81
లావుగలవాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
82
వఱదైన చేనుదున్నకు
కఱవైనను బంధుజనుల కడ కేఁగకుమీ,
పరులకు మర్మము సెప్పకు,
పిఱికికి దళవాయితనముఁబెట్టకు సుమతీ!
83
వరిపంట లేని యూరును
దొరలుండని యూరు, తోడు దొరకని తెరువున్,
ధరను బతిలేని గృహమును,
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
84
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
85
వీడెము సేయని నోరును
చేడెల యధరామృతంబుఁజేయని నోరున్
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
86
వేసరపు జాతి గానీ,
వీసము దా జేయనట్టి వీరిడి గానీ,
దాసి కొడుకైన గానీ,
కాసులు గల వాడె రాజు గదరా సుమతీ
87
శుభముల పొందని చదువును,
నభినయముగ రాగరసము నందని పాటల్,
గుభ గుభలు లేని కూటమి,
సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ
88
సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొరకె తథ్యము సుమతీ.
89
సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
90
స్త్రీలయెడల వాదులాడకు
బాలురతోc జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ.