July 23, 2021

శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 1 To 108

 శ్రీజగన్నాథ అక్షర సుమమాలిక

రచన - శ్రీమతి శ్రీకృష్ణ మాధవి (అనుఙ్ఞ:- జగన్నాధ పెరుమాళ్)

0

జయ జయ జగన్నాథా! జయము జయము 

జయ నీరాజనముల నడుమ 

కదిలింది కదిలింది జగన్నాథుని రథయాత్ర 

ఇదిగో ఇదిగో ఘన అక్షర నీరాజనం 

జయనీరాజనము జయనీరాజనము

జైజగన్నాధా ! జైజగన్నాధా!  జైజగన్నాధా!

శరణం శరణం శరణం 

1.

మరుపు, మోహము, ఆశనిరాశలు 

దరిచేరనీక మనోహరా! గుణాగుణములు 

నీచరణ సేవకై జేర్చుమయా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

2. 

నిను తలచు కాలము పుణ్యకాలము 

నిను కొలుచు వారలకు కొంగుబంగారు 

నిను దర్శించు క్షణమున  ధన్యతనొందగ 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

3. 

సర్పము కుబుసము విడుచునటుల 

జీవి దేహమ్ము విడుచు సమయమ్మున 

నీ నామము జిహ్వన నిలుపుమయ్యా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

4. 

కార్యమ్ములు, కర్మమ్ములు నీ యాధీనమే

నీవు సృజియించిన మట్టి బొమ్మలము

నీచే యాడబడు ఉత్తి తోలుబొమ్మలము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

5. 

వెదకుచుంటి నిను చేరు మార్గము 

జిక్కియు జిక్కక యాడుచుందువేల 

నీకై పరిభ్రమించు జీవులమే కృష్ణా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

6. 

సదా నిను తలచు జీవుల నావికా రక్షక 

భక్తి, ప్రేమ,  స్మరణ, చింతన న

ఎటులైన నిను తలచు మనసొసగు 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

7. 

సర్వ దిక్కుల సర్వ విధముల గావుమయ్యా!

సర్వార్ధసాధకా! నిరతము నీ భజనలే 

భవ బంధమోచనము కాగా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

8.  

ఇలయందు ఈ కలియందు నీవే 

సర్వపాపహరా! నారాయణా! 

ఆలంబనమిచ్చి గావుమయ్యా !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

9. 

నిరతము నీరూపగుణ నామ వైభవమ్ము 

కీర్తింపబడునో యదియె దివ్యస్థలమై 

నొప్పారు  యచటి జనులెల్లరు భాగవతులే 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

10.  

జీవునిగ పుడమిన జనియించి 

చేయుచుంటిమి కార్యాకార్యములు నెన్నియో 

క్షీరమధనము వోలె మధియింపు మము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

11. 

యఙ్ఞేశుడా! యఙ్ఞస్వరూపా! శ్రీహరీ యను 

నీ నామామృతము గ్రోలు మనసీయుము  

యదియే కోటి యఙ్ఞఫలమీ ఇలనను భావన సేతుము! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

12. 

యఙ్ఞంబనిన నేదియో 

యఙ్ఞంబు కానిదేదియో సర్వంబు నీ కెరుక

దాసుడను నీ నామంబు దక్క నాకేమి ఎరుక 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

13.  

ఆగ్రహము కలిగినప్పుడు నిలువుము 

నొకతఱి నిగ్రహమ్మావహన చేకొనిన

భగవదనుగ్రహము దరిచేరు వేడుము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

14.   

కబళించు మృత్యువు పొంచియున్నదని 

తెలివి కలిగి యోచించుము జీవునిగతి 

జీవాత్మకు పరమాత్మయే శరణమని కొలువుము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

15. 

అమృతము కన్న మిన్న శ్రీ హరి గాధామృతము 

దేవతల సొత్తు యా యమృతము సర్వజీవుల 

భక్తుల సొమ్ము శ్రీహరి యని త్రికరణశుద్ధిగా నమ్మి వేడుము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

16.  

వహ్నిదేవ నారాయణా! కార్యముల 

కర్తృత్త్వముల నీవే అండ కాయగ 

దరిచేర్చు దామోదరా ! నినుగాక 

వేరొండు లేరని వేడెద శరణాగత రక్షక !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

17.  

మమత్త్వమును పోషించి అహమిది 

అహమిది యని అహరహము పాటుపడి 

సాగిలవడి తహతహలాడు జీవికి

సద్గతి నీయవయ్యా జగన్నాధా !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

18. 

ప్రాప్తమ్ములన్నియు పరమపురుషుని 

దివ్యానుగ్రహమ్ములవ్వ  ప్రాప్తించినవన్నీ 

ప్రాపకమ్ములని నిజమదిని నమ్మి శరణు

శరణని వేడుము వేడుకగా వరదా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

19.  

సర్వంబు త్యజియించి వైకుంఠా ! జనార్దనా !

వాసుదేవా! నృశింహా! యను నామసంకీర్తన

జేయు నరునికి మరుజన్మ నాస్తి యమపురి 

జూడనేరరు తెలిసి తెలిసి జేయుము హరికీర్తనమ్ము!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

20. 

కడుపునకు తినుచుందురు బుక్కెడు బువ్వ 

మనుగడ సాధించుటకు మనుటకు ఇలలో 

యది యొక్కటే జీవనమ్మయిన జీవనపరమార్ధమేమి? 

సంరక్షింపుమయా  జీవాత్మలను జీవోద్థారకా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

21.  

కాలగతిన కలియుదురు మాన్యులు  అసమాన్యులు 

మరియా కాలగతిన కలయు బెక్కెండు గాని 

సత్యంబు ధర్మంబు శీలమ్ము గుణములు 

నిలిపినవి భూమండలాధీశుల నామములిలను!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

22. 

కాలమ్మె సర్వకార్యమ్ములకు మూలమ్ము  

జపియింపుము కాలాధీశుని  కాలాతీతుని 

నామ స్మరణంబున, రణంబునైన, మరణంబునైన 

అనవరతము సర్వకాలనిలయా ! నారాయణా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

23. 

కలియుగంబు అంతరించు శ్రీ మహావిష్ణు సాక్షిగ 

మరల కృతయుగం బేతెంచు సూర్యచంద్ర గురు 

శుక్రులేకరాశి నుండగ ప్రేమామృతము వర్షించు 

భూమండలమంతయు శోభాయమానముగా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్ 

24.  

శ్రీహరి ధ్యాన పరవశులయి ప్రవర్తిల్లు వారి 

యెడ కలిజూడనేరడు రానేరడు శ్రీహరి 

శ్రీహరి యని మనసున రూపమ్ము నిలిపిన 

 కలి తన కాలికి బుద్ధి చెప్పు కలి హంతక 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్ 

25.  

చేతపట్టే నవనీతము చూపు నిలిపే యసుర 

చిత్తవృత్తుల యెడ తన శక్తి చూపు సమయమిది యని 

యెంచి సన్నద్ధతను చూపుచూసే  చిన్ననాడే 

యా యశోద తనయుడు జగదానందనుడై 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్ 

26.  

తకథిమి తకథిమి మృదంగలయ విన్యాసములు

కర్ణపేయము సేయ వినోదము కలిగె నాధునికని                                       

అనంత భక్తకోటి సాగిలపడిరి ముక్తి ఫలదాయుని 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

 27. 

ఆకృతుల యందు వికృతుల యందు 

ఆకృతియే లేని నీవు పలు ఆకృతుల  ధరియించి  

సృజియించి భేధభావమ్ము లేక అన్నిటను తానుండి 

తానే అయి అవధరించు ఆది నారాయణా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్ 

28. 

