July 23, 2021

శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 1 To 10

 శ్రీజగన్నాథ అక్షర సుమమాలిక

రచన - శ్రీమతి శ్రీకృష్ణ మాధవి (అనుఙ్ఞ:- జగన్నాధ పెరుమాళ్)

000

జయ జయ జగన్నాథా! జయము జయము 

జయ నీరాజనముల నడుమ 

కదిలింది కదిలింది జగన్నాథుని రథయాత్ర 

ఇదిగో ఇదిగో ఘన అక్షర నీరాజనం 

జయనీరాజనము జయనీరాజనము

జైజగన్నాధా ! జైజగన్నాధా!  జైజగన్నాధా!

శరణం శరణం శరణం 

1.

మరుపు, మోహము, ఆశనిరాశలు 

దరిచేరనీక మనోహరా! గుణాగుణములు 

నీచరణ సేవకై జేర్చుమయా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

2. 

నిను తలచు కాలము పుణ్యకాలము 

నిను కొలుచు వారలకు కొంగుబంగారు 

నిను దర్శించు క్షణమున  ధన్యతనొందగ 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

3. 

సర్పము కుబుసము విడుచునటుల 

జీవి దేహమ్ము విడుచు సమయమ్మున 

నీ నామము జిహ్వన నిలుపుమయ్యా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

4. 

కార్యమ్ములు, కర్మమ్ములు నీ యాధీనమే

నీవు సృజియించిన మట్టి బొమ్మలము

నీచే యాడబడు ఉత్తి తోలుబొమ్మలము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

5. 

వెదకుచుంటి నిను చేరు మార్గము 

జిక్కియు జిక్కక యాడుచుందువేల 

నీకై పరిభ్రమించు జీవులమే కృష్ణా!

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

6. 

సదా నిను తలచు జీవుల నావికా రక్షక 

భక్తి, ప్రేమ,  స్మరణ, చింతన న

ఎటులైన నిను తలచు మనసొసగు 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

7. 

సర్వ దిక్కుల సర్వ విధముల గావుమయ్యా!

సర్వార్ధసాధకా! నిరతము నీ భజనలే 

భవ బంధమోచనము కాగా 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

8.  

ఇలయందు ఈ కలియందు నీవే 

సర్వపాపహరా! నారాయణా! 

ఆలంబనమిచ్చి గావుమయ్యా !

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

9. 

నిరతము నీరూపగుణ నామ వైభవమ్ము 

కీర్తింపబడునో యదియె దివ్యస్థలమై 

నొప్పారు  యచటి జనులెల్లరు భాగవతులే 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

10.  

జీవునిగ పుడమిన జనియించి 

చేయుచుంటిమి కార్యాకార్యములు నెన్నియో 

క్షీరమధనము వోలె మధియింపు మము 

లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!

No comments:

Post a Comment