల్ నుండి సేకరించిన ఫోటో ఇది.  


.అన్నీ తిరిగి బసకి చేరుకునేసరికి రాత్రి 7 గంటలు అయ్యింది. మాతో వచ్చిన మా Family Doctor అయిన Dr.Komaladevi గారి జన్మదినం ఆరోజు. టూర్ లో ఎవరివైనా పుట్టినరోజులు, పెళ్ళిరోజులు వంటి ప్రత్యేకమైన రోజులు ఉంటే..... టూర్ ఆర్గనైజర్ శారదా గారు వారే పార్టీ ఏర్పాటు చేస్తారంట. అదే విధంగా ఆరోజు శారదా గారే ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసి, కేక్ తెప్పించి, మా ఆంటీ చేత కట్ చేయించారు.

ఆరోజు ఆంటీ ఆనందానికి అవధులు లేవు. ఆమెకు 70 సంవత్సరాలు నిండి 71 వ సంవత్సరంలో అడుగుపెట్టిన రోజు. ఈ పుట్టినరోజు ద్వారకలో కృష్ణుని వద్ద జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని చాలా ఆనందాన్ని పొందారు. నా జీవితంలో మరుపురాని తియ్యని జ్ఞాపకం ఈరోజు అని అన్నారు.

8 గంటలకి కృష్ణయ్యని దర్శించుకొని, రాత్రి హారతి చూసుకొని, 9.30 కి మా రూమ్స్ కి చేరుకున్నాము.

Day - 7

10/9/18 ఉదయాన్నే 6 గంటలకి ఆలయద్వారం తెరిచే సమయానికి వెళ్ళి కృష్ణయ్యని సుప్రభాత దర్శనాన్ని చేసుకొని, గోమతి ఘాట్ చూసాము.


ఘాట్ ఒడ్డునుండి నడుచుకుంటూ వెళ్ళి సంగమ నారాయణుని దర్శించుకున్నాము. (గోమతీనది సాగరంలో కలిసే ప్రాంతంలో ఉన్న నారాయణుని సంగమ నారాయణుడు అని వ్యవహరిస్తారంట.)

అనంతరం ఇస్కాన్ కృష్ణ మందిరాన్ని చూసి 10 గంటలకి రూమ్స్ కి చేరుకున్నాము.

అప్పటికి నదిలో నీరు ఉంది.


నదిలో నీటిని చూసి, నదీ స్నానం చేసి రూమ్స్ కి చేరుకొని బట్టలు మార్చుకొని సుధామాసేతు(Sudhama Jhulaa)ని చూడటానికి బయలుదేరాము. (ఝూలాని ఎక్కడానికి Rs.10 టిక్కెట్టు)


ఝూలా దాటి ఆవలి ఒడ్డుకి చేరుకుంటే అక్కడ గరుడగామి శ్రీలక్ష్మీనారాయణ మందిరం ఉన్నది.

అందులో శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుక్మoతునిపై ఉన్న విగ్రహాన్ని మనం దర్శించవచ్చును.




ఇక్కడ పంచపాండవులు తవ్వించిన 5 బావులు ఉన్నాయి. ఈ 5 బావుల్లో నీరు 5 రకాల రుచుల్లో ఉంటాయి. ఉప్పగా, తియ్యగా చప్పగా అలా వివిధ రుచుల్లో ఉన్నాయి. మేము టేస్ట్ చూసాము.

పాండవులు తమ సర్వస్వాన్ని కోల్పోయిన  తరువాత ఇక్కడికి  వచ్చినపుడు తమ  తపశ్శక్తితో ఈ 5 బావులు  పాండవులు తవ్వారని చెబుతుంటారు, ఒక్కో బావిలో రుచి ఒక్కోరకంగా వుంది.   ఆ పంచ బావులు 5 నదులకి  ప్రతీకలు అని చెప్పారు.

ధర్మ రాజు బావిలోని నీరు లక్ష్మణ నీరు అనీ,  భీమ కుండ్ లో జాంబవతి నది, అర్జునుడి కుండ్ లో గోమతి, నకులుడు ఉషావతి నది, సహదేవ్ కుండ్ లో చంద్రభాగ నది అని,  పిల్లుస్తారు. ఆ 5 నదులు ఎలా ఉన్నాయో ఈ క్రింది వీడియోలో చూడండి.



మధ్యాహ్నం భోజనాల అనంతరం ద్వారకకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న  బాడకేశ్వర్ మహాదేవ్ మందిరాన్ని చూడటానికి బస్సులో అందరం బయలుదేరి వెళ్ళాము. ఇది సముద్రం ఒడ్డున  గుట్ట మీద ఉన్న చిన్న శివాలయం. ఈ శివాలయాన్ని దర్శించాలన్నా కొంతసమయం వేచి ఉండాలి. సముద్రం వెనకకి వెళ్ళిన తరవాతనే స్వామిని దర్శించుకోగలం.


మేము వెళ్ళేసరికి వర్షం పడటం ఆరంభమయ్యింది. పూర్తిగా స్వామిని దర్శించకుండానే బయటకి వచ్చేసి అక్కడికి దగ్గర్లో ఉన్న లైట్ హౌస్ ని దూరం నుండే చూసి వచ్చి బస్సు ఎక్కి రూమ్ కి చేరుకున్నాము.

మళ్ళీ 6 గంటలకి వెళ్ళి  ద్వారకాధీశుడిని దర్శించి. రాత్రి హారతి వరకు ఉండి, హారతి చూసుకొని, 10 గంటలకి రూమ్ కి వచ్చి ఫలహారాలు చేసి పడుకొన్నాము.

Days -8 & 9

11/9/2018 ఉదయాన్నే నిద్రలేచి, 6.00 కి బస్సు ఎక్కి 15 నిమిషాలలో ద్వారకా రైల్వే స్టేషన్ కి చేరుకున్నాము.






8 గంటకి రైలు ఎక్కి, మరుసటి రోజు 12/9/2018 సాయంత్రం 5 గంటలకి కాచిగూడా రైల్వే స్టేషన్ లో దిగి మిత్రులందరికీ వీడ్కోలు పలికి, ఎవరి ఇళ్ళకు వాళ్ళు చేరుకున్నాం.       
ఈవిధంగా మా ద్వారకా యాత్ర పూర్తి అయ్యింది.
                         __//\\__ సర్వేజనా సుఖినోభవంతు__//\\__