మేలు గుణముల రాశి మమ్మేలు మా స్వామి 

చొరనీయకయ్యా మా యందు రాగద్వేషాది భావమ్ములు 

భావంబులో నయిన మము జూసి కలి 

వెడలి పోవలెనయ్య వసుదేవతనయ వాసుదేవ!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్ 

29.  

పిపీలికాది బ్రహ్మాండమంతయు చరాచరమంతయు 

నిండిన నిర్మలాంతఃకరణ నిరంజనా సరళాత్మ! 

సృష్ట్యాది పర్యంతము నీవే అఖిలాగమవేద!

త్రివిక్రమా! నిను కీర్తన సేతుము!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

 30. 

ఓ మాయా కల్పిత! మాయా వినోద,! 

జీవాత్మల పరమాత్మ  నడుమ మాయలేల 

ఓ మాయా రహితా ! హితముగ సడలింపుమయా 

పెను మాయలను మాయాధీశ! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్ 

31.  

రూపంబులేని నీవు మహత్ గుణములన్నియు 

నొక్కటిచేసి తెచ్చుకొంటివయా బహు దొడ్డ రూపంబు  

జీవుల తరియించుటకు దక్క మరియేమి కాదయా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్ 

32. 

దర్శనంబులు ఇచ్చెదవు పలు తెఱంగుల

పామరులమయ్య  షట్దర్శనముల నొసగుమయ్య 

ఙ్ఞాన విఙ్ఞాన సుఙ్ఞాన ప్రదాత వయి 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్ 

షట్దర్శనములు: సమదృష్టి, సత్ గుణవైభవము, వివేచన, సత్ యోగం, సత్ ఙ్ఞానము, సత్ సాంగత్యము

33. 

కాలఙ్ఞానంబు నీవు, కాలస్వరూపంబు, నీవు కాలమ్ము, 

నీవు కాలాతీతుడవు, నీవు కాల గమనమ్ము, 

నీవు సర్వతేజ స్వరూప కాంతిమయా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్ 

34.  

హృదయ సరసిజనాభ పవళించు 

ఆ  ఆ దిశేషునిపై విశ్రమించు

యది యా యాదిశేషుని భాగ్యమ్మేమో 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్ 

35. 

బాహ్యవస్తు భ్రాంతి బాహ్య బంధు భ్రాంతి 

వదలదేమి బంక జిగురు రీతి 

నిరవధిక నీ నామజపము సేయు శక్తి నీయుమయా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

 36. 

సుఖదుఃఖమ్ములన్నియు పరమాత్మ 

సంకల్పితములవియే మహాప్రసాదమ్ముగ 

నెంచి భావించి స్త్రీ శిశు గాంచు గుణమీయవా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

 37.  

సర్వఙ్ఞ సర్వశక్తి విశారద సత్యఙ్ఞాన 

దివ్యగుణ లీలా ప్రకాశ ఆత్మానాత్మ 

ఙ్ఞానంబు నీయవయా దయాశాలివై 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

38. 

ఆద్యంతములన్నియు నీవే 

అనంతానంత విభుడవు నీవే మా ప్రభువు దైవము

గురుడవు సర్వంబు నీవే నీరజాక్షా...

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

39 .   

ఙ్ఞాన విఙ్ఞానములేకమవ్వ నటుల ఆత్మానుభవమ్ము 

పొంది విశ్వమే పరమాత్మ స్వరూపముగా 

భావింప భావననొసగు భావాత్మా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

40.  

జగతిన జరుగు నాటకమ్మున 

సూత్రధారి పాత్రధారివీ నీవే 

జగన్నాటక సూత్రధారి బిరుదాంకితా ! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

41. 

శతృవయిన కరుణజూపెడు కరుణానిధి 

కమలాకరుండు శిశుపాలాదులకు 

మోక్షమీయగడు వాత్సల్యనిధి శ్రీ కరుని కృప వేడరో! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

42. 

