October 4, 2018

ద్వారక యాత్రా విశేషాలు - Dwaraka Tour Details Day 3

Day 3 

6/9/18 తెల్లవారు ఝామునే నిద్రలేచి కార్యక్రమాలు పూర్తిచేసుకొని 5.30 అందరు బస్సు ఎక్కిసాము. అక్కడ నుండి అర్థగంట ప్రయాణం చేసి రణచోడ్ రాయ్ ని దర్శించటానికి వెళ్ళాము. ముందుగా ఆలయానికి ప్రక్కనే ఉన్న గోమతీ నదిలో స్నానం చేసి, అనంతరం స్వామిని దర్శించుకున్నాము.


ఉదయాన్నే సుప్రభాతసేవా సమయానికి వెళ్ళటంతో జనాలు ఎక్కువగా ఉన్నారు, తోపులాటలో ఎదో విధంగా స్వామిని దర్శించి బయటపడ్డాం. 


రణచోడ్ రాయ్ చరిత్ర:- 
డాకోర్ లో బోధనా అనే భక్తుడు ఉండేవాడు. అతని పెరటిలో తులసి వనాన్ని పెంచుతూ ఉండేవాడు. నెలకి ఒకమారు అంటే ప్రతీ పౌర్ణమికి డాకోర్ నుండి ద్వారకకి కాలినడకన వెళ్ళి భగవాన్ శ్రీకృష్ణునికి అతని వనంలో ఉన్న తులసిని తీసుకువెళ్ళి సమర్పించి, స్వామిని దర్శించి వస్తూ ఉండేవాడంట. కొంతకాలానికి అతను ముసలివాడు అయ్యాడు. కాలినడకన ద్వారకకి చేరుకోవటానికి అతను పడే శ్రమని చూసి "తనని డాకోర్ తీసుకొనివెళ్ళి అక్కడే తనకి పూజలు నిర్వహించమని" శ్రీకృష్ణుడే స్వయంగా బోధనతో చెప్పాడంట. ఒకరోజు అర్థరాత్రి వేళలో బోధన ద్వారక నుండి శ్రీకృష్ణుని విగ్రహాన్ని దొంగిలించి డాకోర్ కి తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న ద్వారక పూజారులు,ప్రజలు కృష్ణుని వెతుక్కుంటూ డాకోర్ కి చేరుకున్నారు. అంతట కృష్ణుడు తనని గోమతి నదిలో దాచి ఉంచమని బోధన్ కి చెప్పాడు, బోధన అలాగే చేసాడు. నదిలో దాచాడన్న విషయం తెలుసుకొని ద్వారకావాసులు కర్రలతో కొడుతూ విగ్రహాన్ని వెతకసాగారు. కర్రల దెబ్బలు తగిలి విగ్రహం నుండి రక్తం స్రవించటం జరిగింది. ఎక్కడైతే కృష్ణుని విగ్రహం నుండి రక్తం వచ్చిందో ఆ ప్రదేశమంతా నదిలో నీరు ఎర్రగా మారిపోయింది. మిగిలిన నది నీరు మామూలుగా ఉందట. మొత్తానికి కృష్ణుని విగ్రహం నదిలోనుండి బయటకు తీశారు. కర్రలతో పొడిచిన గుర్తులు కృష్ణుడి విగ్రహంపై  కనిపించాయి. ద్వారకావాసులు కృష్ణుని విగ్రహం ఐనా ఇవ్వు, లేదా విగ్రహం అంత బరువైన బంగారమైన ఇవ్వమని బోధనా ని అడిగారు. కృష్ణుని ఇవ్వలేను ... బంగారమే ఇస్తాను అని అన్నాడు. మాటైతే ఇచ్చాడు గానీ, అంత బంగారం తన దగ్గర ఎక్కడిది అని బాధపడ్డాడు. తనవద్ద ఉన్నది భార్య ముక్కుపుడక మాత్రమే. దానినే తరాజులో ఒకపక్క వేసి, మరోవైపు విగ్రహాన్ని ఉంచారు, తన భక్తుడైన బోధనాని రక్షించటానికై భగవానుడు తన బరువును తగ్గించి, ముక్కుపుడకతో సమానంగా తూగాడు. ఇక ఏమీ చెయ్యలేక ద్వారకావాసులు, పూజారులు తిరిగి ద్వారకకి వెళ్ళిపోయారు. వారానికి ఒక్కరోజు మాత్రమే ద్వారకలో, మిగిలిన ఆరు రోజులు రణచోడ్ రాయ్ లో కృష్ణుడు ఉంటాడని అంటుంటారు. 

శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్న తరవాత అల్పాహారాలు చేసి, భావనగర్ లో సముద్రం మధ్యలో ఉన్న నిష్కళంక మహాదేవ్ ని దర్శించటానికి 8.45 కి బస్సు బయలుదేరింది.


నిష్కళంక మహాదేవ్ చరిత్ర 

నిష్కళంక - అనగా నిర్దోషమైన అంటే దోషములను పోగొట్టే,......మహాదేవ్ - అంటే మహాదేవుడు శివుడు అని అర్థం. ఈ నిష్కళంక మహాదేవ్ ని ప్రార్థించినా, పూజించినా, దర్శించినా మనం చేసిన దోషాలన్నీ పోతాయి అని ప్రతీతి.

మహాభారత యుద్ధం జరిగిన తరవాత శ్రీకృషుడు పాండవులకి తమ పాప పరిహారం చేసుకోవటానికై శివుడిని ఆరాధించమని చెప్పి, నల్ల ఆవు, నల్ల ఝoడా తీసుకొని వెళ్ళండి, ఎప్పుడైతే ఆ రెండూ తెల్లగా మారుతాయో అప్పుడు మీ పాపములు తొలగిపోయినట్టే అని తెలియచేసాడంట. పాండవులు సముద్రం మధ్యలో 5 శివలింగాలని ప్రతిష్ఠించి పూజలు చేసి వారి పాపాలను, దోషాలను తొలగించుకున్నారని చెబుతుంటారు.
                                 
