December 11, 2016

దివ్యక్షేత్రం వాడపల్లి

దివ్యక్షేత్రం వాడపల్లి - వాడనిమల్లి దివ్యచరిత్ర 

ఒకానొకసారి సనకసనందాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారయణున్ని దర్శించుకున్నారు. ఆయనను అనేక విధములుగా స్తుతించి తరవాత వారు వచ్చిన పనిని తెలిపారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదంలో నడుస్తుంది.ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యతనిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై, అధర్మ జీవితం గడుపుతున్నారు. ఉపేక్షిస్తే అధర్మం మిగిలిన యుగాలకు కూడా ప్రాప్తిస్తుంది. కనుక ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని ఋషులు మహావిష్ణువుని అర్చించారు. అప్పుడు విష్ణువు ఈవిధంగా చెప్పాడు. 












అధర్మం ప్రబలినప్పుడు స్వయంగా యుగయుగమందున అవసరాలకు అనుగుణంగా వివిధ 
అవతారాలు ధరించాను. కానీ కలియుగంలో పాపభూయిష్టము ఎక్కువ అయ్యింది. కొద్ధి మాత్రమే పుణ్యాన్వితం. కావున కలియుగంలో అర్చాస్వరూపుడనై భూలోకమున లక్ష్మీక్రీడాస్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలె దరిచేర్చునది అగు  గౌతమీ తీరమున నౌకపురమును (వాడపల్లి) పురమందు వెలుస్తాను. 

లక్ష్మీదేవితో పాటు ఒక చందన వృక్ష పేటికలో గౌతమీ ప్రవాహ మార్గంలో నౌకపురి(వాడపల్లి) చేరుకుంటాను. ఈ వృత్తాంతం అంతా తెలిసిన నారదుడు పురజనులకు తెలియపరుస్తాడు. 

కొంతకాలానికి నౌకపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకువస్తున్న చందాన వృక్షం కనిపించింది. తీరా ఒడ్డుకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది. ఒకరోజు గ్రామంలోని వృద్ధ బ్రాహ్మణులకు కలలో కనిపించి కాలికల్మషం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు. కనుక పురజనులందరూ వేకువనే గౌతమీ స్నానంతో పవిత్రులై మనగళవాయిద్యాలతో నౌకలో నది గర్భంలోకి వెళితే కృష్ణగరుడ వాలిన చోట నేనున్నచందన పేటిక దొరుకుతుందని చెబుతాడు. పురజనులు స్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నదీగర్భంలోనికి వెళ్ళగా చందన పేటిక లభిస్తోంది. దానిని ఒడ్డుకు తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖు చక్ర గదలతో ఒప్పుతున్న స్వామి దివ్యమంగళ విగ్రహం కనిపించింది. 

అంతలో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు. గతంలో ఋషులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలిసిందిగా విష్ణువును ప్రార్థించటం, విష్ణువు నౌకపురిలో అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు చెబుతాడు. తరవాత మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టించేడు. "వేం" అంటే పాపాలను "కట" అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వేంకటేశ్వరుడని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింప చేసాడు. 

వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్థం అంటే వాడవాడలా ఉత్సవమే. ప్రతీఏటా చైత్రశుద్ధ ఏకాదశినాడు శ్రీ స్వామివారి తీర్థం, కల్యాణోత్సవం వైభవోపేతంగా  జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవ, కల్యాణోత్సవ కార్యక్రమములను వేలాది మంది భక్తులు కన్నులపండుగగా భక్తితో తిలకిస్తారు.

 స్వయంభూక్షేత్రమైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామివారిని వరుసగా 7 శనివారాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి, స్వామిని దర్శిస్తే, భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయట. 7 శనివారాలు దర్శనాలు, ప్రదక్షిణలు పూర్తి అయిన తరవాత స్వామి ఆలయంలో అన్నదానం కోసం బియ్యం, పప్పులు, నూనెలు వారి స్థోమతను బట్టి 7 కుంచాలైనా, 7 కేజీలైనా, అదీ కాకపోతే 7 గుప్పెళ్ళు ఐనా సరే స్వామికి సమర్పించాలంట. 

No comments:

Post a Comment