శ్రీ మానినీ మానస చోర రోషమ్ములున్న 

దోషములున్న నిను గాంచిన మరుక్షణమే 

సమయు సకల దోషములు  దుర్మోహములు

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

43. 

తనువు డస్సి మనసు డస్సి 

డస్సిన హృదికి జీవామృతము నీవే 

మృదుమధుర వాగ్భూషణ జగత్కల్యాణ!  

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

44.

ఆలంబనము ఈయవయ్య  విలంబనము 

సేయక ఉలిదెబ్బలు మలి దెబ్బలు మరి 

ఏలనయ్యా మా ఏలిక నీవు గాగా వేగరా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

45. 

బడుగు బాపడయ్యి అడిగె మూడడుగులు 

బదులు తీర్చే మకార త్రయమను వరమను 

గ్రహించె ద్వారకావలియయి దామోదరా....

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

46. 

తడిలేని యాత్మల ఆత్మజుల్ వుండి 

యేల ఒత్తురు పోతురని భావనలేల 

సేతురు నిందారోపణలను చింతలేల 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

47. 

యోగ్యతల్ పలు తెఱంగులు ఏ యోగ్యతల్ 

ఎవరికి ఒసంగుదువో యోగ్యతల నొసంగు యోగ 

నారసింహా! నిను తలచుదు సదా ఆర్తితోడా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

48. 

బుడిబుడి యడుగుల బాలుడు ధృవుండా(ధృవుడు)

(ఆ)చరించె తపంబు  ఓం నమో నారాయణా యని 

అనుగ్రహించితివే వానిని చేసితివి కడకు ధృవతారగా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

49   

నిరంతర విష్ణు ధ్యానమ్మె కలిగించు 

ధ్యాన యోగ సోపాన  మార్గంబు

కడకు చేర్చును విష్ణు ఫథమ్మును 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

50. 

సరసమయినా, విరసమయినా

ఏ రసంబైన రసరమ్యా నీదు 

సాటి దైవమెవ్వరు దేవాధిదేవా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్

51. 

పరుగులిడును ఉరకలిడును నీ కొఱకై 

వేదనలు సంవేదనలు నైవేద్యమ్ములయి 

ప్రాణదీపము పయనించును నీ దరికి 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్ 

52. 

నీ నామంబులతో జిహ్వ తరియింప 

నీ సంకీర్తనా ధ్వనులతో ఒడలు పులకింప 

గళము కీర్తించె పరమపురుషా యని 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

53. 

విష్ణుండవయి నీవేతెంచగా 

జిష్ణుండవయి చిత్తమున వసియింపగా..

ఓ!శంఖుచక్రథారీ! చక్రపాణీ! చతురాననా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

54. 

కనులు నిండుగ మనసు నిండుగ 

మాకు పండుగ నీ నిరంతర

నిత్యోత్సవమ్ములు నిరంజనా!నీలోత్పలా! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

55. 

వేదవేత్తలు వినుతి జేసిరి 

వేదాచలమే స్థిరమని దివ్యఫలమని 

వేదాంతరంగా! రంగ రంగా !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

56. 

అలలు ఎగసినవి మనస్సంద్రమున    

నీ పాదపద్మములు చేరు యాశతోడి 

మెరుపు మెరిసినది మిలమిల హృదిన 

మీదుమిక్కిలి ప్రేమతోడి ప్రేమావతారా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

57. 

చెలువలు కలువలు మగువలు పరమ 

పురుష పరాగ కాంక్షులై పుప్పొడులైరి 

పులకరించుచూ పురుషోత్తమా! పురాధీశా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

58.   

సంకల్పమ్ములు వికల్పమ్ములు  

ఘర్షణమ్ములు సంఘర్షణమ్ములు 

సర్వంబు నీ యాధీనమే సర్వాంతరంగా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

59. 

