51
తాననుభవింప నర్ధము
మానవపతి జేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగలుగూర్చిన
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ !
52
దగ్గర కొండెము చెప్పెడు
ప్రెగ్గడపలుకులకు రాజు ప్రియుడై మఱి తా
నెగ్గు బ్రజ్జ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతీ !
53
ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగవలసెన్
దనవారి కెంత గలిగిన
తన భాగ్యమె తనకుగాక తధ్యము సుమతీ !
54
ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీcదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ !
55
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ !
56
నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు మగసాలి వాని నటు వెలయాలిన్
నమ్మకు మంగడివానిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ !
57
నయమున బాలుంద్రావరు
భయమున విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియొ
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ !
58
నరపతులు మేరదప్పిన
దిర మొప్పగ విధవ యింట దీర్పరియైనన్
గరణము వైదికుడైనను
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ !
59
నవరస భావాలంకృత
కవితా గోష్టియును మధుర గానంబుగును దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ !
60
నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతులతో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ !
No comments:
Post a Comment