October 4, 2018

ద్వారక యాత్రా విశేషాలు - Dwaraka Tour Details Day 4

Day 4 

7/9/18 ఉదయం 6 గంటలకి సోమనాథ్ లో హోటల్ రూములకి చేరుకొని, స్నానాదికాలు ముగించుకొని, ఫలహారాలు చేసి, సోమనాథ్ లో చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలు చూడటానికి బస్సులో 10 గంటలకి బయలుదేరాము. ముందుగా భాల్ కా తీర్థ్ .... అంటే భగవాన్ శ్రీకృష్ణపరమాత్మ బోయవాని బాణం వలన నిర్యాణం చెందిన ప్రదేశం చూసాము. 






ఇక్కడ ఆటోలు విచిత్రంగా ఉన్నాయి. బైక్ ఇంజన్ కి వెనుక రెండు చక్రాలు, ఒక తొట్టె తగిలించి ఆటోలుగా నడుపుతున్నారు. 

తరవాత గీతామందిరం చూసాము. 
                                 గీతామందిరానికి దారి 


                                       గీతామందిరం 



గీతామందిరానికి ప్రక్కనే బలరామ గుహ ఉన్నది. అక్కడ బలరాముడు ఆదిశేషు అవతారంలో ఉన్నాడు.



గీతామందిరానికి కొంచెం దూరంలో ఉన్న శారదా పీఠం చూసాము.
శారదా పీఠంలో ఉన్న కొన్ని దేవుని విగ్రహాలు 





శారదా పీఠానికి ఎదురుగా ఉన్న త్రివేణీ సంగమం చూసాము.

త్రివేణి సంగమం ......... కపిల+సరస్వతి+హిరణ్ ఈ మూడు నదులు కలిసిన సంగమం ..... మరియు ఈ మూడు నదులు సాగరంలో కలసిన సంగమ ప్రదేశమే ఈ త్రివేణీ సంగమం. 





ఆ తరువాత సోమనాథ ఆలయానికి వెళ్ళి సోమనాథుడిని దర్శించి 2.30 కి అందరం మా వసతి గృహాలకి చేరుకున్నాము.

సోమనాథ్ చరిత:- 
ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా అంటారు. ఆలయంలో ఉన్న శివలింగం 4 అడుగుల ఎత్తులో ఉంటుందట. 

దక్షుడి 27 (నక్షత్రాలకి) కుమార్తెలకి చంద్రుడు భర్త.  చంద్రుడు కేవలం రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకొంటే దక్షుడు ఆగ్రహించి, చంద్రుడిని శపిస్తాడు. ఆ  కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధిని పోగొట్టుకోవటానికై  చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి, తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్ధము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలు అందరిని సమానంగా చూసుకొమ్మని చంద్రుడికి సలహా ఇచ్చి, శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి, చంద్రునిచే  ప్రతిష్ఠించిన శివలింగంలో తాను శాశ్వతంగా ఉంటానని మాట ఇచ్చాడు. చంద్రునిచే ప్రతిష్ఠించిన శివుడు కాబట్టి ఇక్కడ శివయ్యని సోమనాథుడు అని పిలుస్తారు. 

ఈ ఆలయంపై పదహారుసార్లు దాడులు జరిగాయంట. అయినా అన్నిసార్లూ పునర్నిర్మాణం జరుగుతూనే ఉందట. అందువల్లే ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా చెబుతుంటారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన అనంతరం జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకి వచ్చిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు, ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారంట. పటేల్ మరణానంతరం భారతదేశపు మరొక మంత్రి అయిన కె.ఎమ్.మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి అని చెప్పారు. 


ఆరోజు శివయ్యకి శ్వేతపుష్ప అలంకరణ చేసారు..... తెల్లని పుష్పాల మధ్యన శివయ్య ఎంత అందంగా ఉన్నాడో మాటల్లో వర్ణించలేము, చూసి తరించాల్సినదే.

ఆరోజు మేము చూసిన పుష్పాలంకరణ ఇదే విధంగా  ఉంది. (ఈ ఫోటో గూగుల్ నుండి సేకరించబడినది.) ఆలయంలోనికి మొబైల్స్, కెమెరాలు అనుమతి లేదు.   


                                                                       


సోమనాథుని ప్రధాన ఆలయానికి బయటకి వచ్చిన తరవాత ఎడమచేతి ప్రక్కనే స్వామి పాత ఆలయం ఉంది. అదే ఇంతకు ముందు ప్రధాన ఆలయమంట. ఇప్పుడు ఉన్నది విధ్వంసాల అనంతరం నూతనంగా నిర్మించిన ఆలయం అని చెప్పారు. స్వామికి అభిషేకాలు, పూజలు చేయించుకోవాలంటే పురానా ఆలయంలోనే చేస్తారంట. సాయంత్రం 5గంటలకి అక్కడే స్వామికి అభిషేకాలు చేయించుకొన్నాము. ఈ పాత ఆలయంలో స్వామికి ఫోటోలు తీసుకోవటానికి అనుమతి ఉంది. అందుకే అభిషేకం అనంతరం స్వామి పుష్పాలంకరణకి ఫోటోలు తీసుకున్నాము.    


ప్రధాన ఆలయంలో స్వామి హారతి చూసి, 9 గంటలకి రూమ్స్ కి చేరుకున్నాము.

No comments:

Post a Comment