దుర్యోగమ్ములు దగ్ధమవ్వు యాగాగ్నిలో 

సుయోగమ్ములు ఉద్భవించు యోగాగ్నిన 

చరాచర సృష్ఠికర్తా! సర్వచమత్కారా! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

60.

 'న'కారమ్ములేల మనసా...సకారాత్ముడు 

ఎదుటనుండ స్వచ్ఛందనాల మనసు 

సుమ సౌరభ మనోహరుడు కేశవునిదే....కేశవా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

61. 

సర్వలాంఛనమ్ములు నీవే 

సకల కళలు నీవె ధరణీధర దనుజారి 

సర్వ సుగంధములు నీవే శౌరి నీవె

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

62. 

గుణమ్ముల్ సత్ గుణమ్ములు 

నిర్గుణమ్ముల్ నీ యాధీనమే 

సర్వాధారా! సకలాధారా! సద్వైభవ! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

63. 

సమ్మోహనాకార మోహినీ అవతార 

చూడ్కులె సమ్మోహనాస్త్రమ్ములయి 

పంచితివి అమృతము పదిలమ్ముగ 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

64. 

వనమాలికి పంకజాక్షికి 

కలహమా? ప్రణయ కలహమా 

ఔరా !ఔరౌరా ! విభ్రమమందె విభుధ జనులు 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

65. 

సొగసు మీర సోగ కనుల సొగసున 

సొంపైన ఇంపైన సొగసరి నీవని సిరి 

హారతులిడగ గైకొను సిరిపతి శ్రీహరీ

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

66. 

భక్తి కుదిరి రక్తి కుదిరి శక్తి యుక్తులన్ని నీవని 

నీవేనని నికరముగ నెఱ నమ్మి తి 

నీలమేఘరూపా! నీరజాక్షా! నీదయనిజూపు

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

67.  

జ్యోతులు పరంజ్యోతులయి విరాజిల్లే 

వినువీధుల మనో వీధుల హరిచరియించె 

మహా సంకర్షణా! ప్రద్యుమ్నానిరుద్ధా! వాసుదేవ 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

68. 

నిష్కామ కర్మములు పరిఢవిల్ల   

శాంతి సౌభాగ్యములు విస్తరిల్ల 

ఇలపైన వైకుంఠమే వైకుంఠనాథా!

 లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్ 

69.  

దురితమ్ముల నోపగలేము దురితాపహారా!

దుష్టసంహారా! దృగంచల లోచనావలోకా!

సత్ కృపన్ కృపజేయుమా మా మాధవా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్ 

70. 

ఙ్ఞానసాగరమ్ము మథియించి మథియించి  

మదినెంచి భక్తి తీరము చేర ఆనతి నీయుమా 

ఆది నారాయణా ! ఆనంద నిలయ నిఘూఢా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

71. 

అణిమాద్యష్టైశ్వర్యములే కడకు 

మౌనధ్యాన సాధనలే కడకు ఆత్మనందు 

పరమాత్మ సందర్సనమే మేలౌను 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

72.

పరధర్మము వలదు వలదని యదియే 

ప్రాణాంతకమని స్వధర్మమే మేలుమేలను 

ధర్మాధర్మ నిర్ణయాధికారా ధర్మభోధకా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

73. 

ధీనిధుల్ చేతురు యోగాచరణంబులు 

పొందుదురు శాశ్వత మోక్షఫధమ్మును 

నిత్యసూరుల సమక్షమున అనురక్తిన వేడెదరు 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

74. 

సంపదలకు జిక్కక విరాగియయి 

ఆచరణాత్మక ఆత్మఙ్ఞానియయీ 

శ్రీ చరణమ్ములే పరమపెన్నిధి గాగ

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

75. 

నవనవోన్మేష  నళినీధర నీలమేఘ

నిరంజన పురంజన పురుషోత్తమ

 నీలో నేను నాలోన నీవు నెలకొనిన హంసాత్మక! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

76. 

