శ్రీ జగన్నాథ అక్షర సుమమాలిక 21 To 30
కాలగతిన కలియుదురు మాన్యులు అసమాన్యులు
మరియా కాలగతిన కలయు బెక్కెండు గాని
సత్యంబు ధర్మంబు శీలమ్ము గుణములు
నిలిపినవి భూమండలాధీశుల నామములిలను!
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!
22.
కాలమ్మె సర్వకార్యమ్ములకు మూలమ్ము
జపియింపుము కాలాధీశుని కాలాతీతుని
నామ స్మరణంబున, రణంబునైన, మరణంబునైన
అనవరతము సర్వకాలనిలయా ! నారాయణా!
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్!
23.
కలియుగంబు అంతరించు శ్రీ మహావిష్ణు సాక్షిగ
మరల కృతయుగం బేతెంచు సూర్యచంద్ర గురు
శుక్రులేకరాశి నుండగ ప్రేమామృతము వర్షించు
భూమండలమంతయు శోభాయమానముగా
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్
24.
శ్రీహరి ధ్యాన పరవశులయి ప్రవర్తిల్లు వారి
యెడ కలిజూడనేరడు రానేరడు శ్రీహరి
శ్రీహరి యని మనసున రూపమ్ము నిలిపిన
కలి తన కాలికి బుద్ధి చెప్పు కలి హంతక
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్
25.
చేతపట్టే నవనీతము చూపు నిలిపే యసుర
చిత్తవృత్తుల యెడ తన శక్తి చూపు సమయమిది యని
యెంచి సన్నద్ధతను చూపుచూసే చిన్ననాడే
యా యశోద తనయుడు జగదానందనుడై
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్
26.
తకథిమి తకథిమి మృదంగలయ విన్యాసములు
కర్ణపేయము సేయ వినోదము కలిగె నాధునికని
అనంత భక్తకోటి సాగిలపడిరి ముక్తి ఫలదాయుని
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్
27.
ఆకృతుల యందు వికృతుల యందు
ఆకృతియే లేని నీవు పలు ఆకృతుల ధరియించి
సృజియించి భేధభావమ్ము లేక అన్నిటను తానుండి
తానే అయి అవధరించు ఆది నారాయణా!
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్
28.
మేలు గుణముల రాశి మమ్మేలు మా స్వామి
చొరనీయకయ్యా మా యందు రాగద్వేషాది భావమ్ములు
భావంబులో నయిన మము జూసి కలి
వెడలి పోవలెనయ్య వసుదేవతనయ వాసుదేవ!
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్
29.
పిపీలికాది బ్రహ్మాండమంతయు చరాచరమంతయు
నిండిన నిర్మలాంతఃకరణ నిరంజనా సరళాత్మ!
సృష్ట్యాది పర్యంతము నీవే అఖిలాగమవేద!
త్రివిక్రమా! నిను కీర్తన సేతుము!
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్
30.
ఓ మాయా కల్పిత! మాయా వినోద,!
జీవాత్మల పరమాత్మ నడుమ మాయలేల
ఓ మాయా రహితా ! హితముగ సడలింపుమయా
పెను మాయలను మాయాధీశ!
లోకాధినాధా! జగన్నాథా! పాహిమామ్! పాహిమామ్
No comments:
Post a Comment