August 1, 2020

సుమతీ శతకం 71 నుండి 80 Poems

సుమతీ శతకం 71 నుండి 80 Poems 
71
పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్ధములున్
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ !
72
పొరుగున బగవాడుండిన
నిర నొందగ వ్రాతకాడె యేలికయైనన్
ధరగాపు గొండెయైనను
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ !
73
బంగారు కుదువబెట్టకు
సంగరమున బాఱిపోకు సరసుడవైతే
నంగడి వెచ్చము లాడకు
వెంగలితో జెలిమివలదు వినురా సుమతీ !
74
బలవంతుడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుటమేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ !
75
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుట సుమతీ !
76
మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచు దఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు గీలూడినట్లు జరుగదు సుమతీ !
77
మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ !
78
మానధను డాత్మధృతి చెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలముల లోపల
నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ !
79
'రా, పొ' మ్మని పిలువని యా
భూపాలునిగొల్వ భుక్తి ముక్తులు గలవే ?
దీపంబులేని యింటను
జే పుణికి ళ్ళాడినట్లు సిద్ధము సుమతీ !
80
రూపించి పలికి బొంకకు,
ప్రాపగు చుట్టంబు కెగ్గు పలుకకు మదిలో
గోపించు రాజు గొల్వకు
పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ !

No comments:

Post a Comment