అభిషేకమ్ములు చేయ మాకు ప్రియము 

అభిషేకమ్ములు నీకు ప్రియము 

నిరవధిక అభిషేక అభిలాష ఆది నారాయణా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

77. 

ఈప్సితములు నెరవేర్చు రంగరాయా 

మనోరథమ్ములు ఈడేర్చ వెడలినవి 

మహారథమ్ములు జైజై జగన్నాథ థ్వనుల 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

78. 

సంసార బంధనమ్ములు సడలించు 

సాగరనిలయ క్షీరసాగరశయన

వ్యూహవిభవ శ్రీ మన్నారాయణా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

79. 

వినుతిజేసి విరాట్ పురుషుని 

విమలముగ విఖ్యాత విశ్వరూపుని 

విమలాంతరంగ రంగని రంగరంగా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

80. 

కట్టెనందు జీవము కొట్టుమిట్టాడే 

వెడలనీయక వుండనీయక 

జీవశ్చవంబువోలె మరి ఎన్ని నాళ్ళయా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

81. 

డాంబికమ్ములు వలయు 

డాబు దర్పంబులు వలయు 

ఆత్మసంశోధనమ్మసలు లేక ఇది ఏమి మాయనో 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్ 

82. 

కల్ల కపటమ్ముల జిక్కి లేమిని 

పరిహసింతురేల మేలమాడుదురేల 

ఈ అసమతుల్యతలేల మేలైన నాయకా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్ 

83. 

ఓపగలేను సైపగలేను భారమ్ములు   

బ్రహ్మాండనాయకా! బ్రహ్మాండమే కేశమ్ము నీకు 

దయాసాగరా! మదీయ ఆత్మభారంబేపాటిది 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

84. 

బధిరునికడ వేణుగానమ్ము చందమున 

అంధునికి చిత్రకూడ్య వీక్షణ ఎటులనో 

మూఢునికి ఙ్ఞానభోధలా రామచంద్రా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్ 

85.

వేదనల్ కలిగించు విషయాంతరమ్ముల 

విష వలయుమ్ముల విముక్తి నొసగుము 

నందనందనా! విదుర వరదా! విమల వరదా! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

86.

భోధించె సత్ భోధనలు గురుతరముగ 

జగత్ గురువువై గుహ్యాంతరంగా 

శాంతి ప్రదాయకా చిరు నగుమోమున సిరిగల 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

87. 

వాక్ మనమ్ములు ఏకమయి 

ఏకైక నాథునేకరీతి గొలిచి       

విధివ్రాతలు వ్రాయు విరించి తండ్రీ!  

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

88. 

ఆత్మ ఙ్ఞానమ్మే సత్ సంపదనీ 

అక్షయ సుఖమ్మని తెలివి కల్గిన

తెరువరికి కల్గు మోక్ష ఫథమ్ము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

89. 

చరాచర జగత్తున నిండిన వాసుదేవ 

నిను గాంచిన కల్గు సత్ గతులు 

తొలగు వికారమ్ములు సరళాత్మా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

90. 

నిష్కామ భక్తిని మెచ్చి 

పరమపదము చేర్చు త్రిగుణాతీతుడు 

తనరూపు వానికిచ్చు జీవి ధన్యమవ్వగా

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

91. 

భగవత్ సాన్నిధ్యమునకు పరితపించు 

పరమభక్తులు జన్మ సాఫల్యత నందె 

నొందెదరు ప్రహ్లాదుని వోలె!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

92. 

పరమాత్మ గుణవైభవమ్ము  నిరతము 

తలుచు నిరంజనులు వాయువుతోడి 

సుమ సౌరభంభు రీతిగా నిను చేరరా !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

93. 

దిక్కు దిక్కున జూచితి దిక్కెవ్వండని 

దిక్కులకు దిక్కు నీవుండగా వెరవేల 

వేణుగాన ప్రియా! దీనజనోద్ధారకా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

94.

