శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 101 To 108
101తిరుమేని సౌందర్యము కనుల నిండగ
స్వామి సామీప్యమే షడ్రసోపేత రుచుల నొసగ
మరివేరు రుచులేల వేగిరమున కొల్తుము
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్
102
గొల్లవారల డొల్లతనమునకు స్వామి చేరువై
యాడి పాడి క్షమా దయాది గుణము లెల్ల
తేజరిల్లగా కొనియాడిరా రేపల్లె వాసుని
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్
103
శ్రీ హరిని ధ్యానింప వీక్షింప భజియింప
హంగు పొంగులేల నిర్మల తటాకంబు పోలు
నిజాంతఃకరణమ్మున వేడుము
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్
104
అనిత్య వస్తువులే నిత్యమని నమ్మి
పైని తళుకుబెళుకలే సత్యమని నమ్ము వారికి
భ్రాంతులను తొలగింపుమయా మాయా వినోదా !
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్
105
ఆధారము నీవే ఆధారము నీవే
ప్రాపకత్త్వము ప్రాప్యము నొసగునది నీవే !
ప్రాప్యా ప్రాప్య ఫలదాయక !
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్
106
భయమెందుకు అండగ నీవుండగ
భయమెందుకు అంతట నీవుండగ నీయందు మేముండగ
మాయందు నీవుండగ అఖిల లోకమ్ములనేలు
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్
107
పరి పరి విధముల నొసగు పరీక్షల ప్రహ్లాద వరదా !
గజరాజ రక్షకా! మా భవబంధముల భారముల
తొలగించు భారము నీదే భావనారాయణా !
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్
108
సర్వాలంకార భూషితుడై సమస్త లోకమ్ములు పాలించుస్వామి
ఏతెంచె గరుడారూఢుడై గతి తప్పిన జీవుల నుద్ధరించ
సంసిద్ధుడై వేంచేసే వేదములతో
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్
ఫలశృతి:-
శత సుమముల నాఘ్రాణించు వారలకు
జగన్నాథుడొసగు దివ్యానుగ్రహమును
ఇలయందు సుఖసౌఖ్యములు కలిగి
దివియందు చేరుదురు శ్రీ చరణముల!