మార్గమధ్యంలో 1.30 కి బస్సుని ఆపి, భోజనాలు ముగించుకొని మళ్ళీ అర్థగంటలో బయలుదేరాము. మధ్యాహ్నం 3 అయ్యేసరికి భావనగర్ లో ఉన్న కొలియాక్ అనే ప్రాంతానికి చేరుకున్నాము. బస్సు దిగి అందరం సముద్రం మధ్యలో ఉన్న శివలింగాలని చూడాలని సముద్రం ఒడ్డుకి పరుగులు తీసాము. మేము వెళ్ళిన సమయానికి స్వామిని దర్శించుకునే అవకాశం ఉందో లేదో అని అందరికీ ఆత్రంగా ఉంది. ఇంకా సముద్రం వెనక్కి వెళ్ళలేదు. అక్కడ వారిని అడిగితే 5 గంటకి నీరు వెనక్కి వెళ్లవచ్చును, అప్పుడు మీరు వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చును అని చెప్పారు. అప్పటికి అందరం తేలికపడ్డాము.

నిష్కళంకుడిని దర్శించుకోవటానికి చిన్నపిల్లల్లా నీటిలో ఆడుతూ, పాడుతూ  మేము ఎలా వెళ్ళామో ఈ క్రింది వీడియోలో చూడండి.









ఇక్కడ సముద్రానికి కెరటాలు పెద్ద ఎత్తుగా ఏమీ రాలేదు. సముద్రంలోకి ఎంత దూరం వెళ్ళినా మోకాలి లోతు, ఇంకా ఐతే నడుం వరకు నీరు ఉంటుంది. అంతకు మించి లోతు లేనేలేదు.

పంచ పాండవులచే ప్రతిష్టింపబడిన ఈ నిష్కళంక మహాదేవ్ ని దర్శించాలంటే సముద్రం ఒడ్డు నుండి సుమారుగా 1.5 కిలోమీటరు నడుచుకొని వెళ్ళాలి. అప్పుడే సముద్రం నడిబొడ్డులో ఉన్న ఆ లింగాలని మనం దర్శించగలం. 


సముద్రంలో ఉన్న శివలింగాలు ఎలా కనిపిస్తాయి అని మనకి సందేహం కలగవచ్చును. ఇక్కడ సముద్రంలో ఉన్న నీరు 6 గంటలు వెనక్కి వెళ్ళి, 6 గంటల తరవాత మరల ముందుకి వస్తుంది. ఈ విధంగా రోజుకి రెండుసార్లు జరుగుతుందట. ప్రతీరోజూ ఒకే సమయానికి నీరు వెనక్కి వెళుతుంది అనే నియమం లేదు. ఒక్కోరోజు ఒక్కో సమయంలో వెనక్కి జరగవచ్చును. అది ఉదయం 8 గంటలకి అవ్వచ్చును, లేదా 10 గంటలకి అవ్వొచ్చును. అమావాస్య, పౌర్ణమి రోజులలో ఇంకా ఎక్కువసేపు నీరు వెనక్కి వెళుతుంది. ఆ సమయాలలో స్వామికి ... ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. 

4.30 వరకు ఒడ్డునే ఉండి సేదదీరాము. అప్పటికే జనాలు సముద్రంలో తడుసుకుంటూ, ఆడుకుంటూ ముందు ముందుకి నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. వారిని చూసి ఉత్సాహం ఆపుకోలేక మేము కూడా కొంతమంది నీటిలో తడుస్తూ, నడుస్తూ ముందుకి సాగాము. మొత్తానికి 5.15 అయ్యేసరికి సముద్రం శివలింగాలకి వెనక్కి వెళ్ళిపోయింది. ఒడ్డు నుండి చూస్తే కనుచూపు మేరలో ఎక్కడా నీరు కనిపించలేదు. ఒడ్డు నుండి 2 Km దూరంగా వెనక్కి వెళ్ళిపోయింది. అందరికీ భలే వింతగా, విచిత్రంగా అనిపించింది. సముద్రమేమిటి వెనక్కి వెళ్ళిపోవటమేమిటి అని. 

సముద్రంలో నీరు ఉండగానే మేము కూడా నీటిలో నుండే ప్రయాణించి శివలింగాలని చూడటానికి మొత్తానికి చేరుకున్నాము. 




                            అక్కడ ఉన్న శివలింగాలు ఇవి 





మా గ్రూప్ 10 మంది అక్కడ తీసుకున్న ఫోటో. మాతో పాటు టూర్ లో వచ్చిన మరొక స్నేహితురాలు. 


మొత్తానికి పంచపాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలని దర్శించి వచ్చాము. వెళ్ళేటప్పుడు నీటిలో ప్రయాణం చేసాము. వచ్చేటప్పుడు నీరు లేని మార్గంలో చాలా త్వరగా నడచి రాగలిగాము. 

బస్సు వద్దకి అందరు చేరేసరికి రాత్రికి వేడివేడిగా తయారై సిద్ధంగా ఉన్న అల్పాహారాన్ని తిని, బస్సు బయలుదేరేసరికి రాత్రి 9 గంటలు అయ్యింది. ఇప్పుడు మా ప్రయాణం సోమనాథ్ కి. రాత్రంతా ప్రయాణం చేసి ప్రొద్దున్నే 6 గంటలకి సోమనాథ్ చేరుకున్నాము. 

No comments:

Post a Comment