నవ విధ ద్వారమ్ములు కలిగిన 

పురమందు వసియించు వారిమి పురము 

పురము నందు నిను గాంచు మానస మొసగుము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

95. 

జీవాత్మ పరమాత్మ  సంయోగమ్మె 

పరమోత్కృష్టము పరమధర్మము 

చూపుమయా అంతరంగ ప్రేమను 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

96. 

లేదు దుఃఖమ్ము ఆత్మఙ్ఞునికి 

ఆత్మ ఙ్ఞానమే యక్షయంబుగా యదియే 

శుభ సౌఖ్యంబు లొసగగా శుభకర! 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

97. 

గర్వంబు కర్మంబు పరిహరింప నీవుండగ 

అండగ కాచగా దిగులేల దుఃఖ పరిహారా!

 పరివార సమ్ముఖ పారిజాతా! అనంతానంత విభవా !

 లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

98.  

చెంతనే చేరి చూపునెటనో నిలిపితివి 

మానస చోరుల యాగడమా ? 

దుఃఖార్తుల కలవరమా ? సుకుమార! నీ త్వరయేమి ?

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

99. 

గోపికలు నింద చేసిరి దధిచోరాగ్రేసరుడవని 

పడుచుంటివి నేటికిని యా నిందను మాయని 

చిరు సుమధుర హాసముల మాయావిలోలా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

100. 

హరి వాసమె ప్రియమని 

శ్రీ హరి నిలయమె హితమని మెలిగే 

 అనపాయని అనవరతము నిను వీడక 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

101 

తిరుమేని సౌందర్యము కనుల నిండగ 

స్వామి సామీప్యమే షడ్రసోపేత రుచుల నొసగ 

మరివేరు రుచులేల వేగిరమున కొల్తుము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

102 

గొల్లవారల డొల్లతనమునకు స్వామి చేరువై 

యాడి పాడి క్షమా దయాది గుణము లెల్ల 

తేజరిల్లగా కొనియాడిరా రేపల్లె వాసుని 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

103 

శ్రీ హరిని ధ్యానింప వీక్షింప భజియింప

హంగు పొంగులేల నిర్మల తటాకంబు పోలు 

నిజాంతఃకరణమ్మున వేడుము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

104 

అనిత్య వస్తువులే నిత్యమని నమ్మి 

పైని తళుకుబెళుకలే సత్యమని నమ్ము వారికి

భ్రాంతులను తొలగింపుమయా మాయా వినోదా !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

105

ఆధారము నీవే ఆధారము నీవే 

ప్రాపకత్త్వము ప్రాప్యము నొసగునది నీవే !

ప్రాప్యా ప్రాప్య ఫలదాయక !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

106

భయమెందుకు అండగ నీవుండగ 

భయమెందుకు అంతట నీవుండగ నీయందు మేముండగ 

మాయందు నీవుండగ  అఖిల లోకమ్ములనేలు

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

107

పరి పరి విధముల నొసగు పరీక్షల ప్రహ్లాద వరదా ! 

గజరాజ రక్షకా! మా భవబంధముల భారముల 

తొలగించు భారము నీదే భావనారాయణా !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

108

సర్వాలంకార భూషితుడై సమస్త లోకమ్ములు పాలించుస్వామి 

ఏతెంచె గరుడారూఢుడై గతి తప్పిన జీవుల నుద్ధరించ 

సంసిద్ధుడై వేంచేసే వేదములతో 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్ ! పాహిమామ్

ఫలశృతి:- 

శత సుమముల నాఘ్రాణించు వారలకు 

జగన్నాథుడొసగు దివ్యానుగ్రహమును 

ఇలయందు సుఖసౌఖ్యములు కలిగి 

దివియందు చేరుదురు శ్రీ చరణముల!

No comments:

Post a Comment